Wednesday 28 December 2011

బాబు కోసం మన బాబులు ...


ఈ మధ్య తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర బల ప్రదర్శనలు చేయడం రాజకీయ పార్టీల నేతలకు ఫ్యాషన్ అయిపోయింది. ఒక బలమైన ఆకాంక్ష కోసం బలిదానాలకు పాల్పడిన అమరులను వీరి రాజకీయాలు వాడుకోవడం సిగ్గుచేటు. ముఖ్యంగా తెలంగాణ టిడిపి నేతలు ఈ విషయంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఇదంతా త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకోసమే అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇక్కడే ఉన్నది పెద్ద విషాదం. రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీకి నిలబడేది తెలంగాణ నేతలే. కానీ టిడిపి నేతల ఆరాటం మాత్రం సీమాంద్ర బాబును హీరో చెయ్యాలని, మంచిదే తమ నాయకుని కోసం కష్టపడడంలో తప్పులేదు. మోత్కుపల్లి చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు సంగతి అటుంచితే, ఆయన తెలంగాణ గురించి, ఉద్యమం గురించి పూర్తిగా మరిచిపోయారు. కెసిఆర్ ఫాం హౌసులో రెస్ట్ తీసుకుంటున్నారని, తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టారని రోజు చెప్పిందే చెబుతున్నారు. అయితే యిప్పుడు తెలంగాణ టిడిపి తెలంగాణ కోసం ఏమిచేస్తున్నారు అన్నది ప్రశ్న! తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉంది, వాళ్ళే తేల్చాలి అని ముఖ్యమంత్రి మొదలు చంద్రబాబు, జగన్ ఇలా గోడమీది పిల్లులందరూ అదే వాదిస్తున్నారు. మరి ఈ సమస్య ఎందుకు తేలడం లేదు. తెలంగాణ టిడిపి ఫోరం తరుఫున కేంద్ర హోం మంత్రిని కలిసినప్పుడు అయన ఏమి చెప్పాడు. మీ పార్టీ వైఖరిని అడిగాడు కదా, మీరిచ్చిన వినతి పత్రాన్ని ఎవరు పంపపారు అని అడిగాడు కదా. ఇదీ బాబు అభిప్రాయమా,లేక మీ అభిప్రాయమా అని అడిగిన విషయం మరిచిపోయారా ఎర్రబెల్లి, మోత్కుపల్లి. అక్కడ జరిగిన అవమానం తోనే కదా నాగం తెలంగాణ పై  చంద్రబాబు లేఖ ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబట్టింది. దానికే కదా ఆయన్ని పార్టీ నుంచి బయిటికి పంపింది. ఎదుటి వారి తప్పులను ఎంచే ముందు మన వైఖరి స్పష్టంగా ఉండాలి కదా. ఆ పని తెలంగాణ టిడిపి నేతలు చేయగలరా? బాబును నిలదీయగలరా? యిప్పుడు తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదం, సమైక్య వాదాలు లేవు. ఇన్నది ఒకే వాదం తెలంగాణ. 2004 ఎన్నికల్లో టిడిపి సమైక్య వాదం తో పోటీ చేస్తే ఈ ఫలితాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. అలాగే అభివృద్ధి నినాదం తో కరీంనగర్ ఉపఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కు ఇచ్చిన షాక్ ఏమిటో విదితమే. తెలంగాణ, సమైక్య వాదాలు ఉన్నది డిసెంబర్ తొమ్మిది చిదంబరం ప్రకటనకు ముందే. ఇక ఆ తర్వాత సమైక్యవాదానికి అప్పుడే నూకలు చెల్లాయి. ఇకపై తెలంగాణాలో జరిగే ఉప ఎన్నికల్లో వచ్చే ఫలితాలు పార్టీ చిత్తశుద్ధిని చూపించేవే. ఇదీ తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు గుర్తించుకుంటే మంచిది. బాన్సువాడ ఉప ఎన్నికల్లో డిపాసిట్ దక్కిందని సంబరపడిన కాంగ్రెస్ లాగా మీరు కూడా అలాగే సంతృప్తి చెందుతామంటే అది మీ ఇష్టం. అందుకే చంద్రబాబు రైతుల కోసం పెట్టినా అవిశ్వాసం, అలాగే తెలంగాణ కోసం రెండు సార్లు మీరు చేసిన 'రాజీ'నామాలు ఏమయ్యాయి? బాబు పెట్టిన అవిశ్వాసం జగన్ కు అసెంబ్లీ లో ఉన్న బలాన్ని, మీ రాజీనామాలు బస్సు యాత్రలకు  ఉపయోగపడ్డాయి. ఇదీ చంద్రబాబు తెలుగుదేశం, తెలంగాణ టిడిపి చేసిన ఉద్యమాల ఫలితాలు.

