Sunday 29 July 2012

కట్టుకథల విష పుత్రికలు



తెలంగాణపై కాంగ్రెస్ కాలపయాపన రెండున్నర సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నది. పండుగలు, ఎన్నికల పేరుతో ఇంత కాలం నెట్టుకుంటూ వస్తున్న ఆ పార్టీ అధిష్ఠాన పెద్దలు ఇప్పుడు రాష్ట్ర విభజన అంశాన్ని తేల్చే పనిలో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ తేలుస్తారని ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు టీ జేఏసీ ఆగస్టు తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే టీఆర్‌ఎస్ అధినేత మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యం అని చెప్పడం, దానిపై మీడియాలో చర్చలు జరిగాయి, జరుగుతున్నాయి. అయితే ఇందులో వాస్తమెంతో తెలియదు కానీ ఇప్పుడు సీమాంధ్ర మీడియా చేస్తున్న హడావుడి చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై హస్తినలో ఏదో జరుగుతుందనేది సుస్పష్టం.
తెలంగాణపై ఢిల్లీలో కదలిక వచ్చిన ప్రతి సందర్భంలో  సీమాంధ్ర మీడియా పనిగట్టుకుని విష ప్రచారం చేయడం మామూలే. తెలంగాణ ఏర్పాటుపై ఢిల్లీ నుంచి సిగ్నల్స్ బంద్ అయ్యాయని, శ్రీకృష్ణ కమిటీ సిఫారసు చేసిన ఆరో ప్రతిపాదన పట్ల ఢిల్లీ పెద్దలు సుముఖంగా ఉన్నట్టు కొన్ని ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయి. ఆరో ప్రతిపాదన అంటే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారు భావిస్తున్నట్టు ఇందుకోసం కేంద్ర హోం శాఖ రాష్ట్రపతికి నివేదిక సమర్పించిందని వారే చెప్పుకొస్తున్నారు. ఒక ఆంగ్ల పత్రికలో అచ్చయిన కథనం ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ వ్యతిరేక ఛానళ్లు చేస్తున్న విష ప్రచారం అంతా ఇంతా కాదు. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ నాయకత్వ మార్పు తప్పదనే బ్రేకింగ్ న్యూస్‌లు బంద్ అయ్యాయి. సిరిసిల్లలో వైఎస్ విజయమ్మ ఎదురైన పరాభవము పక్కకుపోయింది. మీడియా అంటే నిష్పక్షపాతంగా వ్యహరిస్తుందనే విశ్వాసం ప్రజల్లో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ విషయంలో ఏకాభిప్రాయం లేదు. కొన్ని మీడియా ఛానళ్లు ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షపై ఎంత విషయం చిమ్ముతాయో వారి కథనాలు చూస్తే అర్థమవుతుంది.

కేంద్ర హోం శాఖ తెలంగాణపై రాష్ట్రపతికి సమర్పించిన ఊహాగాన లేఖను చూద్దాం. అందులో శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరో ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని ఆ కమిటీయే పేర్కొన్నది. అలాగే ప్రణబ్ రాష్ట్రపతి కాకముందు ఆయనకు కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరుంది. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, ఆ పార్టీ వేసే కమిటీ భారాన్ని మోసేది ఆయనే. ప్రజా సమస్యలపై సాచివేత ధోరణి అవలంబించాలంటే ప్రణబ్‌కే సాధ్యం అనే ఆ పార్టీ ప్రగాఢ విశ్వాసం. అందుకే ముప్ఫై పైచిలుకు కమిటీలకు ఆయన నేతృత్వం వహించారు. (వాటిలో ఒక్క అంశాన్ని కూడా ఆయన తేల్చలేదు అది వేరే విషయం). ఇక తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం సుముఖంగా ఉంది అని, ఇందుకు తనకు సిగ్నల్స్ ఉన్నాయని పేర్కొన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఇటు ఢిల్లీ పెద్దల నుంచి మొదలు గల్లీ లీడర్ల అభిప్రాయం సేకరించిన సదరు సీమాంధ్ర మీడియా, ఇప్పుడు కేంద్ర హోంశాఖ తెలంగాణ సాధ్యం కాదని రాష్ట్రపతి నివేదిక పంపిన విషయంలో మాత్రం ఆ పని చేయలేదు. అయితే రాష్ట్రపతిగా ప్రణబ్ ఎన్నికైన తర్వాత ఈ మీడియానే తెలంగాణపై ఆయనను గుచ్చిగుచ్చి ప్రశ్నించినా, ఆ సమాధానాన్ని దాటవేశారు. అంతేకాదు కేంద్ర క్యాబినేట్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని బదులిచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ గానీ, యూపీఏ ప్రభుత్వం క్యాబినేట్ గానీ తెలంగాణపై ఏమైనా స్పందించిందా అంటే అదీ లేదు. మరి కేంద్ర హోం శాఖ నివేదిక పంపినట్టు విశ్వసనీయ వార్గాల సమాచారం అని వీరు ఎలా చెప్పగలుగుతున్నారు. ఇందులో వాస్తవాలు ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ రాజకీయ పార్టీల వలే సీమాంధ్ర మీడియా కూడా తమ ద్వంద్వ విధానాలతో ఇరు ప్రాంతాల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నది. తమ రేటింగ్స్ కోసం చిచ్చులు రేపుతున్నది.

ఒక్క విషయం మాత్రం స్పష్టం ఇటు తెలంగాణ ప్రజలు గానీ, అటు సీమాంధ్ర ప్రజలు గానీ తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మొన్న ఉప ఎన్నికల తర్వాత తెలంగాణను వ్యతిరేకించే కరుడుగట్టిన సీమాంధ్ర నేతలే తెలంగాణ ఇచ్చేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో రాయల తెలంగాణ ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. అప్పుడు చప్పుడు చేయని ఈ సీమాంధ్ర ఛానళ్లు ఇప్పుడు నానా యాగీ చేయడం చూస్తుంటే ... ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలపై  చర్చ జరుగుతుంది అనేది స్పష్టం. అయితే అది రాష్ట్ర విభజన పైనా లేక రాష్ట్ర నాయకత్వ మార్పు పైనా అనేది కొన్ని రోజుల్లో తేలనుంది. అంత వరకు ప్రజలను ప్రశాంతంగా ఉండమని నీతులు చెప్పే ఈ ఛానళ్లు కూడా దాన్ని ఆచరిస్తే ఆంధ్ర ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు. తెలంగాణ ప్రజల కూడా ఈ సీమాంధ్ర మీడియా అసత్య ప్రచారాలను నమ్మకుండా సహనంతో ఉండాలి. మనముందున్నవి రెండే అంశాలు. ఒకటి పోరాడి తెలంగాణ సాధించుకోవడం. రెండోది తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో భాగస్వాములవడం.
-రాజు

Wednesday 25 July 2012

సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిందెవరు?



