Friday 25 May 2012

మొన్నముప్ఫై ఎనిమిది.. నేడు ఎనభై.. రేపు వంద!
యూపీఏ -2 సర్కార్ మూడో వార్షికోత్సవ జరుపుకున్న తెల్లారే ప్రజల నెత్తిపై పెట్రో మంట పెట్టింది. 2011-12 మూడు సార్లు పెట్రో ధరలు పెంచి ఆమ్ ఆద్మీ అంటే ఏమిటో సామాన్యునికి అర్థమయ్యేలా చేసింది. ప్రజల కష్టాల సంగతేమో గానీ కార్పొరేట్ వ్యవస్థను మాత్రం కంటికి రెప్పల కాపాడుతోంది మన్మోహన్ సర్కార్. సామాన్యుల ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని యూపీఏ -2 ప్రభుత్వం వాగ్దానం చేసింది. మూడేళ్ళ కిందట ప్రజలకు ఇచ్చిన ఆ హామీలన్నీ శుష్క వాగ్దానలే అని తేటతెల్లమైంది. మన్మోహన్, అహ్లువాలియాల మాయాజాలానికి సామాన్యులే సమిదలవుతున్నారు. యూపీఏ ఎనిమిదేళ్ళ పాలనలో సామాన్యులు మోయలేని విధంగా ఎడాపెడా పన్నులు పెంచేసింది.మన్మోహన్ అండ్ కో లకు అమెరికాతో చేసుకునే అణు ఒప్పందం మీద ఉన్న ప్రేమ పేదల అవస్థలపై లేదు. అందుకే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం నుంచి ఇంకా దిగిరాలేదు. కానీ ఈ ఇప్పటికి ఈ ఏలికలు పెరిగిన ధరల తగ్గించడమే తమ ముందున్న లక్ష్యమని పునరుద్ఘాటిస్తున్నారు. 2004 లో 38 రూపాయలు ఉన్న  లీటరు పెట్రోల్ ధరను ఈ ఎనిమిదేళ్ళలో 80 రూపాయలకు పెంచిన ఘనులు ఈ దేశ ప్రధాని పీఠంపై కూరుచున్న బ్యురోకాట్లు. యూపీఏ పాలకులు చెబుతున్న ప్రగతి.. ప్రజలు పడుతున్న పాట్లకు పొంతన కుదరడం లేదు. యూపీఏ పెద్దలు అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే చూస్తున్నారు కానీ ప్రజల సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తుచ తప్పకుండ అమలుచేస్తున్నది. పెట్రోధరల పెంపు వల్ల కేంద్రానికి ఏట వ్యాట్ రూపంలో దాదాపు 309 కోట్ల ఆదాయం రానున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాట్ శాతాన్ని కొంత తగ్గిస్తే ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుంది. పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మకం పన్ను తగ్గిస్తే ప్రజకు కొంత భారం తగ్గుతుందని వాత పెట్టిన కేంద్రమే వెన్న పూయాలని రాష్ట్రాలకు సూచించింది. దీనిపై ఉత్తరాఖండ్ రాష్ట్రం 25 వ్యాట్ తగ్గించింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించినా కిరణ్ సర్కార్ మాత్రం దీనిపై స్పందించడం లేదు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలతో పాటు యూపీఏ భాగస్వామ్య పక్షాలు తప్పుపడుతున్నాయి. యూపీఏలో ప్రధాన భాగస్వామ్య పక్షం తృణమూల్ ఈ చర్యను తీవ్రంగా నిరసిస్తున్నా ఈ సాకుతో సర్కారును కూలదోయమని ప్రకటించింది. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో ఈ సమయానికి ఏమి జరుగునో అని కాంగ్రెస్ పెద్దలు యూపీఏకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న ఎస్పీ చీఫ్ ములాయంను కాకా పట్టే పనిలో ఉన్నారు. పెంచిన పెట్రో ధరలను ములాయం మూడేళ్ళ  యూపీఏ-2  ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన కనుక అని వ్యంగ్యంగా అభివర్ణించారు. అయితే కేంద్రంలో రెండో దఫా అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కుంభ కోణాలు వెలుగు చూస్తున్నాయి. యూపీఏ మొదటి దఫా అప్పుడు అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఎస్పీ కావడం గమనార్హం. అప్పుడు కేంద్రానికి మద్దతు విషయంలో కీలక పాత్ర పోషించిన అమర్ సింగ్ పరిస్థితి ఏమిటో విదితమే. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ.. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటూ .. అవసరం తీరగానే వాటిని పక్కన పెట్టడంలో కాంగ్రెస్ పెద్దలు అన్ని పార్టీల కంటే ఎప్పుడు ముందుంటారు.అందుకే ఈ ఎనిమిదేళ్ళలో యూపీఏ భాగస్వామ్య పక్షాలు మారాయి. కానీ ప్రజల బాధలు మాత్రం తీరలేదు. తీరవు కూడా. పెట్రో ధరలు  మొన్నముప్ఫై ఎనిమిది.. నేడు ఎనభై.. రేపు వంద అయినా ఆశ్చర్యపోనక్కర లేదు .
-రాజు

