Tuesday 25 September 2012

ఇది మన్మోహన్‌సింగ్ కాలం!


యూపీఏ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలు ఇప్పటివి కావు. మన్మోహన్ సర్కార్ ఎనిమిదిన్న సంవత్సరాలుగా ప్రజాసంక్షేమాన్ని మరిచి కార్పొరేట్ స్వామ్యానికి జై కొడుతూనే ఉన్నారు. అయితే మన్మోహన్ సర్కార్ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడల్లా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తన సహకారాన్ని అందిస్తున్నది. యూపీఏ-1 హయాంలో అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించాయి. అప్పుడు అమర్‌సింగ్ (అప్పుడు సమాజ్‌వాదీ పార్టీలో కీలక నేత) సహకారంతో ఎస్పీని దగ్గర చేర్చుకున్నారు. ఆ తర్వాత అమర్‌సింగ్ పరిస్థితి ఏమైందో మనకు విదితమే. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అవసరాలకు ఎవరితోనైనా కలిసిపోగలదు.. ఎవరితోనైనా కయ్యం పెట్టుకోగలదు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఛరిష్మా కలిగిన నేతల కంటే ఫ్యూహాలకు పదునుపెట్టే వారి సంఖ్య ఎక్కువ.

ఇప్పుడు కూడా చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ)లను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నది. దీన్ని వ్యతిరేకిస్తూ యూపీఏలోని ప్రధాన భాగస్వామ్య పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించింది. దీంతో మన్మోహన్ సర్కార్ ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. అయితే యూపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎస్పీ తన సైకిల్‌పై మన్మోహన్ సర్కార్ పడిపోకుండా కూర్చోబెట్టుకున్నది. అయితే ఇక్కడో విశేషమున్నది. ములాయం కూడా ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తున్నారు. కానీ మతతత్వ శక్తులు అధికారంలోకి రాకుండా ఉండేందుకే తాము మన్మోహన్ సర్కార్‌కు మద్దతు తెలుపుతున్నామంటున్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు పరోక్ష మద్దతునిస్తూ దానికి ఎస్పీ ఏవో సాకులు చెప్పడం విడ్డూరంగా ఉన్నది. సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపుతూ మన్మోహన్ దానికి సంస్కరణలు పేరు పెడుతున్నారు. ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నా.. వాటిని నియంత్రించలేక చేష్టలుడిగిన కేంద్ర సర్కార్ తాను తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థించుకోవడం సిగ్గుచేటు. ఇలాంటి ప్రభుత్వాలకు ఎస్పీ వంత పాడడం ఎంత వరకు సబబో ఎస్పీ అధినేత తెలుసుకోవాలి.
కేంద్ర సర్కార్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తమ అమ్ములపొదిలో ఉన్న సంస్కరణ అస్త్రాన్ని ప్రయోగించడం ఈ ఎనిమిదేళ్లుగా మనం చూస్తున్నదే.  ఏ వెల్గులకీ ఈ సంస్కరణలు అంటే సరైన సమాధానం ఉండదు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేస్తూ అదే అభివృద్ధి అని ప్రజలను భ్రమింపజేయ చూస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అయితే  మన్మోహన్, మాంటెక్‌సింగ్, చిదంబరం, రంగరాజన్‌ల అభివృద్ధి లెక్కలు మాత్రం ఆకుకు అందడం లేదు, పోకుకు పొందడం లేదు. అగ్రరాజ్యం అనుగ్రహం కోసం భారత్ భాగ్యవంతమైన దేశం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వాలను ప్రజలు ఎప్పుడు అవకాశం వస్తుందా తమ ఓటుతో వేటు వేద్దామని అనుకుంటుంటే సమాజ్‌వాదీకి మాత్రం అది అర్థం కావడం లేదు. మతతత్వ శక్తులను అడ్డుకునే పేరుతో మన్మోహన్ మరిన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకునేందుకు రాజమార్గం కల్పించింది.అంతేకాదు మన్మోహన్ సర్కార్ చర్యలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) బాసగా నిలిచింది. ఇక మన్మోహన్ దూకుడు మరింత పెరగనుంది. అది ప్రజలనే కాదు, ప్రాంతీయ పార్టీలను మింగేస్తుంది. బహుపరాక్...
-రాజు

Labels: ,

Monday 24 September 2012

అదే మాట.. పాత బాట


ఆ మధ్య టీడీపీ అధినేత తెలంగాణపై మరోసారి కేంద్రానికి లేఖ ఇవ్వబోతున్నారనే వార్తలు కొంత కాలం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనే లేవదీశాయి. సెప్టెంబర్ 15 కల్లా బాబు లేఖ ఇస్తారని ఒకసారి, అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇస్తారని మరోసారి వార్తలు వచ్చాయి. ఇంకా కొన్ని పత్రికలు, ఛానళ్లు అయితే తెలంగాణపై తేల్చేశాడు అన్నట్టు చెప్పాయి. అయితే సీమాంధ్ర నేతలతో బాబు భేటీ తర్వాత ఆ అంశం పక్కదారి పట్టింది. తెలంగాణపై లేఖ ఎవరు అడిగారు? ఎవరికి ఇవ్వాలి అని కొందరు సీమాంధ్ర నేతలు బాబును ప్రశ్నించగానే బాబు మాట మార్చేశారు. ఇక ఆ అంశంపై చర్చనే లేదు. తెలంగాణపై బాబు చిత్తశుద్ధి లేదు అనేది చాలాసార్లు రుజువైంది.  మొదట తెలంగాణ ప్రాంతం నుంచి బాబు పాదయాత్ర మొదలు పెడదామని అనుకున్నారట. అందుకే తెలంగాణపై బాబు అండ్ కో చాలా హడావుడి చేశాయి.  ఓ చానల్ అయితే ఏకంగా బాబు లేఖ చారిత్రక తప్పిదం అని ఒక కథనం ప్రసారం చేసింది. బాబు ఆంతర్యం ఏమిటో వీళ్లకు తెలియకపోయినా తెలంగాణ ప్రజలకు మాత్రం తెలుసు. అందుకే బాబు తెలంగాణపై ఎన్ని కుప్పిగంతులు వేసినా నమ్మలేదు.

తెలంగాణపై తాము చెప్పాల్సింది చెప్పామని తేల్చాల్సింది కేంద్రమే అని బాబు పదేపదే వల్లెవేస్తుంటారు. అందుకే బాబు తెలంగాణపై మరోసారి కేంద్రానికి లేఖ రాయనవసరం లేదు. కానీ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం మాత్రం ఉన్నది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా వచ్చింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణపై అసెంబ్లీ తీర్మానం కోసం సభను స్తంభింపజేశారు. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీకి రాష్ట్ర విభజనపై స్పష్టమైన అభిప్రాయం ఉండి ఉంటే అధికార పార్టీని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించి ఉండేది. కాంగ్రెస్ పార్టీ కపటనీతి ఎండగట్టి ఉండేది. కానీ టీడీపీ ఆ పని చేయలేదు, చేయదుకూడా. ఎందుకంటే తెలంగాణ విషయంలో ఈ రెండు పార్టీలు దొందూ దొందే. వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది ఈ రెండు పార్టీలే. అందుకే ఇవ్వాళ తెలంగాణలో ఈ రెండు పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది.

