Thursday 26 April 2012

పరువు పోయాక పదవులెందుకు?

తెలంగాణపై పార్లమెంట్ వేదికగా అధికార టి కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తే సస్పెన్షన్ గురయ్యారు. దీని వెనుక ఆ పార్టీ ప్రయోజనాలు ఎలా ఉన్న పరువు పోయింది మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలదే. తెలంగాణ పై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని నిరసించలేక, ఈ ప్రాంత ప్రజల ఒత్తిడిని తట్టుకోలేక పాపం టి కాంగ్రెస్ నేతలు చాలా కష్టపడుతున్నారు. ఇంత జరిగిన తమ పదవులను వదులుకోవడానికి సిద్ధంగా లేరు మన వాళ్ళు. పైగా జానారెడ్డి వంటి నేతలు అధిస్టానం ఎన్ని అవమానాలకు గురిచేసినా పార్టీ ప్రతిష్టను కాపాడుతామని ప్రతినబూనుతున్నారు. ఈ ప్రాంత నేతల ఈ బానిస మనస్తత్వమే తెలంగాణ ప్రజలకు మరణ శాశనాలు అవుతున్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది. సీమాంధ్ర లో ఉన్న కాస్తో కూస్తే ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి తెలంగాణ అంశాన్ని, ఈ ప్రాంత నేతలను ఆ పార్టీ వాడుకోవాలని చూస్తోంది. ఈ సస్పెన్షన్ ఉదంతం అప్పుడెప్పుడో వై ఎస్ సీమాంధ్ర లో లబ్ధి పొందడానికి సృష్టించిన ప్రాంతీయ విద్వేషాల స్క్రిప్ట్ ను కొంత మార్చి యిప్పుడు అమలు చేస్తున్నారు. దశాబ్ద కాలంలో తెలంగాణ ఉద్యమం వాళ్ళ ఈ ప్రాంత ప్రజల్లో గొప్ప చైతన్యం వచ్చింది. అందుకే ఇవ్వాళ తెలంగాణ అనుకూల, వ్యతిరేక వర్గాలను ఈ ప్రాంత ప్రజలు పాలు నీళ్ళ వేరుచేశారు. కాంగ్రెస్, టిపిడి లు ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నా ఆ కుట్రలను చాకచక్యంగా తిప్పి కొడుతున్నారు. అలాంటి చైతన్యం యిప్పుడు సీమాంధ్ర ప్రజానీకంలో రావలె. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా పార్లమెంట్ లో పాడిందే పాట పాసుపండ్ల పాట అన్నటు వ్యవహరించకుండా పదవులను వదులుకొని ప్రజా క్షేత్రంలోకి రావలె. ప్రజల ఆకాంక్షను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పుడో వదిలేశారు. ఇక ఆ పార్టీని, ఆ పార్టీ పదవులను పట్టుకొని వేలాడితే ప్రయోజనం ఏముంటుంది. ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటే ఆన్న టి కాంగ్రెస్ నేతల పరువు అయినా దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని తేలుస్తుందని గానీ, రాష్ట్రాన్ని ఇస్తుందని కానీ ఈ ప్రాంత ప్రజలు నమ్మడం లేదు. ఐదున్నర దశాబ్దాలుగా ఈ అంశాన్ని వాడుకొని, అధికారంలోకి రావడం, వచ్చాక ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నిచడం ఆ పార్టీ చేస్తూనే ఉన్నది. అందుకే ఆ పార్టీని, దాని అడుగులకు లోపాయికారంగా