సంస్కరణలు ప్రారంభమైన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను ప్రయోగశాలగా మార్చింది చంద్రబాబు. ఆయన పెట్టుబడిదారులకు కిటికీలు తెరిస్తే, వైఎస్ ఏకంగా తలపులే తెరిచారు. ఇప్పుడు రాష్ట్రంలో కులవృత్తుల వర్గాలు ఎదుర్కొంటున్న అవస్థలన్నింటికీ బాబే కారణం. దానికి కొనసాగింపు వైఎస్. ఇరువురు కలిసి ఆంధ్రప్రదేశ్‌ను అంధకారంలోకి నెట్టారు. పైగా ఇప్పుడు ఒకరు బీసీల సంక్షేమం గురించి మాట్లాడుతుంటే, మరొకరు మహానేత సువర్ణయుగ పాలనను అందిస్తామని వాగ్దానాలు గుప్పిస్తున్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయి, పార్టీల మనుగడ అస్తిత్వంలో పడ్డప్పుడే రాజకీయ పార్టీలకు సంక్షేమం అనే మాట గుర్తుకు వస్తుంది. అధికారం కోసం ప్రజలు అడగని, ఆచరణలో సాధ్యం కాని ఎన్నో హామీలను గుప్పిస్తారు. ఏరుదాటినంక తెప్ప తగలేయడం రాజకీయ పార్టీలకు వెన్నెతో పెట్టిన విద్యే.  సరిగ్గా ఇప్పుడు అదే పని టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ అధినాయకత్వాలు చేస్తున్నాయి. సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిన ఈ ఘనులే నేత కార్మికుల కోసం దీక్షల పేరుతో దండయాత్రలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సమైక్య పార్టీల నేతలు దాన్ని అడ్డుకోవడానికి వేస్తున్న ఎత్తుగడలో భాగంగానే  సిరిసిల్ల పర్యటనను చూడాలి. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయాయని వస్తున్న వార్తలు దీన్ని దృవీకరిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి కిరణ్ విజయమ్మ పర్యటన విజయవంతం కావడానికి తన వంత సహకారం అందించారు. అందుకే హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వరకు ఈ ప్రాంత ప్రజలపై దమనకాండ చేయించారు. ఇంత చేసినా విజయమ్మ చేనేత దీక్ష అట్టర్ ప్లాప్ అయ్యింది. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు సభా వేదికను కాపాడుకోవడానికే నానా పాట్లు పడ్డారు. అట్లనే చేనేత సమస్యల గురించి దీక్ష చేయడానికి వచ్చిన విజయమ్మ తన ప్రసంగంలో జౌలు పరిశ్రమ అని పదే పదే పలికారు. అంటే చేనేతకు జౌళి పరిశ్రమకు ఉన్న తేడా ఏమిటో తెలియని స్థితిలో ఉన్నారు వైఎస్‌ఆర్‌సీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు. ఎవరో రాసి ఇచ్చిన స్పీచ్‌ను చదివి అభాసు పాలయ్యారు.

అయితే సిరిసిల్ల ఉరిసిల్లగా మారడానికి కారణం ఎవరు? సీమాంధ్ర పాలకుల వల్లే అన్నది జగమెరిగిన సత్యం. 1997-2003 వరకు బాబు హయాంలో 127 మంది నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాజన్న పాలనలో 215 మంది చనిపోయారు.  ఇవి కాకిలెక్కలు కావు..! అధికారిక గణాంకాలు..!  వైఎస్ జమానాలో సిరిసిల్లలో చోటుచేసుకున్న మరణమృదంగాలు..! నాటి వస్త్ర సంక్షోభం దెబ్బకు కార్మికులంతా ఒకరితర్వాత ఒకరు పిట్టల్లా రాలిపోయారు.  కనీసం వారిని  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పరామర్శించలేదు. ఆత్మహత్యలకు పాల్పడ్డ బాధిత కుటుంబాలను అదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నామని 2006లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ ప్రకటించారు. ఇందుకోసం జీవో 46ను విడుదల చేశారు.అయితే పరిహారం ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలు  విధించారు. దీంతో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దానికి సవరణగా 114జీవోను జారీ చేశారు. అయినా బాధిత కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదు. అధికారిక గణాంకాలే ఇందుకు నిదర్శనం. అధికారుల లెక్కల ప్రకారం, జిల్లాలో 1997- 2012 జూన్ వరకు 375 మంది చనిపోయారు. వీటిపై పై పరిశీలన జరిగింది. ఆయా నిబంధనల ప్రకారం 14 మంది మాత్రమే పరిహారం ప్యాకేజీకి అర్హులని అధికారులు తేల్చారు. మిగిలిన దరఖాస్తులను తిరస్కరించారు. ఏడు దరఖాస్తులు నేటికీ పరిశీలనలో ఉన్నాయి. అంటే చనిపోయిన వారిలో సగం కుటుంబాలకు కూడా పరిహారం అందలేదు . దీనికి వైఎస్ హయాంలో ఇచ్చిన జీవోల్లోని అడ్డగోలు నిబంధనలే కారణం. 2007-0 మధ్య కాలంలో సిరిసిల్లలో వరుస ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. నేతన్నల ఆత్మహత్యలపై దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రతిపక్షాలు విమర్శలతో సార్వత్రిక  ఎన్నికలు దగ్గర పడడంతో వైఎస్ హుటాహుటిన 200 అక్టోబర్ 12న సిరిసిల్ల నడిబొడ్డున బహిరంగ సభ పెట్టారు. ఏ ఒక్క బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించకుండా దాన్ని ఎన్నికల సభగా మార్చివేశారు. ‘కార్మికులారా.. మీకు అండగా ఉంటాం, ఆత్మహత్యలు వద్దు..’ అన్నారు. సిరిసిల్లను స్పెషల్ ఎకనామిక్ జోన్‌గా మారుస్తామన్నారు. మరమగ్గాలపై తయారైన వస్త్రాల మార్కెటింగ్ కోసం సిరిసిల్లలో సకలసౌకర్యాలు కల్పిస్తామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలే నేరుగా వస్త్రాలు కొనేలా చర్యలు తీసుకుంటామన్నారు. అప్పరెల్ పార్కు ఏర్పాటుకూ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 50 శాతం సబ్సీడీని 75 శాతానికి పెంచుతామనీ, వృద్ధ కార్మికుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామంటూ ఊదరగొట్టారు. ఇంకా ఎన్నోన్నో హామీలు గుప్పించారు. ఇందులో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఎన్నికల్లో గెలిచాక కనీసం రుణమాఫీని కూడా వర్తింపజేసిన పాపాన పోలేదు.

