Tuesday 4 December 2012

చిత్తశద్ధిపైనే చింత

దళిత, గిరిజన ఉప ప్రణాళిక బిల్లుకు శాసనసభ అమోదం తెలిపింది.  ఈ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతించాయి. అయితే ఈ సబ్‌ప్లాన్‌కు కొన్ని సవరణలు చేయాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. ఏబీసీడీ వర్గీకరణ ప్రతిపాదికన ఉప ప్రణాళికలో నిధులు కేటాయించాలని టీడీపీ ప్రవేశపెట్టిన సవరణకు టీఆర్‌ఎస్, బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీ, ఎంఐఎం, వామపక్షాలు, లోక్‌సత్తా పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. టీడీపీ ప్రతిపాదనకు అనుకూలంగా 47, వ్యతిరేకంగా 67 ఓట్లు వచ్చినట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో టీడీపీ సవరణ ప్రతిపాదన వీగిపోయింది. దీంతో సర్కార్ తీరుపై విమర్శలు వస్తున్నాయి.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించే విషయంలో రాష్ట్ర సర్కార్ రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నించింది తప్ప చిత్తశుద్ధి చూపలేదన్నది ప్రతిపక్షాల వాదన. అందులో కొంత వాస్తవము లేకపోలేదు. ఎందుకంటే ఈ సబ్‌ప్లాన్‌కు రాష్ట్ర సర్కార్ పదేళ్ల కాలపరిమితి విధించింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు చెందిన కోట్లాది రూపాయల నిధులు ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాల కోసం మళ్లించబడ్డాయి. దీన్ని స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీ వేదికగా ఒప్పుకున్నారు. మళ్లించిన నిధులు తిరిగి రికవరీ చేయాలని ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తికి సర్కారు నుంచి సానుకూల స్పందన లేదు. అలాగే ఇప్పటి ఈ సబ్‌ప్లాన్ నిధులు మురిగిపోకుండా ఉండడానికి కూడా ప్రతిపక్షాలు కొన్ని సవరణ చేశాయి. దీనికి కూడా కిరణ్ సర్కార్ అంగీకరించలేదు. దీనిపై ముఖ్యమంత్రి ఓటింగ్‌కు స్పీకర్ అనుమతి ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకానీ ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. కనుక ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు అందరూ సహకరించాలని విన్నవించారు.

రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజాల కోసమే పాకులాడుతాయనడంలో సందేహం లేదు. కానీ ఎట్టకేలకు ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించే బిల్లును పాస్ చేయించుకోవడంలో కిరణ్ సర్కార్ విజయం సాధించింది. చట్టబద్ధత అయితే కల్పించింది కానీ దీని చిత్తశుద్ధిపైనే చింత ఉన్నది. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అన్ని పార్టీలు దళిత, గిరిజనుల అభ్యున్నతి గురించి మాటల్లో వల్లెవేస్తూనే ఉన్నాయి. కానీ నేటికి వారి జీవన స్థితిగతుల్లో వచ్చిన మార్పులేవీ లేవు.  వారి బతుకులు ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇంకా దురదృష్టమేమింటే ఈ సామాజిక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా వీళ్ల సమస్యలపై పోరాడడం లేదని దళిత, గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికీ దళిత, గిరిజన గూడాల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ఓట్ల కోసం అక్కడ రెండురోజులు బస చేయడం, కొన్ని హామీలు గుప్పించడం,  ఓట్లు దండుకున్నాక తిరిగి వారివైపు కన్నెత్తి చూడకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఎస్సీ, ఎస్టీల ఉపప్రణాళిక చట్టబద్ధత కల్పించినందుకు ఆయా సామాజిక వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతున్నా, దీని ఆచరణపై ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది. ఇక అధికార పార్టీ నేతలు ఈ ఉప ప్రణాళిక చట్టబద్ధత ఘనత గురించి ఎవరికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ ఘనత ఎవరిదైనా ఈ ఉప ప్రణాళిక లక్ష్యం గాడితప్పకుండా పాటుపడితే అదే పదివేలు. అందుకు ప్రతిపక్షాలు కూడా పార్టీలకు అతీతంగా ఈ చట్టం సక్రమంగా అమలయ్యేలా ఒత్తిడి తేవాలి. అప్పుడు ఈ చట్టం లక్ష్యం నెరవేరుతుంది.

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home