Saturday 29 December 2012

నార్త్‌బ్లాక్‌లోఆ మూడుపార్టీల నాటకం



అఖిలపక్షం ముందు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది. ఎందుకంటే ఈ అఖిలపక్ష భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్య మార్పులు వస్తాయని ఎవరూ భావించలేదు. భ్రమ పడలేదు. కానీ తెలంగాణపై అస్పష్ట వైఖరి ఉన్న పార్టీల నుంచి స్పష్టత వస్తుందని అంతా ఆశించారు. కానీ మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతుండడానికి కారణం కాంగ్రెస్, టీడీపీలు. తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ కూడా. ఈ మూడు పార్టీల పీటముడి కారణంగానే రాష్ట్ర విభజనపై చిక్కుముడి వీడడం లేదన్నది అందరికీ తెలిసిందే. కానీ ఇవే మూడు పార్టీలు ఏమీ తెలియనట్టు నటిస్తున్నాయి. అదే విధానాన్ని నార్త్‌బ్లాక్‌లో కూడా కొనసాగించాయి. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. రాష్ట్ర విభజనపై అప్పటి కేంద్ర హోంమంత్రి డిసెంబర్ 9న ఒక ప్రకటన చేశారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్, టీడీపీల వల్ల ఆవిరైపోయింది. పట్టుమని పదిహేను రోజుల్లోనే సీమాంధ్ర నేతల రాజ’కీ’యాలతో వెనక్కిపోయింది. అందుకే చిదంబరం రాష్ట్రంలో కొన్ని పార్టీలు తెలంగాణపై ‘యూటర్న్’ తీసుకున్నందున మరిన్ని సంప్రదింపులు జరగాలన్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణకమిటీ, కాంగ్రెస్ అంతర్గత కమిటీల పేరుతో చేసిన హడావుడి విదితమే. ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణపై ప్రజలు స్వరాష్ట్ర సాధన కోసం చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. సహాయ నిరాకరణ, సకలజనుల సమ్మె, తెలంగాణ మార్చ్ ఒక్కటేమిటి ప్రపంచంలో ఏ ఉద్యమంలో కనిపించని అన్ని రూపాలను ప్రదర్శించారు. వందల మంది బలిదానాలకు పాల్పడ్డారు. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. అయినా సీమాంధ్ర నేతలకు మనసు కరగలేదు. చనిపోయిన అమరుల కుటుంబాలపై సానుభూతి కలగలేదు. నిజానికి వారి నుంచి సానుకూల స్పందన ఆశించడం తెలంగాణ ప్రజల అత్యాశే అవుతుంది తప్ప ఫలితం ఉండదు. మూడేళ్ల కాలం ఇట్టే కరిగిపోయింది. కానీ తెలంగాణ ప్రజల కన్నీళ్లకు మాత్రం కేంద్ర ప్రభుత్వం కనికరించలేదు. అందుకే తెలంగాణపై ఎప్పటికప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ కాలయాపన చేసింది. ఎట్టకేలకు ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సమయంలో ఈ ప్రాంత ఎంపీల ఒత్తిడి మేరకు అఖిలపక్ష సమావేశానికి ఒప్పుకున్నది. దాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా ముఖ్యమంత్రి మొదలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, సీమాంధ్ర ప్రాంత నేతలు వ్యవహరించారు. ఆజాద్ అయితే ఏకంగా కేంద్ర హోంమంత్రిగా షిండే కొత్తగా బాధ్యతలు చేపట్టారు కనుక ఆయన అవగాహన కోసం ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ది ఎప్పుడూ తెలంగాణపై కిరికిరే. అందుకే గతంలో ఈ అఖిలపక్ష సమావేశం భిన్నంగా ఉండదని ఎద్దేవ చేసినట్టు మాట్లాడాడు. ప్రపంచ తెలుగు మహాసభల పేరుతో ఈ సమావేశాన్ని వాయిదా వేయించడానికి విఫలయత్నం చేశాడు. అందరూ ఎదురుచూసిన అఖిలపక్ష భేటీ సమయం వచ్చింది. సమావేశమూ పూర్తయ్యింది.