మద్దతునిస్తున్న టిడిపిని ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికే బొంద పెట్టారు. అందుకే తెలంగాణ పై ఇక దాగుడు మూతలకు కాలం చెల్లిందని ఈ ఇరు పార్టీ గ్రహించాయి. అందుకే యిప్పుడు మళ్లీ కొత్త నాటకం మొదలు పెట్టాయి. దీనికి తెలంగాణకు సై అన్న బిజే పీ కూడా యిప్పుడు శ్రుతి కలిపింది. అందుకే అధికార పార్టీ ఎంపీల సస్పెన్షన్ కు ప్రతిపక్ష పార్టీ మద్దతు తెలిపింది. మహబూబ్ నగర్ లో గెలిచిన సంతోషం నుంచి ఇంకా ఆ పార్టీ నేతలు బయిటికి రానట్టున్నారు. అందుకే పాలమూరు ఫలితమే పరకాలలో పునరావృతం అవుతుందని బీరాలు పలుకుతున్నారు. చంద్రబాబు గొడుగు కింద తెలంగాణ ఉద్యమం చేస్తున్న టి టిడిపి ఫోరానికి పట్టిన గతే వెంకయ్య నాయుడు డైరెక్షన్ లో నడుస్తున్న బిజెపి తెలంగాణ ఉద్యమాన్ని పరకాల ప్రజలు ప్రశ్నించబోతున్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న పార్టీ నినాదం ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే ఎందుకు వినిపిస్తున్నది. సీమాంధ్ర లోని పదిహేడు అసెంబ్లీ, ఒక్క పార్లమెంటు స్థానాల్లో ఆ వాదం ఎందుకు మరుగున పడుతున్నదో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమాధానం చెప్పాలే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఉప ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో జరగనున్న స్థానాల్లో స్పష్టత లేకుండా.. కేవలం పరకాల స్థానం పైనే పదేపదే ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు చెబుతున్న రెండుకండ్ల సిద్ధాంతానికి యిప్పుడు బీజే పీ అనుసరిస్తున్నవిధానానికి తేడా ఏమిటో వెంకయ్య, కిషన్ రెడ్డి లు ఈ రాష్ట్ర ప్రజానీకానికి సంజాయిషీ ఇచ్సుకోవలె. పాలమూరులో బీజే పీ కి అభ్యర్థి దొరకక పోతే రాత్రికి రాత్రే గతంలో టిఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన యె న్నం శ్రీనివాస రెడ్డి ని రంగం లోకి దించి పాలమూరులో విజయం సాధించి నంత సులువు కాదు పరకాల. పాలమూరులో ఓట్ల కోసం ఆ పార్టీ వేసిన ఎత్తుగడలు పరకాలలో పారవు. పాలమూరు ఎన్నిక తరువాత టిఆర్ఎస్ కు అసలు విషయం తెలిసివస్తుందని బీజే పీ నేత ప్రకాష్ జవదేకర్ మాటలు... యిప్పుడు పరకాల ఎన్నిక తరువాత వెంకయ్యకు, కిషన్ రెడ్డికి వాస్తవాలు తెలిసి వస్తాయి. అందుకే పాలమూరు గెలుపు వాపు కాదు బలుపు అనుకునే బీజే పీకి ఓరుగల్లు ప్రజలు సరైన నిర్దేశనం చేయనున్నారు. అందుకే అటు  టి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఇటు బీజే పీ నేతలు పరువు పోకముందే ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ నడుచుకుంటే మంచిది
rajuasari@gmail.com


