Saturday 27 July 2013

కొత్త రాగల కుట్ర

తెలంగాణ ప్రజల ఆకాంక్ష హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణ మాత్రమే! ఇప్పుడు మీడియాలో వస్తున్నలీకులు  అంటు మొక్క రాయల తెలంగాణ ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. దీన్ని తెలంగాణ ప్రజలే కాదు, రాయలసీమ ప్రజలు కూడా అంగీకరించరు. ఇప్పటివరకు రాష్ట్రంలో సమైక్య, తెలంగాణ వాదనలే ఉన్నాయి. ఆ మధ్య రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా ఈ రెండు అంశాల పైనే కిరణ్, బొత్స, రాజనర్సింహను రోడ్ మ్యాప్ అడిగారు. తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్ర ప్రజాప్రతినిధుల కంటే ప్రసార మాధ్యమాలే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. బులిటెన్ ఒక వాదాన్ని తెరమీదికి తెస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాయల తెలంగాణకే మొగ్గు చూపిస్తున్నట్లయితే దీన్ని ఇరు ప్రాంతాల ప్రజలు ఒప్పుకోరు కాబట్టి దీని సాకుతో ఇప్పటి వరకు ఆ పార్టీ చెబుతున్న నిర్ణయాన్ని చెప్పకుండా విభజన అంశాన్నికొన్ని రోజులు (కాంగ్రెస్ పార్టీ దృష్టిలో కొన్ని ఏళ్ళు) కోర్ కమిటీలో చర్చిస్తూ సాగదీస్తుంది.

Labels: , , ,

Saturday 13 July 2013

సమా‘వేషాలు’


దిగ్విజయ్ సింగ్ తెలంగాణపై అన్ని పార్టీలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపామన్నారు. ఇక సంప్రదింపులు ఉండవు అన్నారు. ఇక నిర్ణయమే మిగిలింది అన్నారు. అది తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఆ నిర్ణయం తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఒక విధానం ఉండాలి. అలాగే తెలంగాణపై ఇప్పటి వరకు ఏ అభిప్రాయం చెప్పని పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత తెలంగాణపై ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని కమిటీలు వేసింది. చర్చలు, సంప్రదింపుల పేరుతో ఏకాభిప్రాయం సాధిస్తామన్నది. తెలంగాణపై దేశవ్యాప్తంగా మెజారిటీ ఎప్పుడో వచ్చింది. కానీ హామీ ఇచ్చిన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం దీనిపై ఎలాంటి నిర్దిష్ట అభిప్రాయం లేకపోవడమే ఇప్పటి విషాదం. తెలంగాణ అంశం తేలాలంటే కాంగ్రెస్ పార్టీ తన వైఖరి వెల్లడించాలి. అది జరగనంత కాలం కమిటీలు, చర్చలు, సంప్రందిపులు, కోర్ కమిటీ సమావేశాలు, సీడబ్లూసీలో చర్చించడాలు, రోడ్ మ్యాప్‌లు మాత్రమే కనిపిస్తాయి. ఆ సమా‘వేషాలు’ సమస్య సాగదీతకే తప్ప, పరిష్కారం కోసం కాదు.