కానీ ఆయన వారసురాలిగా విజయమ్మ మాత్రం చేనేత సమస్యలపై  జగన్ బాబు దీక్ష చేయమన్నారని సభావేదిక చెప్పడం హాస్యాస్పదం. రాజన్న పాలన త్వరలో వస్తుందని వైఎస్‌ఆర్‌సీపీ అంటుంటే జనం నవ్వుకుంటున్నారు. బాబు, వైఎస్‌ల వల్లే రాష్ట్రం యాభై ఏళ్లు వెనక్కిపోయింది. వారివురు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినా కేవలం అది ప్రజలను మభ్య పెట్టేడానికే! అంతర్గతంగా ఇద్దరూ తెలంగాణ వ్యతిరేకులే. అందుకే ఎన్డీఏ హయాంలో బాబు, యూపీఏ హయాంలో వైఎస్ తెలంగాణ రాకుండా అడ్డుపడ్డారనేది విదితమే. వైఎస్ ఆశయాలు నెరవేరుస్తానని హామీ ఇస్తున్న జగన్ మిగతా వాటి సంగతి ఏమో కానీ తెలంగాణపై తండ్రి అక్కసునే పార్లమెంటులో జగన్ ప్రతిబింబించాడు. అందుకే మానుకోట ప్రజలు ఆయన ఓదార్పు యాత్రపై ధిక్కార స్వరం వినిపించారు. ఈ గడ్డపై కాలుపమోపకుండా అడ్డకున్నారు. మానుకోటలో జగన్ కోసం ఈ ప్రాంత ప్రజల రక్తాని చవిచూసిన కొండా దంపతులకు పరకాల పరాజయాన్ని కానుకగా అందించారు. అయినా వారు సిరిసిల్లలో గొంతు చించుకుని ఆరిచారు. చేనేత సమస్యలను గాలికి వదిలేసి టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. సీమాంధ్ర నేతల వైఖరి ఎలా ఉంటుంది అంటే కత్తి వారిదే అయినా పొడిచేది మాత్రం మనోడే. ఇలాంటి రాజకీయ బానిసలు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ పార్టీల్లో ఉండబట్టే తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కోసం పదిహేడు మంది రాజీనామా చేస్తే, తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన దాదాపు పదిహేను వందల మంది ఆకాంక్ష కోసం ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు పట్టుమని పది మంది కూడా రాజీనామా చేయలేదు. పైగా తెలంగాణ ఉద్యమ నాయకత్వంపైనే విమర్శలు చేస్తారు. ఈ పరాన్న జీవులున్నంత కాలం ఈ ప్రాంత ప్రజలకు లాఠీల, తూటాల దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఈ ప్రాంత అస్తిత్వం పై ఆధిపత్యం చెలాయిస్తున్న సీమాంధ్ర గూండాగిరి ని అడ్డుకుంటేనే మన ఆకాంక్ష నెరవేరుతుంది. అందుకు మనకు కావలసింది రహెమున్నిసా చూపిన తెగువే ఆదర్శం.
-రాజు

