Friday 7 December 2012

వ్యక్తి అవగాహన కోసం అఖిలపక్షం వేదికా?



తెలంగాణపై ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకుంటున్న పార్టీలు... ఇప్పుడు ఏ అభిప్రాయంతో ఉన్నదీ తెలుసుకుంటామన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. సమెక్యాంధ్రకు అనుకూలంగా కొన్ని పార్టీలు, వ్యతిరేకంగా మరికొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. కొన్ని పార్టీలు రెండు వాదనలను వినిపిస్తున్నాయి. పైగా... కేంద్ర హోమంత్రిగా సుశీల్ కుమార్ షిండే కొత్తగా బాధ్యతలు చేపట్టారు. అందువల్ల, అన్ని పార్టీల తాజా అభిప్రాయాలను మరోసారి తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ భేటీ ఏర్పాటు చేస్తున్నాం’’
అఖిలపక్షంపై ఆజాద్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇవి.

ప్రాంతాలకు అతీతంగా ప్రజలు రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి తొలిగిపోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష భేటీతోనైనా కేంద్ర ప్రభుత్వం దీనిపై పరిష్కారం చూపకపోతుందా అనే ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ప్రసార మాధ్యమాలు అప్పుడే ఏదో జరిగిపోయినట్టు కంగారు పడి ప్రజలను కన్‌ఫ్యూజన్ చేసే పనిలో మునిగిపోయాయి. అందుకే ఒక చానల్ తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసిందా అని చర్చ పెట్టింది. మరో చానల్ తేలుస్తారా? నానుస్తారా అని ఓ స్టోరీ చేసింది. వీరి ఆంతర్యం సమస్య పరిష్కారం కంటే అపరిష్కృతంగానే ఉంటేనే బాగుండు అన్నట్టు ఉంటుంది.అందుకే తెలంగాణను వ్యతిరేకిస్తున్న శైలజానాథ్, లగడపాటి రాజగోపాల్, టీజీ వెంకటేశ్ వంటి వాళ్లను తెరమీదికి తెస్తారు. మరో నేత గాదె వెంకటరెడ్డి అఖిలపక్ష భేటీకి పార్టీకి ఇద్దరు చొప్పున పిలవాలి అంటారు. లగడపాటి చెప్పింది కూడా అదే. అందుకే అఖిలపక్ష భేటీకి ముందే వీళ్లు భిన్నవాదనలు చేస్తున్నారు. ఆజాద్ చెప్పినట్టు పార్టీలు ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకుంటున్నాయి అంటున్నారు. నిజమే కానీ ఏ పార్టీలు? కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలే తెలంగాణపై గోడమీది పిల్లి వాటంలా వ్యవహరిస్తున్నాయి. మిగిలి పార్టీలన్నీ స్పష్టమైన విధానంతోనే ఉన్నాయి. కనుక అభిప్రాయాలు మార్చుకుంటున్న పార్టీలో కాంగ్రెస్ కూడా ఉందనే విషయాన్ని ఆజాద్ గుర్తించుకోవాలి. ఎఫ్‌డీఐ, అణుఒప్పందంల విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తర్వాత ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకున్నది. మరి తెలంగాణ విషయంలో ఆ పని ఎందుకు చేయడం లేదు? చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధులు అప్పుడప్పుడు ప్రెస్‌మీట్‌లలో చిలుక పలుకులు పలుకుతారు. అందుకే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఏమిటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే చెప్పకున్నా అఖిలపక్షభేటీలో కాంగ్రెస్ అభిప్రాయం కూడా చెబుతామంటే, రాష్ట్ర విభజనపై భిన్నాభిప్రాయాలు ఉన్న పార్టీలు ఏదో ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా షిండే గారి అవగాహన కోసం అఖిలపక్షం అంటే దానికి అందరిని పిలవడం ఎందుకు? ఇదే ఆజాద్ కూడా ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే అనేకసార్లు సమావేశమయ్యారు. అందరి అభిప్రాయాలు తీసుకుని ఒక నివేదికను వారి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పించారు. కనుక ఇప్పుడు పార్టీ పరంగా ఇద్దరు నేతలను పిలవడం కంటే మీ చర్చల సారాంశం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నదో ప్రజలకు తెలియజేస్తే బాగుటుంది. ఇప్పటికే యాభై కోట్లు ఖర్చుపెట్టి శ్రీకృష్ణ కమిటీని నియమించారు. ఆ కమిటీ రిపోర్టు కూడా తమ దగ్గర ఉన్నది. 2009 డిసెంబర్ 7న రోశయ్య గారి నేతృత్వంలో అఖిలపక్ష భేటీకి సంబంధించిన రిపోర్టు తమ వద్దే ఉన్నది. (దీని ఆధారంగానే కేంద్రం  2009 డిసెంబర్ 9 ప్రకటన చేసింది) ఆ తర్వాత కూడా రెండుసార్లు అఖిలపక్ష భేటీ జరిగింది. ఆ చర్చల సారాంశం కూడా మీకు తెలిసిందే. ఇన్ని సమావేశాలు, ఇన్ని కమిటీలు, ఇన్ని అభిప్రాయాలు ఇంత కాలం కాంగ్రెస్ పార్టీ దగ్గరే పెట్టుకుని మళ్లీ అఖిలపక్ష భేటీ అనడం, దానికి ముందే తమ వైఖరి చెప్పకుండా ఒక వ్యక్తి అవగాహన కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆజాద్ చెప్పడం గర్హనీయం.