Labels: , , ,

Tuesday 9 July 2013

సత్తిబాబు సమైక్య సన్నాయి



రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకున్నానని చెప్పారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే పీసీసీ అధ్యక్షునిగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆయన ఆ మధ్య ఉండవల్లి అరుణ్‌కుమార్ సమైక్యాంధ్ర సదస్సుకు హాజరయ్యారు. ఆ సదస్సులో ఊసరవెల్లి ఉండవల్లి తెలంగాణ ఉద్యమనాయకత్వంపై విషం చిమ్ముతుంటే ఆ వేదికను పంచుకొని నేను సమైక్యాంధ్ర గురించి మాట్లాడలేదు అన్నారు. అంతేకాదు ఆ సభలో తెలంగాణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, ఉద్యమాన్ని అవహేళన చేస్తున్న వారందరితో కలిసిపోయారు సత్తిబాబు. ఆయన ఆరోజు ఆ సభలో సమైక్యవాదాన్ని వినిపించకపోయినా ఆయన ఆంతర్యం మాత్రం అదేనని అప్పుడే అర్థమైంది. దీనిపై ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఆయనను నిలదీస్తే మీరు సభ పెట్టండి మీ సభకు వస్తాను అని తప్పించుకున్నాడు. అట్లాగే ఆమధ్య రాష్ట్రస్థాయి కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలోనూ తెలంగాణ అమరులకు నివాళులు అర్పించే సమయంలో బొత్స వ్యవహరించిన తీరు ఆయన తెలంగాణ వ్యతిరేకతను చూపెట్టింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర మొత్తానికి ప్రాతినిధ్యం వహించాలి. కానీ రేపు ఎన్నికల్లో వీరిద్దరు పోటీ చేసేది సీమాంధ్ర ప్రాంతంలో. అంతేకాదు సత్తిబాబు కుటుంబం నుంచి ఎన్నికల్లో నిలబడే వారి సంఖ్య కూడా పెద్దగానే ఉంటుంది. అందుకే ఎన్నికల సమయంలో సత్తిబాబు సమైక్య సన్నాయి నొక్కుతున్నారు.  ఒకవైపు తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నామంటూనే వైఎస్‌ఆర్‌సీపీ సీమాంధ్రలో రాజీనామాలకు తెరలేపింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటూనే విభజనకు అంగీకరించమని ‘గంట’లు మోగిస్తారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని బాబు చెప్పుకొస్తాడు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లాంటి వాళ్లు కాగితాల మీద ఇచ్చే రోడ్డు మ్యాప్ ఆధారంగా రాష్ట్రాన్ని విభజిస్తామంటే ఊరుకోము అంటాడు. సాక్షాత్తూ రాష్ట్ర పీసీసీ అధ్యక్షునికే తెలంగాణ వ్యతిరేకత ఉంటే, ఇక మిగతా నేతలను ఆయన ఎలా కట్టడి చేస్తాడు? మా పార్టీ క్రమశిక్షణకు పెట్టింది పేరు అనే చంద్రబాబు మాత్రం తెలంగాణ విషయంలో ఆ షరతు వర్తించదు అంటాడు. సీమాంధ్ర బాబు చిత్రాలు ఈ నాలుగేళ్లలో ఈ ప్రాంత ప్రజలు చాలానే చూశారు. అందుకే ఇక తెలంగాణపై ఎన్ని నాటకాలు వేసినా ప్రయోజనం ఉండదు.