Sunday 1 July 2012

మట్టి మనుషుల విజయం


తెలంగాణ ఉద్యమంలో మరో మైలురాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెరాస అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)  విజయం సాధించింది.విశేషం ఏమంటే పోటీలో మిగిలిన సంఘాలతో పోలిస్తే టీబీజీకేఎస్ అంత పటిష్టమైన నాయకత్వ నిర్మాణం లేదు. అయినా తెలంగాణవదనికే పట్టం కట్టారు కార్మికులు. కోల్ బెల్ట్ ప్రాంతంలో  ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందునుంచే తెలంగాణ వాదం బలంగా ఉన్నది. 1969 తెలంగాణ ఉద్యమంలో గని కార్మికులు ప్రధాన పాత్ర పోషించారు. దశాబ్దకాలంగా ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్న పోరులోనూ వీరు అగ్రభాగానే ఉంటూ వస్తున్నారు. అందుకే  స్వరాష్ట్రం కోసం చారిత్రక సకల జనుల సమ్మెలో పాల్గొని  ఉద్యమానికి ఊపు అందించారు సింగరేణి కార్మికులు. దశాబ్దాల తరబడి సింగరేణిలో ఆంధ్ర అధికారుల ఆధిపత్యాన్ని ఎదిరించిన సందర్భం అది. సమ్మె సమయంలో కార్మికులు చూపిన ఉద్యమ స్ఫూర్తి అభినందనీయం, ఆదర్శనీయం. వలస పాలకుల, అధికారుల కుట్రలను తిప్పికొట్టి తెలంగాణ ఉద్యమ సెగ ఢిల్లీకి తగిలేల చేశారు ఈ భూమి పుత్రులు.సింగరేణిలో  నూతన పారిశ్రామిక విధానం అమలులోకి వచ్చిన తరువాత ఉద్యోగులపై పని భారం పెరిగింది. ఉత్పత్తి వేటలో ఉపాధి పై వేటు వేసింది సింగరేణి యాజమాన్యం.1998 నుంచి   ప్రపంచ బ్యాంకు ఏజెంటుగా పనిచేసిన చంద్రబాబు హయంలో దేశంలో ఎక్కడలేని గుర్తింపు సంఘం ఎన్నికలను సింగరేణిలో ప్రవేశపెట్టారు. దీని వెనుక బాబు కుట్ర దాగి ఉంది. అప్పటి వరకు సింగరేణిలో డెబ్బై పై చిలుకు సంఘాలు పనిచేస్తూ ఉండేవి. అనేక పోరాటాల ద్వారా కార్మికులు తమ హక్కులు సాధించుకున్నారు. దీంతో సింగరేణిలో సంస్కరణలు అమలు చేయాలంటే కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయాలని బాబు భావించాడు. దీనికి జాతీయ కార్మిక సంఘాలు కూడా పరోక్షంగా సహకరించాయి. సింగరేణిలో పనిచేసే 1,20,000 వరకు ఉండేవారు.  గుర్తింపు సంఘం ఎన్నికల వరకు ఆ సంఖ్య 96,000 కు పడిపోయింది. అప్పటినుంచి సింగరేణిలో ప్రవేశ పెట్టిన నూతన విధానాల్లో భాగంగా సంస్థలో వీ ఆర్ ఎస్ పేరుతో, మస్టర్ల పేరుతో కార్మికుల సంఖ్యను 63,000 కు కుదించారు. ఇదీ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అదేసమయంలో 98 వరకు సింగరేణిలో ముప్పై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగేది. అది నేడు 52 మిలియన్ టన్నులకు చేరింది. సమ్మె కాలంలో కూడా కార్మికులు ఈ ఏడాది సంస్థ నిర్ణయించిన ఉత్పత్తి లక్ష్యాన్ని వారం రోజుల ముందుగానే సాధించారు. ఒకవైపు స్వరాష్ట్రం కోసం ఉద్యమిస్తూనే సంస్థకు లాభాల పండిచారు. సింగరేణి యాజమాన్యం  ఏటేటా ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకుంటూ కార్మికులను కష్టాల పాలు చేసినా సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారు. సింగరేణి సాధించిన లాభాలు ఆ ప్రాంత ప్రగతికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. పారిశ్రామిక ప్రాంత ప్రాంతాల్లో ఆ సంస్థలు గడించే లాభాల్లో కొంత భాగాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలనే నిబంధనలు తుంగలో తొక్కారు ఆంధ్ర అధికారులు. ఈ రెండున్నర ఏళ్ల తెలంగాణ ఉద్యమం ఏటికి ఎదురీదింది. అనేక ఎత్తుపల్లాలను చవిచూసింది. అయినా నాలుగున్నర కోట్ల ప్రజానీకం ఆత్మవిశ్వాసం సన్నగిల్ల లేదు. వలస పాలకుల కుట్రలను, తెలంగాణ ఉద్యమ ద్రోహులను తిప్పికొట్టారు. జాతీయ పార్టీలతోనే తెలంగాణ వస్తుందన్న వాదనలు పరకాల ఎన్నికల్లో పటాపంచలయ్యాయి. ఆయా పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేశారు ఈ ప్రాంత ప్రజలు. ప్రాంతీయ స్పృహ లేని పార్టీలను పాతర పెట్టారు. అదే చైతన్యం బొగ్గు బావుల్లోను వెల్లివిరిసింది. అందుకే జాతీయ సంఘాలను కాదని స్థానిక సంఘాలకు పట్టం కట్టారు. ఈ ప్రాంత పర్యావరణాన్ని, జీవన విధ్వంసాన్ని అడ్డుకోకుండా సింగరేణి సంస్థ యాజమాన్యంతో సాగిలాపడిన సంఘాలకు గుణపాటం నేర్పారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్నిగెలిపించుకొని తమ ఆకాంక్షను మరోసారి తెలియజేశారు కార్మికులు. నిజంగా ఈ విజయం ఈ ప్రాంత మట్టి మనుషుల విజయమే. యిప్పుడు గెలిచిన గుర్తింపు సంఘం గత సంఘాలు చేసిన చారిత్రక తప్పిదాలు చేయకుండా.. కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలి. వారి హక్కులను కాపాడాలి. ఆ ప్రాంత ప్రజల జీవన భద్రతకు భరోసా ఇవ్వాలి. పచ్చని పంటపొలాలను, పచ్చని బతుకుల్లో చిచ్చు పెడుతున్న ఓపెన్ కాస్ట్ లను వ్యతిరేకించాలి.సింగరేణిని కాపాడుకోవాలి. డిపెండెంట్ ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలి.
-రాజు

రాజకీయ కుట్రే ‘రాయల తెలంగాణ’


