Thursday 31 January 2013

లేఖల లగడపాటి

కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదు అని నిన్న పీసీ చాకో ప్రకటించారు. దీనిపై చరిత్ర తెలుసుకో అని లగడపాటి రాజగోపాల్ ఒంటికాలిమీద లేచి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి చాకో కు లేఖ రాయడం హాస్యాస్పదం. రాజగోపాల్ మీలాగా పార్టీ వేదికల మీద పార్టీ అధికార ప్రతినిధులు వాళ్ళ సొంత అభిప్రాయం చెప్పరు. అయినా నిన్ననే ఈ నేల ఎన్నటికి విడిపోదు, ఉండలేని వాళ్ళు దిక్కున్న చోటికి పొండి అహంకారంగా మాట్లాడిన నువ్వు చాకో మాటలకే ఎందుకు ఉలిక్కి పడుతున్నావ్? రాజగోపాల్ రంకెలు వేసినంత మాత్రాన రాష్ట్ర విభజన ఆగదు. కాంగ్రెస్ ఎన్నడు తెలంగాణ ఇస్తామని చెప్పలేదని నీతో మొదలు మీ సీమాంధ్ర నేతలు చెబుతున్న అసత్యాలకు సమాధానం మీ యూపీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి ఎన్సీపీ అధినేత తెలంగాణ పై చేసిన ప్రకటన చదవండి. తెలంగాణ పై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రధాని కోరానని మీడియా ముందు వెల్లడించాడు. పార్టీ అభిప్రాయం చెప్పిన చాకో మీద చిందులు వేయడం కాదు రాజగోపాల్ చేతనైతే మీ అధినేత్రి తో చెప్పించండి తెలంగాణకు కాంగ్రెస్ వ్యతిరేకం అని. అంతే గాని తెలంగాణకు సానుకూలంగా స్పందించిన అందరికి లేఖలు రాసుకుంటూ పొతే ..నువ్వు అలిసిపోవడమే తప్ప ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోలేవు.

Labels: , ,

Wednesday 30 January 2013

రాజీ'నామాల డ్రామాలు





తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరగాల్సి ఉన్నది దీనికి కాలపరిమితి లేదని ఆజాద్ షిండే ల ప్రకటనల్లో స్పష్టత, సంతృప్తి మొన్న జానారెడ్డికి కనిపించాయి. కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకం కాదన్న ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాటలు మధు యాష్కీకి రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా కనిపించాయి. అఖిలపక్ష సమావేశం తరువాత తెలంగాణపై కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ లోనే యుద్ధం జరుగుతున్నది. సమస్యను పరిష్కరించాల్సిన పార్టీలోనే ఈ అంశంపై సిగపట్లు మొదలయ్యాయి. దీనికి ఆజ్యం పోసింది ఆజాద్. అక్కడ (సీమాంధ్రలో) ఉద్యమం లేదని వయలార్, ఆజాద్ లు సీమాంధ్ర నేతలతో అన్నట్టు ఆ ప్రాంత నేతలే మీడియా ముందు చెప్పారు. అందుకే కేవీపీ ఆ ప్రాంత నేతలను ఒక్క తాటిపైకి తెచ్చి కేంద్రంపై ఒత్తిడి చేసి షిండే పెట్టిన గడువులోగా తెలంగాణ పై నిర్ణయం రాకుండా అడ్డుకున్నారని తెలంగాణ  కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ జనవరి 28న తెలంగాణపై  ఆజాద్ మాటల మంటలు, షిండే మరింత సమయం ప్రకటన ఈ ప్రాంత ప్రజల్లో ఆగ్రహానికి కారణం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్నకోపం నిరసన రూపంలో సమరదీక్ష సభలో నేతల మాటల్లో వ్యక్తమయ్యింది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పై అవలంబిస్తున్న సాచివేతకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ, నెహ్రు కుటుంబాల కు విధేయులు గా ఒక్కటై ఉద్యమ నాయకత్వంపై ఒంటి కాలుమీద లేస్తున్నారు. రాజమండ్రి సభ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో ఈ ప్రాంత నేతలు భాగస్వాములు అయ్యారు. అసలు విషయాన్ని పక్కనపెట్టి గాంధీ, నెహ్రు కుటుంబాలపై వచ్చిన విమర్శల సాకు తో ఉద్యమాన్ని, ఉద్యమ నాయకత్వాన్ని నిర్మూలించే కిరణ్ కుట్రలకు ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు బాసటగా నిలుస్తున్నారు. ఇంతకాలం తెలంగాణ కు ఎవరు అడ్డుపడుతున్న వాళ్ళ గురించి ఈ ప్రాంత ప్రజలకు చెప్పి, ఇప్పడు వాళ్ళతోనే చేతులు కలిపి ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే టీఅర్ఎస్ విలీన అంశాన్ని తెరమీదికి తెస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణ  ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు, టీఅర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తే రేపే తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తాము అన్నట్టు మధు యాష్కీ, వీహెచ్ లు బీరాలు పలుకుతున్నారు. ఒక పత్రిక కూడా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ మరింత మసాలా జోడించి ఓ కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ ఇస్తే తమ పార్టీని బేషరతుగా విలీనం చేస్తాము అని టీఅర్ఎస్ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది. కెసిఅర్ తో హస్తినలో కాంగ్రెస్ పెద్దలు ఈ ప్రతిపాదన చేశారని, అందుకు తము అంగీకరించినట్టు కూడా కరీంనగర్ లో చెప్పారు. అయినా స్పందించని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీదికి ఎందుకు తెస్తున్నది? విభజించు పాలించు సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. అందుకే  తెలంగాణ ఉద్యమం, ఉద్యమ నాయకత్వంపై రాజమండ్రి సభ నుంచి మొదలైన కాంగ్రెస్ మార్కు  విష ప్రచారానికి కొనసాగింపుగానే ప్రస్తుత పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణ పై  కారణాలతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సమరదీక్ష సభను సాకును చూపి ఈ ప్రాంత ఆ పార్టీ నాయకుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేసి, కొంత వరకు సఫలమయ్యింది. అందుకే ఆజాద్ వ్యాఖ్యల ఆగ్రహం కొంత మంది ఎంపీలను రాజీనామాల వైపు నడిపిస్తే, చాకో మాటల సాకు మధు యాష్కీని అధిష్టానం తో 'రాజీ' చేయిస్తున్నది. చూశారా మన ప్రాంత కాంగ్రెస్ నేతల సంతృప్తి నాటకం వాళ్ళ అధిష్టానానికి ఊరట.. మన బిడ్డల ఊపిరి ఆగిపోవడానికి కారణం అవుతున్నాయి. తెలంగాణ  కోసం ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు
రాజీనామాలు చేయకపోయినా  పరవాలేదు కానీ మీ 'రాజీ' నామాల డ్రామాలు ఆపితే మంచిది.      