Labels:

Friday 23 December 2011

telangana




telangana





telangana








Thursday 22 December 2011

వ్యతిరేకం కాదంటే అనుకూలం కాదు....

నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఇదీ చంద్రబాబు తెలంగాణ జిల్లాల్లో పర్యటించేటప్పుడు మాత్రమే ఉపయోగించే పదం. మరి అయన చెప్పిన వ్యతిరేకం కాదు అనే మాటను మనం అనుకూలంగా అనుకుందామనుకుంటే పొరపాటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పే ఏకాభిప్రాయం పాటకు ఈయన చెప్పే మాట కోరస్ లాంటిది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏకాభిప్రాయం కోసం ఎన్నడూ ప్రయత్నించలేదు. ప్రయత్నించరు కూడా. అలాగే చంద్రబాబు కూడా వ్యతిరేకం కాదు అంటే మాట మార్చి అనుకూలం అని మాట్లాడడు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పై అప్పుడప్పుడు పలికే చిలుక పలుకులు ఇక్కడి కాంగ్రెస్ నేతలకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇదీ వారికి వాళ్ళ  అధిస్టానం తెలంగాణపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక చంద్రబాబు చెప్పే మాయ పలుకులు ఈ ప్రాంత టిడిపి నేతలను పులకింపచేస్తాయి. వాళ్లకు ఎక్కడలేని ఉత్సహాన్ని తెచ్చిపెడుతాయి. అదే ఊపులో ఒక రణభేరి, ఒక బస్సుయాత్ర పేరుతో తెలంగాణ కోసం పోరాడుతున్నామని చెప్పేందుకు పర్యటనలు చేస్తారు. మీ అధినేత వైఖరి ఏంటి అని నిలదేస్తే బౌతిక దాడులు చేయిస్తారు. తమ అధినేత మెప్పు కోసం ఉద్యమకారులను నోటికొచ్చినట్టు తిడుతారు. ఇలా తెలంగాణ  కాంగ్రెస్, టిడిపి నేతలు రెండు సంవత్సరాలుగా తెలంగాణ కోసం తెగ కష్టపడుతున్నారు. వాళ్ళ శ్రమను వాళ్ళ అధినేతలు గుర్తిస్తున్నారు. అయినా తెలంగాణ ప్రజలు తమను పట్టించుకోవడం లేదనే కోపం వారిని వెంటాడుతున్నది. ఆ కోపం ఎలా వ్యక్తమవుతున్నదంటే చంద్రబాబు తెలంగాణ పర్యటనలో అయన కాన్వాయి పై కోడిగుడ్లు. ఒక చోట చెప్పు రూపం లో కనిపిస్తున్నాయి. దీంతో ఖంగు తిన్న తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు అక్కడ ఉద్యమకారులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎక్కడైనా నాయకుని వెనుక కార్యకర్తలు నడుస్తారు. పాపం చంద్రబాబు ఇక్కడ కార్యకర్తలు, తన సొంతః సైన్యం సహాయంతో తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు. దీనికి అనూహ్య స్పందన వస్తున్నదని చంద్రబాబు కో మీడియా కోడై కూస్తున్నది. అది పతాక శీర్షికలో. నిరసన మాత్రం ఎక్కడో లోపలి పేజిలో ఉంటుంది. బాబు గారి పర్యటన బాగా జరగడానికి కిరణ్ బాబు సహకారం ఉండనే ఉన్నది. ఎందుకంటే యిప్పుడు వారిది తెలంగాణాను అడ్డుకోవడానికి ఏర్పడ్డ మాయా కూటమి .