Tuesday 22 May 2012

పరకాలలో కిరణ్ పలుకులు ప్రమాద సంకేతాలే!
పరకాల వేదికగా తెలంగాణ ఉద్యమం పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తేలికగా తీసుకోరాదు. మొన్నటి సీమాంధ్ర లో ఓట్ల లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన కిరణ్ అండ్ కో బృందం యిప్పుడు తెలంగాణ గడ్డపై అవే పలుకులు పలుకుతున్నాయి.ఇదంతా పథకం ప్రకారమే జరుగుతున్నది. అంటే శ్రీ కృష్ణ కమిటీ రహస్య నివేదిక అమలవుతున్నది. సమయం దొరికినప్పుడల్లా కిరణ్ సర్కార్ తెలంగాణ ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతూనే ఉన్నది. రెండున్నర సంవత్సరాలలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క స్థానం గెలవకపోయినా ఉద్యమ తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా తెలంగాణాలో టీఆర్ఎస్ బలంగా ఉన్నది. అట్లనే సీమాంధ్ర ప్రాంతంలో జగన్ ప్రభావం అంతే ఉన్నది. (ఈ మాట కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు) ఇప్పటి దాక జరిగిన ఎన్నికల్లో జయాపజయాలు కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికలని తప్పించుకున్నారు. కానీ ఈ ఉప ఎన్నికల్లో అలాంటి చేదు అనుభవమే ఎదురైతే ప్రభుత్వ మనుగడ కష్టమే. అందుకే ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకే కాదు కిరణ్ సర్కార్ కు కత్తి మీద సాములా తయారయ్యాయి. జగన్ అక్రమాస్తుల కేసుపై ఉచ్చుబిగుస్తూనే.. తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్ముతున్నది. మీడియా, పొలిటికల్ మేనేజ్ మెంట్ ను అమలు చేస్తున్నది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది అసెంబ్లీ, ఒక్క పార్లమెంటు స్థానంలో ఉప ఎన్నికలు జరగనుండగా పరకాల ఎన్నికపైనే ఫోకస్ చేస్తుండడం విశేషం. అక్కడ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల ఉనికి లేకున్నా బిజెపి, టీఆర్ఎస్ ల మధ్య వచ్చిన భేధాభి ప్రాయలను సీమాంధ్ర మీడియా నొక్కి చెబుతున్నది. వైఎస్ నేతృత్వంలో బొటాబొటీ  మెజారిటీతో రెండో సారి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ  పాలనను అంపశయ్య పై సాగిస్తున్నది. వైఎస్ చనిపోయాక చోటుచేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నాయి. జగన్ పై వస్తున్న అవినీతి ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకునే ప్రమాద ఉన్నది. అందుకే ఇటు తెలంగాణ, అటు జగన్ ప్రభావం తగ్గిస్తేనే కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కడుతుందని కాంగ్రెస్ పెద్దలు అభిప్రాయానికి వచ్చారు. ముందుగా అధికార పార్టీ నేతలను ఉద్యమానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేశారు. (చంద్రబాబు తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ చర్యలకే మద్దతు ఇస్తున్నారు) అందుకే తెలంగాణ కోసం ఇన్ని వేదికలు, ఇన్ని సంఘాలు ఉన్నప్పటికీ టీఆర్ఎస్ నే కార్నర్ చేస్తున్నారు. బీజేపి కూడా టీఆర్ఎస్ పై దాడి చేస్తుండడం గమనార్హం. టీఆర్ఎస్ ను బలహీన పరిస్తే తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేయవచ్చు అనేది దీని అంతర్యం. అందుకే కిరణ్ పరకాలలో తెలంగాణ నినాదం తాత్కాలికమే, అభివృద్దే శాశ్వతం అని వ్యాఖ్యానిస్తే దానిపై ఒక్క టీఆర్ఎస్ మాత్రమే స్పందించింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాల్లో అన్యాయం జరిగింది వాస్తవమే. అభివృద్ధి మాటల్లో కానీ చేతల్లో కాదనేది స్పష్టమే. కానీ పదే పదే అభివృద్ధి అని ఎందుకు చెబుతున్నారు. ఐదున్నర దశాబ్దాల ప్రజల ఆకాంక్షను ఎందుకు నిరాకరిస్తున్నారు? ఉప ఎన్నికల తరువాత తెలంగాణ పై కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతూనే ఉన్నారు. ప్రాంతీయ మండలి అంశం తెరమీదికి వస్తున్న సందర్భం. తెలంగాణ కోసం ఎంతటి త్యాగాల కైనా సిద్ధమే అన్న నేతలు పదవులు రాగానే అధిస్థానం ముందు జీ హుజూర్ అంటున్న వేళ.. ఈ నేతలు తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయనున్నారు. అందుకే చిత్తూరు బాబులు తెలంగాణ పై ఎంత అక్కసును వెళ్లగక్కుతున్నా మిన్నకుండి పోతున్నారు. ముఖ్యమంత్రి తో వేదికలు పంచుకోవడానికి ఉవ్విళ్ళు ఊరుతున్నారు. ఒక్క సీటు కోసం బీజేపి కూడా తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నది. ఇది శత్రువుకు ఆయుధాన్ని అందించేదే కానీ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించేది కాదు. ప్రాంతీయ పార్టీలు లేకుండా దశాబ్డంన్నర కాలంగా కేంద్రంలో జాతీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. అయినా జాతీయ పార్టీలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం అనే వింత వాదనలు చేస్తున్నారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేదే. ఇవ్వాళ కిరణ్, చంద్రబాబులు చేస్తున్న తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని చేస్తున్నారంటే తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న ఈ సంఘాన్ని, ఏ వేదికను వాళ్ళు పరిగణనలో తీసుకోవడం లేదు. తెలంగాణ అంటే టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అని వారు ఒప్పుకుంటున్నారు. ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ఈ కుట్ర ను  తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న పార్టీలు భాగస్వామ్య పార్టీలు, సంఘాలు తిప్పి కొట్టకుండా మౌనంగా ఉంటే అది తెలంగాణ ప్రజలు మరణ శాసనమే అవుతుంది!
-రాజు

