Tuesday 4 December 2012

ఆంధ్రా పార్టీలపై అలసత్వం వద్దు!


కేసీఆర్ హస్తిన చర్చల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఎటూ తేల్చలేదు. ఢిల్లీలో ఒకవైపు ఆయనతో చర్చలు చేస్తూనే కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలు పూటకోరకంగా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై మోసం చేయబోతున్నదనే అంచనాకు వచ్చారు కేసీఆర్. ఇక కాంగ్రెస్ పార్టీతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే కేసీఆర్ ఢిల్లీ చర్చలపై ఇంటా బయటా విభిన్న వాదనలు ముందుకొచ్చాయి. దీంతో అయోమయంలో ఉన్న క్యాడర్‌కు హస్తిన చర్చల విషయాలను వెల్లడించేందుకు కరీంనగర్‌లో రెండు రోజుల పాటు ‘మేథోమధన’ సదస్సును ఏర్పాటు చేశారు. అందులో పార్టీలోని పొలిట్‌బ్యూరో సభ్యులు, రాష్ట్ర స్థాయి నేతలు, జిల్లా కన్వీనర్‌లు మొదలు అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నారు.  తాను కూడా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో చేసిన చర్చల సారాంశాన్ని ఆ సమావేశంలో వారితో పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదనే అంచనాకు  వచ్చారు. ఇక ఆ పార్టీతో ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పార్టీలోని అందరి అభిప్రాయం కూడా అదే. ఆ తర్వాత మీడియా సమావేశంలోనూ కేసీఆర్ చర్చల సారాంశాన్ని వెల్లడించిన విషయం విదితమే.

ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని అవసరానికి వాడుకొని,  తర్వాత ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అందుకే జేఏసీ కూడా కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా ఉద్యమకార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ కోసం ఎన్ని రూపాల్లోనూ ఉద్యమించినా కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయం, సంప్రదింపుల పేరుతో మూడేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంపశయ్యపై ఉన్నాయి. కనుక ఎన్నికలు ఏ సమయంలోనైనా రావొచ్చుననేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలంటే ఉద్యమాల ద్వారానే అది సాధ్యం అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఉద్యమాలతో పాటు రాజకీయ ప్రక్రియ కూడా అవసరమే అన్నది కూడా మరికొందరి అభిప్రాయం. అందుకే కేసీఆర్ సొంత రాజకీయ అస్తిత్వం ద్వారా తెలంగాణను సాధించుకుందానే నిర్ణయానికి వచ్చారు. ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు తెలంగాణలో సీమాంధ్ర పార్టీలకు చోటులేకుండా చేయాలని నొక్కిచెప్పారు. వంద అసెంబ్లీ, 16 పార్లమెంటు స్థానానాలు సాధిస్తే కేంద్రంలో ఎవరు ఉన్నా తెలంగాణను అడ్డుకోలేరని మేథోమధన సదస్సులో వెల్లడించారు. అట్లాగే జేఏసీతో టీఆర్‌ఎస్‌కు ఉన్న విభేదాల గురించి చెప్పారు. విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని వాటిపై చర్చించి అందరిని కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ బాధ్యత తానే తీసుకుంటానని కూడా చెప్పారు. అన్నట్టుగానే జేఏసీ నేతలతో సమావేశమై పాలమూరు, పరకాల ఉప ఎన్నికల తర్వాత జేఏసీ, టీఆర్‌ఎస్‌ల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలపై అంతా కలిసి చర్చించారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉత్తర తెలంగాణలో ఆ పార్టీ బలంగానే ఉన్నది. అయితే దక్షిణ తెలంగాణలో మాత్రం పార్టీ నిర్మాణం పటిష్టంగా లేదని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. అందుకే దక్షిణ తెలంగాణలో పట్టుసాధించడానికి టీఆర్‌ఎస్  సూర్యాపేటలొ ‘సమరభేరి’ సభను ఏర్పాటు చేసింది. దీనికి తెలంగాణ పొలిటికల్ జేఏసీ  కూడా మద్దతు ప్రకటించింది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఆ సభ దోహదపడింది. అంతా అనుకున్నట్టుగానే లక్షలాది మందితో ఆ సభ విజయవంతం అయ్యింది. అయితే ఆ సభ సక్సెస్ అయినా కేసీఆర్ ప్రసంగం పేలవంగా ఉన్నదని కొంతమంది అభిప్రాయం. నిజమే లక్షలాది మందిలో కేసీఆర్ ప్రసంగం అనుకున్న రీతిలో లేదు. అయితే పార్టీలో మాత్రం జోష్‌ను పెంచగలిగారు. అంతకుముందు టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యే  హరీశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిక రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు కొంత కలిసివచ్చే అవకాశమే. అలాగే మరోటీడీపీ నేత సుధీర్‌రెడ్డి కూడా చేరడంతో రంగారెడ్డిలో టీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి గతంలో కంటే మెరుగ్గానే ఉన్నది. అయితే  సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇదే సరిపోదు. క్షేత్రస్థాయిలో పార్టీ పునర్ నిర్మాణం జరగాలి. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ నుంచి ఎంతమంది పెద్ద నేతలు వెళ్లిపోయినా ఆ పార్టీకి అంతో ఇంతో ఆదరణ ఇంకా ఉండడానికి కారణం ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉండడమే. అందుకే టీఆర్‌ఎస్ కూడా తన లక్ష్యసాధనలో విజయం సాధించాలంటే క్యాడర్‌ను మెరుగుపరుచుకోవాలి. అప్పుడు కేసీఆర్ అంచనాలు కార్యరూపం దాలుస్తాయి. టీఆర్‌ఎస్ ఇప్పటికే ప్రకటించిన పల్లెబాట, నగర బాట కార్యక్రమం ద్వారా ఆ లోటును పూడ్చుకోవాలి.