రాష్ట్రపతి ఎన్నికను తెలంగాణకు ఆయుధంగా వాడుకోవాలని తెలంగాణ జేఏసీ పిలుపు ఒకవైపు, ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలపై సంప్రదింపులు మరోవైపు. దీంతో అందరి చూపు ఆంధ్రప్రదేశ్‌పైనే. తెలంగాణపై నిర్ణయం వెల్లడించడానికి కేంద్రం కసరత్తు చేస్తోందనే సంకేతాలు అందుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణను తేల్చేస్తారనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. అయితే దీనిపై కొత్త, వింత వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించి  ఏడాదిన్నర దాటినా దానిపై కేంద్రం ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు.  కమిటీ చేసని ఆరు సిఫార్సుల్లో మొదటి రెండు సిఫార్సులపై అనేక చర్చలు జరిగాయి. ఎందుకంటే మొదటి రెండు సిఫార్సుల్లో రాష్ట్రాన్ని యధాతదంగా ఉంచడం, లేదా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. వీటిపై ఇటు తెలంగాణవాదులు, అటు సమైక్యవాదులు  ఎవరికి అనుకూలమైన సిఫార్సులపై వారు తమ వాదనలు వినిపించుకుంటూ వస్తున్నారు. కానీ తెలంగాణలోని ఒక బలమైన సామాజిక వర్గం కర్నూల్, అనంతపురంలతో కలిపి ‘రాయల తెలంగాణ’ (ఎంఐఎం వాదన కూడా ఇదే) తమకు ఆమోదయోగ్యమే అన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. జేఏసీ కూడా దీనిపై నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదన ఎందుకు ముందుకు వచ్చింది. శ్రీకృష్ణ కమిటీలోని నాలుగో ప్రతిపాదనను కాంగ్రెస్ పెద్దలు వ్యూహాత్మకంగానే తెరమీదికి తెచ్చారా? ఉప ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో ‘ఫ్యాన్’ గాలి జోరుకు కాంగ్రెస్ పెద్దలు కలవరానికి గురైనట్టు కనిపిస్తున్నది. తెలంగాణవాదుల భుజాన తుపాకీ పెట్టి జగన్‌ను కాల్చే ప్రయత్నం చేయాలని చూస్తోందా? ఇవన్నీ చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. మొన్నటి వరకు సమైక్యవాదమే మా నినాదం అన్న జేసీ దివాకర్‌రెడ్డి, టీజీ వెంకటేశ్‌లు ఉన్నపళంగా రూటు మార్చుకున్నారు. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ హక్కుల సంగతి ఏమిటి ప్రశ్నించిన వీరు ఇప్పుడు కర్నూలు, అనంతపురం ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నాలుగు జిల్లాల హక్కులు కాస్త ఈ ఇద్దరు నేతల వల్ల రెండు జిల్లాలకై పరిమితమయ్యాయి. వీరి ప్రదిపాదనలను సమైక్యాంధ్ర కన్వీనర్ మంత్రి శైలజానాథ్ ముందు ప్రస్తావిస్తే, అలాంటివి ఏవైనా వస్తే అప్పుడు ఆలోచిస్తామనడం గమనార్హం. అయినా రాయలసీమ హక్కుల కోసం చేసుకున్న  ‘శ్రీభాగ్’ ఒప్పందం ఆంధ్ర, సీమ ప్రాంతాల మధ్య జరిగింది. దానికి తెలంగాణ ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేదు. ఇప్పుడు రాయలసీమ హక్కుల గురించి మాట్లాడుతున్న ఈ నేతలు కూడా ఆ ఒప్పందం అమలు కోసం ప్రయత్నించి దాఖలాలు లేవు. వారి అవకాశవాద రాజకీయాల కోసం ఆ ప్రాంత ప్రజల హక్కులను కాలరాసిన, రాస్తున్న నేతలు వారు. వీరి కుటిల నీతి ఏమిటో ఇప్పటికైనా రాయలసీమ ప్రజలు అర్థం చేసుకోవాలి.

నిజంగానే రాష్ట్రపతి ఎన్నిక తర్వాత రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అని భావించలేము. అందుకే రాయల తెలంగాణ, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం వంటి అంశాలను తెరమీదికి తెచ్చి ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్ర పన్నుతోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు సీమాంధ్రలో జగన్, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే రాయల తెలంగాణ ప్రతిపాదన అసాధ్యమని శ్రీకృష్ణ కమిటే తేల్చి చెప్పింది. దీనికి తెలంగాణవాదులు అంగీకరించరన్న విషయమూ తెలుసు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఐదున్నర దశబ్దాలుగా మోసం చేస్తున్నది. తెలంగాణ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడమే తప్ప, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే సదుద్దేశం ఏనాడూ ఆ పార్టీకి లేదు. ఎన్నికల ముందు తెలంగాణ ప్రస్తావన తెచ్చి పబ్బం గడుపుకోవడం ఆ పార్టీకి పరిపాటి అయ్యింది. తెలంగాణను అడ్డుకోవడానికి ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని రాజకీయం చేసి రచ్చ చేయడం ఆ పార్టీ పెద్దలకు అలవాటే. అందులో భాగమే ఇప్పటి ప్రతిపాదనలు.  దీనికి రాష్ట్రంలోని సీమాంధ్ర మీడియా కూడా వంత పాడుతున్నది. సరిగ్గా ఇలాంటి వ్యూహాన్నే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009లో తెలంగాణలో మొదటి దఫా ఎన్నికలు పూర్తయ్యాక నంద్యాల సభలో తెలంగాణ ఉద్యమం విషం చిమ్మారు. అయితే అప్పుడు తెలంగాణవాదానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి మాత్రం సీమాంధ్రలో మెజారిటీ సీట్లను తెచ్చిపెట్టింది. అయితే పరిస్థితులు మారిపోయాయి.  కోవూర్ ఉప ఎన్నికల దగ్గరి నుంచి మొన్నటి ఉప ఎన్నికల వరకు సీమాంధ్రలో లగడపాటి, టీజీ వెంకటేశ్ వంటి నేతలు వైఎస్‌ఆర్‌సీపీకి ఓటు వేస్తే అది రాష్ట్ర విభజనకు దారి తీస్తుందని ప్రచారం చేశారు. నాటి వైఎస్ వ్యూహం బెడిసి కొట్టింది. మెజారిటీ ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారనే లగడపాటి వితండవాదం ఓడిపోయింది. అదొక్కటే కాదు తెలంగాణ గడ్డమీదికి వచ్చి అభివృద్ధి జపం చేసిన కిరణ్‌కు పరకాల ప్రజలు ఐదో స్థానాన్ని బహుమతిగా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయినా, ఇంత తక్కువ శాతం ఓట్లు రాలేదు. రెండు ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి కాంగ్రెస్ పెద్దలను కలవరపాటుకు గురిచేసి ఉండవచ్చు. అందుకే రాష్ట్ర విభజన అనివార్యమయ్యే స్థితిలో ప్రజలను గందరగోళపరిచే ప్రకటనలు వస్తున్నాయి.

ఇప్పుడు వస్తున్న రాయల తెలంగాణ ప్రతిపాదన వల్ల తెలంగాణ సమస్య పరిష్కారం కాదు. విలీనానికి ముందు ఉన్న హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణను ఈ ప్రాంత ప్రజలు డిమాండ్. అందుకే ఐదున్నర దశాబ్దాల ప్రజా పోరాటాన్ని అణవేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆ ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలంగాణ ఏర్పాటు చేస్తే మంచిది. అలా కాకుండా మరోసారి ‘రాయల తెలంగాణ’ పేరుతో  ఈ ప్రాంత ప్రజలను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఇందుకు వంతపాడుతున్న నేతలకు శంకరగిరి మాన్యాలు తథ్యం!
-రాజు

సంక్షేమాన్ని మింగుతున్న సంక్షోభం!



