Wednesday 19 December 2012

సవాళ్లు కాదు, స్పష్టత కావాలె



తాను సమైక్యవాదినని ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కొండా సురేఖ ఇప్పుడు తెలంగాణకోసం టెన్‌జన్‌పథ్ వద్ద చావడానికి నేను సిద్ధం. కేసీఆర్ అందుకు సిద్ధమా అని సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉన్నది. కొండా దంపతుల ఆరాటం అంతా జగన్‌కు అధికార పీఠంపై కూర్చోబెడదామనే తప్ప తెలంగాణ కోసం కాదు. పరకాల ఉప ఎన్నిక కూడా ఆమె వైఎస్ జగన్ కోసం రాజీనామా చేస్తేనే వచ్చింది. అందుకే తాను తెలంగాణ కోసమే రాజీనామా చేశానని చెప్పినా ప్రజలు  విశ్వసించలేదు. దీంతో పరకాల ఫలితం ప్రతికూలంగా వచ్చింది. దీన్ని ఇప్పటికీ కొండా దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. షర్మిల పాదయాత్ర ప్రజల కష్టాలు తెలుసుకోవడానికని, టీఆర్‌ఎస్ పల్లెబాట ఓట్ల కోసమట. రాష్ట్రంలో ఓట్ల రాజకీయం ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసు. అఖిలపక్షభేటీలో తెలంగాణపై  వైఎస్‌ఆర్‌సీపీ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని అడిగితే అది నేరమట. మమ్మల్ని ఎందుకు అడుగుతారు అంటారు.  తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుడూ, తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న పార్టీని, ఉద్యమనాయకత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని తాను తెలంగాణ బిడ్డనే అని చెప్పుకుంటున్నారు కొండాసురేఖ. వైఎస్‌ఆర్‌సీపీ ని తెలంగాణపై ఎందుకు స్పష్టత అడగవలసి వస్తున్నది. పార్లమెంటులో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్నది నిజం కాదా? ద దీనిపై ఆయన గానీ ఆయన పార్టీ వాళ్లు ఇంతవరకు వివరణ ఇచ్చాడా. కేవలం తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామంటే సరిపోతుందా? వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదంటే సమైక్యఉద్యమంలో జగన్‌పై నమోదైన కేసును ఉపసంహరించకున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన జీవో అబద్ధమా? అఖిలపక్షభేటీ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల్లో గుబులు మొదలవుతున్నది. ఎందుకంటే తెలంగాణపై ద్వంద్వ విధానాలను అవలంబిస్తున్నది ఈ మూడు పార్టీలే. జేఏసీ ఇప్పటికే ఈ మూడు పార్టీలకు డెడ్‌లైన్ విధించింది. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో అసహనంతో తెలంగాణ ప్రాంతంలోని కొండాసురేఖ, జగ్గారెడ్డి, ఎర్రబెల్లి, మోత్కుపల్లి వంటి నేతలను ఆయా పార్టీలు తెలంగాణ ఉద్యమనాయకత్వాన్ని విమర్శించడానికి ఉసిగొల్పుతున్నాయి. అయినా తెలంగాణ కోసం ఆత్మహత్యలు వద్దు. పోరాడి సాధించుకోవాలని పార్టీలకు అతీతంగా అంతా కోరుతున్నారు. ఈ సమయంలో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ వంటి వాళ్లు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటేనే తెలంగాణ వస్తుంది. తెలంగాణను తాను చావడానికి సిద్ధం. కేసీఆర్ సిద్ధమా అని రెచ్చగొట్టడం ఎందుకు? కొండా సురేఖ ముందు అఖిలపక్ష భేటీలో వైఎస్‌ఆర్‌సీపీ చేత తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఇప్పిస్తే చాలు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎవరూ ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు కొండాసరేఖ భావోద్వేగాలు అన్నీ జగన్ కోసమే తప్ప, తెలంగాణ కోసం కాదనేది వాస్తవం. అఖిలపక్ష భేటీలో ఏమీ తేలదని పైకి అంతా గుంభనంగా ఉన్నా లోలోప మాత్రం తెలంగాణపై స్పష్టత లేని పార్టీలో ఆందోళన మొదలైంది. అందుకే సీమాంధ్రలో కావూరి, లగడపాటి లాంటి వాళ్లు, ఇక్కడ కొండాసురేఖ, జగ్గారెడ్డి, ఎర్రబెల్లి లాంటి వాళ్లు తెలంగాణ ఉద్యమ నాయకత్వంపై ఎదురుదాడి ప్రారంభించారు. ఎందుకంటే చంద్రబాబును విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదని ఎర్రబెల్లి అంటున్నాడు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ప్రధానికి లేఖ రాసింది చంద్రబాబే కదా. వాళ్ల పార్టీ పరంగా తెలంగాణపై స్పష్టత ఉంటే బాబే అఖిలపక్షానికి వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలి. అలాగే కేంద్రం తెలంగాణ ఇస్తే తాము అడ్డుకోబోమని వైఎస్‌ఆర్‌సీపీ ప్రకటించింది. అదే విషయాన్ని అఖిలపక్షభేటీలో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున విజయమ్మ చెప్పాలి. తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నది ఇదే. దీనికే సవాళ్లుపతిసవాళ్లు ఎందుకు? అందుకే ఈ మూడు పార్టీలు ముందున్న ముప్పును అధిగమించాలంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించాలి. అంతేకానీ రెచ్చగొట్టే చర్యలతో అసలు ఇష్యూను పక్కదారి పట్టించాలని చూస్తే పాట్లు పడేది ఈ మూడు పార్టీలే అని విషయాన్ని గమనించాలి.

Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home