Labels: , , , ,

Saturday 6 July 2013

పార్టీల నిర్ణయమే ప్రామాణికం

తెలంగాణపై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, డెప్యూటీ ముఖ్య మంత్రులను రోడ్‌ మ్యాప్‌లతో రమన్నాడు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌. ఆయన చెప్పిన ప్రకారం కాంగ్రెస్‌ అధిష్టానం ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, రెండోది సమైక్యాంధ్రాను కొనసాగిం చడం. ఈ రెండు వాదనల్లో ఏదో ఒక అంశాన్ని ఎన్నుకొని వారి అభిప్రా యాలు ఆ పార్టీ రాష్ట్ర పెద్దలకు చెప్పుకునే అవకాశం కార్య కర్త మొదలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఉన్న ది. వీరందరి అభిప్రాయాలను పరిగణలోకి హస్తినకు వెళ్తారు. అయితే రాష్ట్ర విభజనపై మాట్లాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే ఎన్నోమార్లు వివిధ కమిటీల ముందు, కాంగ్రెస్‌ అధిష్టాన పెద్దల ముందు వినిపించారు. మొన్న దిగ్విజయ్‌ వచ్చినప్పుడు కూడ ఇరుప్రాంతాల నుంచి తమ తమ అభిప్రాయాలతో కూడిన నివేదికలు ఇచ్చారు. అలాగే అందరి అభిప్రాయాలు అధిష్టాన పెద్దలకు విన్నవించి, రాష్ట్ర విభజనపై అన్ని ప్రాంతాల మనోభా వాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అందరికి ఆమోదయో గ్యమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్యం తీసుకుంటుందని ఇప్పుడు విభజనపై మడత మాటలు మాట్లాడుతున్న నేతలంతా ఇంతకాలం చెప్పుకొచ్చినవే. ఈ రాష్ట్ర ఎప్పటికీ సమైక్యంగానే ఉంటుంది. ఎప్పు డు ఎన్నికలు వచ్చినా సమైక్యవాదానికి 270 స్థానాలు ఖాయమన్న లగడపాటి రాజగోపాల్‌ దాన్ని పక్కనపెట్టాడు. తనకున్న సమాచారం మేరకు మూడు నెలల్లో తెలంగాణపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం కోరుతారని, అప్పుడు ఆ తీర్మానం వీరిపో యేలా చేయాలన్నారు. ఆ తీర్మానం వీరిపోతుందా లేక పాస్‌ అవుతుందా అనేది ఆంధ్రా ఆక్టోపస్‌కు అర్థం కావడం లేదు. అందుకే అప్పుడు ఆ తీర్మానం వీరిపోవాడానికి నలభైపైచిలుకు ఉన్న సీమాంధ్ర టీడీపీ నేతలు సమైక్యవాదంపై గళం విప్పాలం టున్నాడు. తెలుగుతల్లి ముక్కలు కాకుండా ఉండాలంటే వాళ్లు వేసే ఓటుపైనే ఆధారపడి ఉంటుందని తెగ ఆందోళనపడుతున్నాడు. ఇప్పుడు లగడపాటి రాజగోపాల్‌ సీమాంధ్ర కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలకు అధికార ప్రతినిధి అయిపోయాడు. అయా పార్టీల నేతలంతా తెలంగాణను వ్యతిరేకించాలంటున్నాడు. ఇంతకాలం రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితిలో జరగదన్న అగడపాటి ఇప్పుడు మా త్రం ఏం జరుగుతుందో చెప్పలేము అంటున్నాడు. దానిపై ఆయ నకు క్లారిటీ రావాలంటే అసెంబ్లీ తీర్మానం తర్వాత వస్తుందేమో! ఇక్కడే అగడపాటి రాజగోపాల్‌ ఒక విషయాన్ని మరిచిపోతున్నాడు. రాష్ట్ర విభజనపై వ్యక్తిగత అభిప్రా యాలు ఏవైన పార్టీల అభిప్రా యాలే అంతిమం అన్న ప్రాథమిక విషయాన్ని ఆయన మరిచిప తున్నాడు. అసెంబ్లీలో తీర్మానం పెడితే తెలంగాణకు తాము వ్యతిరే కం కాదు అన్న పార్టీల బలబలా లు చూస్తే ఆ బిల్లు సునాయసంగా పాస్‌ అవుతుంది. లేదు ఆ మాట అన్నది తమ రాజకీయ లబ్ధి కోసమే అంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఇప్పుడు పక్క