Thursday 6 December 2012

నరంలేని నాలుక



తెలంగాణ ప్రాంతంలోని కొందరు కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక రాష్ట్రంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న తరణం ఇది. ఇందుకోసం వాళ్లంతట వాళ్లే డిసెంబర్ 9 డెడ్‌లైన్ కూడా విధించుకున్నారు. వాళ్లలో ఎంత మంది ఆ మాటకు కట్టుబడి ఉంటారో తెలియదు. కానీ వాళ్ల చిత్తశుద్ధిని మాత్రం శంకిచాల్సిన పనిలేదు. అయితే వచ్చిన సమస్యల్లా ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులతోనే. వీళ్లు ఇంకా మాకు మా అధిష్ఠానంపై నమ్మకం ఉందంటారు. అధిష్ఠానానికి లేఖలు రాస్తారు. అధిష్ఠానంపై ఒత్తిడి తేవాడానికి ఢిల్లీ యాత్రలు చేస్తారు. ఇదంతా ఈ ప్రాంత ప్రజల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికేనని ఈ ఈ ప్రాంతంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా తడుముకోకుండా జవాబు ఇస్తాడు. ఇదీ ఈ ప్రాంత కాంగ్రెస్ నేతల వైఖరి.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొంతమంది గతంలో రాజశేఖర్‌రెడ్డి అనుయాయులు పోషించిన పాత్రను ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కోసం చేస్తున్నారు. అందులో భాగంగానే జగ్గారెడ్డి వంటి నేతలు అసలు తెలంగాణే అవసరం లేదంటారు. తెలంగాణ కంటే తమకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ముఖ్యమంటారు. అసలు ఈ ప్రాజెక్టుకు జాతీయ సాధ్యమవుతుందా అనే ప్రశ్నార్థకమే. అంతేకాదు ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై భిన్నవాదనలు జరుగుతున్నాయి. ఇక జాతీయహోదా అనేది కూడా అసంభవమే. ఎందుకంటే ఒక రాష్ట్రంలోని రెండు ప్రాజెక్టులకు జాతీయహోదా లభించకపోవచ్చు. నీటిపారుదల నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అలాగే  ఇప్పుడు జగ్గారెడ్డి చేస్తున్న వాదనకు మద్దతు ఎంతమంది ఇస్తున్నారో తెలియదు. కానీ జగ్గారెడ్డి ఎవరి మెప్పుకోసం తెలంగాణ వద్దంటున్నాడో వారే పోలవరం నిర్మించి తీరుతామంటున్నారు. లక్షలాది ఎకరాల భూములను, ఆదివాసులను ముంపుకు గురిచేసి తెలంగాణ ప్రాంతాన్ని నిలువునా ముంచే ప్రాజెక్టును మాత్రం జగ్గారెడ్డి వ్యతిరేకించడం లేదు. కానీ తెలంగాణ ఎందుకు వద్దో తాను ఢిల్లీకి వెళ్లి అధిష్ఠాన పెద్దలను కలిసి వివరిస్తాను అంటున్నారు. ఇక జగ్గారెడ్డి చేస్తున్న తెలంగాణ వ్యతిరేక వాదనలను ఆయన పార్టీకి చెందిన మంత్రులు తప్పుపడుతున్నారు. వాళ్లకు ఆయన సమాధానం చెప్పకుండా హస్తినకు వెళ్లి తన అంతరంగాన్ని వివరిస్తాను అనడం ఆయన అవివేకమే. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ కోసం ఇంత పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం వందలాదిమంది బలిదానాలు చేసుకున్నారు. సీమాంధ్ర పార్టీలకు ఈ ప్రాంతంలో మనుగడే లేకుండా చేయాలని ప్రజలంతా ఏకమై నినదిస్తుంటే, ఈ ప్రాంతంలోనే పుట్టి, ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తి వలసవాదులకు కొమ్ముకాసే విధంగా జగ్గారెడ్డి వ్యవహరిస్తున్నారు.

గతంలో రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాకు తెలంగాణ కంటే అభివృద్ధే ముఖ్యమని చెప్పిన నేతల రాజకీయ భవితవ్యం ఏమైందో అందరికీ ఎరుకే. సొంత ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షలను సీమాంధ్ర పాలకుల దగ్గర తాకట్టు పెట్టాలనుకునే వారు కాలగర్భంలో కలిసిపోక తప్పదు. అది చరిత్రలో రుజువైంది కూడా. ఒక పార్టీ, ఒక వ్యక్తి పట్ల ఉన్న వ్యతిరేకతతో జగ్గారెడ్డి వంటి నేతలు నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను అవమాన పరిచేవిధంగా మాట్లాడితే అది క్షమించరాని నేరమే అవుతుంది. ఆయన మొదట తెలంగాణ కోసం ఏర్పాటైన పార్టీ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయాన్ని మరిచిపోతున్నారు. రాజశేఖర్‌రెడ్డి ‘ఆపరేషన్ ఆకర్ష’కు ఆకర్షితులై ఉద్యమానికి వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు కిరణ్ కోసం తెలంగాణపై కిరికిరి చేయాలని చూస్తున్నారు. హస్తిన పెద్దల సాచివేతపై సమరం మోగిస్తున్న ఈ సమయంలో జగ్గారెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే దాని వెనుక ఎవరు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. స్వలాభం కోసం జగ్గారెడ్డి వంటి వారు ఈ ప్రాంత మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. అంతేకాదు ఇలాంటి నేతలు రేపు పోటీ చేయబోయేది తెలంగాణ ప్రాంతంలో అనే విషయాన్ని మరిచిపోతున్నారు. అధికారంలో ఉన్నాం కదా అనే అహంభావం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అంటే అది ఎంతో కాలం నిలవదు. ఇప్పుడు జగ్గారెడ్డి తెలంగాణ అవసరం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నా, లోలోపలే ఆయన మాటలను సమర్థిస్తున్న వారు కాంగ్రెస్ పార్టీలో లేకపోలేదు. అలాంటి వారు కూడా త్వరలో బయటపడతారు. అందుకే ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నది ఏమిటి? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ తెలంగాణవాదులకు, తెలంగాణ ద్రోహులకు మధ్యే ఉంటాయి అంటున్నారు. అప్పుడు గెలిచేది ప్రజల ఆకాంక్షనా, లేక సీమాంధ్ర పాలకులకు వత్తాసు పలుకుతున్న వారి అహంకారామా అనేది. ఈ పరిణామలు కూడా తెలంగాణ ప్రజలకు ఒకింత మంచిదే. వచ్చే ఎన్నికల్లో మనం ఎవరితో యుద్ధం చేయాలో ప్రజలకు ఇప్పటికే స్పష్టమైంది. అందుకే కాళోజీ చెప్పినట్టు ప్రాంతం వాడు మోసం ప్రాంతంలోనే పాతరపెట్టాలి. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేరదాకా తరిమికొట్టాలి అనేది ఆచరణలో చూపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home