అలాగే బాబుకు ఇప్పుడు తెలంగాణ కంటే చాలా సమస్యలు ఉన్నాయి. మూడు ఫ్రంట్ ద్వారా కేంద్రంలో మళ్లీ చక్రం తిప్పాలి. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం చాటి చెప్పాలి. తనయుడు లోకేశ్‌ను రాజకీయాల్లో తెరంగేట్రం చేయించాలి. ఇన్ని సమస్యలుండగా తెలంగాణపై స్పష్టత ఎందుకు ఇస్తారు? ఎలాగూ ఈ సమస్యను సాగదీసేందుకు కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉన్నది. అందుకే యూపీఏ తెలంగాణ ఇవ్వదని బాబు అన్న వార్తలు కూడా వచ్చాయి. టీడీపీ విస్తృతస్తాయి సమావేశంలో తెలంగాణ అంశం గురించి తర్వాత చూద్దాం అని బాబు దాటవేసినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నాలుగున్నర కోట్ల ప్రజాకాంక్షను నలుగురు పెట్టుబడిదారుల కోసం పక్కనపెట్టినట్టే... బాబు కూడా నలుగురు సీమాంధ్ర టీడీపీ నేతల అభిప్రాయం మేరకే నడుచుకుంటారు. అందుకే బాబుకు రాని డౌటు వారికి వచ్చింది. అఖిలపక్ష భేటీలో మన అభిప్రాయాన్ని చెబుదామని అర్థంలేని వాదన చేస్తారు. ఒకవేళ ఈ లోగా కేంద్రం తెలంగాణపై  ఏదైనా నిర్ణయం తీసుకోవాలని భావిస్తే మరో కొత్తనాటకానికి తెరతీస్తారు.  బాబు మూడేళ్లుగా చేస్తున్నది ఇదే. అందుకే బాబును తెలంగాణ ప్రజలే కాదు సీమాంధ్ర ప్రజలు కూడా విశ్వసించడం లేదు. అది ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ రుజువైంది. అయినా బాబు మారడు. తన మనసులోని మాట బైట పెట్టడు.
-రాజు

Labels:

Monday 17 September 2012

తీర్మానమే తీర్పు కాదు



తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలన్న టీఆర్‌ఎస్ డిమాండ్‌పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ స్పందన హాస్యాస్పందంగా ఉంది. తీర్మానం పెడితే వీగిపోతుందనడంలోకూడా వింతేమీ లేదు. అయితే గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది కిరణ్ వ్యవహారశైలి. ఎందుకంటే తెలంగాణకు అన్ని రాజకీయ అనుకూలమనే అంటున్నాయి (సీపీఎం, ఎంఐఎం తప్ప). మరి అలాంటప్పుడు మాటల్లోనే తెలంగాణ ప్రజల మనోభావాలు అర్థం చేసుకుంటున్నామని రాజకీయ పార్టీలు ఎంత కాలం మోసం చేస్తాయి?  సీమాంధ్ర ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వారి సంఖ్య 175. తెలంగాణ ప్రాంతం నుంచి 119. కిరణ్‌కుమార్‌రెడ్డి సంఖ్యా బలాన్ని చూసి వీగిపోతుంది అంటున్నారు. వ్యక్తిగతంగా తెలంగాణను ఎంత మంది వ్యతిరేకిస్తారు అనేది అప్రస్తుతం. పార్టీల వైఖరి ఏమిటి అనేది మాత్రం తీర్మానంతో తేలిపోతుంది. ఎందుకంటే పార్టీల పరంగా ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమంది అనుకూలంగా ఓటేస్తారు, ఎంత మంది వ్యతిరేకిస్తారు అనేది ప్రస్తుత చర్చ. అందులో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఇంటిదొంగలు ఎవరు అనేది మాత్రమే. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమైక్య, విభజన వాదాలు వినిపిస్తునే ఉన్నారు.

అయితే గతంలో తెలంగాణ కోసం 120 మందికి పైచిలుకు ప్రజాప్రతినిధులు ‘రాజీ’నామాలు చేశారు. నిజానికి అందులో అధికార పార్టీకి చెందిన వారు నలభై మంది నిజాయితీగా ఉన్నా ఇవ్వాళ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ఆచరణ రూపం దాల్చి ఉండేది. కానీ వారు ఆ సాహసం చేయరనే కాంగ్రెస్ పార్టీ సాచివేత ధోరణిని అవలంబిస్తోంది. టీడీపీ కూడా మొన్నటి బాబు రెండు కండ్ల సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బాబు అన్ని అంశాలపై స్పష్టత అనే పేరుతో మొన్నటిదాకా కొంత హడావుడి కూడా చేశారు. అందులో అన్ని అంశాల్లో పార్టీ పరంగా ఏకాభిప్రాయాన్ని సాధించినా, తెలంగాణ విషయంలో మాత్రం ఆ పార్టీ ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నది. బాబు తెలంగాణపై మరోసారి లేఖ రాస్తామని ప్రకటించారు. అది కూడా మీడియాలో కోడై కూసింది. అందరి అభిప్రాయాలు తీసుకుని సెప్టెంబర్ 15 కల్లా లేఖ రాస్తారని, లేకపోతే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత రాస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే బాబుకు నిజంగా తెలంగాణపై చిత్తశుద్ధి ఉన్నట్లయితే గతంలో అసెంబ్లీలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉండి ఉంటే అధికార పార్టీ అవకాశవాదం బయటపడుతుంది. సీమాంధ్ర టీడీపీ నేతలు బాబును అడిగినట్టు ఇప్పుడు లేఖ ఎవరికి ఇవ్వాలో అనే సందేహాన్ని పక్కనపెట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే ఎవరు ఏమిటో తేటతెల్లమవుతుంది. టీడీపీ తెలంగాణకు కట్టుబడి ఉంటే అసెంబ్లీలో ఈ అంశంపై తీర్మానం వీగిపోయే అవకాశమే ఉండదు. కానీ బాబు ఆ పని చేస్తారని ఎవరూ భావించడం లేదు. ఎందుకంటే ఇంకా ఆయన హస్తిన రాజకీయాలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్లు తేల్చరు వీళ్లు దానిపై అడగరు. తెలంగాణ అంశంపై ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం ఏమిటో అందరికి అర్థమైంది. అందుకే తెలంగాణ అంశం వీరికి ఎన్నికల మేనిఫెస్టోల్లోనే కనబడుతుంది.