Tuesday 24 April 2012

ప్రజా ప్రస్థానంతో ప్రయోజనం ఎవరికి?
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'ప్రజా ప్రస్థానం' పూర్తిగా అధికార పార్టీ ప్రచార కార్యక్రమంగా తయారైంది. ప్రభుత్వం గతంలో  నిర్వహించిన రచ్చబండ, ప్రజాప్రస్థానం కార్యక్రమాల్లో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదు. మంత్రి దానంతో పాటూ ఆ పార్టీ నేతలు ఇదే విషయం పై తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించి, ప్రజలకు మరింత చేరువ కావడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ముఖ్యమంత్రి మీడియాలో ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉన్నది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి వచ్చిన ప్రజానీకం పై ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయిస్తున్నది. నిరసన తెలపుతునవారిని నిర్దాక్షనీయంగా బయటికి గెంటి వేస్తున్నది. అయతే ఈ కార్యక్రమ ఉద్దేశం మాత్రం త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో పార్టీ పరువును కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి తాపత్రయ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై ఆ పార్టీ అధిష్టానం అసంతృప్తి తో ఉన్న విషయం తెలిసిందే. బొత్స, కిరణ్ ల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య, అంతర్గత పోరువల్ల పార్టీ రాష్ట్రంలో చాలా బలహీన పడిపోయిందని ఇటివలే రాష్ట్ర పర్యటనకు వచ్చి కాంగ్రెస్ అధిష్టాన దూత వాయిలార్ రవి సోనియా దీనిపై ప్రాథమిక నివేదిక సమర్పించినట్టు సమాచారం.దీనికి ఈ ఇరువురు నేతలపై 'వేటు రూటే' ఉత్తమం అని  కాంగ్రెస్ పెద్దలు ఒక అభిప్రాయానికి వచ్చారని వార్తలు వస్తున్నాయి. ఉప ఎన్నికల తరువాత ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంత వరకు ఉప ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అనే ఉద్దేశం తో రవిని రాష్ట్ర పర్యటనకు పంపారు. పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని రవి సూచించారు. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆవహించిన నిస్తేజాన్ని పోగొట్టడానికి పార్టీ అధిష్టానం నడుం బిగించింది. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సంగతి ఎలా ఉన్నా..అలసత్వం మాత్రం పనికి రాదని తేల్చి చెప్పింది. అందుకే ముఖ్యమంత్రి ఉప ఎన్నికలు జరిగే నియోజక వర్గాల్లో పర్యటనలు చేస్తూ కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నారు. తన కుర్చికి ముంచు కొస్తున్న ముప్పును తప్పించుకోవడానికి కిరణ్ చాలా కష్టపడుతున్నారు. ఉప ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి న్యాయ పరమైన చిక్కులు ఎదురు కాకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలపై అధికారులను ఆదేశించారు. ఇంతకాలం ప్రజా సమస్యలను పక్కన పెట్టి అధికార పార్టీలోని నేతలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుని వైకరిపై అధిష్టానం అక్షింతలు వేయడంతో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి.  అందుకే ముఖ్యమంత్రి  ప్రజా ప్రస్థానం పేరుతో పార్టీ ఎన్నిక ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ ప్రచార కార్యక్రమ సభల్లో ముఖ్యమంత్రి తన గురించి గొప్పలు చెప్పుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తున్నది.రాష్ట్రంలో తాగు నీటి సమస్యలు తలెత్తకుండా వందకోట్లు కేటాయించినట్టు, రైతులకు ఏడుగంటలు విద్యుత్తూ అందిస్తున్నట్టు ఉపన్యాసాలు ఇస్స్తున్నారు. అయితే గుక్కెడు నీళ్ళ కోసం రాష్ట్రంలోని చాలా గ్రామాల ప్రజలు  మైళ్ళ దూరం వెళుతున్నారు. కరెంటులేక పంటలు ఎండిపోతున్న వాస్తవాలు మనకు కనిపిస్తున్నయి. స్వైన్ ఫ్లూ కేసులు రోజురోజుకు పెరుగుతున్న వార్తలు రోజూ మీడియా లో వస్తున్నాయి. ఇవ్వన్ని ప్రజా సమస్యలుగా రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిచడం లేదు కాబోలు. నా రాజ్యం రామ రాజ్యం అని కిరణ్ భావిస్తున్నారు కావచ్చు. గతంలో ఈ ప్రభుత్వం చేయనన్ని పనులు తన ప్రభుత్వం చేసిందని ముఖ్యమంత్రి ప్రతీ సభలో గొంతెత్తి అరుస్తున్నారు. తమ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని తనకు తనే ప్రశంశ పత్రాలు ఇచ్చుకుంటున్నారు. మరి ప్రజా సమస్యలే లేనప్పుడు ఈ 'ప్రజా ప్రస్థానం' ఎవరి కోసం? దీంట్లో ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రభుత్వాధినేతలు చెబితే బాగుంటుంది.
-రాజు ఆసరి 