Wednesday 16 May 2012

మారని వారే మార్క్సిస్టులు ...
మార్పు కోరుకునేదే మార్క్సిజం. కానీ సిపిఎం నేతలకు ఇది వర్తించదు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కారత్ ఆ మధ్య అమెరికాలో ఓ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి తమ సిద్ధాంతాలకు కాలం చెల్లిందన్నారు. (మన దేశానికి వచ్చాక ఆ వ్యాఖ్యలను ఖండించారు అది వేరే విషయం). ప్రపంచీకరణ నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. వస్తున్నాయి. వీటిని స్వాగతించే వారు ఉన్నారు. విభేదించే వారూ ఉన్నారు. వీరితో ప్రజలకు ఎలాంటి పేచీ లేదు. కానీ ఒక విషయాన్ని కొత్తగా చెబుతున్నట్టు నటించే వారితోనే ప్రమాదం. వీరు చేసే పనులన్నీ సిద్ధాంతాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తారు. కాలం చెల్లిన పిడి వాదాలను పట్టుకొని మూర్ఖపు వితండవాదాలు చేస్తారు.ఇలాంటి పనులన్నీ చేస్తున్నది ఎవరో కాదు సిపిఎం పార్టీ. తెలంగాణ విషయంలో తాము భాష ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడే ఉంటాము అంటారు. మరోసారి తెలంగాణపై తేల్చాల్సిన కాంగ్రెస్ పార్టీ తమ భుజాన తుపాకీ పెట్టి తాను తప్పించుకోవాలని చూస్తున్నదని ఆ పార్టీ నేతలే చెబుతారు. ప్రాంతాల వెనుకబాటుకు రాష్ట్ర విభజన సరికాదు అంటారు. చిన్న రాష్ట్రాల విభజన విషయంలో సిపిఎం వితండవాదన వెనుక చాలా కారణాలు ఉన్నాయి. మూడు దశాబ్దాల పాటు బెంగాల్ ను ఏకాచత్రాధిపత్యంగా ఏలిన సిపిఎం కోటలు కూలిపోయాయి. అక్కడ గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతున్నది. ఒక్క బెంగాల్ విభజనను వ్యతిరేకించడం కోసం సిపిఎం దేశ వ్యాప్తంగా అదే నినాదాన్ని అన్ని ప్రాంతాల ప్రజలపై రుద్దుతున్నది. అక్కడ గూర్ఖాలాండ్ విభజనపై దానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి గూర్ఖా నేతలతో  మమత ప్రభుతం  ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఆ సందర్భంగా గూర్ఖా నేతలు ఈ ఒప్పందం తాత్కాలికమే.. ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండును మేము వదులుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని తెలంగాణ కు ఆపాదిస్తూ సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం చేసింది. ఈ వాదనలు ఇలా ఉంటే సిపిఎం గత కొంతకాలంగా కొత్త వాదనను తెరమీదికి తెచ్చింది.బాబు రెండుకండ్ల సిద్ధాంతం, కాంగ్రెస్ కాలయాపన కంటే సిపిఎం చేస్తున్న వాదన మరింత ప్రమాదకరమైంది. తెలంగాణ ఉద్యమాన్ని మతంతో ముడిపెడుతున్నది ఆ పార్టీ. తమ భాష ప్రయుక్త రాష్ట్రాల నినాదాన్ని పక్కన పెట్టి తెలంగాణ ఏర్పడితే బిజెపి బలపడుతుందని ఎంఐఎం చేస్తున్న వాదననే ఈ పార్టీ ఆలపిస్తున్నది. శ్రీ కృష్ణ కమిటీ ముందుకూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మత కలహాలు చెలరేగుతాయని ప్రజల ఆకాంక్ష పై విషం చిమ్మింది. బహుశా తెలంగాణపై ఎంఐఎం కు ఉన్న అభిప్రాయాలూ, అనుమానాలు ఇంత భయంకరంగా లేవు. అందుకే ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ తెలంగాణ పై తేలకుండా.. హెచ్ఎండీఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను తప్పుపట్టాడు.అంటే ఎంఐఎం కూడా తమకు సమైక్య రాష్ట్రం వల్ల ఉండే  ప్రయోజనాలను పక్కన పెట్టి, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు గుర్తించింది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రంపై తెలంగాణపై తేల్చాలని ఒత్తిడి తెస్తున్నది. తమ ఓటు సమైక్య వాదానికే అని ప్రకటించినా ఒకవేళ కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదలుచుకుంటే హైదరాబాద్ రాజధానితో కూడిన  తెలంగాణ రాష్ట్రాన్నిడిమాండ్ చేస్తున్నది. అ పార్టీలో కూడా మార్పు వస్తున్నది. కానీ మార్పు కోరుకునే మార్క్సిస్టులం అనే చెప్పుకునే వీరు మూర్క్సిస్ట్ ల వలె వ్యవహరిస్తున్నారు. ఒక రాష్ట్రం ఏర్పడితే ఒక  పార్టీ బలపడుతుందనే వాదన అసంబద్ధమైనది. ప్రజల ఆదరణ లేకుండా ఏ పార్టీ కూడా బలపడలేదు అనేది కూడా గుర్తించలేని వీరు మార్క్సిస్టుల నే కాదు ఏ చిన్న పిల్లాడిని అడిగిన చెబుతాడు. అంతే కాదు వీరు చెప్పే ఉద్యమాలు, పోరాటాలు కూడా ప్రజల ఆదరణ ఉంటేనే సక్సెస్ అవుతాయి. మరి రాఘవులు వంటి వారు తెలంగాణ అంశాన్ని ఒక పార్టీతో ఎందుకు ముడిపెడుతున్నాడో తెలుసుకోలేని అమాయకులు కారు తెలంగాణ ప్రజలు. రాష్ట్ర సిపిఎంలో ఆధిపత్యం చెలాయిస్తున్నది ఒక వర్గమే అన్నది విదితమే. పార్టీలు, సిద్ధాంతాలు ఏవైనా వీరి డ్యూయెట్ ఒక్కటే అబ్బని 'కమ్మ'ని దెబ్బ. అందుకే సిపిఎం రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో తన ఉనికిని పూర్తిగా కోల్పోయింది. అయినా ఈ నేతల వైఖరిలో మార్పు రాలేదు. వస్తుందని కూడా ఎవరు భావించడం లేదు. ఎందుకంటే వారు మారని మార్క్సిస్టులని తెలంగాణ ప్రజలే కాదు, తెలుగు ప్రజలు  ఎప్పుడో గుర్తించారు. మార్పు కోరుకోకుంటే పోయిన ప్రతిష్ట ఒక్కటే కాదు, ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చే వారు కూడా దూరమౌవుతారు అనే విషయాన్ని రాఘవులు అండ్ కో ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

పరకాల పార్టీలకు ప్రతిష్టాత్మకమే!

