Wednesday 12 December 2012

ఇచ్చేది, తెచ్చేది, చచ్చేది

నిన్న పార్లమెంటులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాతృరాష్ట్రంలో ఏకాభిప్రాయం వస్తేనే రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమవుతుందని ప్రకటించారు. దానికి కొనసాగింపుగానే తెలంగాణపై అఖిలపక్షభేటీ పార్టీకి ఇద్దరు చొప్పున రావాలని కేంద్ర హోం శాఖ నుంచి రాష్ట్రంలోని తొమ్మిది పార్టీలకు వర్తమానం అందింది. 2001 నుంచి తెలంగాణ సమస్య కాంగ్రెస్ పార్టీ కోర్టులో ఉన్నది. 2004 నుంచి నేటి వరకు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమూ ఆ పార్టీకే ఉన్నది. కానీ తెలంగాణపై తేల్చకుండా ఏకాభిప్రాయం అనే పాటను మార్చిమార్చి పాడుతున్నది. అఖిలపక్షభేటీ తేదీ ఖరారైనప్పటి నుంచి అధికార పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి ఒక్కరినే పంపాలని తెలంగాణ ప్రాంత నేతలంటే, ఇద్దరని పంపాలని సీమాంధ్ర నేతలు అన్నారు. తెలుగు మహాసభల పేరుతో అఖిలపక్షభేటీని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి విన్నపాన్ని షిండే తిరస్కరించినా, ఈ అంశాన్ని అంత త్వరగా తేల్చబోమనే ‘‘తీపికబురు’’ మాత్రం ఆయనకు అందించారు. అందుకే కాబోలు ఆయన ఈ అభిలపక్షభేటీ గతంలో కంటే భిన్నంగా ఉండదని ముందే చెప్పారు. తెలంగాణపై తేలాలంటే ఏకాభిప్రాయమైనా మరే అభిప్రాయమైనా రావాలంటే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల్లోనే రావాలి. ఎందుకంటే తెలంగాణపై రెండు వాదనలు వినిపిస్తున్నది ఇవే పార్టీలు. ఈ మూడు పార్టీలు తమ ముసుగును తీసేసి ఒకే అభిప్రాయం చెబితేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల అవస్థలు తీరుతాయి. అలాగే అఖిలపక్షభేటీ ఘనత ఎవరిదనే విషయంపై కూడా ఇంతవరకు చర్చలు జరిగాయి.  ఇది తమ అధినేత రాసిన లేఖ ఫలితమే అని తెలుగు తమ్ముళ్లు తెగ సంబరపడిపోయారు. చంద్రబాబు పాదయాత్ర తెలంగాణ ప్రాంతంలోకి వచ్చినాటి నుంచి ఆయన కూడా కాంగ్రెస్‌లా ఏకాభిప్రాయం అనే మాట కాకుండా వ్యతిరేకం కాదనే పదాన్నే తన ఆయుధంగా ఎంచుకున్నారు. హస్తినలో జరిగే అఖిలపక్షభేటీలోనే తమ పార్టీ అభిప్రాయం స్పష్టంగా చెబుతామంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, కొణాతాల రామకృష్ణ ఈ మధ్యే మీడియా ముందు అఖిలపక్షభేటీకి తమకు ఆహ్వానం అందింతే కాంగ్రెస్, టీడీపీల వలె కాకుండా ఒకే అభిప్రాయం చెబుతామన్నారు. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు చెప్పినట్టు ఒకే అభిప్రాయం చెబితే తెలంగాణపై కాంగ్రెస్ కాలయాపనకు కాలం తీరుతుంది. లేకపోతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర హోంమంత్రి షిండేలు చెప్పినట్టు తెలంగాణ చర్చలు కొనసా...........గుతూనే ఉంటాయి. అందుకే ఆరుదశాబ్దాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను అపహాస్యం చేస్తున్న అధికార పార్టీ ఆటలో భాగస్వాములు కాకుండా ఉంటే మంచిది. అప్పుడు  తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది, లేకపోతే చచ్చేది మేమే అని చెబుతున్నవాళ్లుకు తెచ్చే అవకాశం, ఇచ్చే ఉద్దేశం లేదని అర్థమవుతున్నది. కనీసం వాళ్లకు చచ్చే అవకాశం అన్నా టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు ఇస్తే మంచిది.

Labels: , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home