ఇంతకీ అఖిలపక్షంలో తేలింది ఏమిటి? మళ్లీ ఆ మూడు పార్టీల తంతూ అదే. కాంగ్రెస్ రెండు వాదనలు వినిపించింది. తెలుగుదేశం పార్టీ ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖ గురించి పాతపాడే పాడింది. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామని వైఎస్‌ఆర్‌సీపీ ఇడుపులపాయ ప్లీనరీ ముచ్చటే చెప్పింది. ఒక రకంగా ఈ మూడు పార్టీలు తెలంగాణపై తమ సస్పెన్స్ యథావిధిగా కొనసాగించాయి. కానీ బయటికి వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణపై తాము స్పష్టంగా చెప్పామని టీడీపీ బీరాలు పలికింది. సమావేశంలో టీడీపీ ‘సీల్డ్‌కవర్’ ద్వారా ఏం చెప్పింది? షిండేకు రెండు లేఖలు ఇచ్చినట్టు సమాచారం అందులో మొదటి ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖ. రెండోది రాష్ట్రంలో అనిశ్చితికి కారణం కేంద్రమే. కనుక ఈ సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉన్నదని చెప్పింది. అందుకే తెలంగాణవాదులు టీడీపీ లేఖలో స్పష్టత లేదు అంటే మొదటి లేఖలో తెలంగాణకు టీడీపీ సానుకూలంగా ఉన్నదనే వాక్యం ఉన్నదట. అందుకే షిండేకు ఇచ్చిన రెండు లేఖలు కలిపి చదువుకుంటే తెలంగాణపై టీడీపీ చిత్తశుద్ధి కనిపిస్తుందట. ఏమైనా అర్థం ఉన్నదా? టీడీపీ చెబుతున్న ప్రణబ్ కమిటీ యూపీఏ-1 ప్రభుత్వ కాలపరిమితి ముగిసిన తర్వాత అది కాలగర్బంలో కలిసిపోయింది. ఆ తర్వాత తెలంగాణపై చాలా కమిటీలు వచ్చాయి. రాజశేఖర్‌రెడ్డి వేసిన రోశయ్య కమిటీ, కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీ, ఈ అఖిలపక్ష సమావేశాని కంటే ముందు రెండు అఖిలపక్ష సమావేశాలు జరిగాయి. వీటిలో ఏ ఒక్కదానిలో టీడీపీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పలేదు.  అందుకే టీఆర్‌ఎస్ నేతలు టీడీపీ వైఖరిని పెండ్లి ఎత్తగొట్టి, నిశ్చితార్థానికి కట్టుబడి ఉంటామంటే ఎలా అని నిలదీస్తున్నారు. అఖిలపక్ష భేటీకి టీడీపీ తరఫున ఈ ప్రాంత నుంచి వెళ్లిన కడియం శ్రీహరిగారు షిండే రికార్డు చేసిన మినట్స్ చూస్తే టీడీపీ తెలంగాణకు అనుకూలమో, వ్యతిరేకమో తేలుతుంది అంటున్నారు. దాన్ని బయటపెట్టించే దమ్ము కేసీఆర్‌కు ఉన్నదా అని ఛాలెంజ్ చేస్తున్నారు. ఒకవేళ శ్రీహరి వాదిస్తున్నట్టు టీడీపీ తెలంగాణకు అనుకూలమైతే సీల్డు కవర్ సందేశమెందుకు? చంద్రబాబు తెలంగాణ ప్రాంతంలోనే పాదయాత్ర చేస్తున్నారు కదా! ఆయన నోటి నుంచే 200లో తమ  పార్టీ మహానాడులో తెలంగాణపై చేసిన తీర్మానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఒక మాట చెబితే సరిపోతుంది. కానీ వాళ్లు ఆ పని చేయడం లేదు. అయిపోయిన లేఖ గురించి పదే పదే ప్రస్తావిస్తూ అదే మా విధానమని అరిచి గీ పెడుతున్నారు. అలాగే టీడీపీ వైఖరి స్పష్టంగా లేదని ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమే చెప్పడం లేదు. ఆ సమావేశానికి హాజరైన వాళ్లలో కొంతమంది అదే చెబుతున్నారు. లోపల ఒకటి బయట ఒకటి చెబుతున్నారని మండిపడ్డారు. ‘హిందూ’ లాంటి ఆంగ్ల పత్రిక కూడా తన సంపాదకీయంలో తెలంగాణపై టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల వైఖరి అస్పష్టంగా ఉన్నదని పేర్కొన్నది. అందుకే టీడీపీ నేతలు తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదు అనడం కంటే ఆ పార్టీ అధినేతతో అనుకూలం అని చెప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే టీడీపీ తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని నర్సారావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. తాను సమైక్యవాదినని, దీనిపై తమ పార్టీ అధినేతతో చర్చిస్తాను అన్నారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు తాను నడుచుకుంటానని, అవసరమైతే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాను అన్నారు. దీన్ని నన్నపనేని రాజకుమారి కూడా సమర్థించారు. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాయలసీమ హక్కుల గురించి మాట్లాడారు. ఇలా సీమాంధ్ర నేతలు టీడీపీ తెలంగాణ సానుకూల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే.. తెలంగాణవాదులు స్పష్టత గురించి డిమాండ్ చేస్తున్నారు. బాబు రెండు కండ్ల సిద్ధాంతం మొదటికే మోసం తెచ్చేలా ఉన్నది.