పార్టీల విషయాన్ని పక్కనపెడితే మీ ముఖ్య మంత్రి, పీసీసీ, డెప్యూటీ సీఎం రోడ్‌ మ్యాప్‌ల ఆధారంగా కాంగ్రెస్‌ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అసెంబ్లీలో అమలు చేయాల్సిన బాధ్యత సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపై ఉంటుంది. తమ అభిప్రాయాన్ని తెలియజేసి మిగతా పార్టీల అభిప్రాయాన్ని కోరవలసి ఉంటుంది. అంతేగానీ బడిత ఉన్న వాడిదే బర్రె అన్నట్టు సీమాంధ్ర ప్రాంతంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉంది కాబట్టి పార్టీ నిర్ణయంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తామంటే తీర్మానం వీగిపోతుందేమో కానీ రాష్ట్ర విభజన మాత్రం ఆగదు. మెజరిటీ ప్రాంత ప్రతినిధులు తమకున్న బలంతో మైనరిటీ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకుంటామంటే కుదరదు. ఇలాంటి పరిస్థితి ఉంటుం దనే రాజ్యాంగ నిర్మాతలు కొత్త రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్రం చేతిలో పెట్టారు. అందుకే మీ రాష్ట్ర వ్యవహారల పర్యవేక్ష కుడు దిగ్విజయ్‌ సింగ్‌ కూడా అసెంబ్లీ తీర్మానానికి కట్టుబడి ఉండా ల్సిన పనిలేదు అన్నారు. రాష్ట్రాన్ని విడదీస్తే రాజీనామాలు చేస్తాం. అగ్నిగుండం అవుతుంది అనే మాటలతో కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసే రాజకీయాలకు కాలం చెల్లింది. తెలంగాణ కోసం ఆ మధ్య కొంతమంది ఎంపీలు పార్టీకి డెడ్‌లైన్లు పెడితే, అధిష్టానానికి డెడ్‌లైన్లు పెట్టే సాహసం ఎవరూ చేయకూడదని ముఖ్యమంత్రి అన్న మాటలు రాజీనామాలు చేస్తాం అంటున్నవారు గుర్తించుకుంటే మంచిది. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు కూడా తెలంగా ణపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నాయి. కాంగ్రెస్‌ హస్తిన పెద్దలు మొదలు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి దాకా కేంద్రం దీనిపై చర్చలు జరుపుతున్నదని త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆ నిర్ణయానికి అనేక గడువులు పెట్టి మాట మార్చారు కూడా. ఇప్పుడు ఆ సమయం కూడా దాటిపోయింది. అందుకే డిగ్గీరాజా ఒక డెడ్‌లైన్లు ఉందవు నిర్ణయమే ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఈ మాట నిజమో కాదో అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయుల్లా కలిసుందామని ఆంధ్రప్రదేశ్‌ లోని బుద్ధిజీవులంతా కోరుకుంటున్నారు. అయితే నిర్ణయం రాకము ందే ఒక ప్రాంత ప్రజలు ఆకాంక్షపై ఒక వర్గం మీడియా, కొంత మంది వ్యక్తులు విషం చిమ్మడం సరికాదు. అలాగే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేవరకూ కాంగ్రెస్‌ను నమ్మేస్థితిలో ప్రజలు లేరు. కాంగ్రెస్‌ పార్టీ అన్నమాట ప్రకారం పార్లమెంట్‌లో బిల్లు పెడితేనే ఆ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారు. తెలంగాణ ప్రజల నాలుగు దశాబ్దాల కల సాకారమవుతుందనుకున్న ప్రతి తరుణంలో ఒక వర్గం మీడియా అడ్డుకోజూడటం ఇక్కడి ప్రజల్లో పెను ప్రభావమే చూపుతుంది. తెలంగాణపై పార్టీల నిర్ణయమే ప్రామాణికం. ఆయా పార్టీలు ఇక్కడ మన గలగాలంటే ఇప్పుడు అవి తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

Labels: , , , , ,

Monday 1 July 2013

ముందే కూస్తున్న కోయిలలు



ఈ మధ్య ఓ చానల్ తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం అంతర్గం ఏమిటో ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. మినట్ టూ మినట్ అప్‌డేట్ అంటూ రకరకాల కథనాలు ప్రసారం చేసింది. విభజన ఖాయం అని తేల్చేసింది. ఇక నిర్ణయమే మిగిలింది అన్నట్టు సాగింది ఆ చానల్ హడావుడి. దీనిపై చర్చలు కూడా చేసింది. పైకి చూస్తే ఇదంతా ప్రజాహితం కోసం ఆ చానల్ తెగ ఆరాటపడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ అసలు కథ అది కాదు. తెలంగాణపై నిర్ణయం రాకుండా మళ్లీ సీమాంధ్రలో అగ్గిరాజేయడానికి చేసిన ప్రయత్నం అది. అందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై మూడు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిందని చెప్పుకొచ్చింది. ఒకటి పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమని, రాయల తెలంగాణ అని, ప్యాకేజీ అని రకరకాలుగా విశ్లేషణలు మొదలుపెట్టింది. తెలంగాణపై షిండే నేతృత్వంలో జరిగిన అఖిలపక్షంలో ఒకటి రెండు పార్టీలు మినహా అన్ని పార్టీలు తెలంగాణకు జై కొట్టాయి. దీంతో ఇంత కాలం ఏకాభిప్రాయం అనే మాట మాట్లాడిన కాంగ్రెస్‌కు అఖిలపక్ష సమావేశం తర్వాత ఇక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఆంధ్రా లాబీయింగ్ ఆజాద్ రూపంలో తెలంగాణ అంశాన్ని మళ్లీ మొదటికి తెచ్చింది. కాంగ్రెస్ ఊతపదాలు మరిన్ని చర్చలు, విస్తృత సంప్రదింపులు, ఏకాభిప్రాయం వంటివి వచ్చాయి. షిండే పెట్టిన గడువుకు ఆజాద్ తాత్కాలికంగా గండికొట్టాడు. ఆ తర్వాత కాంగ్రెస్ నెలలు గడిచినా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చకుంటే ప్రజలు తిరగబడతారని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇక  లోక్‌సభ ఎన్నికలు కూడా నవంబర్‌లో జరగవచ్చు అనే వాదనలూ వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్న, యూపీఏ 1, 2 ప్రభుత్వాల ఏర్పాటులో కీలక రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని భావిస్తూ ఉండవచ్చు. అందుకే తెలంగాణపై ఇప్పటికే ఎన్నో మాటలు, ఎన్నో గడువులు పెట్టింది. తెలంగాణ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు అనేది సత్యం. అందుకే ఇక తెలంగాణపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. కేంద్రంలో కదలిక రాగానే ఆంధ్రా చానళ్ల, నేతల్లో ఆందోళన మొదలవుతుంది. హస్తిన పెద్దలు ఏ నిర్ణయం చెప్పకుండానే ఇక్కడ మాత్రం హడావుడి ప్రారంభమవుతుంది. ఇదే ప్రజాహితమని, మెరుగైన సమాజం కోసం ప్రజలను మభ్యపెడుతుంటాయి. నిజానికి రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఇరు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. కేంద్రం కూడా ఈ అంశంపై తేల్చాల్సిన సమయమూ ఆసన్నమైంది. అది ఏమిటో ఇంత వరకు అటు కాంగ్రెస్ పెద్దలు కానీ, ఇటు రాష్ట్ర పెద్దలు కానీ పెదవి విప్పడం లేదు. మరికొన్ని కోయిలలు ముందే ఎందుకు కూస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి.

అట్లాగే కావూరి సాంబశివరావు తెలంగాణపై మాటమార్చారని ప్రసారం చేస్తున్నాయి. కావూరి తెలంగాణ అనుకూల వ్యాఖ్యలేమీ చేయలేదు. ఇప్పుడు సమైక్యవాద నినాదం వినిపిస్తున్న నేతల మాటనే ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా అంతిమంగా కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలన్నారు. ఒకవేళ హస్తిన పెద్దలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజీ పడక తప్పదు అన్నారు. దీన్ని భూతద్దంలో చూపెడుతూ.... కావూరిని తెలంగాణకు అనుకూల వ్యక్తిగా, సమైక్యాంధ్రకు వ్యతిరేకిగా చిత్రిస్తున్నాయి. ఒక వర్గం కొమ్ము కాస్తున్న మీడియా చిత్తశుద్ధి ఉంటే 2009 డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు జైకొట్టి, డిసెంబర్ 10న మాట మార్చిన చంద్రబాబును నిలదీయాల్సి ఉండే. అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని చెబుతూనే...  సీమాంధ్ర కాంగ్రెస్ నేత చేస్తున్న వితండవాదాన్ని తప్పుపట్టాల్సి ఉండే. కానీ ఇవేవీ చేయకుండా వాళ్ల కంటే ఒక అడుగు ముందుకేసి ఒక వర్గం మీడియా ప్రజల్లో లేని అపోహలను, విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదు.

Labels: , , , ,