Sunday 22 April 2012

ఉప ఎన్నికలు .. ఉపన్యాసాలు

తెలంగాణపై తేల్చడానికి, రాష్ట్రంలో జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధం లేదు. ఉండకూడదు కూడా. తెలంగాణ పై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక డెడ్ లైన్లు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఈ సాచివేత వైఖరి వల్లే దాదాపు 850 తెలంగాణ బిడ్డలు ఆత్మ్యహత్యలకు పాల్పడ్డారు. ఈ పాపంలో రెండుకండ్ల బాబుకు కూడా భాగస్వామ్యం ఉన్నది. మొన్నటిదాకా కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి, గవర్నర్, డీజీపీ తో కలిసి అనేక కుట్రలకు పాల్పడ్డాడు. దీనికి ఇంటిదొంగలు కూడా తమ వంతు సహాయం అందించారు.ఉద్యమకారులపై, ఉద్యోగస్తులపై, విద్యార్థులపై వందలాది అక్రమ కేసులు బనాయించాడు. తెలంగాణ ఉద్యమం చల్లబడిందని కేంద్రానికి నివేదికలు పంపాడు. కిరణ్ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఆ'జాదు' తో కలిసి కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించాడు.దీని ప్రభావం మొన్న ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒక్క మణిపూర్ లో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో వచ్చి ఫలితాలు కాంగ్రెస్ పెద్దలకు పెద్ద షాక్ నే ఇచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. అలాగే మహారాష్ట్రలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి ఆరోపణలను ఎదురుకొంటున్నది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కి మిత్ర పక్షమైన ఎన్ సిపీ మధ్య కూడా విభేదాలు మొదలయ్యాయి.ఈ రెండు పార్టీల మధ్య ఈ అగాధం ఏర్పడడానికి ప్రధాని మన్మోహన్ కారణం. ఒకవైపు మిత్ర పక్షాలతో కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ.. వాటివల్లే అనేక సమస్యలు వస్తున్నాయని ప్రధాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. ప్రధాని వ్యాఖ్యలను శరద్ పవార్ తప్పు పట్టాడు. ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం లో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్ అధిష్టానం వాయిలార్ రవిని రాష్ట్రానికి పంపి వాస్తవ పరిస్థితులపై ప్రాథమిక నివేదికను తెప్పించుకున్నది. రవి పర్యటన కేవలం ఉప ఎన్నికల కోసమే అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా బొత్స, కిరణ్ ల మధ్య కొనసాగుతున్న అంతర్గత కలహాలతో పార్టీ తీవ్రంగా నష్టపోయిందని రవి సోనియాకు వివరించినట్టు సమాచారం. అయితే ఈ ఉప ఎన్నికల తరువాత రాష్ట్రంలో పీ సి సి అధ్యక్షుడిని, ముఖ్యమంత్రిని మారుస్తారని వస్తున్నా వార్తల్లో వాస్తవం ఎంత ఉన్నా.. నాయకత్వ మార్పుతో కాంగ్రెస్ పార్టీ ఒనగూరే ప్రయోజనం మాత్రం శూన్యం. ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని పక్కన పెడితే.. అధికార, ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలపై చేతులేత్తేసినట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే తరుచు ఉప ఎన్నికలు వస్తుండడంతో  పోటీ చేయడం కన్నా, తమిళనాడు తరహాలో వదిలేయాలని అనిపిస్తున్నది చంద్ర బాబు నిర్వేదంతో అన్నారు. కిరణ్ కూడా తను ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన సమయం బాగా లేదేమో అని వేదాంతాలు పలికారు. అంటే ఎన్నికలను ఎదురుకొనే సత్తా లేదని ఈ ఇరువురు నేతలు ఒప్పుకున్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ చిత్తూరు బాబులిద్దరు విఫలమయ్యారు.కిరణ్, బోత్సలపై నమ్మకం లేకనే కాంగ్రెస్ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది, కనీసం రెండు మూడు స్థానాల్లో అయినా గెలవడానికి వ్యూహాలు రచిస్తున్నది. అధికార పార్టీగా గడిచిన రెండున్నర సంవతరాల్లో రాష్ట్రం లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలవకపోవడం కూడా కాంగ్రెస్ పెద్దలను కలవరానికి గురిచేసిందేమో. ఈ పరిస్థితి ఇలానే ఉంటే దాని ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై కూడా పడుతుందని గ్రహించింది. అందుకే రోగ నిర్ధారణ కోసం వాయిలార్ రవిని రాష్ట్రానికి పంపింది.  రాష్ట్రంలో పార్టీకి సోకిన వ్యాధికి ప్రాథమిక చికిత్స ప్రారంభించింది.యిప్పుడు వాయిలార్ రవి ఇచ్చిన నివేదిక ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నదో మరికొన్ని రోజులు ఆగితే గానీ తెలియదు. కానీ తెలంగాణ వ్యతిరేకులు ఉప ఎన్నికల్లో జగన్ ను ఎదురుకొని నిలబడడానికి, రాష్ట్ర విభజన అంశాన్ని వీటితో ముడి పెడుతున్నారు. గత ఎన్నికల సమయంలో నంద్యాల సభలో  వై ఎస్ వేసిన పాచికనే ఓట్ల కోసం  ఇప్పడు మళ్లీ వేస్తున్నారు. కానీ నాటికి నేటికి రాష్ట్రంలో.. రాష్ట్ర ప్రజానీకంలో ఎంతో మార్పు వచ్చింది. వై ఎస్ హయంలో జరిగిన అవినీతి, చంద్రబాబు ద్వంద్వ నీతీ.. కిరణ్ అసమర్ధత, కేంద్ర ప్రభుత్వ అలసత్వం ఇవన్నీరాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులకు గురి చేశాయి. చేస్తున్నాయి. ఈ విషాదానికి జగన్ కూడా బాధ్యుడే! రాష్ట్ర ప్రజల్లో మానసిక విభజన డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ పై చిదంబరం చేసిన ప్రకటన తర్వాతనే వచ్చింది. ఇక యిప్పుడు మిగిలింది భౌగోళిక విభజన మాత్రమే. రాష్ట్ర ప్రజలు కేంద్రాన్ని  కోరుతున్నది అదే. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే గానీ ప్రజలను అయోమయాని గురిచేసే ప్రకటనలు చేయడం సరికాదు. దాని వల్ల అన్నదమ్ములుగా విడిపోయి ఆత్మీయులుగా కలిసుండాలని ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను దెబ్బ తీయరాదు. యిప్పుడు జరిగే ఉపఎన్నికలు వై ఎస్, జగన్ ల అవినీతికి, ప్రభుత్వ పని తీరుకు, ప్రధాన ప్రతిపక్ష నేత సమర్థతకు కు మాత్రమే ఈ ఎన్నికల యుద్ధం. వీటికి  రాష్ట్ర విభజనకు సంబంధం లేదు.