మాయా మోహన జాలం. ఇది మన్మోహన్, మాంటెక్ సింగ్‌ల కాలం. సంస్కరణల పేరుతో వీరు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలు అనేక సమస్యల్లో కూరుకుపోతున్నారు. వీరి పాటలకు ఆటలాడుతున్నది రాష్ట్ర సర్కారు. దేశంలో ఇప్పటికీ నలభై కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ఆకలేస్తే ఆకాశం వైపు చూసే అభాగ్యులు,  దాహం వేస్తే నీళ్ల కోసం మైళ్ల దూరం నడిచే నిరుపేదలు కోట్లాది మంది ఉన్నారు. వీరి సమస్యలు ఏవీ ఈ కార్పొరేట్ పాలకులకు పట్టడం లేదు. దేశంలో కొంత కాలంగా పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రూపాయి రోజురోజుకు  పతనమవుతున్నది. యూరప్ దేశాల్లో తలెత్తిన సంక్షోభం మునుముందు మన దేశాన్ని చుట్టుముట్టినా ఆశ్చర్యం లేదు. మన ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఆపదేమి లేదని మన్మోహన్, మాంటెక్‌సింగ్, ప్రణబ్ ముఖర్జీ, రంగరాజన్‌లు ప్రకటిస్తున్నా.. ముంచుకొచ్చే ముప్పును మాత్రం వీరు తప్పించలేరు. మన దేశంలో డెబ్బై శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.  వీరి సంక్షేమం, సమస్యల గురించి మన్మోహన్ అండ్ కో ఆలోచించరు. వ్యవసాయానికి ఎలాంటి ప్రోత్సాహం అందించారు.   ఆ మధ్య సుప్రీంకోర్టు గోదాముల్లో పేరుకుపోయిన ఆహారనిల్వలను ప్రజల కోసం వినియోగించాలని సూచిస్తే కుదరన్నారు మన మన్మోహన్. ఇవాళ దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆకలి చావులు నమోదవుతున్నాయి. వీటిని పూర్తిగా నివారించకున్నా... అందుకోసం కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదు. మార్కెట్ శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న మన్మోహనుడికి మనుషుల గురించి మానవత్వం గురించి ఎందుకు?

మన్మోహన్ సర్కార్ నిర్ణయాల వల్ల పేదల బతుకు బాగుపడకపోగా, మరింత భారంగా తయారయ్యాయి. కానీ యూపీఏ సర్కార్ ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తామంటోంది. దీనికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక చట్టం చేయడమే మిగిలింది.  అయితే అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ద్రవ్యలోటును తగ్గించుకోవాలని సూచించింది. ద్రవ్యలోటు తగ్గాలంటే ప్రభుత్వ అందిస్తున్న సబ్సిడీ లను తగ్గించాలి లేదా పూర్తిగా  తప్పుకోవాలి. దీన్ని మన ఏలికలు అమలు చేయాలని చూస్తున్నారు. కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ వ్యయాన్ని  జీడీపీలో రెండు శాతం, వేచ్చే ఆర్థిక సంవత్సరం 1.7 శాతం దిగువస్థాయికి తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరి ఈ సమయంలో ప్రజల సంక్షేమం గురించి ఇక ప్రభుత్వాలు ఎందుకు ఆలోచిస్తాయి? అందుకే మన్మోహన్ కాలంలో మన బతుకులకు భద్రత లేదు. ఉండదు కూడా. ముఖ్యంగా రాజ్యాంగం ప్రకారం ప్రజలకు అందించే మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం నుంచి తప్పుకోవాలనుకుంటున్నది. ఇందులో భాగంగానే కార్పొరేట్ ఆస్పత్రులు, కార్పొరేట్ పాఠశాలలకు ద్వారాలు తెరుస్తున్నది. యిప్పుడు మన దేశం ఎదురుకుంటున్న ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రెండు లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలని ప్రధాని ఈ మధ్యే ప్రకటించారు. అయితే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులన్నీకార్పోరేట్ వ్యవస్థకు కాసులు కురుపించేవే కానీ కామన్ మ్యాన్ కష్టాలు తీర్చేవి కావు. ఇదే ఈ ఎనిమిదేళ్ళలో మన్మోహన్ సర్కార్ సాధించిన మానవాభివృద్ధి. అందుకే ఆఫ్రికా ఖండంలోని చిన్న దేశాల్లో నివసిస్తున్న ప్రజా జీవన ప్రమాణం మన దేశ పౌరుల కంటే మెరుగ్గా ఉన్నది. 

పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోల్లో వారు అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, ప్రణాళికలను పొందుపరుస్తాయి. ఈ దేశంలో వాటిని తు.చ. తప్పకుండా అమలు చేస్తారని ఎవరూ భావించడం లేదు. కానీ ప్రజలకు పట్టెడు అన్నం అందించే పథకాలు కావాలని కోరుకుంటున్నారు. పారదర్శకమైన పాలనను ఆశిస్తున్నారు. అయితే ఇలాంటి మాటలు మనం మాట్లాడుకోవడానికి, రాసుకోవడానికి తప్ప ఆచరణలో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర ఏళ్ల సమయం ఉన్నది. బహుశా అప్పటి వరకు ఈ దేశ ప్రజలు సంక్షేమం, సబ్సిడీ అనే మాటలు మరిచిపోవలసిందే.
-రాజు

