రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన నగదు కూడా లేదంటున్నారు. మరి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అందులో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం అట్టహాసంగా నియామకపత్రాలు అందిస్తున్న వాటిలో ఎక్కువశాతం గత ప్రభుత్వ హయాంలోనే వచ్చిన నోటిఫికేషన్లే అని వారి వాదన. అయితే ప్రభుత్వాలు మారినా నియామక ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతుందని ప్రభుత్వ చెబుతున్న మాట. సరే ఆ సంగతి పక్కనపెడితే గత ఏడాది అసెంబ్లీ వేదికగా ఆగస్టులో
జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. వాటికి సంబంధించిన ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. కొత్త ఏడాదిలో అప్పుడే 5 నెలలు పూర్తికావొస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ అమలు అంటే జనవరి టు డిసెంబర్ ఉండాలి కదా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపెట్టి ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ఉద్యోగాల భర్తీ అంశాన్ని మరుగున పడేసే ప్లాన్ వేస్తున్నదని మండిపడుతున్నారు.