--
rajuasari@gmail.com


Tuesday 3 April 2012

గెలిచింది తెలం'గాన'మే !


తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వచ్చిన ప్రతీసారి.. ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఆంద్ర, మన్యసీమ, గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రం వాదనలు మున్డుకొచ్చేవి. తరువాత బహుజన తెలంగాణ, అణగారిన వర్గాల తెలంగాణ కావాలని.. దొరల తెలంగాణ వద్దనే వాదనలు వచ్చాయి. రెండున్నర సంవత్సరాలుగా ఇలాంటి వాదనలు వచ్చాయి పోయాయి. ఆయా సందర్భాలకు అనుగుణంగా కొందరు ఇలాంటి వాదనలు తెచ్చారు, వీటిని ప్రజలు ఎంత వరకు విశ్వసించారు అనేది వేరే విషయం. ఈ వాదనలు తెచ్చిన వారు వాటికోసం ఉద్యమించింది లేదు. ఉద్యమిస్తున్నది లేదు. అందుకే ఆ వాదనలు పేపర్లో వ్యాసాలుగానో.. వార్తలు గానో మిగిలి పోయాయి.  యిప్పుడు రాయల తెలంగాణ కావాలని కొందరు..మతతత్వ తెలంగాణ వద్దని మరికొందరు వాదిస్తున్నారు. నిజంగా తెలంగాణ ప్రజలు ఈ అన్ని వాదనల్లో దేన్ని సమర్థిస్తున్నారో తెలియదు గానీ .. ముందు స్వరాష్ట్రం కావాలనే తమ ఆకాంక్షను మాత్రం వెలిబుచ్చుతున్నారు. ఇది ఎవరు అవునన్నా.. కాదన్నా వాస్తవం. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష.. ఆవేదన.. వారి అలుపెరుగని పోరాటం.. ఆరాటం అంతా తెలంగాణమే. యిప్పుడు ఈ ప్రాంత  ప్రజలు యుద్ధం చేస్తున్నది ఇద్దరిపైనే. అందులో తెలంగాణ ప్రకటన చేసి  వెనక్కి తీసుకున్న కేంద్రం పైన.. మరొకరు ఆడిన మాట తప్పినా రెండుకండ్ల బాబు పైన.. ఈ యుద్ధంలో తెలంగాణ వ్యతిరేకులపై ఈ ప్రాంత ప్రజలు విజయాన్ని సాధించారు.. సాధిస్తున్నారు... మునుముందు సంపూర్ణ విజయం సాధిస్తారు కూడా. ఇందులో రెండో మాటకు తావు లేదు. ఈ యుద్ధంలో కుల, మత, వర్గాల ప్రస్తావన లేదు. ఉండదు. ఉండకూడదు. బలమైన శత్రువును ఎదురుకోవాలంటే అది ఒక బలవంతుడికే సాధ్యం అవుతుంది. ఆ బలం పదేళ్ళ కిందట ప్రారంభమైన మలిదశ ఉద్యమం నేడు వివిధ పాయలుగా చీలిపోయి.. అందరి ఆకాంక్ష కోసం ఒక్క తాటిపైకి వచ్చింది. ఇందులో ఎవరి అభిప్రాయాలూ వారికున్నా..నినాదం మాత్రం ఒక్కటే. ఇది తెలంగాణ వ్యతిరేక శక్తులకు మింగుడు పడడం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని గ్రహించారు. బలమైన తెలంగాణ శక్తుల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీసే వ్యూహాలు పన్నుతున్నారు. ఈ కుట్రలను తిప్పికోట్టక పొతే తెలంగాణ ప్రజలు కట్టు బానిసలుగా బతకాల్సి వస్తుంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీ ల విధానం ఒక్కటే. ఇందులో వారి వారి ప్రయోజనాలు తప్పక ఉంటాయి. దీనిపై యిప్పుడు చర్చలు కూడా అనవసరం. ఈ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలిచినా అక్కడి ప్రజల తీర్పుగానే భావించాలి. అక్కడ శత్రువు ఓడిపోయాడు తెలంగాణ గెలిచింది. ఒకవేళ అక్కడ కాంగ్రెస్, టిడిపిలలో ఈ పార్టీ గెలిచినా... లేదా టి ఆర్ఎస్ టిడిపి లాగా నాలుగో స్థానానికి దిగాజరినా తెలంగాణ వాదం పై విషం చిమ్మేందుకు సీమాంద్ర మీడియా, సీమాంధ్ర నేతలు సిద్దపడేవారు. సిద్ధపడ్డారు కూడా. ఎన్నికల ఫలితాల రోజు మహబూబ్ నగర్లో మొదట టి ఆర్ఎస్ నాలుగో స్థానంలో ఉన్నప్పుడు.. మిగతా చోట్ల ముందున్నా వాటిని వదిలి పెట్టి.. మహబూబ్ నగర్ ఎన్నికపై చర్చలు పెట్టిన విషయాలు ఇక్కడ మనం గుర్తించు కోవాలె. దాన్ని మరిచిపోయి ..  