రాష్ట్రపతి ఎన్నికలో రాజకీయాలు

దేశంలో దశాబ్దంనర కాలంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దీంతో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల మద్దతుపై ఆధాపడవలసిన పరిస్థితులు వచ్చాయి. పేరుకే జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా ఢిల్లీ పీఠంపై కూర్చునే పరిస్థితులు పోయాయి. జాతీయ పార్టీలు ఎంత బలహీనపడ్డాయో ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా స్పష్టంగా కనిపిస్తున్నది. యూపీఏ, ఎన్టీఏ కూటములు తమ రాష్ట్రపతి అభ్యర్థులను గెలిపించుకోవడానికి చిన్నాచితకా పార్టీలను కూడా బతిమిలాడాల్సి వస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఓట్ల విలువ 10.98 లక్షలు. వచ్చే నెల 19న జరిగే ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే 5,49,442 ఓట్లు కావాలి. అధికార పార్టీ తరఫున ప్రణబ్ బరిలో ఉన్నారు. ప్రధానప్రతిపక్షం సంగ్మాకు మద్దతు పలుకుతున్నది. అయితే రాష్ట్రపతి ఎన్నిక మాత్రం మూడు కూటముల్లో మంటపెట్టింది. యూపీఏ తరఫున పోటీలో ఉన్న ప్రణబ్‌ను ఆ కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన తృణమూల్ వ్యతిరేకిస్తున్నది. మమతాబెనర్జీ అబ్దుల్ కలాంను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీలో నిలపాలని విఫలయత్నం చేశారు. కానీ ఆ రతిపాదనను కాంగ్రెస్ పెద్దలు తిరస్కరించారు. ప్రణబ్‌ను ఏకపక్షంగా ఎంపిక చేశారని ఆరోపిస్తున్నది. తృణమూల్ యూపీఏ నుంచి వైదొలగనుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే మమత మద్దతు ఇవ్వకపోయే సరికి ఈ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొన్నది. కానీ రాష్ట్రపతి ఎన్నిక అధికార పార్టీనే కాదు ప్రధాన ప్రతిపక్షంలోనూ చీలిక తెచ్చింది. ఎన్డీఏ కూటమిలోని శివసేన, జేడీయూ ప్రణబ్‌కు మద్దతు ఇస్తున్నాయి. అలాగే వామపక్షాల్లోని సీపీఎం, ఫార్వర్డ్‌బ్లాక్ ప్రణబ్ వెంట ఉండగా, సీపీఐ ఓటింగ్‌కు గైర్హాజరు కావాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న కూటముల బలాలు పరిశీలిస్తే యూపీఏకు (తృణమూల్ మినహా) 4,12,00 లక్షల ఓట్లున్నాయి.  ఎస్పీ, బీఎస్పీ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్, జేడీయూ, శివసేన, జేడీఎస్ పార్టీల ఓట్లు కలిపితే ప్రణబ్‌కు 6.29లక్షల ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఎన్డీఏకు (జేడీయూ, శివసేన మినహా)
2,43,000 ఓట్లు ఉన్నాయి. ఎన్డీఏ బలపరుస్తున్న సంగ్మాకు అన్నాడీఎంకే, బీజేడీల ఓట్లు కలిపి 3,10,00 ఓట్లు పడే అవకాశమున్నది. దీంతో 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ఎన్నికవడం ఖాయంగానే కనిపిస్తున్నది. అయితే ఈ ఎన్నికపై కూటముల్లోని పార్టీల పట్టింపులు విషయంలో ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే ప్రధాన ప్రతిపక్షం తరఫున బరిలో నిలిచిన సంగ్మా ఈశాన్య ప్రాంతంలోని చిన్న రాష్ట్రాల నుంచి రాజకీయంగా ఎదిగారు. అధికార పార్టీ తరఫున బరిలో ఉన్న ప్రణబ్ చిన్న రాష్ట్రాలను వ్యతిరేకిస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నిక ఏమంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తెలియజేస్తున్నది. సంగ్మా మొన్నటి వరకు ఎన్సీపీలో కొనసాగారు. ఆ పార్టీ యూపీఏలో భాగస్వామి. ఆ పార్టీ అధ్యక్షుడు, సంగ్మా కుమార్తె అధికార పార్టీలో మంత్రులుగా కొనసాగుతున్నారు. దీంతో పోటీ నుంచి తప్పుకోవాలని శరద్ పవార్ సూచించినా సంగ్మా బేఖాతరు చేశారు. పార్టీకి రాజీనామా చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఉండే రాజకీయ సమీకరణాలు కూడా రాష్ట్రపతి ఎన్నిను సంక్లిష్టం చేశాయి. అందుకే మహారాష్ట్రలో ఎన్సీపీ కాంగ్రెస్‌తో, శివసేన బీజేపీతో కలిసి పనిచేస్తున్నది. అందుకే ఎన్సీపీ వ్యతిరేకించిన అభ్యర్థిని శివసేన కూడా వ్యతిరేకిస్తున్నది. అట్లనే బెంగాల్‌లో మూడు దశబ్దాల ఎర్రకోటను కూల్చి అధికారంలోకి వచ్చిన మమత వ్యతిరేకించిన అభ్యర్థికి సీపీఎం మద్దతు తెలుపుతున్నది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో రాష్ట్రపతి నిర్ణయం కీలకమవుతుంది. అందుకే అధికార, ప్రతిపక్ష కూటములు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించకుండా రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటున్నాయి.  ఈ రాష్ట్రపతి ఎన్నికను తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా ఒక అవకాశంగా
ఉపయోగించుకోవాలి. ఐదున్నర దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలను కమిటీలు, ఒప్పందాలుల పేరుతో మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న ప్రణబ్ కూడా తెలంగాణ వ్యతిరేకి. దేశంలోని ప్రధాన సమస్యలన్నింటి తేల్చకుండా 30 కమిటీలను తన జేబులో వేసుకుని తిరుగుతున్న వ్యక్తి ప్రణబ్. ఆయకు పార్టీయే కానీ ప్రజలు ముఖ్యం కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయనను ట్రబుల్ షూటర్‌గా పేర్కొంటుంది. ఈ ట్రబుల్ షూటర్ పార్టీని సమస్యల నుంచి గట్టెంచడానికి ప్రజలను ట్రబుల్స్‌కు గురిచేయడానికి కూడా వెనకాడడు. తెలంగాణ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తెలంగాణను అడ్డుకున్న ప్రణబ్‌కు వ్యతిరేకంగా ఓటేయ్యాలి. లేకపోతే కనీసం తమ నిరసనను తెలియజేయడానికి ఓటింగ్‌కు గైర్హాజరవ్వాలి.
-రాజు