పరకాలలో టీఆర్ఎస్ మోలుగురు భిక్షపతిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అందరి దృష్టి పరకాల ఎన్నిక పైనే పడింది. పరకాల ఎన్నిక ప్రధాన పార్టీల అన్నింటికీ ప్రతిష్టాత్మకమే! ఉప ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఈ నియోజకవర్గం అందరినీ ఆకర్షించడానికి అనేక కారణాలు ఉన్నాయి. పరకాలలో ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ పోటీ మాత్రం టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీల మధ్యనే ఉండబోతున్నది. ఇక్కడ అధికార పార్టీది నామమాత్రపు పాత్రే. పోరుగల్లు ఓరుగల్లు కేంద్రంగా జరుతున్న ఈ ఉప ఎన్నికల్లో జేఏసీ ఎవరికి మద్దతు ఇస్తుంది? పాలమూరు ఫలితమే పరకాలలో పునరావృతం అవుతుందా? టీఆర్ఎస్, జేఏసీకి మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాల వల్ల ఎవరి లాభం అనే చర్చలు జరుతున్నాయి. కానీ యిప్పుడు మీడియాలో జరుగుతున్నచర్చల తాలూకు ప్రభావం పరకాల ఎన్నికల్లో ఉండకపోవచ్చు. పాలమూరు ఎన్నికకు, పరకాలకు చాలా తేడా ఉన్నది. అక్కడి ఎత్తుగడలు ఇక్కడ పనిచేకపోవచ్చు. ఇక్కడ పోటీలో ఉన్నటీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీల అభ్యర్థులకు స్థానికంగా గట్టి పట్టు ఉండడం వలన గెలుపు ఎవరిదో చెప్పడం అంత వీజీ కాదు. కానీ ఒత్తిడి మాత్రం కొండ దంపతులపైనే ఉన్నది అనేది స్పష్టం అవుతున్నది. కొండ సురేఖపై అనర్హత వేటు పడేవరకు వారి నోటి నుంచి వచ్చిన పదం వైఎస్. అనర్హత వేటు పడగానే వారి స్వరంలో మార్పు వచ్చింది. తను జగన్ కోసం కాకుండా, తెలంగాణ కోసమే రాజీనామా చేశానని చెప్పుకొస్తున్నారు. ఇంకా పరకాలలో తనకు పోటీ టీఆర్ఎస్ అనే ఆమె చెప్పకనే చెబుతున్నారు. అందుకే ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుంది అంటే తాను తప్పుకుంటాను అని కొండ సురేఖ పదేపదే ప్రకటిస్తున్నారు. ఆమెపై 2009 ఎన్నికల్లో పోటీ చేసి దాదాపు పదిహేను వేల ఓట్లతో ఓడిపోయినా భిక్షపతినే అందరి అమోదయోగ్యంతో ఎంపిక చేశామన్నది. కానీ ఇందుకు వేరే కారణాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ స్థానం నుంచి ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జేఏసీ నేత సహోదర్ రెడ్డిల పేర్లు కూడా వినిపించాయి.కానీ స్థానిక, సామాజిక అంశాలు తెరపైకి రావడంతో టీఆర్ఎస్ భిక్షపతిని ఎంపిక చేసింది.బీజేపి నేతలు చెబుతున్నట్టు పాలమూరు వలె పరకాలలోను పాగా వేస్తామన్నవారి మాటలు అంత సులువు కాదు. పాలమూరు యెన్నం పోటీ చేసింది బీజేపి అభ్యర్థిగా అయినా స్థానికంగా ఆయనపై కొంత సానుభూతి, పేరు  కూడా ఉన్నది, కానీ ఇక్కడ బిజేపీ అలాంటి పరిస్థితి లేదు. అయితే ఆ పార్టీ కొన్ని ఓట్లను చీల్చగలదేమో కానీ అవి గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో మాత్రం ఉండవు. ఎందుకంటే ఈ రెండున్నర ఏళ్లలో ఓరుగల్లు ప్రజలు మానుకోట, పాలకుర్తి యుద్ధాలను ఎదురుకొన్నారు. అవేకాదు రాయినిగుడెంలో ముఖ్యమంత్రికే ముచ్చెమటలు పట్టించిన వనితలు ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉద్యమం ఎంత ఉధృతంగా ఉన్నదో. ఉద్యమకారులు ఎవరో, ఉద్యమ ద్రోహులు ఎవరో హంస వలె పలు నీళ్ళలా వేరుచేయగల చైతన్యం వరంగల్ ప్రజలకు ఉన్నది, కనుక ఇక్కడ ఫలితం పాలమూరు కంటే భిన్నంగానే ఉంటుంది. ఇక వైఎస్ఆర్ సీపీ కి ఈ ఎన్నిక పెద్ద సవాలే.ఎందుకంటే పార్లమెంటులో జగన్ తెలంగాణకు వ్యతిరేకగా ప్లకార్డ్ పట్టిన ఉదంతం ఆ పార్టీని వెంటాడుతూనే ఉన్నది. అలాగే జగన్ వెంట నడుస్తున్న తెలంగాణ నేతల్లో కొండ దంపతులే బలమైన నాయకులు. ఈ ప్రాంతంలో వారికి  గట్టి పట్టుతో పాటు వ్యక్తిగత పరిచయాలు కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి తమ గెలుపు నల్లేరు మీద నడకే అని కొండ దంపతులు భావించడం లేదు. ఈ ఎన్నిక సమైక్య, తెలంగాణ వాదాలకు జరుతున్న ఎన్నిక అక్కడ ప్రచారాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇక్కడ జగన్ ఇమేజ్ కొండకు గుడి బండల తయారయ్యే ప్రమాదం ఉన్నది. అలాగే టీఆర్ఎస్ కూడా ఇక్కడ గెలుపు ప్రధానమే. ఉద్యమ పార్టీగా ఇక్కడ పాలమూరు ఘటనలు పునరావృతం కాకుండా ఆ పార్టీ జాగ్రత్త పడినట్టు తెలుస్తున్నది. అందుకే అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వేసింది. పార్టీలో అసమ్మతి లేకుండా చూసుకున్నది. కాబట్టి బిజెపి ఎత్తుకున్న నినాదం పాలమూరు-పరకాల-పార్లమెంటు ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