ఇక కిరణ్‌కుమార్ అన్నట్టు తెలంగాణపై తీర్మానం వీగిపోతే జరిగే నష్టం ఏమిటి? ఇప్పటి వరకు అసెంబ్లీలో చాలా అంశాలపై తీర్మానాలు పాస్ అయ్యాయి. మరి ఆ సమస్యలు పరిష్కారమయ్యాయా? లేదు. తీర్మానం ద్వారా ఆయా అంశాలపై పార్టీల అభిప్రామం మాత్రం వెల్లడైంది. తెలంగాణవాదులు కూడా కోరుతున్నది అదే.  ఈ అంశంపై రెండువాదనలు కాకుండా ఒకే మాట మీద నిలబడే పార్టీలు ఎన్ని? ఎంత మంది ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికి. ఒకవేళ తీర్మానం పాస్ అయినా వీగిపోయినా రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నది విదితమే. ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వం విదర్భ కోసం ఎన్నడో తీర్మానం చేసింది. అయినా దానిపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొన్నటిమొన్న యూపీని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి సర్కార్ తీర్మానం చేసింది. దానిపై ఏమీ తేల్చలేదు. మరి తీర్మానమే తీర్పు అన్నట్టు కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలా భావిస్తున్నారు? గతంలో ఆయన స్పీకర్‌గా పనిచేసినప్పుడు తెలంగాణకోసం పార్టీలకు అతీతంగా రాజీనామా చేస్తే కేవలం టీఆర్‌ఎస్ పార్టీ శాసనసభ్యులవే ఆమోదించి కొంతకాలం అసెంబ్లీలో తెలం‘గానం’ వినపడకుండా తన వంతు కృషి చేసిన విషయాన్ని ఎవరూ మరిచిపోరు. అట్లాగే ఏకాభిప్రాయం అనే మాట కాంగ్రెస్ పార్టీలో వినిపించే కామన్ మాటే. అది ఆ పార్టీ కాలయాపన కోసం మాత్రమే వాడుకుంటుంది. ఇంకా మంచి ఉదాహరణ ఏమంటే వైఎస్‌ఆర్ అకాల మరణం తర్వాత ఆయన తనయుడు జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని దాదాపు 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపారు. అయినా అనుభవం పేరుతో ఢిల్లీపెద్దలు రోశయ్యను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టారు. సీల్డు కవర్‌లో ముఖ్యమంత్రులను నిర్ణయించే కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం అంటే హస్తినలో కానీ అసెంబ్లీలో కాదనే విషయం ముఖ్యమంత్రి గుర్తిస్తే మంచిది. తెలంగాణపై డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయం మేరకే వచ్చింది. దీన్ని చాలా సందర్భాల్లో చిదంబరం చెప్పారు కూడా. కానీ ఆ తర్వాత వచ్చిన పరిణామాలతో ఆ ప్రకటన వెనక్కిపోయింది. డిసెంబర్ 9 ప్రకటనకే కట్టుబడి ఉండాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. మూడేళ్లుగా వాళ్లు దానికోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తున్నారు. తమ న్యాయమైన హక్కు కోసం వందలాది మంది యువతీయువకులు బలిదానాలకు పాల్పడ్డారు. అయినా సీమాంధ్ర సర్కార్‌కు కనిపించవు. ఆధిపత్యం పేరుతో ప్రజల ఆకాంక్షలను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నది. అది ఎంతో కాలం కొనసాగదు. అందుకే తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెడితే అందరి బాగోతాలు బయటపడతాయి.
-రాజు

Labels: ,

Wednesday 12 September 2012

నిర్ణయం చెప్పకుండా నీతులా?



తెలంగాణపై డిసెంబర్ 23 చిదంబరం మరో ప్రకటన తర్వాత ఈ అంశంపై  కాంగ్రెస్ పార్టీ కొత్తగా చెప్పింది ఏమీ లేదు. పాత పాటనే కొత్త గొంతుతో వినిపిస్తున్నది. అట్లాగని అది సీక్వెల్ అని కాదు. శృతి, లయ లేని రాగాలు. అందుకే ఆ పలుకులకు మీడియా ప్రచార ఆర్భాటాలే తప్ప ప్రజల్లో వాటికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఇప్పుడు సరిగ్గా తెలంగాణపై షిండే చేసిన వ్యాఖ్యలు కూడా ఆ కోవలోకే చెందుతాయి. ఎందుకంటే తెలంగాణ అంశంపై తనకు అవగాహన లేదంటూనే ఆయన అడ్డదిడ్డంగా మాట్లాడారు. మొన్ననే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆయనను కలిసినప్పుడు సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వారికి హామీ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతల మాటల్లో కన్ఫ్యూజనే తప్ప క్లారిఫికేషన్ కనపడదు. తెలంగాణపై ఏదో ఒకటి మాట్లాడడం తర్వాత దాన్ని మరొకరు సరిదిద్దకోవడం వారికి అలవాటే.

టీజీ వెంకటేశ్, లగడపాటి వంటి వాళ్లమాటలైతే కోటలు దాటుతాయి. షిండే చిన్న రాష్ట్రాల వల్ల ఏర్పడే సమస్యల గురించి ఏకరువు పెట్టగానే.. అవి తమకు అనుకూలంగా మలుచుకొని మీడియా ముందు వాలిపోయారు. షిండే వ్యాఖ్యలతో తెలంగాణ రాదని తేల్చేశారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వైఖరి కూడా ఇదేనా అంటే వారి దగ్గర సమాధానం ఉండదు. వారి విశ్లేషణలే వారి అధిష్ఠానం విధాన నిర్ణయమన్నట్టు తెగ వాగేస్తుంటారు. మరి డిసెంబర్ 9 తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని ఎట్లా చెప్పారు అంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు, యూపీఏ ప్రభుత్వం చేసింది అంటారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేకుంటే యూపీఏకు నాయకత్వం వహిస్తున్న ఆ పార్టీ ప్రమేయం లేకుండా ప్రకటన ఎలా వస్తుంది అంటే దానికి మరో కొత్త మెలిక పెడతారు. అదేమిటంటే డిసెంబర్ 9 ప్రకటన అసెంబ్లీ తీర్మానం అనే అంశాన్ని తెరమీదికి తెస్తారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెడితే, అది నెగ్గితే దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని అంటారు. మరి ఇప్పటి వరకు అసెంబ్లీలోతీర్మానం ఎందుకు ప్రవేశపెట్టలేదో వారికే తెలియాలి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే సీమాంధ్రలో 175 స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే ఎవరు నెగ్గుతారో చిన్నపిల్లవాడినడిగినా ఇట్టే చెబుతాడు. అయితే పార్టీల పరంగా రాష్ట్ర విభజనపై ఏదో ఒక నిర్ణయానికి వచ్చి, దానికి అందరూ కట్టుబడి ఉండాలి అన్నప్పుడు ఎవరు దొంగలో తేలిపోతుంది. దీనికి ఆంధ్రా అక్టోపస్ లగడపాటి విశ్లేషణలు అవసరం లేదు. టీజీ, లగడపాటిలు తెలంగాణకు వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడుతుండగానే పీసీసీ అధ్యక్షుడిని తెలంగాణపై టీడీపీ లేఖ గురించి ప్రస్తావించారు. టీడీపీ లేఖ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడుతుంది కదా అంటే సత్తిబాబు నిర్ణయం తీసుకునేది మేమే అయితే  లేఖ ఎందుకు అని తిరిగి ప్రశ్నించారు. తెలంగాణ అంటే ఏకాభిప్రాయం అనే కాంగ్రెస్ పెద్దలు దీనిపై ఎన్ని గొంతులు వినిపిస్తున్నారో వారికే తెలియదు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందన్నట్టు నిజాయితీలేని కాంగ్రెస్ నాయకులు నిసిగ్గుగామాట్లాడుతారు. దీనికి మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఒక అందమైన ట్యాగ్ తగిలించుకుంటారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు, అవినీతి ఆరోపణలకు కేంద్రబిందువయ్యింది.

తెలంగాణపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఒకసారి ప్రకటన చేసింది. దీనికి సంబంధించి పార్లమెంటులోని ఉభయ సభల్లోనూ మాట్లాడింది. తర్వాత రాష్ట్రంలోని పార్టీలు యూ టర్న్ తీసుకున్నాయని మరో ప్రకటన చేసింది. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ, ఆజాద్ కమిటీ అంటూ కాలం వెళ్లదీసింది. ఇప్పుడు యూటర్న్ తీసుకున్న పార్టీల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే మిగిలాయి. ఎందుకంటే పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యింది. టీడీపీ అధినేత తెలంగాణపై తమ పార్టీ నేతలతో సంప్రదింపులు చేస్తూ.. తెలంగాణపై స్పష్టత ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ, కొత్తగా పుట్టిన వైఎస్‌ఆర్‌సీపీల వైఖరే. ఇక ఎంఐఎం అభిప్రాయం గురించి ఇక్కడ చర్చే అవసరం లేదు. ఎందుకంటే సమైక్యవాదమే తమ పార్టీ విధానం అని అసెంబ్లీ వేదికగా ఆపార్టీ శాసనసభపక్ష స్పష్టం చేశారు. అంతేకాదు ఒకవేళ కేంద్ర తెలంగాణ ఇవ్వదలుచుకుంటే హైదరాబాద్‌న్ కేంద్ర పాలిత ప్రాంతమనో, ఉమ్మడి రాజధాని అంటే ఒప్పుకునేది లేదని, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కుండబద్దలు కొట్టింది. అందుకే తెలంగాణ ప్రజలు కూడా కోరుతున్నది తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ వైఖరి మాత్రమే. ఇక తేల్చుకోవలసింది కాంగ్రెస్ పార్టీనే.
-రాజు

Labels: ,

Monday 10 September 2012

లేఖపై ఎందుకీ గోల?


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణపై స్పష్టత ఇవ్వనున్నారనే వార్తలు కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆయన అన్ని ప్రాంతాల నాయకులతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుని, తెలంగాణపై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తారు అనేది ఆ వార్తల సారాంశం. ఇంత వరకు బాగానే ఉన్నది. తెలంగాణ సంక్లిష్ట సమస్య అని, సున్నిత సమస్య అని ఎంత కాలం సాచివేత ధోరణి మంచి పద్ధతి కాదు. ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు పెరగకుముందే రాజకీయ నేతలు పరిణతి ప్రదర్శించాలి. బహుశా బాబు కూడా తెలంగాణపై చేస్తున్న ప్రయత్నం అదే కాబోలు. దీనికి అందరి ఆమోదం ఉండకపోయినా పరవాలేదు, కానీ అనవసర రాద్ధాంతమే సరికాదు. ఎందుకంటే బాబు ఇంతవరకు తెలంగాణపై ఒక నిర్ణయానికి రాలేదు, కేంద్రానికి లేఖ ఇవ్వనూ లేదు. కానీ అప్పుడే మీడియాల్లో చర్చల మీద చర్చలు చేస్తున్నారు. అయితే ఆ చర్చలు ప్రజలకు ఉపయోగపడేవి కావు సుమా! ఒకరిపై మరొకరి ద్వేషాగ్నిని రగిలించేవి మాత్రమే. అందుకే కొన్ని టీవీ ఛానళ్లు పనిగట్టుకొని బాబుపై సీమాంధ్ర నేతల నిరసన గళం అని ప్రసారం చేస్తున్నాయి. చంద్రబాబు చేస్తున్న అభిప్రాయ సేకరణలో అనుకూల, ప్రతికూల వాదనలు ఉంటాయి. అందులో తప్పులేదు. ఎందుకంటే తెలంగాణపై తాను చెప్పిందే ఫైనల్ అని గతంలో చంద్రబాబు చెప్పారు కూడా. అందరి అభిప్రాయాలు సేకరించాక ఆయన ఏం చెబుతాడో వేచిచూస్తే బాగుంటుంది. కానీ తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్నట్టు చంద్రబాబు లేఖపై, తెలంగాణకు గూర్ఖాలాండ్ తరహా ప్యాకేజీలపై చర్చలు పెట్టడం ఏ పత్రికా విలువలో ఆలోచించాలి.

ఇక తెలంగాణపై బాబు స్పష్టత ఇస్తానన్న విషయంలోనూ కొత్తేమీ లేదు. ఇప్పుడు ప్రాంతాల వారీగా ఆయన సేకరిస్తున్న అభిప్రాయాల్లోనూ వింతేమీ లేదు. గతంలో ఆ పార్టీ మూడు ప్రాంతాల నాయకులతో కలిసి ఒక కమిటీ వేసి, అన్ని ప్రాంతాల కార్యకర్తల మనోభావాలు తెలుసుకున్నాకే మహానాడులో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన విషయం విదితమే. అయితే తెలంగాణపై 2009 డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన తర్వాత సీమాంధ్ర ప్రజల్లో వచ్చిన నిరసన కంటే ఆ ప్రాంత నాయకులు హడావుడే ఎక్కువ. అందుకే ఇప్పుడు బాబు తెలంగాణకు అనుకూలంగా మరోసారి లేఖ ఇచ్చినా ప్రజాప్రతినిధుల్లో నిరసన గళాలు వినిపిస్తాయేమో గానీ ప్రజల్లో మాత్రం కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు మానసికంగా ఎప్పుడో విడిపోయారు. ఇక మిగిలింది భౌగోళిక విభజన మాత్రమే. దీనిపై  ఎలాంటి శషబిషలు అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని, పెట్టుబడులు వెనక్కివెళుతున్నాయని గగ్గోలు పెట్టే వాళ్లు అందులో వాస్తవాలు ఎలా ఉన్నా.. తెలంగాణ సమస్య పరిష్కారానికి కూడా సహకరించాలి. మీడియా పారదర్శకంగా వ్యవహరించాలి తప్ప ప్రజల్లో విద్వేషాలను పెంచిపోషించకూడదు. అట్లాగని మీడియాలో పనిచేసే వ్యక్తులకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదనేది ఏమీ లేదు. కానీ వాటిని ప్రజాభిప్రాయం చూపెట్టడమే తప్పు. అందుకే దాదాపు మూడేళ్లుగా మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న పార్టీల ద్వంద్వ విధానాలను మీడియా ప్రశ్నించాలి. తెలంగాణ సమస్య ఏనుగులా కళ్లముందు కనబడుతున్నా దాని పరిష్కారానికి ప్రయత్నించని ప్రజాప్రతినిధులను నిందించాలి. ఒక ప్రాంతానికి  అనుకూలంగా నిర్ణయం వస్తే మరో ప్రాంతం ఓడిపోయినట్టు కాదు. తమ అవకాశవాద రాజకీయాల కోసం ప్రజల ఆకాంక్షలతో ఆడుకున్న పార్టీల వైఖరులను ఎండగట్టిన నాడే ప్రాంతీయ విముక్తి, ప్రజలకు మనశ్శాంతి లభిస్తుంది.
-రాజు

Labels: ,

Saturday 8 September 2012

ఏకాభిప్రాయం మాట ఎన్నిసార్లు?



దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటిలో చాలావరకు పాలకుల చిత్తశుద్ధి వల్ల కొన్ని పరిష్కారమైతే, వారి అసమర్థత వల్ల కొన్ని అలానే ఉన్నాయి. అంటే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టబడినాయి. అలా దశాబ్దాల తరబడి ఒక ప్రజాస్వామిక ఆకాంక్షను తమ అవసరాలకు అనుగుణంగా బయటకు తీయడం తర్వాత దాన్ని పక్కనబెట్టడం ఒక్క తెలంగాణ విషయంలో జరిగిందేమో! అది చేసింది కూడా నూటా పాతికేళ్ల కాంగ్రెస్ పార్టీయే. ప్రపంచ వ్యాప్తంగా చాలా అంశాలు అభిప్రాయభేదాలతోనే పరిష్కారమయ్యాయి కానీ ఏకాభిప్రాయం అనే మాట ఎక్కడా వినిపించలేదు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం అనే మాటను కాంగ్రెస్ నేతలు ఎన్నిసార్లు చెప్పారో వారికే తెలియదు. సరే ఏకాభిప్రాయం కోసం వాళ్లు ఏమైనా కృషి చేశారా అంటే అదీ లేదు. అంతేకాదు ఆ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు. మరి సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? మన్మోహన్ అన్న ఏకాభిప్రాయం సమైక్యాంధ్రపై ఉన్నదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పడినప్పుడూ లేదు. ఒప్పందాలపైనే కదా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. అవి సీమాంధ్ర పాలకులు ఉల్లంఘింస్తున్నారనే కదా దశాబ్దాలుగా తెలంగాణ సమస్య రగులుతూనే ఉన్నది. అసలు తెలంగాణపై ఏకాభిప్రాయం రాలేదన్న ప్రధాని మన్మోహన్ ఎంపికపైనే ఏకాభిప్రాయం లేదు. ప్రపంచబ్యాంకుకు తాబేదారుగా వ్యవహరించే మన్మోహన్‌కు ప్రజల మనోభావాలు ఎలా తెలుస్తాయి.

తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారనే విషయాన్ని తాజా ఒక జాతీయ చానల్ నిర్వహించిన సర్వే తేల్చింది. సీమాంధ్రలో కూడా 25 శాతం మంది ప్రజలు దీనికి మద్దతు తెలుపుతున్నారని తెలిపింది. ప్రజల్లో ఉన్న ఆకాంక్షకు పార్టీల ద్వంద్వ వైఖరితో ముడిపెట్టి దానికి ఏకాభిప్రాయం అనే అసంబద్ధ వాదనను ముందుకు తెస్తే అది ఎన్నటికి పరిష్కారం కావాలి?  రాష్ట్రంలో తెలంగాణ సమస్య జటిలం కావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్, టీడీపీలు.  ముందు ఈ రెండు పార్టీలు ఈ అంశంపై ఏకాభిప్రాయానికి రావాలి. తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నది తెలంగాణపై ఈ రెండు పార్టీల స్పష్టమైన వైఖరి మాత్రమే. ఈ రెండు పార్టీలు చెబుతున్నట్టు మేం తెలంగాణకు వ్యతిరేకం కాదనే మాటను ఆచరణలో చూపెడితే  పార్లమెంటులో తెలంగాణకు అనుకూలంగా భారీ మెజార్టీ ఖాయం. కానీ అదే సమస్య. టీడీపీ తెలంగాణపై తేల్చాల్సింది కేంద్రమే అని చెబుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయం, సంప్రదింపులు, సంక్లిష్ట సమస్య అని కాలయాపన చేస్తుంది. ఈ రెండు పార్టీల వైఖరి వల్ల ఇరు ప్రాంతాల్లోని ప్రజల్లో విద్వేషాలు పెరిగిపోతున్నాయి. అలాగే ప్రధాని చెప్పిన పాత పాటను కొన్ని పత్రికలు ఏకాభిప్రాయం ఎక్కడ అనే పెద్ద పెద్ద శీర్షికలతో హెడ్డింగులు పెట్టాయి. నిజంగా ప్రసారమాధ్యమాలు ప్రజాహితం కోసం పనిచేస్తే ఇంకా ఎంత కాలం పాడుతారు ఈ పాత పాటను అని ప్రధానిని నిలదీయాల్సింది. కానీ అవి ఆ పని చేయలేదు. కానీ తెలంగాణపై చంద్రబాబు స్పష్టత ఇస్తారు అనే మాట అనగానే ఆ పార్టీలోని సీమాంధ్ర నేతలు నిరసన గళం వినిపిస్తున్నారని లేనిపోని కథనాలను మాత్రం అల్లుతున్నాయి. నిజానికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చాలని కోరుకుంటున్నారు. కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన మీడియా మాత్రం అగ్నికి ఆజ్యంపోసే విధంగా వ్యవహరించడం సరికాదు. అందుకే రాష్ట్ర ప్రజల్లో రాష్ట్ర విభజనపై ఎవరికి మనోభావాలు వారికి ఉన్నాయి. వారి వారి అభిప్రాయాలు కమిటీల ముందు, ఎన్నికల్లోనూ చూపారు. ఇందులో ఏ పేచీ లేదు. సమస్యల్లా పార్టీల వైఖరితోనే. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీలతోనే. ఈ రెండు పార్టీలు వారి పార్టీల్లో తెలంగాణ, సమైక్యాంధ్రలపై ఏదో ఒక క్లారిటీకి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా ఈ అంశంపై గోడపిల్లిలా ఉన్న మిగిలిన పార్టీలు కూడా దారికి వస్తాయి. అందుకే పార్టీలు నిజాయితీగా వ్యవహరిస్తే నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుంది. అప్పుడు ఏకాభిప్రాయం రాకున్నా ఏదో అభిప్రాయం మాత్రం చెప్పవచ్చు. ఆ దిశగా పార్టీలు ఆలోచిస్తాయని ఆశిద్దాం.
-రాజు

Thursday 6 September 2012

హైదరాబాద్ టూ హస్తినా

హైదరాబాద్ టూ హస్తినా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఏదో ఒక నిర్ణయాన్ని వెలువరించనుందనే వార్తలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరికి వారు తమకు అనుకూలంగా ఆపాదించుకుంటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ‘బొగ్గు’ కుంభకోణంతో తడిసిముద్దయ్యాయి. అది మొదట యూపీఏ ప్రభుత్వ మెడకు చుట్టుకున్నా.. రాను రాను అందులో కొంత ఎన్డీఏ ప్రభుత్వానికి అంటించింది. అందుకే సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే వంటి కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల చేతులకు అవినీతి మసి అంటుకున్నదని ఆరోపిస్తున్నారు. హస్తినలో బొగ్గు ఉదంతం హాట్‌గా మారగా, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వేడి మళ్లీ రాజుకుంటున్నది. తెలంగాణకు సానుకూలంగా ఉన్న పార్టీలన్నీ ఎవరికి వారు స్వరాష్ట్రం కోసం పోరుబాట పట్టారు. ఇదంతా నాణానికి ఒక పార్శం అయితే తెలంగాణపై టీడీపీ మరోసారి కేంద్రానికి లేఖ రాయనుందనేది మరో పార్శం.

