Thursday 6 December 2012

అఖిలపక్షంతోనే ఆకాంక్ష తీరదు

తెలంగాణపై ఎట్టకేలకు కేంద్రంలో కదలిక వచ్చింది. డిసెంబర్ 2న అఖిలపక్షభేటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇక తేల్చుకోవాల్సింది పార్టీలే. ఇంతకాలం తెలంగాణ ద్రోహులు మీరంటే మీరని ఒకరినొకరు నిందించుకున్నారు. రాష్ట్ర విభజనపై మీ అభిప్రాయం ఏమిటంటే భిన్నాభిప్రాయాలు చెప్పారు.  పార్టీకి ఒక్కరినే పిలుస్తామని కేంద్రహోం మంత్రి చెప్పారు అనితెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. అదే గనుక నిజమైతే రెండు కండ్లు, ఇచ్చే శక్తి తెచ్చే శక్తి లాంటి మాటలకు అర్థం ఉండదు. అలాగే కాంగ్రెస్ చెబుతున్న ఏకాభిప్రాయం మాటకు కాలం చెల్లింది. ఎందుకంటే తెలంగాణకు అనుకూలంగా కేంద్రంలో మెజారిటీ పార్టీల మద్దతు ఉన్నది. ఏకాభిప్రాయానికి రావాల్సింది రాష్ట్ర పార్టీలేనని గతంతో చిదంబరం చెప్పిన విషయాన్ని గమనించాలి.

అలాగే ఇంత కాలం అఖిలపక్షం అన్న పార్టీలు ఇప్పుడు దీన్ని మరో నాటకంగా చిత్రించడం విడ్డూరంగా ఉన్నది. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ వంతుగా ప్రయత్నం చేసి, అఖిలపక్షానికి ఒప్పించారు. ఎఫ్‌డీఐల ఓటింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తక్కువగా ఉండి అందుకు తలొగ్గిందా అనేది అప్రస్తుతం. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కాలయాపనపై ఎంపీలు కన్నెర్ర చేశారనే చెప్పవచ్చు. అఖిలపక్ష భేటీ తర్వాత ఫలితం ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే పార్టీల అసలు రంగు మాత్రం బయట పడడం ఖాయం. అఖిలపక్ష భేటీని రాజకీయ పార్టీలు రాజకీయం చేయకుండా సమస్య పరిష్కారానికి పోరాడాలి. ముఖ్యంగా చంద్రబాబు తాను తెలంగాణకు వ్యతిరేకం కాదు అని పదే పదే చెబుతున్నారు. అదే విషయాన్ని అఖిలపక్ష భేటీలో స్పష్టంగా చెప్పాలి. ఆ పార్టీ నేతలు కూడా చంద్రబాబే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. బాబు కూడా అఖిలపక్ష భేటీలో తమ అభిప్రాయం చెబుతామని అన్నారు కనుక దీన్ని స్వాగతించాలి. చంద్రబాబు చెబుతున్నట్టు తెలంగాణ అంశాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ టీడీపీ దెబ్బతీయాలని చూస్తుంది అనుకుంటే అఖిలపక్ష భేటీలో తెలంగాణపై స్పష్టంగా మీ అభిప్రాయం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ గనుక తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టే అవకాశం ఉంటుంది.  అలాగే వైఎస్‌ఆర్‌సీపీ కూడా కేంద్రం తెలంగాణ ఇస్తానంటే తాము అడ్డుకోబోమని ప్రకటించింది. దానికి ఆ పార్టీ కట్టుబడి ఉండాలి. అన్నికంటే ముందు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలి. ఎందుకంటే అఖిలపక్ష భేటీ ఖరారైందని మీడియాలో వార్తలు రాగానే లగడపాటి రాష్ట్రం విడిపోదు అని చెప్పి తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అఖిలపక్షభేటీ తెలంగాణ ప్రాంత విజ్ఞప్తి మేరకే ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పడం చూస్తుంటే ఆయన ఏ హోదాలో దీనిపై స్పందిస్తున్నారో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు చెప్పాలి. ఎందుకంటే కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి మొదలు పీసీసీ అధ్యక్షులు చెబుతున్నారు. కనుక మూడేళ్లుగా రాష్ట్రంలోని ఒక ప్రధాన సమస్యపై కేంద్రం ఒక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న ఈ తరుణంలో లగడపాటి రాజగోపాల్ వంటి నేతల వ్యాఖ్యలు ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇలాంటి వారి వ్యాఖ్యలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్ఠానంపై ఉన్నది.

ఇక సీమాంధ్ర మీడియా కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న, సమర్థిస్తున్న వాళ్లను తెరమీదికి తెచ్చి వాళ్ల వ్యాఖ్యలను బ్రేకింగ్ న్యూస్ చేసి ప్రజలను గందరగోళపరచవద్దు. ప్రజలను సంయమనం కోల్పోవద్దు అని చెప్పే మీడియా ముందు ఆ పని తాను చేయాలి. సమస్య సానుకూలంగా పరిష్కారం కావాలంటే అందులో మీడియా పాత్ర ఎంతో ఉంటుంది. అందుకే మీడియా కూడా తమ వ్యక్తిగత అభిప్రాయాలను ఇతరుల ద్వారా చెప్పించి ప్రజలను రెచ్చగొట్టకుండా వ్యవహరిస్తే అదే పదివేలు. ఎందుకంటే చాలాకాలంగా ఈ సమస్య పరిష్కారం కావాలని రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. ఇందులో రాష్ట్ర విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్నవారూ లేకపోలేదు. ఏదైనా ఒక అంశంపై ఏకాభిప్రాయం ఎన్నటికీ సాధ్యం కాదు. బాధితుల పక్షాన నిలవాల్సిన బాధ్యత పార్టీలపై ఉన్నది. తెలంగాణ అంశం ఈనాటిది కాదు ఆరు దశాబ్దాలుగా ఉన్నదే. అభివృద్ధి మండళ్లు, ప్యాకేజీలు ఈ ప్రాంత ప్రజలకు ఆమోదయోగ్యం కావు. గతంలో ఈ ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి. ఇంకా ఈ ప్రాంతాన్ని ప్రయోగశాలగా ఉపయోగించుకోకుండా ప్రజల ఆకాంక్షను గౌరవించాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉన్నది. ఎందుకంటే ఇచ్చేది తెచ్చేది మేమే అని ఇంత కాలం ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ వారే. అయితే అఖిలపక్ష భేటీకి సంబంధించిన అధికార తేదీ ఖరారైంది కానీ విధివిధానాలు ఎలా ఉంటాయో వెల్లడికావాల్సి ఉన్నది. అంతవరకు ముఖ్యంగా నేతలు ప్రగల్భాలు పలకడం మానుకోవాలి. ఆల్ పార్టీ మీటింగ్ ప్రయత్నం ఎవరిదైనా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఏకతాటిపై నడవాలి. డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండేలా ఒత్తిడి తేవాలి. ఇందుకు పార్టీల జెండాలు పక్కన పెట్టి తెలంగాణ అజెండాగా పనిచేస్తేనే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఇంతవరకు వేసిన కమిటీలకు కొనసాగింపుగా ఈ అఖిలపక్ష మిగులుతుంది తప్ప, ప్రయోజనం ఉండదు.

Labels: , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home