Monday 14 May 2012

స్వరాజ్యమవలేని సురాజ్యమెందుకని?
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ  పార్లమెంటరీ సంస్థలు అరవై ఏళ్ళు మనగగలగడం గొప్ప విషయమే.అయితే ఈ సంతోష సందర్భాన్ని పురస్కరించుకుని తొలి లోక్ సభ ఎంపీలను సత్కరించారు. ఈ అరవై ఏళ్లలో దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులొచ్చాయి. వ్యక్తులకు పదవీ విరమణ ఉంటుందేమో కానీ, వ్యవస్థలకు మాత్రం ఉండదు. సభే సర్వోన్నతం అని గర్వంగా చెప్పుకుంటున్న మనం, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాల్సిన మనం, ప్రపంచానికి నాగరికత గురించి చెప్పిన మనం ఈ పార్లమెంటు వజ్రోత్సవాల సందర్భంగానైనా చాలా విషయాలు మననం చేసుకోవాలి. ఎందుకంటే ఈ అత్య్తున్నత చట్ట సభలో ప్రజా సంక్షేమం కోసం చేసినా చట్టాలన్నీయిప్పుడు ఉన్నోడి చుట్టలుగా మారిపోయాయి. మట్టి మనుషుల కళ్ళ కింది నేలను గుంజుకొని, బహుళజాతి కంపెనీల కొమ్ము కాస్తూ, ఈ అన్యాయాన్ని ఎదిరిస్తున్న ఈ దేశ భూమి పుత్రులపైనే యుద్ధం చేస్తున్నది, పార్లమెంటు అరవై ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్నది ఇప్పుడే. నాటి పార్లమెంటు సభ్యలు ప్రజా సమస్యల పై చర్చించడానికి ఈ వేదికను ఉపయోగించుకునేవారు. అధికార పక్షం పై ప్రతిపక్షం విమర్శలు చేస్తే హుందాగా వ్యవహరించే వారు. కానీ సమస్యల నుంచి తప్పించు కోలేదు. కానీ ఇప్పడు అందుకు పూర్తి విరుద్ధంగా మన పార్లమెంటు ఉన్నది. ఆరు దశాబ్దాలలో ఎన్నో సంస్కరణలకు బాటలు వేసిన పార్లమెంటు యిప్పుడు సంక్షోభంలో ఉన్నది. లక్షలాది కోట్ల కుంభకోణాలు వెలుగు చూస్తున్న ఈ కాలంలోనే. నాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యనికి వ్యతిరేకంగా ఉద్యమించిన స్వాతంత్ర్య సమరయోధులు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిపై ఉద్యమిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక బలగాల ప్రత్యేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇరోం షర్మిల పదకొండు ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ఆ రాష్ట్రాల్లో సైనిక బలగాలకు ఉగ్రవాదిగా ఎవరిపై అనుమానం వచ్చినా కాల్చివేసే అధికారం ఉన్నది. నేరం రుజువు కాకుండా శిక్ష విధించారాదని మన చట్టాలు చెబుతున్నాయి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల   ఇలాంటి దుర్మార్గ చట్టాల వల్ల అక్కడి ప్రజల బతుకులకు రక్షణ కరువైందని ప్రజాస్వామిక వాదులు, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరోం షర్మిల నిరసనను పటించుకోవడం లేదు. ప్రజల కోసం చేసిన శాసనాలన్ని దుర్వినియోగం అవుతున్నాయి. గ్రామ స్వరాజ్యం గంగలో కలిసిపోయింది. కాలం కలిసి రాక, వ్యవసాయం గిట్టుబాటు కాక అన్నదాతలు పొట్టకూటికోసం నగరాలకు వలసబాట పడుతున్నారు. బ్యాంకుల జాతీయకరణ, పార్టీ ఫిరాయింపుల చట్టం, గృహ హింస, సమాచార హక్కు చట్టం, 73వ, 74వ రాజ్యాంగ సవరణ చట్టం వంటి సాహసోపేతమైన శాసనాలను చేసిన పార్లమెంటు వీటిని పారదర్శకంగా అమలు చేయడం లేదు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించని పార్లమెంటరీ వ్యవస్థ పై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబూకుతున్నది. సభ్యుల క్రమశిక్షణ రాహిత్యం చట్టసభల గౌరవాన్ని తగ్గిస్తున్నది. అధికారంకోసం దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టడానికి కూడా వెనకాడడం లేదు నేటి పాలకులు. తమ కుర్చీని కాపాడుకోవడానికి దోపిడీ దారులకు, విదేశీ తొత్తులతో రాజీ పడుతున్నారు. మేధావులు, ఆలోచన పరులతో నిండాల్సిన రాజ్యసభ నేడు పార్టీల ప్రయోజనాలను నెరవేర్చే వారితో నిండి పోతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.అలాగే దేశానికి స్వాతంత్ర్యం రాకముందు స్వతంత్ర దేశంగా ఉన్నది నిజాం స్టేట్. దేశంలో సంస్థానాల విలీన సమయంలో సైనిక చర్య ద్వారా భారత్ లో కలిసింది ఆ దేశం. పార్లమెంటుకు ఎంత చరిత్ర ఉన్నదో తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినా తెలంగాణ రాష్ట్ర డిమాండు కూడా అంతే చరిత్ర ఉన్నది. ప్రజాస్వామిక పద్ధతుల్లో ఈ ప్రాంత ప్రజలు రాష్ట్ర సాధన కోసం ఐదున్నర దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన పాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్ర డిమాండ్ ను కూడా ఈ దేశ పాలకులు అణచివేయాలని చూస్తున్నారు. కొత్త రాష్ట్రాల డిమాండు ను పరిష్కరించాల్సిన కేంద్రమే అగ్నికి ఆజ్యం పోసే విధంగా వ్యవహరిస్తున్నది. నలుగురు పెట్టుబడిదారుల కోసం నాలుగున్నర ప్రజల కోరికను కాలరాస్తున్నది. ఈ పార్లమెంటు వజ్రోత్సవాల సందర్భంగా మాయావతి తెలంగాణ, విదర్భ, యూపీ విభజన సమస్యలను కేంద్రమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇప్పటికైనా అలసత్వం వీడి తెలంగాణ ప్రజల చిరకాల కోరికను నెరవేరిస్తే బాగుంటుంది. లేకపొతే చట్టసభల పై ఒక ప్రాంత ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉన్నది. అలాగే  పార్లమెంటు అరవై వసంతాల సంతోష సమయంలో ఈ దేశ పాలకులు సరిదిద్దవలసిన అనేక సమస్యలు ఉన్నాయి. లేకపొతే కవి అన్నట్టు స్వరాజ్యమవలేని సురాజ్యమెందుకని అని ప్రజలు భావించవలసి వస్తుంది.
-రాజు