కేంద్రం ప్రభుత్వం తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోబోతుందని, దీనికి సంబంధించి కాంగ్రెస్ పెద్దల నుంచి తనకు సిగ్నల్స్ అందుతున్నాయని టీఆర్‌ఎస్ అధినేత చెప్పుకొస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై తలో రకంగా మాట్లాడినా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు గమనిస్తే  పరోక్షంగా చాలా పార్టీలు ఆయనను సమర్థించినట్టే కనిపిస్తున్నది. ఎందుకంటే ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో చంద్రబాబు  రెండు కండ్ల సిద్ధాంతాన్ని వీడి తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. అయినా బాబు స్పందించలేదు సరికదా తన సిద్ధాంతాన్ని సమర్థించుకున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా బాబు వేసిన రెండుకండ్ల ఎత్తుగడతో రెండు ప్రాంతాల్లో పార్టీ కాపాడుకోవచ్చని అనుకున్నారు. కానీ ఆయన రెండుచోట్లా రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యారు. రాష్ట్ర విభజనపై ఆయన తటస్తంగా ఉన్నా తెలంగాణపై మాటమార్చినందుకు ఈ ప్రాంతంలో ఆ పార్టీ నుంచి వలసలు ఎక్కువయ్యాయి. వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది బాబే అని తెలంగాణవాదులు ఆరోపిస్తే.. ఆంధ్రలో అయినా ఆయనకు ప్రాధాన్యం పెరగలేదు. అక్కడ జగన్ రూపంలో ఆ పార్టీని మరో సమస్య చుట్టుముట్టింది. ఏ పార్టీకి అయినా ఎత్తుపల్లాలు సహజమే. అయితే తెలంగాణపై డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పులు టీడీపీ మనుగడను ప్రశ్నార్థకం చేశాయి. ఈ రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ ఒక్కస్థానం కూడా గెలుచుకోలేదు. తెలంగాణలో అంటే ఉద్యమ ప్రభావంతో ఓడిపోయామని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు ఆ పార్టీ నేతలు. అయితే సీమాంధ్రలో కూడా అదే పరిస్థితి పునరావృతం అయింది. దీంతో బాబుకు  ఏం చేయాలో పాలుపోలేదు . ఆంధ్రప్రదేశ్‌ను అత్యధిక కాలం పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పిన చంద్రబాబుకు వరుస వైఫల్యాల రికార్డును కూడా మూటగట్టుకున్నారు. దీనికంతటికి కారణం కీలక సమస్యలపై సాచివేత కంటే స్పష్టత ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు బాబు. అందులో భాగంగానే ఇప్పుడు బీసీలకు వంద టికెట్లు, ఎస్సీ వర్గీకరణకు మద్దతు, తెలంగాణపై మరోసారి కేంద్రానికి లేఖ తదితర అంశాలు తెరమీదికి తెచ్చారు. అయితే ఎన్నికల్లో లబ్ధి కోసమే బాబు ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నారని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నారు. అలాగే బాబు తెలంగాణకు అనుకూలంగా మరోసారి లేఖ ఇస్తేనే సరిపోదు అందుకోసం ఉద్యమించాలని కూడా కిషన్‌రెడ్డి వంటి వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు అంటూనే సీపీఐ తెలంగాణ పోరుబాటను, బీజేపీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడురోజుల దీక్షను చేపట్టింది. తెలంగాణ కోసం చేస్తున్న ఈ ఇరు పార్టీల  ఉద్యమాలను స్వాగతించాల్సిందే. అయితే ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రాంతంలో చేస్తున్న ఉద్యమాలు ఆంధ్ర ప్రాంతంలో కూడా చేస్తే బాగుండేది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని తప్ప మరే ఇతర ప్రతిపాదనలను అంగీకరించే స్థితిలో లేరు. అట్లాగే తెలంగాణపై నాటకాలు ఆడిన కాంగ్రెస్, టీడీపీలకు తగిన బుద్ధి చెప్పారు. మునుముందు కూడా చెబుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ స్థితిలో చిన్న రాష్ట్రాల వల్ల కలిగే సౌలభ్యం గురించి ఆంధ్ర ప్రాంత ప్రజల్లో కూడా చైతన్యం తెచ్చేలా ఉద్యమించాలి. ఎందుకంటే నాలుగున్న కోట్ల ప్రజల ఆకాంక్షలను నలుగురు పెట్టుబడిదారుల కోసం అణచివేస్తున్నారని ఈ నాయకులే మైకుల ముందు మాట్లాడుతున్నారు. మరి ఆట ఎక్కడ ఆడాలో తెలిసినప్పుడు దాన్ని విస్మరిస్తే ఎలా? ముఖ్యంగా జాతీయ పార్టీలుగా చెప్పునే వాళ్లు దీన్ని ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు తెలంగాణ అనుకూలంగా ఎన్నో పార్టీలు గొంతు వినిపిస్తున్నా వాటిని ప్రజలు పూర్తిస్థాయిలో విశ్వసించకపోవడానికి కారణం కూడా ఇదే. అందుకే సీపీఐ, బీజేపీ లాంటి పార్టీలు టీడీపీ వలె కాకుండా జైఆంధ్ర ఉద్యమాన్ని మొదలుపెట్టాలి. ఎందుకంటే తాజాగా ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను 17 శాతం మంది ప్రజలు సమర్థించారు. అట్లాగే 25 శాతం మంది ప్రజలు తెలంగాణకు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే పెట్టుబడిదారులు చెబుతున్నట్టు మెజారిటీ ప్రజలు సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారు అనేది తప్పదని ఈ సర్దే నిరూపించింది. ఇందులో శాస్త్రీయత  సంగతి పక్కన పెడితే మన రాష్ట్రంలోనే ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అది స్పష్టమైంది. కాబట్టి ఏదైనా అంశంలో వందశాతం ఏకాభిప్రాయం ఎప్పుడూ సాధ్యం కాదు. కాబట్టి ఈ రెండు పార్టీలు ఆంధ్ర ప్రాంత ప్రజకు అర్థమయ్యే రాష్ట్ర విభజనకు అంగీకరించేలా కృషి చేయాలి. అప్పుడు కేంద్ర రాష్ట్ర విభజనపై ఏదో ఒక  నిర్ణయం తీసుకున్నా ప్రజల్లో ఉండే భావోద్వేగాలను కొంత వరకు నియంత్రించవచ్చు.

రాష్ట్ర విభజనపై తనకు కేంద్ర పెద్దల నుంచి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని చెబుతున్న కేసీఆర్ కూడా ఢిల్లీ బాట పట్టారు. కేంద్రం రాష్ట్రం ఇస్తే సంతోషమే ఇవ్వకపోతే సమరమే అని ఆయన ఇప్పటికే ప్రకటించారు. అట్లాగే కేసీఆర్ కేంద్రంలోని కీలక నేతల పిలుపు మేరకే ఢిల్లీ వెళ్లారని సమాచారం. అయితే కేసీఆర్  మాత్రం తాను పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చానాన్ని, ఏది ఏమైనా ఈ నేలకరులోగా తెలంగాణ అంశం తేలిపోతుందని కుండ బద్దలు కొట్టారు . అట్లాగే తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేతలు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను, కేంద్ర మంత్రి వాయలార్ రవిలను కలిసి విజ్ఞప్తి చేశారు. వాళ్ళను కలిసిన తరువాత తమకు కూడా తెలంగాణ పై స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని చెప్పడం గమనార్హం. సీమాంధ్ర ఎంపీలు కూడా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిని కలిశారు. తెలంగాణ మంత్రులు కూడా త్వరలో  ఢిల్లీ బాట పట్టనున్నారు. ఇప్పటికిప్పుడు తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తెలుస్తుందో లేదు తెలియదు కానీ నేతల హడావుడి చూస్తే హస్తినలో ఏదో జరగబోతున్నదని అర్థమవుతున్నది. అది రాష్ట్ర విభజన పైనా లేక రాష్ట్రంలో అధికారపార్టీ నాయకత్వంలో మార్పా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

