Saturday 14 January 2012

అదే ఆట... అదే బాధ

ఆస్ట్రేలియా టూర్ లో మన జట్టు ప్రదర్శన సగటు భారతీయుడిని నిరాశకు గురి చేయడం సహజమే. అయితే ఇందులో ఎవరి తప్పు ఎంత ఉందని విశ్లేషిస్తే చాలా విషయాలు మనకు బోధపడతాయి . ఎందుకంటే అసలు క్రికెట్ అంటేనే టెస్ట్ క్రికెట్. ఇదీ ఒకప్పటి మాట. ఒకప్పుడు సగటు క్రికెట్ ప్రేమికుడు ఐదు రోజుల క్రికెట్ అయినా, యాబై ఓవర్ల వన్డే అయినా ఆశ్వాదించేవాడు. యిప్పుడు పరిస్థితులు మరి పోయాయి. నాడు దేశం తరఫున ఆడమంటే అదో గొప్ప అవకాశంగా ఫీల్ అయ్యేవారు. కానీ నేడు క్రికెట్ అంటే అమ్మడం కొనడం అనే స్థితికి వచ్చింది. ఎడతెగని బిజీ షెడ్యుల్ మన ఆటగాళ్ళ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ట్వంటి ట్వంటి క్రికెట్ ఐపిఎల్ వంటి టోర్నమెంట్ లో వేగంగా పరుగులు సాధించాడనికి అలవాటు పడ్డారు. అలాంటిది యిప్పుడు ఐదు రోజుల టెస్ట్ క్రికెట్ లో నిలకడగా బ్యాటింగ్ చేయడం, ఫీల్డింగ్ చేయడానికి చాలా ఓపిక కావాలి, అందుకోసం మన జట్టులో ఎంతమంది సిద్దంగా ఉంటున్నారు. అయితే వీళ్ళ లో టెస్ట్ క్రికెట్లో పరుగులు, వికెట్స్ తీసిన వారు లేరా అనేది కాదు. ఉన్నారు. మన వాళ్ళు స్వదేశం లోనే బాగా రాణిస్తారు, విదేశాలలో మన ట్రాక్ రికార్డు అంతంత మాత్రమే అనేది విదితమే. మరి అటువంటప్పుడు విదేశాలలో మనవాళ్ళు ఎదురుకుంటున్న సమస్యలను పసిగట్టలేరని ఎలా అనుకుంటాం. ఫాస్ట్ బౌలింగ్ క్రికెట్ పిచ్ లను తయారు చేయాలి, అందు కోసం మన బి సి సి ఐ ఇంత వరకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది? మాజీ క్రికెట్ ఆటగాళ్ళు కూడా దీనిపై స్పందించిన దాఖలాలు అరుదు.  మన జట్టు ఆట చూసి విసిగిపోయి, ఇక వీరు మారారు అనుకుని కొన్నిరోజులు క్రికెట్ చూడడం మానుకుందాం అనుకుంటాం. కానీ  సెహవాగ్ డబుల్ సెంచరీ చేస్తేనో,  సచిన్ సెంచరీ కొడితేనో, లేక ఏది రికార్డు నెలకొల్పితేనో , రెండున్నర దశాబ్దాల తరువాత ప్రపంచ కప్ గెలిచిన ఆనందమో మనల్ని క్రికెట్ వైపు మళ్ళిస్తుంది. అందుకే స్వదేశం లో ప్రయోగాలూ చేసే మనం, విదేశాలలో ఆడటానికి  సమర్థులని భావిస్తూ ఎంపిక చేసి పంపినా అవే ఫలితాలు. అంటే ఆటగాళ్ళను మార్చినంత మాత్రానా విదేశీ గడ్డ పై మన రికార్డులు మారడం లేదు. అందుకే ఓడిపోయాక రోగ నిర్ధారణ చేసి, చికిత్స చేయకపోతే మన పాత వైఫల్యాల  జ్ఞాపకాలు ఎప్పుడు పదిలంగానే ఉంటాయి. గెలిచినప్పుడు ఆనంద పడడం, ఓడినప్పుడు అలసి పోవడం క్రికెట్ ఆటగాళ్ళకు, అభిమానులకు మాములే

Friday 13 January 2012

పోరాడరు కానీ పోట్లాడుతారు ...