Tuesday 8 May 2012







కోస్తాలో కరివే'కాపులు' ఎటువైపు?
 విజయవాడలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై  యిప్పుడు రాష్ట్రంలో చర్చలు సాగుతున్నాయి. ఈ పరిణామాలను నిశితంగా పరిశిలీస్తే రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. ఒకటి తెలంగాణలో కాంగ్రెస్, టిడిపిలు తమ ఉనికిని కోల్పోయాయి. రెండోది  కోస్తాలో ప్రధాన రాజకీయ పార్టీలు కమ్మ, కాపు సామాజిక వర్గాలను తమవైపు ఎలా తిప్పుకోవాలో అని ఆలోచిస్తున్నాయి. కోస్తా ల రెడ్డి, కమ్మ వర్గాలే అధికారాన్ని చేలాయిస్తున్నయనే అసంతృప్తి కాపు వర్గ నేతల్లో ఎప్పటి నుంచో ఉన్నది. అవకాశం వస్తే అధికార పీటంపై కూర్చోవాలని ఆ వర్గ నేతలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ రెడ్డి, కమ్మ వర్గ నేతలు ఆ వర్గ ఓట్ల కోసం వారిని కరివే పాకులుగానే వాడుకుంటున్నారు. వారి ఆశలపై నీళ్ళు చల్లుతున్నారు.  కోస్తాలో కమ్మ, కాపు వర్గాల మధ్య వైరం దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. కమ్మ వర్గం టిడిపి వెంట ఉంటే. కాపులు కాంగ్రెస్ వెంట నడుస్తున్నారు. కోస్తాలో కాపు వర్గ నేత వంగవీటి మోహన రంగ హత్య తరువాత రాజశేఖర్ రెడ్డి ఆ వర్గానికి దగ్గరయ్యారు. దీంతో కోస్తాలోని మెజారిటీ కాపు వర్గ నేతలంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. రాజకీయంగా తమ బద్ధ శత్రువులైన కమ్మ వర్గాన్ని ఎదురుకోవడానికి కాంగ్రెస్ పార్టీ యే సరైన వేదిక అని వాళ్ళు భావిస్తున్నారు. అధికార పీటంపై ఆశ చావకున్న అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ లోని రెడ్డి సామాజిక వర్గంతో ఇంత కాలం అంతకాగుతూ వస్తున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం తగ్గిపోయింది.ఆ సామాజిక వర్గ నేతలు కాంగ్రెస్ వెన్నంటే ఉంటున్నారు. యిప్పుడు జగన్ వేరు కుంపటి పెట్టుకోవడంతో ఆ వర్గ నేతలు వైఎస్ఆర్ సీపీ బాట పాడుతున్నారు. దీంతో ఇక ఆ ప్రాంతంలో మిగిలిన కాపు వర్గం ఎటువైపు వెళుతుందో అనే ఆసక్తి ఉండడం సహజమే. అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రోశయ్య తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నిక చేసింది. రెడ్డి సామాజిక వర్గం తమ వెంటే ఉండాలని భావించి ఆ పని చేసి ఉండవచ్చు. అందుకే కిరణ్ కూడా తన ప్రభుత్వంలో తన సామాజిక వర్గానికే పెద్ద పీట వేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ కి పెద్దగ ప్రయోజనం కలగలేదు. ఎందుకంటే మొన్న జగన్ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో రెడ్డి సామాజిక వర్గ నేతలే ఎక్కువగా ఉన్నారు. దీంతో కంగు తిన్న కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడిన కాపు సామాజిక నేత చిరంజీవికి యిప్పుడు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నో ఏళ్లుగా ముఖ్యమంత్రి పీటం కన్నసిన కాపు సామాజిక వర్గ నేతలు రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొత్స కూడా కోవడం, మాజీ పీసీసీ అధ్యక్షులు కిరణ్ సర్కారుకు వ్యతిరేకంగా అధిష్టానానికి నివేదికలు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికే కిరణ్  అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయినా కూడా ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేక పోయింది. దీంతో  యిప్పుడు కూడా కిరణ్ కడప జిల్లాలోని రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో  కూడా తన వర్గ నేతల పేర్లే అధిష్టానానికి పంపినట్టు వార్తలు వచ్చాయి. అయితే కడప జిల్లా లో బలిజ సామాజిక ఓటర్లు  అధికంగా ఉన్నాయి . దీంతో  బిసిలు అధికంగా ఉన్నదా రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో కిరణ్  పంపిన పేర్లను తిరస్కరించినట్టు సమాచారం. ఈ పరిణామాలన్నీ ఒక కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాలేదు. టిడిపి కూడా నారా, నందమూరి వంశాల మధ్య ఆధిపత్య పోరు గత కొంత కాలంగా  కొనసాగుతున్నది. యిప్పుడు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణాను వదిలి పెట్టి సీమాంధ్ర ప్రాంతం లోనే అస్తిత్వ పోరాటం చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పడు జరగబోయే ఉప ఎన్నికలు సెమి ఫైనల్ గా అన్ని పక్షాలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో  రాయలసీమ ప్రాంతంలో జగన్ పార్టీ  ముందంజలో ఉన్నదని ఇప్పటికే మీడియాలో విశ్లేషణలు, సర్వేలు వస్తున్నాయి. దీంతో కోస్తాలో కీలక మైన కాపు వర్గ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జగన్ కాపు వర్గ నేత వంగవీటి రాధను వైఎస్ఆర్ సీపీలో ఆహ్వానించారు. అంతే కాదు ఆ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకోవడానికి రాధను కేవలం పార్టీలోకే తీసుకోవడమే కాకుండా తన తమ్ముడిలా గుండెల్లో పెట్టుకుంటానని ప్రకటించారు. యిప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలు ఆని  ఎన్నికలను దృష్టిలో పెట్టు కొని చేస్తున్నవే. నిజంగా ఆయా పార్టీలు  కాపు వర్గాలపై కానీ, దళిత, బహుజన వర్గాలపై కానీ ప్రేమ ఏమీ లేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అన్ని రంగాల్లో  పెద్ద పీట వేస్తామని వాగ్దానాలు చేయడం మాములే. ఆచరణలో మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. నేర వేర్చరు కూడా. ఉప ఎన్నికల తరువాత ఈ కోస్తా కరివే 'కాపు'లు ఎటువైపు ఉంటారో తేలిపోనుంది. అలాగే జగన్ కలిసిన వల్లభనేని వంశీకి కూడా టిడిపి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విజయవాడలో దేవినేని ఉమా  చంద్రబాబు వర్గమైతే, కోడలి నాని, వల్లభనేని వంశీ నందమూరి వర్గం. వీరి ఇరువురి మధ్య కూడా  విబేధాలు ఇప్పటికే చాలా సార్లు బయటప్పడ్డాయి. యిప్పుడు వంశీ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తారా? లేదా జగన్ ఆహ్వానం మేరకు ఆయనతో కలిసి వెళతారా వేచి చూడాలి.

ముంచుకొస్తున్న మనుగడ ముప్పు!

మొన్న ఉప ఎన్నికల వరకు తెలంగాణ ఉద్యమంపై, ఉద్యమ నాయకత్వంపై అవాకులు చెవాకులు పేలిన తెలంగాణ టిడిపి ఫోరం కొంత కాలంగా కనిపించడం లేదు. దేవేందర్ గౌడ్ కు చంద్రబాబు రాజ్యసభ టికెట్ కట్టబెట్టిన తరువాత టి టిడిపి కార్యకలాపాలు పూర్తీగా తగ్గిపోయాయి. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నాయి. కానీ రాష్ట్రంలో ప్రధాన పత్రికలకు మాత్రం ఇవి సమస్యలుగా కనిపించక పోవడం శోచనీయం. కానీ పనిగట్టుకుని ఈ ప్రధాన మీడియా వర్గం మాత్రం టిఆర్ఎస్ , జేఏసీల మధ్య ఏదో జరిగిపోతున్నట్టు కాలుకు బలపం కట్టుకుని ప్రచారం చేస్తున్నది. దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవ, అవాస్తవాలు ఎంత వరకు నిజమో తెలియదు. కానీ విజయవాడ వేదికగా టిడిపిలో జరుతున్న నందమూరి వర్సెస్ నారా వారి అంతర్గత కలహాలు మాత్రం ప్రజలకు ప్రత్యక్షంగా కనపడుతూనే ఉన్నది. అయితే  టిఆర్ఎస్ , జేఏసీల మధ్య అభిప్రాయ భేదాలు అసలే  లేవని చెప్పలేము. కానీ కోడి గుడ్డుపై ఈకలు పీకినట్టు అదేపనిగా పనిగట్టుకుని ఉద్యమం పై విష ప్రచారం చేయడం దారుణం. టిడిపిలో ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జగన్ వేసిన ఎత్తుగా ఫలిస్తున్నట్టు కనిపిస్తున్నది. జగన్ ఆపరేషన్ ఆకర్ష్ కు సీమాంధ్ర తెలుగు తమ్ముళ్ళు వైఎస్ఆర్ సీపీ లోకి వలస బాట పడుతున్నారు. జగన్ 'కమ్మ'ని కౌగిలింతతో టిడిపిలో కలవరం మొదలైంది. ఇటు తెలంగాణ, అటు జగన్ తో టిడిపికి  వచ్చే ఎన్నికల నాటికీ పూర్తిగా చతికిల పడే ప్రమాదం పొంచి ఉంది. పార్లమెంటు వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ టి ఎంపీ లు స్వరాష్ట్రం కోసం నినదించి సస్పెన్షన్ కు గురయ్యారు. టిఆర్ఎస్ సభ్యులు కూడా సభలో హల్ చల్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేశారు. పాపం టి టిడిపి నేతలు మాత్రం దీనిపై ఏమిచేయాలో పాలుపోక ఒక్కరోజు ప్లకార్డులు పట్టారు. చంద్రబాబు రెండుకండ్ల సిద్ధాంతం అ పార్టీ ని రెండుచోట్ల కాపాడడం సంగతేమో గానీ,, తెలంగాణాలో ఉద్యమం, సీమాంధ్రలో జగన్ ఆకర్ష్ టిడిపి మనుగడను ప్రశ్నిస్తున్నాయి. అయితే టిడిపి నేతలు చెబుతున్నట్టు .. పార్టీ పెట్టిన ముప్పై ఏళ్లలో ఇలాంటి సంక్షోభాలు చాలానే చూడవచ్చు. మళ్లీ పుంజుకుని అధికారాన్ని కైవసం చేసుకుని ఉండవచ్చు. కానీ ఆ సంక్షోభ సమయంలో నందమూరి కుటుంబం పార్టీ వెంటే ఉన్నదనే విషయాన్ని మరిచిపోకూడదు. ఎన్టీఆర్ ను పదవి నుంచి దించినప్పుడు కూడా నందమూరి కుటుంబం నారా నేతృత్వం లోనే నడిచింది. కానీ పరిస్థితులు మారిపోయాయి. నారా వారిపై ధిక్కార స్వరం వినిపిస్తున్నదే నందమూరి కుటుంబం. పైకి తాము కలిసే ఉన్నామని ప్రకటనలు ఇస్తున్న ఆచరణలో మాత్రం అది కానరావడం లేదు. విజయవాడలో జగన్, వల్లభనేని కలయిక కాకతాలియమే అని చెబుతున్న.. అది పక్కా ప్లాన్ తోనే జరిగింది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే వంగవీటి రాధా విజయవాడలో వైఎస్ఆర్ సీపీలో చేరే రోజే టిడిపి బందర్ పోర్టు పై బందుకు పిలుపునిచ్చింది. అదే రోజు జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా విడుదల అయ్యింది. టిడిపి తీసుకున్న బందు నిర్ణయం నందమూరి అభిమానులను కలచివేసింది. ఉప ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియదు కానీ.. టిడిపిని వెంటాడుతున్న ఆగస్టు సంక్షోభం మాత్రం ఈ పార్టీని ముందున్న పెద్ద సవాలు. అందుకే తన కుటుంబ, పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని కప్పిపెట్టి, తనకు అనుకూలంగా ఉన్న పత్రికల్లో తెలంగాణ ఉద్యమం పై విషం చిమ్మడం మానివేస్తే మంచిది.
-రాజు ఆసరి