ఇక మధ్యంతర ఎన్నికలు వస్తే యూపీఏ 15, ఎన్డీఏ 207 లోక్‌సభ స్థానాలు వస్తాయని ఎన్డీటీవీ సర్వే తేల్చింది. ఆ మధ్య అద్వానీ తన బ్లాగ్‌లో రాసుకున్నట్టు వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత యూపీఏ, ఎన్డీఏ యేతర అభ్యర్థే ప్రధాని అవుతారా అనిపిస్తున్నది. ఎందుకంటే దాదాపు 150 లోక్‌సభ స్థానాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని సర్వే చెబుతున్న సారాంశం. అందుకే దాదాపుగా రెండు దశాబ్దాలుగా దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగం నడుస్తున్నది. అది ఇక ముందు కూడా కొనసాగుతుందని అర్థమవుతున్నది. సార్వత్రిక ఎన్నికలకు కూడా మరో ఏడాదిన్న సమయం మాత్రమే ఉన్నది. అందుకే ఇప్పటి నుంచే జాతీయ పార్టీల్లో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. దానికంటే ముందు కేంద్ర ప్రభుత్వం నెత్తిన చాలా సమస్యలు చుట్టుకున్నాయి. వీటికి తోడు సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఉన్నాయి. సోనియాగాంధీ ఈసారి ఎట్లాగైనా యువరాజు రాహుల్‌గాంధీకి పట్టాభిషేకం చేయాలని భావిస్తున్నారు. ఆమె కల నెరవేరాలంటే వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలి. అయితే అది అంత సులువు కాదు. దేశంలోని చాలా పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీకి కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక స్థానాలు ఇచ్చి ఆదుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఏదో ఒక నిర్ణయం తప్పక తీసుకోవాలి. తెలంగాణప డిసెంబర్ ప్రకటనకు కట్టుబడి ఉండాలి. అందుకు సంబంధించి రోడ్ మ్యాప్ ప్రకటించాలి. అప్పుడు ఆ పార్టీకి గతంలో వచ్చినన్ని సీట్లు రాకున్నా ఇరవై పైచిలుకు స్థానాలను మాత్రం ఖాయం చేసుకోవచ్చు. దీంతో నాలుగున్నర కోట్ల ప్రజల ఆరు దశాబ్దాల ఆరాటం ఫలిస్తుంది. సోనియా సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది.
-రాజు

Monday 3 September 2012

అంధకారంలో ఆంధ్రప్రదేశ్



రాష్ట్రంలో కిరణ్ సర్కార్ తీరు ఆగమ్యగోచరంగా తయారైంది. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ‘ఇందిరమ్మ’ పేరుతో ఈ మధ్యనే ఒక కొత్త కార్యక్రమాన్ని కిరణ్ చేపట్టారు.  విశేషమేమంటే ఇందిరమ్మ పేరుతో కిరణ్ జిల్లాల పర్యటనలు చేస్తుంటే.. ప్రజలు తమ సమస్యలు తీర్చాలంటూ నగర బాట పడుతున్నారు. మిన్ను విరిగి మీదపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదు. ప్రజా సమస్యలపై నిలదీస్తే ప్రతిపక్షాలకు ఏమీ పనిలేదు అని వెటకారంగా మాట్లాడుతారు ముఖ్యమంత్రి. తమ ప్రభుత్వ పనితీరు బాగుందని వారికి వారే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు. రోశయ్య తర్వాత  వచ్చిన కిరణ్ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని గాడీలో పెడతాడని ఆ పార్టీ అధిష్ఠానం భావించింది. కిరణ్ వెలుగులతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోఅంధకారం నుంచి బయటపడుతుందని అనుకున్నారు. కానీ కిరణ్ కాంగ్రెస్ పెద్దల నమ్మకాన్నే కాదు ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోతున్నారు.

తాజాగా ఎన్డీటీవీ రాష్ట్ర నాయకత్వంపై వెలువరించిన సర్వే తాలూకు విశేషాలు చూస్తే రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న కిరణ్‌కు 11 శాతం మంది ప్రజలే మద్దతు తెలిపారు. సర్వేల్లో శాస్త్రీయత లేదన్నది అందరూ అనుకుంటున్నదే. కానీ మిగతా వారి సంగతి ఏమో గానీ కిరణ్ మాత్రం సమస్య తీవ్రత తెలిసినా దానిపై ఆయన స్పందన చూస్తే ప్రజల్లోనే కాదు అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులకే నీరసం వచ్చేస్తుంది. దీనికి విద్యుత్ సమస్యపై ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరే ఉదాహరణ. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ సంక్షోభం ఉందన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. అలాగే ఈ ఏడు రాష్ట్రంలో ఆశించిన మేరకు వర్షాలు కురవలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు పంట తడి కోసం కంట తడి పెడుతున్నారు. ఇటు వర్షాలు కురవక అటు విద్యుత్ లేక వాళ్లు నానా అవస్థలు పడుతున్నారు. అయినా ముఖ్యమంత్రి మాత్రం నివారణ చర్యల కంటే పొదుపు సూత్రాలనే వల్లిస్తున్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్టు పొదుపు అనేది ఒక్కరోజులో సాధ్యం కాదు. అలాగే పొదుపు గురించి పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఉన్నదాంట్లో సర్దుకోవడం ఈ వర్గాల్లో మెజారిటీ ప్రజలకు అలవాటే. అట్లా అని ఉన్నత వర్గాలు కూడా విద్యుత్ దుబారా చేస్తామని అనలేము. కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో విద్యుత్ పొదుపు మాటేమిటని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇంట్లో అంటే పెద్దవాళ్లు హెచ్చరిస్తే పిల్లలు దాన్ని ఆచరిస్తారు. కానీ ప్రభుత్వ సిబ్బందిని ఎవరు గైడ్ చేయాలి. ఒకవేళ చెప్పినా వారు వింటారా? ఏళ్ల తరబడి ఒక ఛట్రంలో ఉన్న వాళ్లు ఉన్నపళంగా పొదుపు మంత్రం పాటిస్తారని అనుకోవడం భ్రమే అవుతుంది. వాళ్ల చేతి నుంచి కరెంటు బిల్లులు కడితే దాని గురించి ఆలోచిస్తారేమో! కానీ సర్కారు సొమ్మే కదా మాకేంటి అనే అలసత్వం వారిని ఆవరిస్తుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యత లేదన్నది మన ఉద్దేశం కాదు. వారి ఆలోచన కూడా యధా రాజా తథా ప్రజా అన్నట్టు ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి ఆశించిన పొదుపు మార్పు రావడానికి ఇంకా కొంత కాలం పడుతుంది.

రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఏనుగులాగా కళ్లముందు కనబడుతుంటే ముఖ్యమంత్రి ఆ సమస్య తీర్చకుండా సర్దుకుపోండి అంటున్నారు. ప్రభుత్వాధినేతగా ఉంటూ ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం కిరణ్‌కుమార్‌రెడ్డికే చెల్లింది. చాలా రోజుల తర్వాత సమావేశమైన కేబినేట్ సమావేశంలోనూ విద్యుత్ సమస్యపై ఎక్కువ చర్చ జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ సమస్యపై ఒకరు ఇద్దరు జూనియర్ మంత్రులు మినహా కిరణ్‌కు బాసటగా నిలవలేదంటే ఆయన వ్యవహారశైలిపై ప్రజలకే కాదు సహచర మంత్రుల్లోనూ అసంతృప్తి ఉన్నదని అర్థమవుతున్నది. తాను ఇరవై ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని బీరాలు పలికిన చంద్రబాబును విద్యుత్ ఉద్యమాలు దెబ్బతీశాయంటే అతిశయోక్తి కాదు. ‘ఉల్లి’ఘాటుకే ఢిల్లీలో ప్రభుత్వం కుప్పకూలిపోయిన విషయం మనకు విదితమే. ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే, కిరణ్ తన కుర్చీని కాపాడుకునేందుకు పాకులాడకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. లేకపోతే రచ్చబండ, ప్రజాపథం, ఇందిరమ్మ ఇలా ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల పేర్లు మారుతాయేమో కానీ ప్రజల తలరాతలు మారవనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తెరగాలి.
-రాజు