టీడీపీ వైఖరి అలా ఉంటే.. ఈసారి అఖిలపక్షంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు రెండు కండ్ల సిద్ధాంతాన్ని పాటించినట్టు కనిపించింది. అందుకే మాజీ శాసనసభాపతి కేఆర్ సురేష్‌రెడ్డి తెలంగాణవాదం వినిపిస్తే, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి సమైక్యవాదాన్ని వినిపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంపై మొదట భిన్నవాదనలు వినిపించాయి. సమావేశంలో గాదె వెంకటరెడ్డిని హోం మంత్రి షిండే మాట్లాడనివ్వలేదని, సురేష్‌రెడ్డి చెప్పిన అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రెండువాదనలపై మిగలిన పక్షాలు నిలదీస్తే.. సురేష్‌రెడ్డి అభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలు కోరుకుంటున్నదని చెప్పినట్టు ప్రసార మాధ్యమాలు ప్రసారం చేశాయి. ఎందుకంటే అఖిలపక్ష సమావేశం తర్వాత గాదె వెంకటరెడ్డి పెద్దగా మాట్లాడకపోవడంతో ఈ వాదనకు బలం చేకూరింది. అయితే తర్వాత గాంధీభవన్‌లో గాదె ప్రెస్‌మీట్ పెట్టి మరి షిండే రెండు రాష్ట్రాల వాదనను తోసిపుచ్చారు. తన వాదనపై వస్తున్న వివాదాలకు వివరణ ఇచ్చారు. మా పార్టీ ఎవరిని అడ్డుకోలేదని, ఇద్దరి అభిప్రాయాలను చెప్పుకొమ్మన్నదని, అయితే ఎవరు ఏం చెప్పినా చివరికి అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామనే మాట చెప్పమన్నదని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అఖిలపక్షం తర్వాత లగడపాటి ఏకాభిప్రాయం రాలేదు అంటున్నారు. గాదె వెంకటరెడ్డి కూడా తెలంగాణపై కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదన్నారు. కనుక వీళ్లు రాష్ట్రం ఎన్నటికీ విడిపోదని ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే దీన్ని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు విభేదిస్తున్నారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలంటున్నారు. అంతేకాదు ఈ అంశం రాష్ట్ర పరిధిలో నుంచి కేంద్ర పరిధిలోకి వెళ్లిందని, కనుక తెలంగాణపై ఇక రాష్ట్రంలో ఏకాభిప్రాయం అనే మాటకు అర్థం లేదంటున్నారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే నమ్మకం తమకు ఉందంటున్నారు. గాదె వెంకటరెడ్డి, లగడపాటి, కావూరి, రాయపాటి, టీజీ వెంకటేశ్ వీళ్లు రాష్ట్ర విభజనపై చెబుతున్న శాస్త్రీయ విధానం సంకీర్ణ ప్రభుత్వంలో సాధ్యంకాదు. అది వారికీ తెలుసు.  ఈ రాష్ట్రం రావణకాష్టంలా మూడేళ్లుగా మండుతున్నది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ విషయంలో మొదటి దోషి కూడా కాంగ్రెస్ పార్టీనే. అందుకే అఖిలపక్ష భేటీలో పార్టీల అభిప్రాయాలు చెప్పాలని కోరినప్పుడు కాంగ్రెస్ పార్టీయే ముందుగా తన అభిప్రాయం చెప్పాలని మిగిలిన పక్షాలు డిమాండ్ చేశాయి. కానీ దీనిపై కాంగ్రెస్ నేతలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధులు చెప్పిన అభిప్రాయాల్లో దేన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించిందో కూడా చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉన్నది. తెలంగాణ ప్రాంతం వారు షిండే రెండు రాష్ట్రాలు అన్నాడని, లేదు ఆయన అలా అనలేదని, అది నిరూపిస్తే తాను రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని గాదె స్పష్టం చేశారు. కనుక రాష్ట్రంలో నెలకొన్న అస్థిర పరిస్థితిని చక్కదిద్దాలి. ఇంకా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తే కాలగర్భంలో కలిసిపోక తప్పదు.

ఈ రెండు పార్టీల వైఖరి ఇలా ఉంటే వైఎస్‌ఆర్‌సీపీది సెంటిమెంట్ పేరుతో ఓట్లను సొమ్ము చేసుకునే కప్పదాటు వైఖరే. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికికే ఉన్నదని, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా కేంద్రమే తండ్రివలె ఈ సమస్యను పరిష్కరించాలన్నది ఆ పార్టీ. అందుకే షిండే సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నాం అంటే తెలంగాణ సానుకూలమేనా అంటే మౌనమే మైసూరరెడ్డి వంతు అయ్యింది. ఇంతకు మించి ఏమీ చెప్పలేమని వారు అన్నట్టు సమాచారం. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణకు వ్యతిరేకమని స్పష్టమైంది. అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలనే వైఎస్‌ఆర్‌సీపీ వైఖరి ఆచరణలో సాధ్యం కాదు. ఎందుకంటే ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మరొకరి ఎంతో కొంత నిరాశ ఉండడం సహజమే. అందరిని సంతృప్తి పరచాలనే ఆ పార్టీ విధానమే తప్పు. పీడితులన పక్షాన నిలబడాల్సిన ఆ పార్టీ గోడ మీద పిల్లిలా నిలిచింది. తెలంగాణకు అనుకూలమా అని షిండే అడిగిన ప్రశ్నకు స్పష్టంగా సమాధానం చెప్పలేదంటే ఆ పార్టీ తెలంగాణను వ్యతిరేకించినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే రాజన్న రాజ్యం తెస్తామంటున్న ఆ పార్టీ  రాష్ట్ర విభజనపై రాజశేఖర్‌రెడ్డినే అనుసరిస్తుంది. ఆయన తెలంగాణను బహిరంగంగానే వ్యతిరేకించారు. ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి లేదన్న ఆ పార్టీ కనీసం ఇవ్వండి అని చెప్పే సాహసం కూడా చెయ్యలేదు. పరకాల ఎన్నికల సమయంలో, షర్మిల పాదయాత్ర సందర్భంలో, జగన్ ఆర్మూర్ రైతుదీక్ష సందర్భంలో, విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భంలో ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నామని చెప్పిన మాటను నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్, టీడీపీల కంటే స్పష్టంగానే తెలంగాణ వ్యతిరేకతను చాటింది.
అఖిలపక్షంలో మిగిలిన పార్టీలో బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఐ జై తెలంగాణ అన్నాయి. సీపీఎం, ఎంఐఎం సమైక్యవాదాన్ని వినిపించాయి. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర విభజన సమస్య పరిష్కారం అవుతుందని ఆశించిన వారి ఆశలు అడియాసలే అయ్యాయి. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాజీనామాల డ్రామాలు ఆడిన కాంగ్రెస్, టీడీపీ లుఇప్పుడు అదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. అప్పుడు పీఆర్‌పీ స్థానంలో అఖిలపక్ష సమావేశానికి హాజరైన వైఎస్‌ఆర్‌సీపీ ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే సామాజిక తెలంగాణ అన్న చిరంజీవి మాట మార్చి సమైక్యవాదమన్నారు. ఇప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ స్టాండ్ ఏమిటో తెలిసిపోయింది కనుక కాంగ్రెస్, టీడీపీల సీమాంధ్ర నేతల అసమ్మతి సెగలో తాను భాగస్వామ్యం అవుతుందా లేదా అన్నది చూడాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం. కేంద్ర హోంమంత్రిఇదే చివరి అఖిలపక్షం అన్నారు. కనుక తెలంగాణ ప్రజల సహనం నశించకముందే వారి ఆకాంక్షను నెరవేరిస్తే బాగుంటుంది.

Labels: , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home