Saturday 10 December 2011

మా పేరు ఏకాభిప్రాయం....



తెలంగాణ పై తేల్చే టైం వచ్చింది ఆజాద్ అనడం కొత్తకాదు. మళ్లీ మళ్లీ మళ్లీ అయన అదే పాట పాడుతున్నారు. దీనికి కారణం బహుశా అవిశ్వాస తీర్మానం సందర్భంగా  తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానం పై చూపిన విధేయత కావొచ్చు. అందుకే వారు అదే మాట మాట్లాడుతున్నారు, మనవాళ్ళు వారి బాటనే పయనిస్తున్నారు. నల్లారి అడుగుల్లో నడుస్తున్న ఈ బానిస నేతలకు అధిస్టానం ఇచ్చిన నజరానా తెలంగాణ సమస్య సంక్లిష్టమైనది, సున్నితమైంది అనే పదాలు. ఈ పదాలకు కాంగ్రెస్ పెద్దల దగ్గర చాలా పర్యాయ పదాలున్నాయి. కాంగ్రెస్ దృష్టిలో తెలంగాణ అంటే ఏకాభిప్రాయం. అది సాధ్యం కానీ సమస్య. సాచివేత సమస్య, అంటే ఆజాద్ చెప్పిన మాటలకు స్పందించే ఓపిక తెలంగాణ ప్రజానీకానికి లేదు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇస్తుందో లేదో తెలియకున్నా ఈ ప్రాంత నేతలు ఉద్యమం లో భాగస్వాములు కావాలని, పదవులను వదులుకొని పజల పక్షాన ఉండాలని ఉంటారని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ ప్రజల ఆకాంక్ష వేరు కాంగ్రెస్ నేతల ఆలోచన వేరు. అది ఏమిటో మొన్న అవిశ్వాస తీర్మానం సందర్బంగా చూపారు. నరనరాన కాంగ్రెస్ నైజాన్ని చూపారు. ముఖ్యమంత్రిని తిట్టిన వాళ్ళు, అది సీమాంద్ర సభ అన్నవాళ్లు అందరూ ఒక్కటై పోయారు. ఆ మధ్య జైపాల్ రెడ్డి అన్నట్టు కాంగ్రెస్ వాదులు ప్రాంతీయ వాదులుగా ఉండరాదు, జాతీయవాదులుగా ఉండాలన్న మాటను అక్షరాల పాటించారు. ఇంత విధేయత వారికి ఎక్కడి నుంచి వచ్చింది. కావూరి అన్నట్టు పదవులు లేకుండా  తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక గంట కాదు కదా ఒక్క నిమిషం కూడా ఉండలేరు అనడానికి నిదర్శనం. ఇక తెలంగాణ కు ప్రాంతీయ మండలి, ప్యాకేజీ అంటూ సీమాంద్ర మీడియాలో చర్చలు మామూలే. అందుకే యిప్పుడు తెలంగాణ ప్రజలు రాజీనామాల కోసం పట్టుబడడం లేదు. నేలుగున్నర కోతల ప్రజానీకాన్ని వంచించిన వారికి రాజకీయ మరణ శాశనం రాయబోతున్నారు.  మన్మోహన్, చిదంబరం, ప్రణబ్, ఆజాదు. అభిషేక్ సింగ్వి, రషీద్ ఆల్వి, మనీష్ తెవారి లు చెప్పే రోజుకో స్క్రీన్ ప్లే కు ఇక ముగింపు తప్పదు.