ఇక మరోసారి సూర్యాపేట సమరభేరి గురించి చర్చిద్దాం. ఈ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టడానికి గల కారణాలు ఏమిటి? ఇంతకు ముందు టీఆర్‌ఎస్‌కు లక్షలాది మందిలో అనేక బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర ఉన్నది. కానీ నల్లగొండ జిల్లాలో సభ సక్సెస్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. కేసీఆర్ నల్లగొండ జిల్లా నుంచి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ చర్చలు. అదే గనుక నిజమైతే ఇప్పటి వరకు ఆ జిల్లాలో పాతుకుపోయిన తెలంగాణలోని ఒక సామాజిక వర్గానికి కొంత ఇబ్బందే. ఎందుకుంటే గత ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి పోటీచేయడం ద్వారా ఆ ప్రాంతంలో పరిస్థితులు మారాయి. తెలంగాణ ఉద్యమాన్ని చూస్తే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఒకే రీతిలో ఉంటుంది. ఇంత కాలం ఉత్తరతెలంగాణకే పరిమితం అన్న సరిహద్దును మూడేళ్ల కిందట కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చెరిపేసింది. ఉద్యమం ఉధృతంగా ఉన్న మాట వాస్తవమే. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ సీమాంధ్ర పార్టీలు గెలవలేదు. అదే పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతం కావాలంటే చాలా శ్రమ పడాలి. అందుకే టీఆర్‌ఎస్ ఒకవైపు ఉద్యమం మరోవైపు ఎన్నికలు లక్ష్యాన్ని ఎంచుకున్నది.

అలాగే ఇప్పుడు రాష్ట్రంలో పాదయాత్రల కాలం సాగుతున్నది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి షర్మిల తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్నారు. ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నా పాదయాత్రలు మాత్రం ప్రశాంతంగానే సాగుతున్నాయి. ఇది తెలంగాణవాదులకు మింగుడు పడడం లేదు. ఎందుకంటే తెలంగాణను అడ్డుకున్నవారిలో ఈ రెండు పార్టీలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కార్యాచరణ ఎంత ముఖ్యమో, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల రూపంలో కూడా తెలంగాణ ఉద్యమానికి ప్రమాదం పొంచి ఉన్నది. ఎందుకంటే ప్రత్యక్షంగానే చంద్రబాబు రాజీనామాలతో వచ్చిన తెలంగాణను అడ్డుకుంటే, పార్లమెంటులో ప్లకార్డు పట్టి తెలంగాణపై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు జగన్. వీరు ఇప్పుడు తాము తెలంగాణకు వ్యతిరేకం కాదు అని తెలంగాణ ప్రాంతంలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నా.. చంద్రన్న, రాజన్న రాజ్యం అని పాటలు పాడుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు ఎంత అన్యాయం చేశాడో తెలిసింది. ఆయన కూతురు ఇప్పుడు రాజన్న రాజ్యం వస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది అంటున్నారు. ఇక చంద్రబాబు తన హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందింది అంటున్నారు. దీనిపై బహిరంగ చర్చకు కూడా సిద్ధమే అన్నారు కూడా. ఈ రెండు పార్టీలు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకుండానే తమ పాదయాత్రలను కొనసాగిస్తున్నాయి. వీరిని అడ్డుకోవాల్సిందేనని తెలంగాణవాదుల అభిప్రాయం. ఈ విషయంలో తెలంగాణవాదుల అంతా కలిసికట్టుగా నినదిస్తేనే అది సాధ్యమవుతుంది. కానీ వాళ్లు ఎన్ని పాదయాత్రలు చేసినా జనం విశ్వసించరు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తెలంగాణవాదం ఒక్కటే సీమాంధ్ర పార్టీలను మట్టికరిపించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో అనేక అంశాలు ముందుకొస్తాయి. అప్పుడు సీమాంధ్ర పార్టీలు 20-40 స్థానాలు దక్కించుకున్నా అది ఉద్యమానికి ఎదురుదెబ్బే. ఆ పార్టీలో ఈ ప్రాంతంలో భూస్థాపితం కావాలంటే అందరి అభిప్రాయం ఒక్కటే కావాలి. తెలంగాణ కోరుకునే పార్టీలన్నీ ఏకతాటిపై రావాలి. అంతేకాదు ఎన్నికలే లక్ష్యంగా ఉద్యమిస్తే లాభం ఉండదు. అధికార పార్టీపై ఒత్తిడి పెంచాలి. ఎందుకంటే కేంద్రంలో ఇప్పుడు నడుస్తున్నది సంకీర్ణ ప్రభుత్వాలు. తమ రాజకీయ అవసరాలకు తీర్చుకోవడానికి చిన్నచితకా పార్టీలు కూడా కేంద్రాన్ని బెదిరించే స్థాయికి వచ్చాయి. అందుకే తెలంగాణకోసం ఉద్యమిస్తున్న టీ కాంగ్రెస్ ఎంపీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎఫ్‌డీఐలపై పార్లమెంటులో ఓటింగ్‌ను తమకు అనుకూలంగా మలుచకోవాలి. తెలంగాణపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటింగ్‌లో పాల్గొంటామని తేల్చిచెప్పాలి. అంతేకానీ ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే వేరే ఫ్రంట్ పెట్టుకుని పోటీ చేస్తామంటే కుదరదు. డిసెంబర్ ప్రకటన తర్వాత సీమాంధ్రలో పార్టీలకతీతంగా ఏకమై తెలంగాణను అడ్డుకున్న విషయాన్ని మరిచిపోవద్దు. అదే ఐక్యతను ఇప్పటికైనా ప్రదర్శిస్తే నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది.

Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home