పార్టీలు.. వర్గాల ప్రస్తావన తేవడం సరికాదు.  ఎందుకంటే తెలంగాణాలో జరిగిన ఆరు స్థానాల్లో ఐదు చోట్ల తెలంగాణ కోసం రాజీనామా చేసినవాళ్ళు అయితే ఒక్క స్థానానికి  మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నిక వచ్చింది. ఐదు స్థానాల్లో ఆయా అభ్యర్థులపై స్థానికంగా ఎంత వ్యతిరేకత ఉన్న తెలంగాణ వాదనికే ప్రజలు జై కొట్టి.. ఉద్యమ స్పూర్తిని చాటారు. మహబూబ్ నగర్ స్థానంలో మాత్రం జే ఏ సీ లో కీలక పాత్ర పోషిస్తున్న రెండు పార్టీలు బరిలో ఉండడం మూలంగా అక్కడ  ఎవరిని ఎన్నుకోవాలో.. ఏ పార్టీకి మద్దతు తెలంగాణ వాదులకు కూడా పరీక్షా ఎదురైంది. ఈ సమస్యను పరిష్కరించే సమయం కూడా జే ఏ సీ కి లేకుండా పోయి ఉండవచ్చు. ఇందులో ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అన్ని వర్గాల వారు కూర్చుని చర్చించుకునే అవకాశం కూడా ఉన్నది. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకునే మార్గాలు కూడా ఉన్నాయి. అంతే కానీ సీమాంధ్ర పెట్టుబడి దారులు తెస్తున్న వాదనలు.. తమది సమక్య వాదమని.. భాష ప్రయుక్త రాష్ట్రాలే తమ సిద్ధాంతమని బీరాలు పలికి.. చివరికి మాటమార్చి ఈ ప్రాంత ప్రజలను అవమాన పరిచే విధంగా తెలంగాణ ఇస్తే మతకలహాలు చెలరేగుతాయని శ్రీకృష్ణ కమిటీ ముందు అడ్డదిడ్డంగా మాట్లాడిన సిపిఎం వైఖరి తెలంగాణ వాదులది కావద్దు. వారి మాటలను బలపరిచే విధంగా మన వాదనలు ఉంటే..మన అనైక్యతే శత్రువుకు ఆయుధం అవుతుంది!
అలాగే మహబూబ్ నగర్ లో బిజెపి అభ్యర్థి గెలుపు పై వాదనలు చేస్తున్న మిత్రులు కూడా ఒక్క విషయం గ్రహించాలి. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణపై ఒక స్పష్టమైన విధానం ఆ పార్టీకి ఉన్నది. ఎప్పుడు అవకాశం వచ్చిన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ఆ పార్టీ నిలదీస్తున్నది. కానీ తెలంగాణ తను వ్యతిరేకం కాదని.. వ్యతిరేకంగా మాట్లాడలేదని.. మాట్లాడబోనని చెబుతూనే రాష్ట్ర అసెంబ్లీలో మాత్రం ఈ అంశం పై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. వ్యతిరేకం కాదన్న వాళ్ళు అనుకూలం అని చెప్పలేదు. బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తామనడం లేదు. ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్న పార్టీలను వదిలిపెట్టి..తెలంగాణకు మద్దతు ఇస్తామన్న పార్టీలను తప్పుపట్టడం ఎందుకో! అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఆ రాష్ట్రం ఎలా ఉండాలో ఈ ప్రాంత ప్రజలు నిర్ణయించుకుంటారు. అప్పటిదాకా ఉద్యమ ఐక్యతను ప్రదర్శిస్తున్న ప్రజల మధ్య విభజన తెచ్చే విధానాలకు ఎవరు పాల్పడిన అది చారిత్రక తప్పిదమే అవుతుంది.

--
rajuasari@gmail.com


Labels: