Wednesday 31 October 2012

బాటలు-బీటలు

చంద్రబాబు ఒకవైపు ‘వస్తున్నా మీ కోసం’ అంటూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం వెళ్తున్నాం జగన్ కోసం అంటూ బాబుకు నిస్తేజాన్ని నింపుతున్నారు. ముప్ఫై ఏళ్ల తెలుగుదేశం పార్టీని ఈ మూడేళ్లలో అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. హైటెక్ ముఖ్యమంత్రిగా అంతర్జాతీయ ప్రశంసలు పొంది ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోయిన బాబును తాజా పరిణామాలు కలవరపెడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రానికి ఇప్పుడు సమర్థవంతమైన నాయకుడు కావాలి, అది చంద్రబాబే అని ఆ పార్టీ ప్రచారం చేస్తుంటే.. ఆ పార్టీ అసమ్మతి నేతలు మాత్రం బాబు నాయకత్వ వైఫల్యం వల్లే తాము పార్టీని వీడుతున్నామంటున్నారు.

2009 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి పేరుతో టీడీపీ 92 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ఆ సంఖ్య 7 కి చేరింది. ఇందులో పన్నెండు మంది ఆ పార్టీకి దూరం కాగా మరో ఇద్దరు అదే బాటలో ఉన్నారు. వీళ్లే కాదు మునుముందు మరికొంత మంది పార్టీని వీడుతారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. నిజానికి అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత ప్రధానప్రతిపక్షానికి లాభించాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని కలవరపెడుతున్నా పైకి మాత్రం ఆ పార్టీ నేతలు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతున్నది. రోశయ్య తర్వాత అంధకారంలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌కు వెలుగు ‘కిరణం’ అవుతాడునుకున్న ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడల వల్లే ఆ పార్టీ కూడా నానాటికీ బలహీనపడుతున్నదని ఆ పార్టీ నేతల బహిరంగంగా విమర్శిస్తున్నారు. చిత్తూరు బాబులిద్దరు జనంలో ఉంటే వారి పార్టీ ఎమ్మెల్యేలు జగన్ వెంట నడుస్తామంటున్నారు.

అధికార పార్టీ పరిస్థితికి వారి అధిష్ఠానం చేస్తున్న తప్పిదాల స్వయంకృతపరాధం ఒక కారణమైతే ఆ పార్టీలో అంతర్గత ఆధిపత్యపోరు మరో కారణం. కానీ చంద్రబాబు పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధం. టీడీపీలో ఆయనే కర్త, కర్మ, క్రియ. కానీ బాబు నాయకత్వంపై నీలినీడలు ఎందుకు కమ్ముకుంటున్నాయి? బాబు పాదయాత్ర సక్సెస్ అని ఒకవైపు ప్రకటిస్తూనే..మరోవైపు పార్టీతో విభేదిస్తున్న ఎమ్మెల్యేపై సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఈ ముంచుకొస్తున్న ముప్పును చంద్రబాబు ఎలా అధిగమిస్తారు అనే ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం దొరకడం కొంచెం కష్టమే. ఎందుకంటే పార్టీని వీడుతున్న ఎమ్మెల్యే చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో బాబు పాదయాత్ర చేస్తూ తాను తెలంగాణకు వ్యతిరేకం కాదు అని గొంతెత్తి అరుస్తుంటే ఆ పార్టీని వీడుతున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు మాత్రం సమైక్య ఉద్యమానికి ఊతమిచ్చింది బాబేనని మీడియా ముందు వెల్లడిస్తున్నారు. అయితే ఈ విమర్శలను టీడీపీ నేతలు సూటికేసులకు అమ్ముడుపోయి బాబుపై నిందలు వేస్తున్నారన్నా వారి వ్యాఖ్యల ప్రభావం ఆ పార్టీపై తప్పకపడుతుంది. ఎందుకంటే టీఆర్‌ఎస్ పార్టీ,  నాగం జనార్ధన్‌రెడ్డి వంటి నేతలు ఇప్పటికే సమైక్య ఉద్యమాన్ని నడిపించింది బాబేనని చాలా కాలంగా ఆయనను కార్నర్ చేస్తున్నారు. దాని ఫలితమే తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల మాత్రం డిపాజిట్ దక్కించుకోగలిగింది. ఇప్పుడు తాజా మాజీ టీడీపీ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు తెలుగుతమ్ముళ్లు. అందుకే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి మళ్లీ లేఖ రాసినా ఈ ప్రాంత ప్రజలు విశ్వసించడం లేదు. కానీ బాబు లేఖను బూచిగా చూపిస్తు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతున్నారు. నారా నందమూరి కుటుంబాల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ బాబు పాదయాత్రతో సద్దుమణుగుతుందని అంతా భావిస్తున్న ఈ సమయంలో ఆ పార్టీలో కొత్త సంక్షోభాలు ముందుకొస్తున్నాయి. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే మునుముందు ఎలా ఉంటుందో చెప్పలేం.

ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎలా చూస్తున్నారో ప్రత్యేక రాష్ట్రంపై స్పష్టత ఇవ్వని టీడీపీని అలాగే చూస్తున్నారు. ఇందుకు వైఎస్‌ఆర్‌సీపీ కూడా మినహాయింపు కాదు. ఇచ్చేది మేమే తెచ్చేది మేమే ఒకరు, ఇచ్చే శక్తి గానీ తెచ్చే శక్తి గానీ తమకు లేవని మరొకరు, తెలంగాణపై తేల్చాంది కేంద్రమే అని ఇంకో పార్టీ వీరి వాదనలు ఏవైనా వాస్తవాలను మాత్రం ప్రజలు గ్రహిస్తున్నారు. ఇచ్చేది కేంద్రమే తేల్చాల్సింది రాష్ట నేతలే అని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఆశపడుతున్న అశావహులు కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీంతో రెండు పార్టీల్లో ఆనందం మరో పార్టీలో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడాలంటే అన్ని పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న తెలంగాణపై ఒక అభిప్రాయానికి రావాలి. అప్పుడు అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం అసాధ్యమేమీ కాకపోవచ్చు.
-రాజు

Labels: , , ,

విస్తరణ తెచ్చిన విభిన్న సమస్యలు

కేంద్ర క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణతో కాంగ్రెస్ కొత్త సంకేతం పంపింది. ముంచుకొస్తున్న ముప్పును తట్టుకునేందుకు ముందస్తు ఎన్నికల ప్రణాళికలను రూపొందించుకున్నది. అందుకే  ఇప్పుడు కేంద్ర క్యాబినేట్ 79 మంది ఉంటే అరవై పైచిలుకు మంత్రివర్గ స్థానాలు అధికార పార్టీ అభ్యర్థులే. అలాగే పది మంది మహిళా మంత్రులు. యువతకు పెద్దపీట వేస్తామన్న హామీని కూడా ఆచరణలో పెట్టినట్టు కనిపిస్తున్నది. ఇలా యువరాజు పట్టాభిషేకానికి రాజమార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అయితే మంత్రి వర్గంలో చోటు దక్కని అసంతృప్తులు, వాళ్లను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌లో పార్టీలో ఉండే సోనియా ఆంతరంగికులు ఉండనే ఉన్నారు. కానీ పెట్రోలియం శాఖ నుంచి జైపాల్‌రెడ్డిని తప్పించి వీరప్పమొయిలీ అప్పగించడం పట్ల అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. రిలయన్స్ అధినేత ముఖేశ్ ఒత్తిడితోనే జైపాల్ శాఖ మారింది అనుకున్నా దీనికి గల కారణాలను కూడా కాంగ్రెస్ చెబుతున్నది. దీన్ని సామాజిక ఉద్యమకారుడు కేజ్రీవాల్ బహిరంగంగానే ప్రభుత్వ తీరును విమర్శస్తున్నారు. అంతేకాదు యూపీఏకు బయటి  నుంచి మద్దతు ఇస్తున్న ఎస్పీ కూడా మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణపై విమర్శలు చేస్తున్నది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడాన్ని నిరసిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నదనే వారి ఆరోపణలు. అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ విషయంలో ఇదే రగడ కొనసాగుతున్నది. ఎందుకంటే గతంలో ఆ పదవిని నిర్వహించిన వారు చాలా అనుభవజ్ఞులనేది విశ్లేషకుల భావన. అలాంటిది ఇప్పుడు ఆ పదవిని పల్లంరాజుకు కేటాయించడంపై అధికార పార్టీలో కొందరు అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు స్వచ్ఛందంగానే వైదొలిగి యువత అవకాశాలు కల్పించడానికి పార్టీ కోసం పనిచేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తున్నది. అయితే దీనిపై కేంద్రంలో ఒక వాదన, రాష్ట్రంలో ఒక వాదన వినిపిస్తుండడం గమనార్హం. రాష్ట్ర రాజకీయాల్లో జైపాల్ తలదూర్చినందుకే ఆయన హోదాకు తగిన శాఖ దక్కలేదు అనేది వాస్తవం కాదు. ఎందుకంటే మన్మోహన్ తాజా క్యాబినేట్ కూర్పు అంతా సంస్కరణలు వేగవంతం చేసేందుకే అన్నది జగమెరిగిన సత్యమే. అందుకే ఆయన శాఖ మార్పు జరిగి ఉండవచ్చు.  కార్పొరేట్ స్వామ్యానికి జై కొడుతూ కామన్‌మ్యాన్‌ను పట్టించుకోని మన్మోహన్  ఇంత కాలం మిత్రపక్షాల ఒత్తిడి పక్కకుపెట్టిన అంశాలన్నీ వచ్చే ఏడాదిన్నర కాలంలో ఆచరణలో పెట్టబోతున్నారు.

అలాగే రాష్ట్రాల వారీగా పార్టీని పటిష్టం చేసే వ్యూహం కూడా ఈ తాజా కూర్పులో కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలసి సోనియాగాంధీ తన పార్టీ ఎంపీల సమావేశంలో చెప్పినట్టు వార్తలు కూడా వచ్చాయి. అందులోవాస్తవ అవాస్తవాలను పక్కన పెడితే కచ్చితంగా ఇది ఎన్నికల క్యాబినేటే అని స్పష్టమవుతుంది. ఇక విధేయత గురించి కూడా చర్చ జరుగుతున్నది. కానీ ఇదేం కాంగ్రెస్ పార్టీలో కొత్త అంశం కాదు. ఇందిరాగాంధీ హయాం నుంచి కొనసాగుతున్నదే. అది ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాదు అన్ని పార్టీల్లోనూ ఎంతోకొంత విధేయతకు పట్టం కట్టడం మనం చూస్తూనే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎలాగంటే వాళ్ల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కదా! పార్టీని, ప్రభుతాన్ని ఇబ్బందిపెట్టకుండా అంటే కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరించేవారిని అందలం ఎక్కించడంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుంటుంది. అలాగే వచ్చే ఏడాది నవంబర్, డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చునని యువనేత రాహుల్‌గాంధీ తనను కలిసిన ఎంపీలకు చెబుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు కేటాయించే బాధ్యతను కూడా ఆయనకే కట్టబెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే ఆయన రాష్ట్రాల వారీగా కొంతమంది ఆయన టీమ్‌లో చేర్చుకుంటున్నారు కూడా. వీరికి వారి వారి సొంత రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తున్నారట. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజాప్రతినిధుల పనితీరుపై తనకు నివేదికలు ఇవ్వాలని వారికి ఆదేశిస్తున్నారట.  గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల తర్వాత ముందస్తు ఎన్నికలపై మరింత సమాచారం రావచ్చు. సార్వత్రిక ఎన్నికల కోసం ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు బీజేపీ కూడా సన్నద్ధం అవుతున్నది. అందుకే పార్టీని విభేదించి బయట ఉన్న అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఆ పార్టీ ఉన్నది.

ముఖ్యంగా కర్ణాటక నుంచి యడ్యూరప్ప, రాజస్థాన్ నుంచి వసుంధరాజే, ఉత్తరప్రదేశ్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్‌లను సంప్రదించి కలుపుకుపోవాలనుకుంటోంది. లేదు లేదు అంటూనే అధికార, ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికల సందడి చేస్తున్నాయి. అయితే బీజేపీ సంగతి ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ నవంబర్‌లో ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టబోతున్నట్టు సమాచారం. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి పట్టున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మూడేళ్లుగా రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్‌రెడ్డి రెండేళ్ల పాలనలో ఆ పార్టీ పరిస్థితి దిగజారిందనేది విశ్లేషకుల వాదన. పార్టీలో ప్రక్షాళన జరగకపోతే గతంతో సాధించిన 33 పార్లమెంటు స్థానాల సంగతి ఏమో కానీ 13 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీకే చెందినవారు విమర్శిస్తున్నారు. అందుకే  ముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షుడిని సంప్రదించకుండానే మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి పెద్దపీట వేశారు అన్నది స్పష్టమే. అట్లాగే చంద్రబాబు జపిస్తున్న బీసీ మంత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆచరణలో చూపెట్టినట్టుంది. సీమాంధ్రలో ఒక సామాజిక వర్గం జగన్ వెంట వెళతారు అన్న ప్రచారం నేపథ్యంలో కాపులను ప్రసన్నం చేసుకోవడానికే పల్లంరాజు, చిరంజీవి లాంటి వారికి పెద్దపీట వేశారు అన్న చర్చ సాగుతున్నది. ఇందులో కొంత వాస్తవం కూడా ఉండవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో మొన్న జరిగిన 1 అసెంబ్లీ స్థానాల్లో రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ఆ అభ్యర్థులు కూడా కాపు సామాజిక వర్గం నేతలే కావడం గమనార్హం. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు చంద్రబాబు బీసీ మంత్రాన్ని, వైఎస్‌ఆర్‌సీపీ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని అనుసరించింది. అంతేకాదు రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా పది  మంత్రిపదవులు కట్టబెట్టింది. వీరి ద్వారా వలసలకు చెక్ పెట్టాలని భావించింది. కానీ మంత్రివర్గ విస్తరణ తర్వాతే అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఇంకొంత మంది అదే బాటలో ఉన్నట్టు సమాచారం. అయితే రాజకీయ పార్టీలో వలసలు అనేవి సహజమే. కానీ రాష్ట్రంలో అతిపెద్ద సమస్య అయిన తెలంగాణ అంశాన్ని పరిష్కరించకుండా ఇంకా నాన్చివేత ధోరణిని అవలంబిస్తే ఈ ప్రాంతంలోనూ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ రోగమొకటి అయితే చికిత్స మరొకటి చేస్తున్నది. ఇలా ఎంత కాలం నెట్టుకొస్తుందో హస్తిన పెద్దలకే అర్థం కావాలి.
-రాజు

Labels: , ,

Tuesday 23 October 2012

అనుకూలమనకుండా అఖిలపక్షం అంటే ఎట్లా?

ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజలకు నిరసన తెలిపే హక్కును నిరాకరిస్తున్నది. మొన్న ప్రధాన పర్యటన సందర్భంగా, నేడు చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా తెలంగాణవాదులను నిర్బంధించి, వారి గొంతు నొక్కాలని యత్నిస్తున్నది. తెలంగాణపై బాబు మరోసారి లేఖ రాశారని తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కానీ బాబు లేఖలో స్పష్టత లేదని ఈ ప్రాంత నేతలే కాదు సీమాంధ్ర టీడీపీ నేతలు కూడా చెప్పిన విషయాన్ని గుర్తించుకోవాలి. బాబుకు ఈ ప్రాంతంలో పర్యటించే హక్కు ఎలా ఉందో ఆయనను నిలదీసే హక్కు కూడా తెలంగాణ వాదులకు ఉంటుంది. అధికార పార్టీ అండతో తెలంగాణపై దండయాత్ర చేస్తున్న సీమాంధ్ర నేతలను స్వాగతిస్తున్న ఈ ప్రాంత టీడీపీ ప్రజాప్రతినిధులకు ఆత్మాభిమానం లేదా? తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం చెప్పమంటే అఖిలపక్షం అని తప్పించుకుంటున్న బాబుకు మీరు వంత పాడడం ఏమిటి? అంటే మీరు ఆ ప్రాంత ప్రజల ఆకాంక్ష కోసం పనిచేస్తున్నారా? లేక చంద్రబాబు ప్రాపకం కోసం పరితపిస్తున్నారా తెలియజేయాలి. అయినా జేఏసీ నేతలు ఎక్కడా చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని చెప్పలేదు. తెలంగాణపై బాబు వైఖరికి నిరసనగా తమ నిరసనను తెలిజేస్తామన్నారు. అంది కూడా నేరమేనా?

సీమాంధ్ర నేతల పర్యటన అనగానే ప్రభుత్వం వారికి భారీ బందోబస్తును ఏర్పాటు చేసి తెలంగాణ వాదులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, నిర్బంధించి ఈ ప్రాంతాన్ని ఒక మిలటరీ క్యాంపుగా మార్చే ప్రయత్నం చేస్తున్నది. ప్రశ్నించడమే అదో మహా పాపం అన్నట్టు కిరణ్ సర్కార్ వ్యవహరిస్తున్నది. అయితే వలసపాలకుల కుటిల నీతి తెలియంది కాదు. దానికి ఈ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నేతలు వంతపాడడమే విషాదం. బాబు పాదయాత్ర ఉద్దేశ్యం ఏమిటి? ప్రజల కష్టాలను తెలుసుకొని వారి అండగా ఉంటామనే భరోసా ఇవ్వడానికి ‘వస్తున్నా మీ కోసం’ అంటూ బయలు దేరారు. మరి ఈ ప్రాంత ప్రజానీకాన్ని నిర్బంధించి, వారి వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటుంటే ఇక బాబు ఎవరి బాధలు వింటారు. బాబు బాగోతాలు ఈ ప్రాంత టీడీపీ నేతలకు అర్థం కాకపోవచ్చు. కానీ ఈ ప్రాంత ప్రజలకు మాత్రం అది ఎప్పుడో అర్థమైంది. అందుకే బాబు ఇప్పటికి ఎన్నిసార్లు నేను తెలంగాణకు వ్యతిరేకం కాదని మొత్తుకుంటున్నా ఆయనను విశ్వసించడం లేదు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే ఇవ్వాళ నాలుగున్న కోట్ల ప్రజానీకం ఇలా రోడ్లపైకి వచ్చేవారు కాదు. స్వరాష్ట్రం కోసం ఇన్ని ఆత్మబలిదానాలు జరిగి ఉండేవికావు. వారి తల్లులకు కడుపుకోతలు మిగిలేవి కావు.

తెలంగాణ ప్రాంత టీడీపీ మాట్లాడితే తెలంగాణకోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని ఉరితాళ్లను పట్టుకుని తిరిగారు. మీరు ఎలాగూ చంద్రబాబును తెలంగాణపై నిలదీయలేరు. కనీసం ప్రజలనైనా అ పని చేయనివ్వరా? మొన్నటి దాకా జేఏసీకి మేమున్నాం అని పలికిన టీ టీడీపీ నేతలు ఇప్పుడు ఆ జేఏసీపైనే విమర్శలకు దిగడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం. అంటే వారి అవసరానికి అనుగుణంగా మాటమార్చడం చంద్రబాబు నుంచి నేర్చుకున్నారు. ఇక చంద్రబాబు మహబూబ్‌నగర్‌లో పాత పాటే పాడారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదంటారు. (వ్యతిరేకం కాదంటే అనుకూలం కాదు). ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పామని అన్నారు. మరి డిసెంబర్ 10 ప్రెస్‌మీట్ పెట్టి రాష్ట్రాన్ని విభజించడానికి తమిళనాడుకు చెందిన చిదంబరం, కర్ణాటకు చెందిన వీరప్ప మొయిలీ ఎవరు ఎందుకు ప్రశ్నించారు. సీమాంధ్రలో తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని ఎందుకు అడ్డుకోలేదు? మొదటి రాజీనామాల అస్త్రాన్ని సంధించిన టీడీపీ నేతలను ఎందుకు వారించలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రెండు కండ్ల సిద్ధాంతాన్ని ఎందుకు ముందుకు తెచ్చారు. తమరు రెండు కండ్లు అంటే, కాంగ్రెస్ వారు ఏకాభిప్రాయం అంటారు. మరొక పార్టీ ఇచ్చే శక్తి తెచ్చే శక్తి తమకు లేదంటుంది. ఇవి చాలవా తెలంగాణపై మీ వైఖరి ఏమిటో తెలియజేయడానికి. అట్లాగే ఇవ్వాల్సిన కాంగ్రెస్‌ను నిలదీయకుండా మమ్మల్ని నిందించడం ఏమిటని బాబు ప్రశ్నించారు. నిజమే. కేంద్ర చెబుతున్న మాటేమిటో బాబు అండ్ కో కు తెలియదా? రాష్ట్రంలో ఏకాభిప్రాయం లేనిదే తాము తెలంగాణపై ఏమీ చేయలేమని చెప్పిన విషయాన్ని మరిచిపోతున్నారు. మీరు నిజంగా తెలంగాణపై స్పష్టంగా ఉంటే ఈ అంశంపై ఎవరు నాటకం ఆడుతున్నారో ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలుస్తుంది. అలాగే తెలంగాణపై మీరు రెండోసారి లేఖ రాసిన తర్వాత సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పాదయాత్ర సమయంలో సమైక్యాంధ్ర జేఏసీ మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ అది టీ కప్పులో తుపానే. అయితే తెలంగాణ ప్రాంతంలోకి మీరు అడుగుపెడతారనగానే ఎందుకు ఇంత రచ్చ జరిగింది. టీడీపీ వైఖరి స్పష్టంగా ఉంటే రాజోలి రగడ ఎందుకు జరిగింది. పాలకుర్తిలో ప్రజల నుంచి నిరసన ఎందుకు ఎదురైందో సదరు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. అట్లనే చంద్రబాబు అఖిలపక్షం అనేకంటే తెలంగాణకు అనుకూలం అంటే వారికి జరిగే నష్టమేమిటో? నిజంగా టీడీపీ ఈ పనిచేస్తే కాంగ్రెస్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారో, లేక చంద్రబాబు కాంగ్రెస్‌తో చేసుకున్న చీకటి ఒప్పందం ఆరోపణలు ఏమిటో అందరికి అర్థమవుతాయి.

Labels: , , ,

Saturday 20 October 2012

అన్నింటికి అతనే



గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది లగడపాటి రాజగోపాల్ వైఖరి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. డెంగీ మరణాలు, విద్యుత్ కోతలు, చేనేత సమస్యలు, ఇలా ఒక్కటేమిటి సకల జనుల సమస్యలన్నీ సచివాలయంలో పేరుకుపోయాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఈ లగడపాటి ఏనాడూ లేఖ రాయలేదు. రాయడు కూడా. కానీ తెలంగాణ అన్నా, తెలంగాణ ఉద్యమకారులన్నా ఆయనకు చిర్రెత్తుకొస్తుంది. సీమాంధ్ర మీడియా కూడా తెలంగాణపై మాట్లాడడానికి, ఉద్యమకారులపై విమర్శలు చేయడానికి ఆయనకే పేటెంట్ హక్కు ఇచ్చినట్టు ఉన్నాయి. అందుకే తెలంగాణ అనగానే లగడపాటి వచ్చి వాలుతాడు. అయితే తెలంగాణ ఉద్యమంపై ఆయనకు అవగాహన ఉన్నదా? లేక రాజకీయాల్లో తలపండిన నేతా అంటే పొరపాటే సుమా! ఆయనకు తెలిసిందల్లా వాస్తవాలు లేని వితండవాదమే తప్ప దేనికి సరైన ఇవ్వడు. మొన్నటికి మొన్న కేసీఆర్ హైదరాబాద్‌లేని తెలంగాణ ఇవ్వమని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరాడని, దీనికి ఒప్పుకోవాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు, ఇతర ముఖ్యులకు ఫోన్ చేశాడని అర్థంలేని ఆరోపణలు చేశాడు. దీనికి రుజువులు ఉన్నాయా అంటే ఏవీ లేవు. ఆరోపణలు చేసిన వ్యక్తే ఏమంటాడు అంటే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గుండె మీద చెయ్యి వేసుకుని తన ఆరోపణలు వాస్తవమో, అవాస్తమో చెప్పమంటాడు. సదరు సీమాంధ్ర మీడియాకు లగడపాటి చేస్తున్న జగడం ఏమిటో అర్థమయ్యాక కూడా మళ్లీ మళ్లీ అతని అభిప్రాయమే సర్వరోగ నివారణి అన్నట్టు మైకు తీసుకెళ్లి ఆయన ముందు పెడతారు.

ఇప్పుడు తాజాగా కెమెరామెన్ గంగాతో రాంబాబు విషయంలోనూ తలదూర్చి ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశాడు. ఈ విషయంలో ఉద్యమకారులపై ముఖ్యమంత్రి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతాడు. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఈ సినిమా వివాదంపై అందులో అభ్యంతరాలు ఉన్నాయని తమ దృష్టికి వచ్చినట్టు ఒక కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ సభ్యులు కూడా ఇందులో తొమ్మిది చోట్ల అభ్యంతరాలు ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించారు కూడా. అయినా లగడపాటికి ‘రాంబాబు’మత్తు వదలలేదు. ఆ సినిమా డైరెక్టర్ పేరు కూడా సరిగ్గా తెలియని రాజగోపాల్ ఇవ్వాళ ఆ సినిమాలో సమైక్యత గురించి గొప్ప సందేశముందని లెక్చర్లు దంచుతున్నాడు. దీనికి ఓ సీమాంధ్ర మంత్రి, మరో రాయలసీమ నేత కూడా వంత పాడుతున్నారు. అంటే వీళ్ల ప్రభుత్వం నియమించిన కమిటీయే ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే వీళ్లు మాత్రం ఓ హీరోను పల్లకిలో మోసే పనిలో ఉన్నారు. అంతేమరి ప్రభుత్వాధినేత పనితీరు బాగుంటే వీళ్లు ఇంత కులాసాగా ఉందుకుంటారు. ముఖ్యమంత్రి ముందు సమస్యలు లేవనెత్తితే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు. పరిష్కారం చూపమంటే పక్కవాడి మీద నెట్టేస్తారు. అందుకే యథారాజ తథా ప్రజా అన్నట్టు ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ పాలన! కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యను పరిష్కరించి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాన్న ఉద్దేశ్యం ఉన్నట్టు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అలజడులను చూస్తూ హస్తినలో పెద్దలతో పూటకో మాట పలికిస్తున్నది. ఈ పరిస్థితిని ఇంకా ఎంతకాలం ఏకాభిప్రాయం పేరుతో  కొనసాగిస్తారో వారికే తెలియాలి.

జాతి ఆకాంక్షపై విషం కక్కడమే జాతీయభావనా?



వినోదాన్ని పంచాల్సిన సినిమాలు వివాదం ఎందుకు అవుతున్నాయి? ఆర్ట్ సినిమా తీసినా ఆదాయమే వారి ఉద్దేశం. దానికి కూడా కొన్ని కమర్షియల్ హంగులు జోడించి సొమ్ముచేసుకోవడం జరుగుతున్నదే. మంచి సందేశం ఇవ్వాలంటే ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం దాన్ని ద్వారా వచ్చే ఆదాయాన్ని సొమ్ముచేసుకోవడం జరుగుతున్నదే. అది తెలంగాణ ఉద్యమమే కావచ్చు. లేదా మరేదైనా కావచ్చు. అలా వివాదాస్పదం అయిన సినిమాల జాబితాలోకి ఇప్పుడు కెమెరామెన్ గంగాతో రాంబాబు చేరిపోయింది. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆయన వ్యవస్థలోని అవస్థలను చూపించబోయి అభాసుపాలయ్యాడు. జాతీయ భావన పేరుతో ఒక జాతి ఆకాంక్షను అగౌరవపరిచాడు. ఈ సందర్భంగా ఆ మధ్య ఆయనే తీసిన పోకిరి సినిమాలో ఓ డైలాగ్ గుర్తుకు వచ్చింది. అందులో ప్రకాశ్‌రాజ్ మమైత్‌ఖాన్‌ను గిల్లితే గిల్లించుకోవాలి అంటాడు. అట్లాగే ఉన్నది పూరి వ్యవహారశైలి. తనకున్న అవగాహనో, అజ్ఞానమో తెలియదు కానీ ఓ సినిమాను తీసేసి అ సినిమాను ప్రదర్శనకు పెట్టి ప్రజల మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అంటున్నాడు.

ఇక్కడ ఈ సినిమా విడుదలకు ముందు పూరీ చెప్పిన కొన్ని విషయాలను గుర్తుచేసుకుంటే ఇది ఆయన కావాలనే తీసినట్టు అర్థమవుంది. ఈ సినిమా కథను నాలుగేళ్ల కిందట రాసుకున్నానని, అయితే ఇప్పటికి ఇప్పటికి మన వ్యవస్థలో వచ్చిన మార్పులేవీ లేవన్నారు. సినిమా చూస్తే ఎక్కడా మీకు అది నాలుగేళ్లనాటి కథ అనిపించదు అన్నారు. అంటే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నాలుగేళ్ల కిందట ఎలా ఉన్నదో ఇప్పటికీ అలాగే ఉన్నదన్నది సదరు దర్శకుని అభిప్రాయం. అందుకే కాబోలో ఆయన అక్కసు. అట్లాగే మరో విషయం కూడా చెప్పారు. ఈ కథ విన్న హీరో పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా కథ రాశావు అన్నారన్నారు. అంటే కథలో దర్శకుడు చెప్పబోతున్న అంతర్లీన అంశం విషం చిమ్మడంమే కనుక ఆయన మెచ్చుకున్నారు కావచ్చు. అంతేమరి నిమ్మచెట్టుకు తుమ్మకాయలు కాస్తాయా మరి? జగిత్యాలలో సామాజిక తెలంగాణ అని మారువేశం వేసిన చిరంజీవి తర్వాత సమైక్యవాదమన్నారు. ఇలా అవకాశవాదం వ్యవహరించిన అన్న వైఖరిని తమ్ముడు తప్పుపట్టలేదు. పూరి జగన్నాథ్ కూడా ఇది అన్యాయం అనిపించలేదు. కానీ ఇప్పుడు జాతీయ భావన గురించి తెగ బాధపడిపోతున్నాడు. అందుకే పవన్‌కు తెలంగాణపై తనకున్న ఆవేశాన్ని, పూరిలో ఉన్న అక్కసు జోడించి ఈ సినిమాను తెరముందుకు తెచ్చారు. దీన్ని పంపిణీ చేసిన ఈ ప్రాంత ప్రబుద్ధుడు దానికి వంతపాడాడు.  సినిమా ప్రివ్యూ చూస్తున్నప్పుడు కొంత అనుమానం వచ్చిందట కానీ దాన్ని అప్పుడు చెప్పలేకపోయారు పాపం. అందుకే ఇప్పుడు ఈ సినిమా నిర్మాత దానయ్య దీనికి వివరణ ఇవ్వడం లేదు కానీ దిల్ రాజు మాత్రం అన్నీ తానై సినిమా వివాద బాధ్యతలను తాను మోస్తున్నాడు. అయినా మహిళలను, వికలాంగులను గౌవరించాలన్న సంస్కారం లేని వాళ్లు సమాజానికి నీతులు చెప్పడమే ఇప్పటి విషాదం.

అట్లాగే మన సినిమా వాళ్లు మా కళాకారులకు ప్రాంతాలతో సంబంధం లేదు. మేము అన్ని ప్రాంతాల వారీని గౌరవిస్తాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తరచుగా కనిపిస్తున్నదే. ఈ సినిమాపై తలెత్తిన వివాదాలకు దర్శకుడు, నైజాం ఈ సినిమా పంపిణీదారుడు వివరణ ఇచ్చారు, ఇస్తున్నారు. తమ తప్పును తెలుసుకుని క్షమాపణలు కోరుతున్నారు. కానీ సందట్లో సడేమియా లాగా తెలంగాణ అంటే ఒంటికాలిపై లేచే లగడపాటి ఇందులోకి ఎంటరయ్యారు. లగడపాటి ఈసినిమా ప్రచారాన్ని మోస్తున్నారు అంటేనే ఈ సినిమా ఉద్దేశం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. దర్శకుడు సినిమా బాగా తీశాడని ప్రశంసిస్తున్నారు. దర్శకుడు ఈ సినిమాలో జాతీయ సమైక్యత గురించి చక్కగా వివరించారని అంటున్నారు. మరి జాతీయ భావన గురించి చెప్పే వీరు మొన్న జీవవైవిధ్య సదస్సుకు ప్రధాన వచ్చిన సందర్భంలో ఒక ప్రాంత పాత్రికేయులను నిరాకరించినప్పుడు వీరు స్పందించలేదు. కలిసుందాం అంటూనే కలహాలు పెట్టే చర్యలు పూనుకుంటున్నారు. లగడపాటి అనుంగు శిష్యుడు అడుసుమిల్లి జయప్రకాశ్ అయితే ‘జై బోలో తెలంగాణ’ సినిమాకు జాతీయ సమగ్రత’ అవార్డు ఇవ్వడాన్ని ఆక్షేపించారు. జైబోలో తెలంగాణ సినిమా ఆపడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించారో అప్పుడే మరిచిపోయారా? ఆదీనిపై పునరాలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అప్పుడు మాట్లడలేదు ఈ జాతీయవాదులు. ఆంధ్రప్రదేశ్‌లో సమైక్యభావన లేదనడానికి ఈ ఉదంతాలు చాలవా?

ఇంత జరిగినా కొందరు సినీ పండితులు మాత్రం సినిమాను సినిమాలా చూడాలి అంటారు. తప్పుచేసి దానికి మీడియా ముఖంగా దానికి తెలంగాణ ప్రజలను కోరుతుంటే కొందరు మిత్రలు మాత్రం ఫేస్‌బుక్‌లో ఇంకా సినిమాను సమర్థించడం సబబు కాదు. అందుకే దీనికి మనం ఇచ్చే సమాధానం కూడా పూరీ ‘నేనింతే’ సినిమాలో చెప్పిన డైలాగ్‌ను వారికే గుర్తు చేద్దాం. అందులో హీరోపై విలన్ ఉమ్మేస్తాడు. దానికి హీరో స్పందన ఎలా ఉంటుంది అంటే తుడుచుకుంటే పోతుంది అంటే వందసార్లు తుడుచుకోవడానికైనా నేను రెడీ. మరి నేనే పోతాను అనుకుంటే దానికంటే ముందు నువ్వుపోతావు అంటాడు. మరి మనం ఏం చేద్దాం. అందుకే తెలంగాణ సహనాన్ని గిల్లవద్దు. జాతీయభావన గురించి నీతులు చెప్పేవాళ్లు ఒక జాతి ఆకాంక్షపై విషం గక్కడం ఎంత వరకు సమంజసమో వారే ఆలోచించుకోవాలి?వినోదాన్ని పంచుతామనే పేరుతో వివాదాలు సృష్టిన్తున్న ఇలాంటి వారికి రాయితీలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలి.  అలాగే పూరీ అండ్ కో తెలుసుకోవాల్సిన మరో విషయం ఉన్నది. సినిమా బాగుంటేనే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ప్రజల ఓపికను పరీక్షిస్తే అప్పుడు పూరీ తీసిన సినిమా క్లైమాక్స్‌లో గ్రాఫిక్స్‌లా ఉండవు గర్జనలే ఉంటాయి. అప్పుడు ఆ సౌండ్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది.

Saturday 13 October 2012

సులువు కాదన్నప్పుడు సూక్తులెందుకు?

సంక్లిష్టం, సున్నితం, సంయమనం, సంప్రదింపులు, చర్చలు, ఏకాభిప్రాయం, అందరికి ఆమోదయోగ్యం ఇవన్నీ సప్త స్వరాల వలె ఎప్పుడూ మనకు వినిపిస్తాయి. తెలంగాణపై హస్తిన పెద్దలను ఆరాతీస్తే వచ్చే సమాధానాల్లో ఇందులో ఏదో ఒకటి తప్పక ఉంటుంది. ఐదున్నర దశాబ్దాలుగా తెలంగాణపై ఎన్నడూ ఒక్క ముందడుగు వేయలేదు (ఒక్క 2009 డిసెంబర్ 9 ప్రకటన తప్ప). 2009 డిసెంబర్ 7 నుంచి 9 వరకు మాత్రమే తెలంగాణపై రాష్ట్రంలో, కేంద్రంలో ఏకాభిప్రాయం వచ్చింది. తెలంగాణపై చిదంబరం ప్రకటన తెల్లారి నుంచి అంటే  డిసెంబర్ 10 మానవ హక్కుల దినం నుంచి ఈ ప్రాంతంలో ప్రజల హక్కులు కాలరాయబడుతూనే ఉన్నాయి. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తాము అంటూనే వారి హక్కులను హరిస్తున్నాయి పార్టీలు. నిజానికి తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు చూస్తే తెలంగాణ ప్రజల్లో తెగువ రెట్టింపు అయితే, ఆంధ్ర ప్రాంత ప్రజలకు అసహ్యం వేస్తున్నది. ఎందుకంటే ప్రజల్లో రాష్ట్ర విభజనపై మానసిక విభజన ఎన్నడో వచ్చింది. వారంతా కోరుతున్నది ఇక భౌగోళిక విభజనే! అయితే అది ఎలా ఉంటుంది అనేదే అందరిలో ఉన్న ఆసక్తి.

కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినప్పటి నుంచి తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలు చేసిన ప్రకటనలు చూస్తే వారికి ఈ ప్రాంత ప్రజల మనోభావాలపై ఎంత చిన్నచూపు ఉన్నదో అర్థమవుతుంది. కేంద్ర హోం మంత్రి తెలంగాణపై తనకు అవగాహన లేదంటూనే అడ్డదిడ్డంగా, అనాలోచితంగా మాట్లాడతారు. వాయలార్ రవికి అయితే ప్రజల ఆకాంక్ష హాస్యం అయిపోయింది. అందుకే ఆయన వేరీజ్ తెలంగాణ అంటారు. ఆజాద్‌ను తెలంగాణ గురించి ఆరా తీస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చెప్పేది ఒక్కటే మాట ఏకాభిప్రాయం. అందుకే ఆజాద్ తనకున్న ఆజాదీతో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను విభజించినంత సులువుగా ఏపీ విభజన సాధ్యం కాదు అంటారు. అయితే  ఆ రాష్ట్రాల విభజన కూడా అంత సులభంగా జరగలేదు అన్న విషయం పాపం ఆయనకు తెలియదు కాబోలు. ఎందుకంటే ఆ పని చేసింది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ కాదు కమలనాథుల నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. మనీష్ తివారీ సంయమనం పాటించాలి అంటారు. మరో అధికార ప్రతినిధి ప్రజల మనోభావాలు మాకు తెలుసు అంటారు. నిజానికి కాంగ్రెస్ పెద్దలు తెలంగాణపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెబుతున్నారు కానీ అభ్యంతరాలు ఏమిటో చెప్పడం లేదు. అవి కూడా ప్రజల అభిప్రాయాలా లేక ప్రజాప్రతినిధులవా లేక పెట్టుబడిదారులవా అన్నది స్పష్టం చేయడం లేదు. ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నామంటున్న హస్తిన పెద్దలు అది ఎన్నటికి పూర్తవుతుందో వారికే తెలియదు. తెలంగాణపై అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న హస్తిన పెద్దలను అర్థం చేసుకునేది రాష్ట్ర కాంగ్రెస్ నేతలే. వారి అవగాహనా రాహిత్యాన్ని అర్థం చేసుకోవాలని, వాటికి అపార్థాలు తీయవద్దని వాళ్ల బాధ్యతారాహిత్య వ్యాఖ్యల భారాన్ని వీళ్లు మోస్తారు.

 2004 నుంచి తెలంగాణ అంశం కేంద్రం కోర్టులో  (కాంగ్రెస్ పార్టీ) ఉంది. అంటే ఎనిమిదిన్నర సంవత్సరాలుగా వీళ్లు ఈ అంశం ఏం సాధించారో తెలియదు. కానీ కనీసం వాళ్ల పార్టీలోనే అది కూడా రాష్ట్రస్థాయిలో ఏకాభిప్రాయం సాధించలేకపోయారు. ఇక భాగస్వామ్య పక్షాల్లో ఎలా అది సాధ్యమవుతుందో వాళ్లకే తెలియాలి. ప్రణబ్ కమిటీకి దాదాపు నలభై పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తమ అభిప్రాయాలు పంపాయి. అప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ లిఖితపూర్వకంగా తమ అభిప్రాయం తెలియజేయకున్నా పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై బిల్లుపెట్టంటి మేము మద్దతు ఇస్తామని ప్రకటించింది. అయినా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కదలిక ఉండదు. కాలయాపన కోసం కమిటీలు వేస్తూ.. అవి ఇచ్చిన నివేదికలపై నిర్ణయం చెప్పకుండా నిశ్చింతగా ఉండడం హస్తిన పెద్దలకు అలవాటైపోయింది. అందుకే ఆజాద్ రెండున్నర సంవత్సరాలుగా తెలంగాణపై సంప్రదిపులు కొనసాగుతున్నాయి అంటున్నారు కానీ సాధించింది ఏమిటో చెప్పడం లేదు.

ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. తెలంగాణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. అసెంబ్లీ తెలంగాణపై తీర్మానం పెట్టంటి అని బీరాలు పలికిన బాబు రాష్ట్రంలో ఎన్నో అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారు. కానీ తెలంగాణపై మాత్రం గోడమీద పిల్లిలా వ్యవహరిస్తారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదన్నప్పుడు అసెంబ్లీలోతెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్‌ఎస్ పట్టుబట్టినప్పుడు ప్రధానప్రతిపక్ష బాధ్యతను బాబు విస్మరించారు. అందుకే ఆయన మనసులోని అంశాన్ని మాటల్లో ఎన్ని రకాలుగా చెప్పినా ప్రజలు విశ్వసించడం లేదు. బాబుకు ఊడిగం చేస్తున్న ఈ ప్రాంత టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పెద్దలు చెబుత్నున ఏకాభిప్రాయం ఎన్నటికీ సాధ్యం కాదు. కానీ  తెలంగాణ ప్రజల సహనం నశిస్తే మాత్రం సులువు కాదన్న అంశం సులభం అవుతుంది అన్నది సుస్పష్టం. అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా వ్యవహరించడం కట్టిపెట్టాలి. సమస్యను సాగదీయకుండా పరిష్కరించాలి. రాష్ట్ర విభజన సులువు కాదు అనుకుంటే అవుననో కాదనో ఏదో ఒకటి చెప్పాలి. అప్పుడు బాధితులకు పోరుబాటే మార్గమైతే...త బాధ్యతలు విస్మరించిన వారికి అది మరణశాసనం అవుతుంది.
-రాజు

Labels: ,

Thursday 4 October 2012

ప్రజలు, ప్రసారమాధ్యమాలు, ప్రజాప్రతినిధులు



ఈ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది అని సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల కన్వీనర్ మంత్రి శైలజనాథ్ ఉవాచ. కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసిన సందర్భంలో అక్కడ ఏం జరుగుతున్నదోనని అంతా గగ్గోలు పెట్టారు. దీంతో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి శైలజనాథ్ ఢిల్లీ వెళ్లి సీమాంధ్ర ఎంపీలను కలిశారు. మీడియాలో వచ్చినంత హడావుడి ఇక్కడ ఏమీ లేదని తిరిగి ప్రయాణం అయ్యారు. అయినా సమైక్యాంధ్ర అంటున్న ప్రజాప్రతినిధుల్లోనే సంక్లిష్టత కనిపిస్తున్నది. రాయలసీమ పరిరక్షణ పేరుతో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలంగాణను ఆపే శక్తి ఎవ్వరికీ లేదు, ఒకవేళ రాష్ట్రం విడిపోతే రాయలసీమ పరిస్థితి ఏమిటి అని యాత్ర చేపట్టారు. తెలంగాణ కంటే ముందు ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాల్సిందేనని అందుకోసం ప్రజలను మేల్కొల్పేందుకు ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఇంతలో టీజీ వెంకటేశ్ ఉలిక్కిపాటుకు గురైనట్టు కనిపిస్తున్నది. మొన్నటికి మొన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఒక సమావేశం పెట్టుకుని మరీ డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు టీజీ నేతృత్వంలో రాయలసీమ ప్రజాప్రతినిధులు హస్తినలో అధిష్ఠానం పెద్దలను కలిసి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు. సమైక్య రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతమే అధికంగా నష్టపోయిందని తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందో లేదో కానీ రాయలసీమ నేతల్లోనే ఐక్యత లేదన్న ఇప్పుడు సుస్పష్టం. నలుగురిలో నారాయణలాగా వీళ్లు అప్పుడప్పుడు సమైక్యాంధ్ర అంటున్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాయలసీమ కూడా ఇవ్వాలంటున్నారు. మరి అదే రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం మెజారిటీ ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారు అంటున్నారు.

తెలంగాణ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా ఎవరికి వారు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. విభేదాలు ఎన్ని ఉన్నా అందరి అభిప్రాయం మాత్రం తెలంగాణ రాష్ట్రమే. కానీ సీమాంధ్రలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అంటున్న వారే ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. కిరణ్‌కుమార్ మహబూబ్‌నగర్‌లో ఒక మాట, కృష్ణా జిల్లాలో ఒక మాట, జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట ఇలా ప్రాంతానికో పాట పాడుతున్నాడు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించలేము అంటూనే ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనపై కొత్త రాజకీయాన్ని మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన అనివార్యం అనేది సీమాంధ్ర నేతల ఆందోళన చూస్తుంటే అర్థమవుతున్నది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో వేదికలు ఏవైనా అందరి గమ్యం ఒక్కటే. కానీ సీమాంధ్రలో అప్పుడే కోస్తాంధ్ర, రాయలసీమ అనే రెండు విభజనలు వచ్చాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్టానికి ముఖ్యమంత్రి అయినా రేపు విభజన తర్వాత ఆయన రాజకీయం చేయాల్సింది సీమాంధ్రలోనే. అందుకే కాబోలు తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రాంతంలోని సామాన్య ప్రజానీకం పసిగట్టింది. కానీ మింగలేక కక్కలేక ముఖ్యమంత్రి మాటలను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సీమాంధ్ర మీడియా కూడా జేఏసీ, టీఆర్‌ఎస్ పార్టీ మధ్య విభేదాలను భూతద్దంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పెద్దల మాటలను ఉటంకిస్తూ అవి తెలంగాణకు అనుకూలంగా లేవనే చర్చలు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు సీమాంధ్ర నేతలు ప్రాంతాల వారీగా చేస్తున్న ప్రయత్నాలను మాత్రం విశ్లేషించడం లేదు. తెలంగాణపై సానుకూలత లేదంటూనే ఈ అంశం లేని చర్చ లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే మార్చ్ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలను పట్టుకుని పెద్దవిగా చూపే ప్రయత్నం చేసింది. తీరా దాన్ని జేఏసీ నాయకత్వం దాన్ని ఖండించడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మళ్లీ కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే చర్చల సారాంశం ఏమిటి? అవి అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి? ప్రశ్నిస్తున్నాయి. సీమాంధ్ర మీడియా ఇక్కడ ఇంకో విషయాన్ని మరిచిపోతున్నది. పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ విశాఖ కేంద్రంగా తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటి అన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దాని అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉన్నదని చెప్పారు. బొత్స కూడా ఢిల్లీకి వెళ్లివచ్చిన తర్వాతనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కానీ లగడపాటి వంటి  వాళ్లు తెలంగాణపై చేస్తున్న వ్యాఖ్యలకే ప్రాధాన్యం ఇస్తున్న సీమాంధ్ర మీడియా పార్టీ బాధ్యునిగా బొత్స చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న నలుగురైదుగురు పెట్టుబడిదారుల మాటలే వారికి ప్రాధాన్యం అయిపోయాయి. అసంబద్ధమైన విషయాలపై చర్చలు పెడుతూ ప్రజలను ఎందుకు పరేషాన్ చేస్తున్నారో ఆలోచించాలి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ అలసత్వం కనబడుతున్నది. విద్యుత్ కోతలపై సర్కార్ మీనమేషాలు లెక్కిస్తున్నది. పంటలు ఎండిపోతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినా ఇవేవీ మీడియాకు పెద్ద సమస్యలుగా కనిపించడం లేదు. కిరణ్ సర్కారు నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదు.  అందుకే రాష్ట్ర విభజనపై నిర్ణయం ఎప్పుడు వస్తుందో తెలియదని అందరూ అంటున్నారు. కానీ నీరో చక్రవర్తిలా నిద్రపోతున్న సర్కారును మాత్రం నిద్రలేపాల్సిన బాధ్యత మీడియాపై ఉన్నది.
-రాజు

Labels:

Tuesday 2 October 2012

సంక్లిష్టం అంటే సాగదీతే!

‘సాగరహారం’ తెలంగాణ ప్రజల సంకల్పాన్ని చాటింది. మార్చ్ ద్వారా ప్రజల మనోభావాలు ఏమిటో చెప్పినా.. హస్తిన పెద్దలకు ఇంకా అర్థం కావడం లేదు. సహనమే సంస్కృతి అని పెద్దలు అన్నారు. దాన్ని తెలంగాణ ఉద్యమం దశాబ్ద కాలంగా ఆచరిస్తూ వస్తున్నది.  ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన కాలంలో ఏవో కొన్ని చిన్న చిన్న ఘటనలు మినహా అహింసాయుతంగానే ప్రజలను తమ ఆకాంక్షను వెల్లడిస్తున్నారు. అయితే ఒకవైపు సంయమనం పాటించాలంటున్న ఢిల్లీ పెద్దలే సహనం కోల్పోతున్నారు. ప్రజలను రెచ్చగొడుతున్నారు. సమస్య ఏనుగు లాగా కళ్లముందు కనబడుతున్నా సంక్లిష్టమైనదని, సున్నితమైనదని సమాధానాలు చెబుతున్నారు. కాలపరీక్షకు నిలబడిన తెలంగాణ ప్రజలు ఇంకా ఎంత కాలం నిరీక్షించాలో కూడా స్పష్టమైన జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్రంలో అన్ని పార్టీలు (ఒక్క సీపీఎం మినహా) తెలంగాణకు తాము వ్యతిరేకం కాదన్నప్పుడు ఇంకా ఏకాభిప్రాయం మాట ఎందుకు వస్తున్నది? రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం ఇంకా ఈ సమస్యను సాగదీస్తారు? నిజంగానే తెలంగాణ ఏర్పాటు వల్ల ఏవైనా సమస్యలు తలెత్తుతాయి అనుకుంటే అవి ఏమిటో ప్రజలకు వివరించాలి. అంతేగానీ తెగేదాకా లాగుతాం అనడం ప్రజాస్వామిక లక్షణం కానే కాదు.

 తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు చెప్పిన కేంద్ర హోం మంత్రి... రాష్ట్ర విభజనపై ఒక ముందడుగు లేదనడం దేనికి సంకేతం? అంటే శాంతి అనే పదం ప్రజలకే కానీ పాలకులకు వర్తించదా? ప్రజలు సంయమనంగా ఉండాలంటున్న హస్తిన పెద్దలు సీమాంధ్ర పెట్టుబడిదారులకు అదే విషయాన్ని ఎందుకు సూచించడం లేదు? ఏఐసీసీ పెద్దలే చెబుతున్నారు శ్రీకృష్ణ కమిటీతో ఒనగూరిన ప్రయోజనం సున్నా అని. మరి ఇంకా లగడపాటి, టీజీ వెంకటేశ్, కావూరి, లాంటి వాళ్లే కాదు టీడీపీ సీమాంధ్ర నేతలు కూడా శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా చెప్పిందని ఎందుకు సీమాంధ్ర ప్రజానీకాన్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఎస్సార్సీ అంటే మందుపాతర పేల్చినట్టే అంటున్న ఏఐసీసీ పెద్దల మాటలు లగడపాటికి అర్థం కావడం లేదా? నిజానికి తెలంగాణపై ఏకాభిప్రాయం లేదంటున్న వాళ్లు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. తెలంగాణపై పార్లమెంటులో బిల్లుపెడితే మద్దతు ఇస్తామని ఇప్పటికే మెజారిటీ పార్టీలు బహిరంగంగానే వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ  ఈ విషయంపై తన వైఖరి వెల్లడిస్తే పార్లమెంటులో తెలంగాణకు అనుకూలంగా ఎంత మెజారిటీ ఉన్నదో తేలిపోతుంది. కానీ రెండో ఎస్సార్సీని దేశంలో ఏ పార్టీ కూడా ఆహ్వానించడం లేదు. ఇప్పుడు తెలంగాణపై కాంగ్రెస్ పెద్దలు చెబుతున్న అభ్యంతరాలన్నీ 2001లో నాటి సీఎల్పీ లీడర్ వైఎస్ 41 మంది తెలంగాణ ఎమ్మెల్యేల సంతకాలతో లేఖ పంపినప్పుడే చెప్పాల్సింది. టీఆర్‌ఎస్‌తో 2004లో పొత్తు పెట్టుకున్నప్పుడే చెప్పాల్సింది. ప్రణబ్ కమిటీ వేసే ముందే సమీక్షించుకోవాల్సింది. కామన్ మినిమిమమ్ ప్రోగ్రాంలో చేర్చేముందు చర్చించాల్సింది. వైఎస్ హయాంలో రోశయ్య కమిటీ, ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ, మొన్న ఆజాద్ కమిటీ ఇలా కమిటీలతో కాలయాపన చేసేకంటే ఈ విషయంపై కన్‌క్లూజన్ ఏమిటో ఆలోచిస్తే బాగుండేది. ఇరు ప్రాంతాల ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యేవి. కానీ ఇవేవీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. తమ పార్టీ ప్రయోజనాలే తప్ప ప్రజల గురించి ఏనాడూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడే పార్టీ కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నది. ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉంటుంది. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే అది అసాధ్యమేమీ కాదు. కానీ అవకాశవాదమే తమ అజెండా అని పార్టీలు భావించినంత కాలం దేశంలో ఏ సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా రావణకాష్టంగా రగులుతూనే ఉంటాయి. గాంధీ వారసులైన కాంగ్రెస్ నేతలకు  నీతులు చెప్పడమే కానీ ఆచరించడం రాదు. అందుకే ఇవ్వాళ ఆ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో తన ఉనికి కోల్పోయిందో చూస్తే అర్థమవుతుంది. యూపీఏ నుంచి తృణమూల్ వైదొలిగిన తర్వాత తుమ్మితే ఊడిపోయే మన్మోహన్ సర్కార్‌ను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతూ.. ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నది. అది తెలంగాణ అంశమైనా కావొచ్చు. లేదా మరేదైనా కావొచ్చు.

అలాగే తెలంగాణ ప్రజలకు ఇది పరీక్షా సమయం. ఇవ్వాళ తెలంగాణ కోరుతున్న సంఘాలు, పార్టీల్లో విభేదాలు ఉండవచ్చు. కానీ లక్ష్య సాధన కోసం అందరూ ఏదో ఒక సందర్భంలో ఏకతాటిపైకి వస్తూనే ఉన్నారు. విభజించి పాలించే విధానాన్ని అవలంబించే వారు ఈ ఐక్యతను దెబ్బతీయాలనే కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఇవ్వాళ గుంపులో గోవింద లాగా తెలంగాణ ప్రాంత నేతలు లేఖలతో, మీటింగ్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. అంతేకానీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వారికంటూ ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోలేకపోతున్నారు. కావూరి లాంటి వాళ్లు అంటే టీ కాంగ్రెస్ నేతలు ఒంటికాలిపై లేచారు. కానీ పదవులు లేకుండా వీళ్లు ఒక్క క్షణం కూడా ఉండలేరు అన్నది ఇప్పటికి చాలాసార్లు రుజువైంది. నిజమే రాజీనామాలే అన్ని సమస్యలకు పరిష్కారం కాకపోవచ్చు. రాజకీయంగా వాళ్లు నిర్వర్తించాల్సిన బాధ్యత విస్మరించారనే కదా ఇవ్వాళ ప్రజలంతా రోడ్డెక్కాల్సి వస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నది. వాళ్లు పదవులు వదులుకున్నా.. ప్రజలతో కలిసి ఉద్యమంలో పాలుపంచుకున్నా ఇప్పుడే జరగాలి. అలాకాకుండా తీరా ఎన్నికలు దగ్గరికి వచ్చాక మళ్లీ తెలం‘గానం’ వినిపిస్తామంటే అందుకు తెలంగాణ ప్రజానీకం అంగీకరించే స్థితిలో లేదు. ఇందుకు తెలంగాణ టీడీపీ కూడా మినహాయింపు ఏమీ కాదు. ఆశయ సాధన కోసం కలిసి నడవాలి అనుకుంటే జేఏసీ, టీఆర్‌ఎస్ విభేదించేవాళ్లు మరో వేదికను ఏర్పాటు చేసుకుని ఉద్యమం చేయవచ్చు. అయితే పార్టీల గొడుగు కింద ఉండే ఆ పని చేస్తామంటే ప్రయోజనం ఉండదు. ప్రజలు చూపుతున్న ఐక్యత ప్రజాప్రతినిధులు చూపెట్టగలిగితే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంపై వినిపిసుత్న్న విభిన్న వాదనలు పోయి ఏకాభిప్రాయం దానంతట అదే వస్తుంది. అందరి ఆశయం నెరవేరుతుంది.
-రాజు

Labels: ,

Monday 1 October 2012

సాగరహారం చెప్పిన సత్యం



తెలంగాణ పేరుతో తెలుగుజాతిని నాశనం చేశారన్న లగడపాటి అయినా తెలుగు ప్రజల సంక్షేమమే తమ పార్టీ లక్ష్యం బాబు అయినా వారి ఆవేదన అంతా మాటల్లోనే! నిజానికి ఇవ్వాళ ఈ రాష్ట్రంలో ఈ అనిశ్చితి ఇంకా కొనసాగుతున్నదంటే కాంగ్రెస్ పార్టీ కారణమో టీడీపీ కూడా అంతే కారణం. ఈ రెండు ఇప్పటికీ తెలంగాణకు తాము వ్యతిరేకం కాదంటాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చెప్పే ఏకాభిప్రాయం అనే మాట పరోక్షంగా టీడీపీలో కూడా లేదు. ఇవ్వాళ రాష్ట్ర విభజన జరగాలంటే ఈ రెండు పార్టీ తెలంగాణపై డొంక తిరుగుడు విధానాలు విడనాడాలి. బాబు మళ్లీ లేఖ రాస్తాడు అని ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చిన టీ టీడీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? బాబు లేఖ కొత్తసీసాలో పాత సారాయి అన్న చందంగా ఉన్నది. అన్ని అంశాల్లో స్పష్టత ఇచ్చిన బాబు తెలంగాణ విషయంలో మాత్రం తన అంతరాత్మ ప్రకారమే నడుచకున్నట్టు కనిపిస్తుంది. తెలంగాణపై వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అంటారు. అక్కడే తమ అభిప్రాయం చెబుతాము అంటే.. అందులో అర్థమేమైనా ఉన్నదా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలో ఏకాభిప్రాయం వచ్చేదాకా అఖిలపక్ష సమావేశం ఉండదు అంటే.. అప్పుడు పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఏకాభిప్రాయం ప్రజల్లో కాదు.. పార్టీల్లోనే... అందులో టీడీపీ కూడా ఉన్నది. అందుకే బాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో తెలంగాణపై మేం ప్రణబ్ కమిటీకీ లేఖ రాసినదానికి కట్టుబడి ఉన్నామని, దాని ఆధారంగానే కేంద్రం చర్యలు చేపట్టాలని కోరేవారు. కానీ అలా చేయలేదు. విషయాన్ని పక్కదోవ పట్టించేలా వితండవాదాలు చేశారు బాబు. చరిత్ర అంతా అందులో పొందుపరిచారు తప్ప వర్తమానాన్ని వదిలేశారు. అందుకే బాబును తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదు. విశ్వసించరు కూడా.
 ఇక లగడపాటి ఎంతసేపు తనకు తెలిసిందే చెబుతాడు తప్ప ఇతరు చెప్పేదాంట్లో వాస్తవాన్ని గ్రహించడు. అసెంబ్లీలో తీర్మానం పెడితే తెలంగాణ అంశం తేలిపోతుంది అంటాడు. మరి ఆ పని చేయమని మొన్న వర్షాకాల సమావేశాల్లో టీఆర్‌ఎస్ నిలదీస్తే కిరణ్ చెప్పిన సమాధానం ఏమిటో లగడపాటి గుర్తించుకోవాలి. కేంద్రం చెబుతున్న పార్టీల వైఖరి కూడా బట్టబయలు అవుతుంది. అలాగే లగడపాటి రాజగోపాల్ మరోమాటను మార్చిమార్చి చెబుతాడు. చిన్నరాష్ట్రాల విషయంలో రెండో ఎస్సార్సీయే కాంగ్రెస్ పార్టీ విధానం అంటాడు. ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన అధిష్ఠాన పెద్దలు తెలంగాణకు రెండో ఎస్సార్సీ వర్తించదు అని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అయినా లగడపాటి తన పిడివాదాన్నే పట్టుకుని వేలాడుతాడు. ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు ప్రధాన ప్రతిపక్షం మొదలు వామపక్షాలు కూడా రెండో ఎస్సార్సీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని లగడపాటి గుర్తించుకోవాలి. అసలు లగడపాటి ఏ హోదాలో కాంగ్రెస్ విధానం ఇది ప్రకటిస్తాడో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. మెజారిటీ ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారు అంటాడు. తది తప్పని చాలాసార్లు రుజువైంది కూడా. అయితే దానికి భావోద్వేగం, కమిట్‌మెంట్ ఓట్లు అని కొత్తసూత్రాలు ఆయనే చెబుతాడు. ఈ మధ్యనే ఎన్డీటీవీ సర్వేలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నదో కళ్లకట్టినట్టు చెప్పింది. అయినా వచ్చే సార్వత్రిక  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నలభై పార్లమెంటు స్థానాలు ఖాయమని ఈ ఆంధ్రా ఆక్టోపస్ తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు. అందుకే లగడపాటి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఓ జోకర్‌లా మారాడు. ప్రజల్లో సమైక్య భావన లేదని ఎవరూ అనడం లేదు. అయితే లగడపాటి చెబుతున్న మాత్రం లేదు. ప్రజల్లో ఇప్పటికే మానసిక విభజన వచ్చింది. స్వయంగా పీసీసీ అధ్యక్షుడే తెలుగు వారు రెండు రాష్ట్రాల్లో ఉంటే తప్పేమిటిని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా సున్నితమైన అంశమైన తెలంగాణపై ఆచితూచి స్పందిస్తే, కానీ లగడపాటి మాత్రం పార్టీలో ఏ హోదా లేకున్నా కేవలం పార్లమెంటు సభ్యునిగా అపరిమిత అధికారాలు ఉన్న నేతగా ఆయనకు ఆయనే భ్రమపడుతూ అడ్డదిడ్డంగా మాట్లాడుతాడు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతాడు. అందుకే ఆయన వల్ల తెలంగాణలో ఆపార్టీ సంగతి ఏమో కానీ సీమాంధ్రలో కూడా తీవ్ర నష్టం జరుగుతున్నది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

‘సాగరహారం’ ప్రజాప్రతినిధులకు, పార్టీలకు ఒక గొప్ప సందేశాన్ని పంపింది. జేఏసీ ఇచ్చిన పిలుపుతో పార్టీలకు అతీతంగా ప్రజలు ఉవ్వెత్తున కదిలివచ్చారు. పార్టీలకు ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. కానీ తెలంగాణపై స్పష్టత లేకుండా పైపై మాటలకే పరిమితం అవుతామంటే కుదరదని మార్చ్ నిరూపించింది. నిర్బంధాలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ప్రజలు తమ ఆకాంక్షను చాటారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా జేఏసీ తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించింది. ప్రజల సహనం ముందు ప్రభుత్వ కుయుక్తులు పనిచేయలేదు. అందుకే సహనంగా ఉండాలిని చెప్పే కాంగ్రెస్ పెద్దలు ప్రజల సహనం బద్దలవకముందే తమ సాచివేత విధానాన్ని వీడాలి. ఏకాభిప్రాయం అనే మాటతో ఇంకా ఎంతో కాలం ప్రజలను మోసం చేయలేరు. ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు విశ్వాసం కలిగేలా తెలంగాణపై తేల్చాలి. తెలంగాణ ప్రజల అయిదున్నర దశాబ్దాల ఆకాంక్ష సాకారానికి ఆచరణలో కార్యాచరణను రూపొందించాలి. అప్పుడే ఇరు ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుంది.
-రాజు

Labels: ,