నాన్చుడు కాదు, తేల్చాలి

కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనం వల్ల ఎవరు లబ్ధి పొందారు? ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఘోర పరాజయం తర్వాత ఫలితాలపై కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. నరసాపురం,  రామచంద్రాపురం స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను ఓడించింది గత ఎన్నికల్లో పీఆర్పీ  తరఫున బరిలో నిలిచిన వారే. అందుకే కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనం చిరు వర్గానికే లాభించిందని చెప్పవచ్చు. సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ గెలిచిన పదిహేను మంది అభ్యర్థుల్లో దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్నవారే. అందుకే ఆయా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలను రంగంలోకి దించినా ఫలితం లేకుండా పోయింది. సీనియర్లను, జూనియర్లను సమన్వయం చేయడంలో విఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కి ఉండే ఓటు బ్యాంకును కాపాడుకోలేక పోయారు. అందుకే ఏడు చోట్ల డిపాజిట్లు కోల్పోవాల్సి వచ్చింది. అలాగే కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాల్లో ని అభ్యర్థులు కాపు వర్గానికి చెందినా వారు కావడం గమనార్హం.  వంగ వీటి రంగ హత్య తరువాత కోస్తాలో కాపులు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యారు.
ఇక పీఅర్పీని విలీనం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నది. కానీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కాదని సీమాంధ్ర ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.విలీనం తరువాత ఇరు పార్టీల నేతల్లో విభేదాలు చాలా సందర్భాల్లో బయటపడ్డాయి. తమను పట్టించుకోవడం లేదని కొందరు పీఅర్పీ బాహాటంగానే విమర్శించారు. అవసరం అయితే పీఅర్పీని పునరుద్ధరిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఢిల్లీ పెద్దలు వచ్చి చర్చలు చేసి విలీనం తంతు పూర్తి చేసినా క్షేత్ర స్థాయిలో అది వర్క్ అవుట్ కాలేదు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. రామచంద్రయ్య వంటి నేతలకు మంత్రి పదవి కట్టబెట్టడాన్ని కడప జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కొందరు నేతలయితే పీఅర్పీ విలీనం వల్ల నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుతుందన్నారు. ఈ వాదోపవాదనలు ఎలా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ లో  నెలకొన్నఅనిశ్చితిని తొలగించడానికి ఆజాద్ నేతృత్వంలో ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ ఆ కమిటీ రెండు మూడు సమావేశాలకే పరిమితం అయ్యింది. కానీ పీఅర్పీ విలీనం, నేతల మధ్య సమన్వయం సాధించడంలో విఫలమయ్యింది. కర్ణుని చావుకు వంద కారణాలు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర లో ఓటమి పాలు కావడానికి అనేక కారణాలు ఉన్నాయని బొత్స వంటి నేతలు చెప్పుకోవడం విడ్డురంగా ఉన్నది. వైఎస్ ఆకస్మిక మరణం తరువాత రోశయ్యను ముఖ్యమంత్రి చేసినా కాంగ్రెస్ పార్టీ జగన్ ను కట్టడి చేయడానికి అదే సామాజిక వర్గ నేతకు ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. మంత్రి వర్గ విస్తరణలో కూడా అదే సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సామాజిక న్యాయం నినాదంతో పార్టీ పెట్టిన చిరు కాంగ్రెస్ పార్టీలో పీఅర్పీని విలీనం చేసి సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు. చిరు మాటలు ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేసి ఉండి ఉంటే సీమాంధ్ర ప్రాంతం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరో రెండు మూడు సీట్లు గెలుచుకొని ఉండేది. ఎందుకంటే జగన్ వంగవీటి రంగ తనయుడు రాధా ను వైఎస్ఆర్ సీపీ లో చేర్చుకోవడమే కాదు, రాధను తన సొంత తమ్ముడిలా గుండెల్లో పెట్టుకుంటానని కాపులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జగన్ ప్రయత్నం ఫలించింది. అందుకే కోస్తాలో అన్ని వర్గాల ప్రజలు జగన్ను ఆదరించారు అనుకోవచ్చు. ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున పోటీ చేసినా అభ్యర్థులకు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నది. గతంలో ఆయా నియోజక వర్గాల్లో రెండో స్థానంలో నిలిచిన పీఅర్పీ అభ్యర్థులకు అవకాశం కల్పించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో ఇంతటి చేదు అనుభవం ఎదురయ్యేది కాదు. ఒకవేళ ఓడిపోయినా వైఎస్ఆర్సీపీ నేతలకు అంత భారీ మెజారిటీ వచ్చేది కాదు.  సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ళ సమయం ఉన్నది.ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి తెలంగాణ పై తేల్చాలి. సీమాంధ్ర ప్రాంతంలో పార్టీ బలోపేతానికి అన్ని వర్గాల వారికి సరైన ప్రాతినిధ్యం కల్పించి ముందుకు పొతే ఇప్పటికంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.అలా కాకుండా కాంగ్రెస్ పెద్దల్లో ఎప్పుడు మెదిలే సమస్యను నాన్చి వేస్తే దాని తీవ్రత కొంతకాలనికి తగ్గుతుందని భావిస్తే ఇవే ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయి. అప్పుడు రాహుల్ గాంధీని ప్రధాని ని చేయడం సంగతి అటుంచితే నూట ఇరవై ఏళ్ల ప్రాంతీయ పార్టీల కంటే వెనుకబడి పోవడం ఖాయం. సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని మాటల్లో మ్యానిఫెస్టో లలో పెట్టడం కాదు, అధికారంలో ఉండగానే ఆచరణలో చూపాలి. అప్పుడే ప్రజల విశ్వాసం పొందగలుగుతారు. ఎందుకంటే ఇవ్వాళ పరకాల ఫలితం కంటే సీమాంధ్ర లో జగన్ పార్టీ కి ఓటు వేస్తే అది రాష్ట్ర విభజనకు దారి తీస్తుంది అని ముఖ్యమంత్రి మొదలు లగడపాటి, టి జి వెంకటేష్, ఆనం వంటి నేతల ప్రచారాన్ని అక్కడి ప్రజలు పట్టించుకోలేదు. అంటే రాష్ట్రంలో ఈ అనిశ్చితి తోలిగిపోవాలంటే తెలంగాణ పై నాన్చడం కాదు తేల్చాలి. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతంలో బలహీన పడినా మరో ప్రాంతంలో బలపడుతుంది. లేకపోతే బాబు రెండు కండ్ల సిద్ధాంతం ఫలితం ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. అదే దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పడుతుంది.
rajuasari@gmail.com