పాలకుర్తి, ఆర్మూర్ సభలు తెలంగాణపై దండయాత్రలు గానే ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. జగన్, చంద్రబాబు లు పోలీసు బందోబస్తులో దీక్షలు, యాత్రలు చేసి తమ సభలు విజయవంతమయ్యాయని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. రైతు పేరు చెప్పుకొని  వేలాది మంది పోలీసు, ప్రైవేటు రక్షణలో వీరు యాత్రలు దీక్షలు చేశారు. అలాగే తెలంగాణ పై స్పష్టమైన విధానాన్ని చెప్పాలని డిమాండ్ చేస్తూ వారిని అడ్డుకోవాలని చూసిన ప్రతి తెలంగాణ బిడ్డను గొడ్డును బాదినట్టు  బాదారు. యిప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఎదురుకొంటున్న సమస్యలను పరిష్కరించలేని కిరణ్ సర్కారు వీరి యాత్రలకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం విడ్డురంగా ఉంది. జగన్, చంద్రబాబు యాత్రల సందర్భంగా వారికి రక్షణ కోసం దాదాపు ఎనిమిది కోట్ల దాక ఖర్చయినట్టు సమాచారం. వేలాది మందిని అరెస్టు చేసి, నిర్బంధించి కిరణ్ సర్కార్ వారికి అండగా నిలబడింది. సర్కారు సహాయంతో తెలంగాణ ప్రాంతం లో చక్కర్లు కొట్టి, ప్రజలు తమను విశ్వసిస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటు. అయితే ఇక్కడ ఒక విషయం మరిచి పోతున్నారు. జగన్, చంద్రబాబులు తాము తెలంగాణ కు వ్యతిరేకం కాదని చెప్పిన వారికి నిరసనలు తప్పలేదంటే వారిపై తెలంగాణ ప్రజలు ఎంత విశ్వాసముందో అర్థం అవుతున్నది. ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవంత్ రెడ్డిలు తెలంగాణ పై తమ అధ్యక్షుడు ఇప్పటికే తన అభిప్రాయాన్ని చెప్పాడు అంటున్నారు. అదే పార్టీకి చెందినా సీమాంద్ర నేత రాజేంద్ర ప్రసాద్ మాత్రం జగన్ ఆర్మూర్ యాత్ర పై స్పందించారు. పార్లమెంటులో సమైక్య ఫ్లకార్డు పట్టుకున్న అయన దానికే కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఇక వై ఎస్ ఆర్ కాంగ్రెస్ సీమాంద్ర  నేత మేకపాటి తెలంగాణ పై జగన్ ఇంత కంటే స్పష్టత ఇవ్వలేరు అంటున్నారు. ఈ రెండు పార్టీల తెలంగాణ నేతలు మాత్రం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కంటే తమ తమ అధినేతల అనుగ్రహనికే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తున్నది. ఒకరు రెండుకళ్ళు అంటే మరొకరు ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి లేదని వంచనకు పాల్పడుతున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని నిరసించింది తెలంగాణ ప్రజానీకం. అందుకే వీరి పర్యటనలను ప్రతిఘటించింది. ప్రజల ఆగ్రహాన్ని అణిచివేయడానికి కిరణ్, జగన్, చంద్రబాబులు ఒక్కటయ్యారు ఈవేళ. దాని ప్రశ్నించాల్సిన ఈప్రాంత ప్రజాప్రతినిధులు టి ఆర్ ఎస్ జగన్ పర్యటనను ఎందుకు అడ్డుకోలేదు అనడం అవివేకం. చంద్ర బాబు, జగన్ పర్యటనల సందర్బంగా తెలంగాణవాదులను అరెస్టు చేసిన విషయం వీరికి కనిపించలేదా? అదే చంద్రదండు తెలంగాణ వాదులపై చేసిన దాడులు మరిచిపోయారా? మొన్నఆర్మూర్ సభలో  న్యూ డేమోక్రాసి సభ్యుల మెరుపు ముట్టడి... ఇవన్ని కావా నిరసనలు. మరి మీరు నిజంగా తెలంగాణ కు కట్టుబడి ఉన్నట్లయితే జగన్ పర్యటనను ఎందుకు అడ్డుకోలేదు? మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి ఉద్యమ నేతలపై అవాకులు చెవాకులు ఎందుకు? అందుకే మిమ్మల్నీ మీ అధినేతను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. నమ్మరు కూడా. ఇదీ కాంగ్రెస్, వై ఎస్ ఆర్ పార్టీ ల కే కాదు తెలంగాణ ను వ్యతిరేకించే అన్ని పార్టీలకు వర్తిస్తుంది.

Labels:

Friday 6 January 2012

ప్రశ్నిస్తే... ప్రతిఫలం ఇదీ ..!