తరాలు మారుతున్నా మారని తలరాతలు

దేశ గ్రామీణ జనాభాలో దాదాపు అరవై శాతం మంది రోజుకు 35 రూపాయలు లేదా అంతకంటే తక్కువ వ్యయం తోనే తమ జీవితాలను వెళ్లదీస్తున్నారని  జాతీయ శాంపిల్ సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్ఓ ) తన నివేదికలో పేర్కొన్న్నది. అదే నగరాల్లో 66 రూపాయలతో ఖర్చుతో గడుపుతున్నరన్నది. ఈ నివేదిక ఆధారంగానే ప్రణాళిక సంఘం 2009-10 దారిద్ర్యరేఖను నిర్ధారించింది. ఈ సర్వే ప్రకారం దేశంలో సుమారు అరవై శాతం జనాభా అటు ఇటుగా తక్కువ దినసరి ఖర్చులతో మనుగడ సాగిస్తున్నారు. అలాగే  భారత దేశంలో  ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2005 నాటికి 41.6 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారని పేర్కొన్నది. 2010 యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రకారం 37.2 శాతం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. ఈ  నివేదికల ప్రకారం 2005-2010 మధ్యకాలంలో మన దేశంలో పేదరికం తగ్గింది దాదాపు నాలుగు శాతమే! కానీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు అహ్లువాలియా మాత్రం రోజుకు ఇరవై ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టే వారంతా పేదలు కారని తేల్చేశారు. ఆయన  లెక్కప్రకారం రోజుకు రెండుసార్లు చాయ్ తాగి .. ఒక కర్రితో ఒక్క పూట భోజనం చేసేవాళ్ళంతా ధనికులే. అహ్లువాలియా లెక్కల ప్రకారం దేశంలో పేదరికం లేనే లేదు. బ్యూరోక్రాట్లు ఈ దేశాన్ని ఏలితే ప్రజల జీవన ప్రమాణ స్థాయి ఎలా ఉన్నా... పాలకుల పట్టికలో మాత్రం మెరుగ్గానే కనిపిస్తారు. స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా ఈ దేశంలో ప్రజలు చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. మెరుగైన విద్య, వైద్యం లేక అక్షరాస్యతలో, ఆరోగ్యంలో ప్రపంచంలో చిన్న దేశాల కంటే వెనుకబడే ఉన్నారు. 187 దేశాలాలోని మానవాభివృద్ధిలో మన దేశ స్థానం 134. ప్రజల అవస్తలు పాలకులకు అభివృద్ధిగా ఎందుకు కనిపిస్తున్నది? ఎవరి మెప్పు కోసం మన దేశం సుభిక్షంగా ఉందని మన విధానకర్తలు ప్రకటిస్తున్నారు? ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాలు మెల్లగా మన పాలకులు  దేశంలో అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజా సంక్షేమాన్ని సందుగలో పెట్టి తాళం వేస్తున్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలు తలుపులు తెరిచే చర్యలు ఇప్పటికే  ప్రారంభమయ్యాయి. ప్రజారోగ్యాన్ని కార్పోరేట్ ఆస్పత్రులకు కట్ట బెట్టారు. అణు ఒప్పందం పేరుతో ఈ దేశ సార్వబౌమత్వాన్ని అమెరికా కాళ్ళ దగ్గర పెట్టింది మన్మోహన్ ప్రభుత్వం. దాదాపు నాలుగు లక్షల ఎంవోయులు కుదుర్చుకుని అటవీ ప్రాంతాలలోని సహజ వనరులను బహుళజాతీ సంస్థలకు అప్పజెప్పింది.ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న అడవిబిద్దాలను ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో అంతమొందిస్తున్నది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ...దాన్ని నిలదీస్తున్న ప్రజలను, ప్రజా సంఘాలను అణచివేస్తూ అదే దేశం సాధించిన అభివృద్ధి అహ్లువాలియా ప్రకటిస్తున్నారేమో! అభివృద్ధి అంటే వందకోట్ల మంది భారతీయులది కాదు, పాతిక మంది బడా పెట్టుబడి దారులదని పాలకుల ప్రగాఢ  విశ్వాసం. అందుకే గోదాంలలో ముక్కిపోతున్న బియ్యాన్ని పేదలకు పంచాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన కుదరదు అని చెప్పిన ప్రధాని మన్మోహన్ దివాలా దీస్తున్న కంపెనీలకు మాత్రం బెయిల్ అవుట్ ప్రకటిస్తున్నారు. అందుకే మిత్రులారా స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మనం పుస్తకాల్లో చదువుకుంటున్న భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే పదాన్ని సవరించి చదువుకోవాలి . వచ్చే ఏడాది విద్యార్థుల పుస్తకాల పునర్ ముద్రణలో ఈ మార్పు చేస్తే, మనం బాధపడుతుంటే పాలకులు మురిసిపోతారు. వాళ్ళ సంతోషం కోసమైనా కొంతకాలం మన సమస్యలను పక్కన పెడదాం! ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుగుణంగా మన దేశ ప్రజల జీవన ప్రమాణాలను నిర్ధారిస్తున్నారు మన ఏలికలు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం  ఎన్డీఏ  హయంలో భారత్ వెలిగిపోయింది, యూపీఏ హయంలో భారత్ సంపూర్ణ అభివృద్ధిని సాధించింది. ఈ రెండు ప్రభుత్వాల దశాబ్దంన్నర కాలంలో ప్రజల కష్టాలన్నీ తీరిపోయాయని మనం అనుకోవాలి. పాలకుల పని తీరుకు అద్దంపట్టే ఎన్నో కుంభకోణాలు, లక్షల కోట్ల అవినీతిని మాత్రం మనం చెడు చూడకూడదు,  మాట్లాడ కూడదు, వినకూడదు అనే సూత్రానికి కట్టుబడి వాటిని వార్తలుగా చదువుకోవాలి. అందులో వాస్తవ, అవాస్తవాలను తేల్చడాని ప్రభుత్వాలు సిబీఐ, సిట్టింగ్ జడ్జి విచారణలు చేపడుతాయి. ఇవి అవినీతి తేల్చేసరికి తరాలు మారిపోతాయి. కానీ ఈ దేశ ప్రజల తలరాతలు మాత్రం మారవు. అదే మనం అరవై ఏళ్లుగా  వింటున్న భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. పాలకులు మారిన ఈ మాటలో మాత్రం మార్పు ఉండదు!

Tuesday 1 May 2012