ఇక అఖిలపక్ష భేటీ తమ ఘనతే అని జబ్బలు చరుచుకుంటున్న ఈ ప్రాంత ఎంపీలు అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీల అసలు రంగు బయటపడుతుంది అంటున్నారు. కానీ భేటీకి ముందే కాంగ్రెస్ పార్టీ కుట్రలు బయటపడుతున్నాయి. కర్రవిరగకుండా పాముచావకుండా సమస్యను పరిష్కారించాలనుకే హస్తిన పెద్దల ఆటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కాంగ్రెస్ పెద్దలకు ప్రజా ఉద్యమాలపై, సమస్య పరిష్కారంపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటో కనబడుతున్నది. దీనికి తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్న పార్టీలు కూడా మినహాయింపు కాదు. ఇంతకూ అఖిలపక్షభేటీకి ఇద్దర్ని పిలుస్తారా? లేక ఒక్కర్ని పిలుస్తారా అనేది మరో వారం రోజుల్లో తేలుతుంది. కానీ ఒక్కర్నే పంపాలని తెలంగాణవాదులంటుంటే, ఇద్దర్ని పిలవాలని సీమాంధ్రు నేతలు అంటున్నారు. ఇద్దర్ని పిలిస్తే జరిగేది ఏమిటో లగడపాటి కేంద్రం అఖిలపక్షం అనగానే మీడియా ముందుకు వచ్చే జోస్యం చెప్పారు. దానికి ఏకాభిప్రాయం అని ఒక ట్యాగ్ కూడా తగిలేశారు. నిజంగా ఏకాభిప్రాయం కావాలంటే తెలంగాణపై ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్న పార్టీలను పిలిచి మాట్లాడండి. లేదా పార్టీల వారీగా దీనిపై చర్చించుకోండి. అప్పటికి ఏకాభిప్రాయం సాధ్యం కాకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని లిఖిత పూర్వకంగా చెప్పండి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వచ్చే వరకు మాట్లాడకుంటే మంచిది. కానీ మూడేళ్లుగా తెలంగాణ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న మూడు పార్టీల వల్లే (మూడు పార్టీల్లో అప్పుడు వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా ఇప్పుడు పరోక్షంగా వైఎస్‌ఆర్‌సీపీ వైఖరి అలాగే ఉన్నది)ఈ సమస్య సాచివేతకు, రాష్ట్రంలో సంక్షోభానికి కారణమవుతున్నాయి. అందుకే అఖిలపక్ష భేటీకి ముందే ఈ మూడు పార్టీలు తమ పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతేకాదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునేది మేమే అంటే టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. దీంతో అధికార పార్టీని నిలదీసే అవకాశం లభిస్తుంది. లేకపోతే కేంద్రం ఆడుతున్న ఈ నాటకంలో పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రసారమాధ్యమాలు పాత్రధారులైతే... ప్రజలు ప్రేక్షులుగా మిగిలిపోవాల్సి వస్తుంది.

Labels: , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home