Thursday 8 December 2011




Labels:

Saturday 3 December 2011

చలి కాలంలో 'అవిశ్వాస' వేడి


అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం వేడి మొదలైంది. ఒకవైపు పార్టీలు విప్ జారీ చేశాయి. మరో వైపు తమ బలబలాలపై ఎమ్మెల్యేలతో సంప్రదింపులు మొదలయ్యాయి. అయితే ఈ అవిశ్వాస తీర్మానం ప్రభావం కేవలం కాంగ్రెస్ పార్టీ, జగన్ కు మధ్యే ఉన్నట్టు తాజా పరిణామాలను చూస్తే స్పష్టంగా కనిపిస్తున్నది. జగన్ వర్గం నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్లి పోవడంతో కిరణ్ సర్కారు అవిశ్వాస తీర్మానాన్ని ధీటుగా ఎదురుకుంటామని సవాళ్ళు కూడా విసిరింది. మొన్నటి దాక తన వైపు ఉన్న ఎమ్మెల్యేల్లో కొంత మంది బహిరంగంగానే ముఖ్యమంత్రిని కలిసి మద్దతు తెలిపారు. ఇదీ జగన్ వర్గాన్ని కలవరపెట్టింది. టిడిపి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం తో ఇక జగన్ కూడా గుంటూరు ఓదార్పు యాత్రకు విరామం ఇచ్చి నేరుగా రంగం లోకి దిగారు. జగన్ నివాసం లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు జగన్ తో సమావేశం కావడం, కాంగ్రెస్ పార్టీలో పిఅర్పీ విలీనం తరువాత చిరంజీవి కూడా మొదటి సరి తమ ఎమ్మెల్యేలు అసంతృప్తి తో ఉన్నారనడంతో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. జగన్ పడగొడితే నిలబెడతాను అన్న చిరునే తన అసంతృప్తిని వెల్లడించాడు. దీంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు గంట గంటకు మారిపోతున్నాయి. పిఅర్పీ రాకతో ఊపిరి పీల్చుకున్న అధికార పార్టీకి ప్రస్తుత పరిణామాలు మాత్రం కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఎందుకంటే తమ వల్లే ప్రభుత్వం నిలబడింది అన్న చిరు మా ఎమ్మెల్యేలను గడ్డి పోచల వలె చూస్తున్నారని ఒక రకంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ విశ్వాసాన్ని పొందుతుందో లేదో ఆ పార్టీ నేతలకే తెలియడం లేదు. ఇదే అదనుగా పిఅర్పీ తమ పదవుల కోసం పట్టుబడవచ్చు. ఇదే కనుక కొనసాగితే అధికార పార్టీకి మరిన్ని సమస్యలు తప్పక పోవచ్చు. ఎందుకంటే ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ని కొందరు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పిఅర్పీ ల విలీనం తరువాత కొన్ని చోట్ల ఈ రెండు పార్టీల శ్రేణుల్లో గొడవలు జరిగాయి. అవి ఇప్పడు సద్దుమనిగినా మునుముందు తీవ్ర స్థాయికి చేరుతాయి. అందుకే తాజా పరిణామాలతో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు నేరుగా రంగం లోకి దిగారు. జగన్ వర్గ ఎమ్మెల్యేల లో కొంత మందిని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కిరణ్ కు బొత్స కు మధ్య సంబంధాలు సరిగా లేవని వార్తలు వస్తున్నాయి. పిఅర్పీ తో ప్రస్తుత అవిశ్వాస తీర్మానంలో గట్టెక్కినా, అది కొంత కాలమే. ఎందుకంటే అసంతృప్త ఎమ్మెల్యేలకు ఏవో కొన్ని హామీలు ఇచ్చి తమ దారికి తెచ్చుకున్నా, అవి నెరవేరని నాడు మళ్లీ వారు తిరుగుబావుటా ఎగరేయవచ్చు. అందుకే కిరణ్ సర్కారు తెలుసు కావలసింది ఏమిటంటే సమర్థవంతమైన నాయకత్వం తోనే ప్రభుత్వ మనుగడ ఉంటుంది కానీ సంఖ్యా బలం తో కాదు.