బాబు రైతు పోరు యాత్ర  తెలంగాణ ప్రజలపై దండ యాత్ర లాగా సాగుతున్నది. ఒక ప్రాంత ప్రజలు బాబు గో బ్యాక్ అని నినదిస్తున్నారు. అయినా బాబు తన మంది మార్బలంతో ప్రజలపై పోరుకు సిద్ధమై ఓరుగల్లుకు వెళ్ళాడు. దీన్ని ఆ పార్టీ టిడిపి నేతలు బాబు పర్యటన బాగు బాగు అని సమర్థించుకుంటున్నారు. కానీ బాబు అండ్ కో ఒక విషయాన్ని మరిచిపోతున్నారు. ఇవాళ బాబు చేస్తున్న రైతు యాత్ర ఎవరి కోసం. హైదరాబాద్ మొదలు వరంగల్ దాక అడుగడుగునా బాబుకు నిరసనే వ్యక్తమయ్యింది. నిజంగా బాబు పర్యటనను తెలంగాణ ప్రజలు స్వాగతించి ఉంటే మూడు రోజులుగా ఓరుగల్లులో జరిగిన పరిణామాలు, జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. యిప్పుడు రైతు సమస్యలే కాదు, కార్మికులు, విద్యార్థులు, చేనేత, ఒక వర్గమే కాదు అన్ని ప్రభుత్వ వ్యవస్థ లను నిర్వీర్యం చేసినా ఘనుడు బాబు. ఐ టి మోజులో పది సమాజం లోని అన్ని వ్యవస్థలను తుంగలో తొక్కాడు. దాని పర్యవసానమే కదా రెండు సార్లు ప్రజలు ప్రతి పక్షంలో కూర్చోబెట్టారు. నిజంగా బాబు తన తొమ్మిదేళ్ళ పాలనను, ఏడేళ్ళ ప్రతిపక్ష పాత్రపై సమీక్ష చేసుకుని ఉంటే చాలా వాస్తవాలు తెలిసి ఉండేవి.  నేను తెలంగాణకు వ్యతిరేకం కాదని బాబు ఎంత మొత్తుకుంటున్నా ఇవాళ తెలంగాణ సమాజం ఆయనను ఎందుకు విశ్వసించడం లేదో అర్థమయ్యేది. తెలంగాణ ను  అయిదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ  మోసాలు చేసింది .చేస్తూనే ఉన్నది. ప్రతిపక్ష నేతగా ఆ అన్యాయాలను ఎండగట్టే అవకాశం బాబు ఉంది (అయన తెలంగాణకు నిజంగా కట్టుబడి ఉంటే). ఇక్కడే బాబు తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇదీ తెలిసిన తెలియనట్టు నటించడమే బాబు చేస్తున్న మోసం, ద్రోహం. పార్టీ పరంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే ఇంత రాద్ధాంతం జరగదు. అప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అనే కాంగ్రెస్ పార్టీ అందరి ఉమ్మడి శత్రువు అవుతుంది. తెలంగాణ ప్రజానీకం బాబు రెండు కళ్ళ  సిద్దాంతాన్ని, అయన తటస్థ వైఖరి పైనే మండి పడుతున్నది. చిదంబరం మొదలు బొత్స వరకు టిడిపి ఒకే మాట చెప్పాలని కోరుతున్నారు.  అలా చెప్పి ఉంటే అలాగే ఇవాళ మోత్కుపల్లి, దయాకర్ రావు , రేవంత్, రేవూరి, దేవేందర్ గౌడ్, కడియం లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు తెలంగాణ వ్యతిరేకులు ఎవరో బయట పది ఉండేది. కానీ బాబు తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి తెలంగాణ టిడిపి నేతలను పావులుగా వాడుకుంటున్నాడు. ఈ విషయం తెలియని అమాయకులు కాదు ఈ ప్రాంత టిడిపి నేతలు. అయితే మొన్న అవిశ్వాస తీర్మానం సందర్భంగా బాధ్యత మరిచిన తెలంగాణ కాంగ్రెస్ బానిసల వలె వీరు వ్యవహరించడమే విషాదం. తెలంగాణ ప్రజల పైకి చంద్ర దండును ఉసిగోలుపుతున్న బాబుకు రక్షణగా కిరణ్ సర్కారు ఉన్నది. మరి ఈ ప్రజలను కాపాడవలసిన ఈ ప్రాంత ప్రజాప్రతినిధులే వారిపై జులుం ప్రదర్శిస్తే ఇక చేసేది ఏముంది. పోరాటమే తెలిసిన తెలంగాణ ప్రజలను ఈ గాయాలు బాధిస్తున్నాయి కానీ తమ ఆకాంక్షను బంధించలేక పోతున్నాయి. అందుకే ఈ ప్రతిఘటనలు, దాని పర్యవసానాల బహుమతులు.