Monday 10 December 2012

నల్లారి వారి నిజస్వరూపం


ప్రపంచ తెలుగు మహాసభలను సాకుగా అఖిలపక్ష భేటీని వాయిదా వేయించడానికి ముఖ్యమంత్రి శతవిధాలా ప్రయత్నించారు. దీనికి పీసీసీ అధ్యక్షుడు, రాయపాటి వంటి నేతలు వంతపాడారు. ఒక ప్రాంత ప్రజల తమ ఆకాంక్ష కోసం ఆరు దశాబ్దాలుగా ఉద్యమిస్తన్నారు. ముఖ్యంగా మూడేళ్లుగా ఆ దశాబ్దా కల సాకారం కోసం నినదిస్తున్నారు. అయితే ఇంత కాలం తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని తాము కూడా కోరుతున్నట్టు కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు మహాసభలు జరుగుతున్నందున రాష్ట్ర విభజనపై చర్చలు బాగుండవంటున్నారు. అలాగే ఈ అఖిలపక్ష భేటీ గతంలో కంటే భిన్నంగా ఏమీ ఉండదన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, లగడపాటి రాజగోపాల్, మరికొందరు సీమాంధ్ర నేతలు హస్తిన ఆంతర్యాన్ని ముందే చెబుతున్నారు. అలాగే ఏకాభిప్రాయం రానిదే తెలంగాణ సాధ్యం కాదన్న లగడపాటి విజయవాడలో తెలంగాణ ఏర్పడితే మనల్ని బతకనీయరు అని రెచ్చగొడతారు. ముఖ్యమంత్రి తాను మూడో తరగతి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని చూస్తున్నాను అంటారు. ప్రజలు ఏమైపోయినా పరవాలేదు కానీ తమ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు వీళ్లు వ్యవహరిస్తున్నారు. నేను హైదరాబాదీనే అని చెప్పుకునే కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా సీమాంధ్ర ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఎటూ తేల్చకుండా మూడేళ్లుగా కమిటీలని, ఎన్నికలని, పండుగలని, సోనియా అనారోగ్యం అని, ఆజాద్, వాయలార్ రవిలు విదేశీ పర్యటనలో ఉన్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనాలని చాలా కథలపేరుతో చేసిన కాలయాపన ముగిసింది. ఈ మూడేళ్లలో రాష్ట్రం అనిశ్చిత పరిస్థితిని తొలగించకుండా కాంగ్రెస్ పెద్దలు ఆడిన నాటకానికి ఈ రాష్ట్ర ప్రజలు బలికావాల్సి వస్తున్నది. ఇది చాలదన్నట్టు కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణపై చర్చలు కొనసాగుతూ.....................
....నే ఉంటాయని వెటకారంగా మాట్లాడుతున్నారు. అయినా సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణపై ఇంతకంటే భిన్నంగా వ్యవహరిస్తారనుకోవడం పొరపాటే. అందుకే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, కిరణ్ పాలన అద్భుతం అని, మాకు అభివృద్ధే కావాలి తెలంగాణ అవసరం లేదనే వాళ్లు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలవైపా? పార్టీ వైపా? అని.

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home