Saturday 1 September 2012

కేంద్రం నెత్తిన ‘బొగ్గు’ కుంపటి


కొంత కాలంగా బొగ్గు కుంభకోణం పార్లమెంటును కుదిపేస్తున్నది. వేలం లేకుండా జరిపిన 57 బొగ్గు క్షేత్రాల కేటాయింపుల వల్ల ఖజానాకు 1.6 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ‘కాగ్’ నివేదిక సమర్పించింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య పార్లమెంటు వేదికగా తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. 2005-09 మధ్య బొగ్గు గనుల కేటాయింపులన్నింటికి ప్రధానే బాధ్యుడు కాబట్టి ఆయన రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై మౌనమే తన సమాధానం అన్నట్టు వ్యవహరించిన ప్రధాని ఎట్టకేలకు ‘కాగ్’ నివేదికపై కవితాత్మక సందేశాన్ని వినిపించారు. ‘హజారో జవాబోం సే అచ్చీ హై మేరీ ఖామోషీ, న జానే కిత్నే సవాలోం కీ ఆబ్రూ రఖే’ (నా మౌనమే వెయ్యి సమాధానాల కన్నా మిన్న. ఎన్నెన్నె ప్రశ్నలకు బదులివ్వకుండా కాపాడుతుందో అది’! అన్నది ఆయన ఉర్దూ కవిత అర్థం) అంటూ ఇంత కాలం తాను వహించిన మౌనాన్ని కవితాత్మకంగా సమర్థించుకున్నారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 2జీ, కామన్‌వెల్త్, ఆదర్శ్ కుంభకోణం వంటివి వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులతో సహా జైళ్లలో మగ్గుతున్నారు. ఈ కుంభకోణలకు సంబంధించి ప్రతిపక్షాలు ప్రధానిని పరోక్షంగా విమర్శించాయి. ప్రధాని ధృతరాష్ట్రుని వలె కళ్లకు గంతలు కట్టుకుని ఉండడం వల్లే ఇన్ని లక్షల కోట్ల ప్రజాధనం లూటీ అయిందనే ప్రతిపక్షాల ఆరోపణలు. అయితే ఇప్పుడు బొగ్గు గనుల కేటాయింపుల్లో ప్రతిపక్షాలు ప్రధానినే టార్గెట్ చేశాయి. ఆయన హయాంలోనే ఈ అవినీతి జరిగిందంటున్నాయి. దీనిపై కేంద్రమంత్రి సమాధానమిస్తూ ప్రధాని గురించి అందరికీ తెలుసునని, ఇంకా ఎవరైనా తప్పుచేస్తారేమో కానీ మన్మోహన్ మంచోడని ఎన్నడూ తప్పుచేయడన్నారు. బొగ్గు గనుల వేలాన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు వ్యతిరేకించాయి కాబట్టి గనుల వేలం నిర్వహించలేకపోయామన్నారు.
కాగ్ నివేదిక లోని వాస్తవాలు ఎలా ఉన్నా... ప్రధాని మొదటి నుంచి కార్పొరేట్ సామ్యానికి జీ హుజూర్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్‌ఇండియా, సింగరేణి వంటి సంస్థలకు బొగ్గు తవ్వే సామర్థ్యమున్నా వాటికి కేటాయించలేదు. ప్రైవేట్ సంస్థలకు వీటిని అప్పగించడం వల్ల 194 బొగ్గు క్షేత్రాలు 2002- 2009 వరకు క్యాప్టీవ్ మైన్స్ కింద కేటాయింపులు జరిగాయి. ఈ బ్లాకులలో 24 బ్లాకులు మాత్రమే బొగ్గును వెలికితీశాయి. ఇందులో కొన్ని నిర్ణీత సమయంలో బొగ్గు తవ్వలేదన్న కారణంగా రద్దయ్యాయి. కేటాయింపులు పొందిన కంపెనీలు నిర్దేశిత ఉత్పత్తి ప్రారంభించడానికి ప్రయత్నించడం లేదని, వాటిపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించందని ప్రధాని వెల్లడించారు. అక్రమంగా అనుమతులు పొందిన వారిపై చర్యలుంటాయన్నారు. వీటిపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నందున అక్రమాలు జరిగి ఉంటే అవి వెలుగులోకి వస్తాయన్నారు.
అయితే బొగ్గు గనుల కేటాయింపు ఉమ్మడి నిర్ణయమేనని ప్రధాని దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కాగ్ నివేదికను తప్పుల తడకగా అభివర్ణించారు. ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చాంటూ కాగ్ చూపిన గణాంకాలను సందేహాస్పదమైనవిగా ప్రధాని చెప్పారు. వేలం లేకుండా 1993 నుంచి ఆయా ప్రభుత్వాలు బొగ్గు క్షేత్రాలను కేటాయిస్తున్న విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. అంతేకాకుండా బొగ్గు క్షేత్రాలు అధికంగా ఉన్న పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, రాజస్థాన్‌ల్లో అప్పట్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని, యా రాష్ట్ర ప్రభుత్వాలు వేలం ద్వారా కేటాయింపులను వ్యతిరేకించాయని ప్రధాని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. చట్టబద్ధంగానే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు అనుగుణంగానే వ్యవహరంచామని ప్రధాని చెప్పుకొచ్చారు. ఇదంతా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్న కనిపిస్తున్నది. తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం ఎవరూ చేయకుండా.. ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపుకుంటూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు.
ఇదిలాఉంటే మరో 60 సంవత్సరాలలో సింగరేణి బొగ్గు కనుమరుగవుతుందని కేంద్ర బొగ్గుశా మంత్రి శ్రీ ప్రకాశ్ జైస్వాల్ పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. మంత్రి చెప్పిన ప్రకారం చూస్తే సింగరేణి ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్న విధ్వంసం కొనసాగుతుందని అనుకోవచ్చు. వాస్తవానికి సింగరేణి ప్రాంతంలో ఇంకా 150 సంవత్సరాల పాటు తవ్వగలిగే బొగ్గు నిక్షేపాలున్నాయి. అయితే సింగరేణి యాజమాన్యం ఏ యేటికి ఆ యేడు ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచుకుంటూ పోతున్నది. ముఖ్యంగా 12 పంచవర్ష ప్రణాళిక కాలం ఈ ప్రాంతంలో తొమ్మిది ఓపెన్‌కాస్టులకు అనుమతి లభించింది. ఈ ఓపెన్‌కాస్టులు ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తే దాదాపు 90 గ్రామాలు విధ్వంసానికి గురయ్యే ప్రమాదం ఉన్నది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నిరాశ్రయులను చేసే ఓపెన్‌కాస్టులను వ్యతిరేకించాలి. అండర్‌గ్రౌండ్ పద్ధతిన బొగ్గు తవ్వకాలు చేపట్టాలి. కమీషన్ల కక్కుర్తి కోసం బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కంపెనీలకు ధారదత్తం చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలైన కోలిండియా, సింగరేణిలకు అప్పజెప్పాలి. అప్పుడు ఈ అవకతవకలను కొంత మేరకు అరికట్టవచ్చు. పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకోవచ్చు. బొగ్గు ఉత్పత్తి అనేది సమాజ ఉన్నతికి ఉపయోగపడాలి కానీ ప్రజల ఉనికిని ప్రశ్నార్థకం చేసేదిగా ఉండకూడదన్న విషయాన్ని పాలకులు ఇప్పటికైనా గుర్తించాలె.
-రాజు