Labels: , , ,

Tuesday 29 January 2013

ఆడలేక మద్దెలు ఓడు



ముఖ్యమంత్రి గారు టి అర్ ఎస్ పార్టీని ఉప ప్రాంతీయ పార్టీ అన్నారు. 2009లో మీకు వచ్చింది పది సీట్లే అని ఎద్దేవా చేశారు. నిజమే. మరి 2004లో మీరు రాష్ట్రంలో ఏ జాతీయ పార్టీతో కలిసి పోటీ  చేశారు? 2009 డిసెంబర్ తరువాత ఈ ప్రాంతంలోజరిగిన ఉప ఎన్నికల్లో  ఈ పార్టీ (అదే జాతీయ పార్టీ) ఎన్ని సీట్లు గెలిచింది? అంతెందుకు జగన్ మీ పార్టీని వీడిన తరువాత మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మీ పార్టీ ఏమి చేసిందో గుర్తు లేదా? ఇప్పటికే మీ పార్టీలోని సీమాంధ్ర  ప్రాంతానికి చెందిన ఐదుగురు శాసనసభ్యులు రాజీనామా చేశారు. వాటిని ఆమోదిస్తే మీ సామర్థ్యం, మీ మంత్రుల సామర్థ్యం ఏమిటో తెలుస్తుంది. రెండు దశాబ్దాల కిందటే ఈ దేశంలో సంకీర్ణ యుగం ప్రారంభమైంది.నాటినుంచి ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో అధికారం చెలాయించే మీకు ప్రాణవాయువు అందిస్తున్నాయి.  నెహ్రు కుటుంబ త్యాగాలను కొనియాడిన మీకు ఒక ప్రాంత ప్రజల ఆకాంక్ష కోసం వెయ్యి మంది ప్రాణ త్యాగాలు చేశారు. వాటిని గుర్తించడానికి నిరాకరిస్తున్నది మీ జాతీయ పార్టీ. వ్యక్తుల ప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రస్టు పట్టించిన చరిత్ర మీ పార్టీకి ఉన్నది. సమస్య పరిష్కారానికి సమయం కోరడం తప్పా? ప్రశ్నిస్తున్నారు. తప్పులేదు కానీ సంప్రదింపుల పేరుతో సాగదీయడమే తప్పు. అధికారం ఉంది కదా అని ప్రజల ప్రజాస్వామిక హక్కులను  కాలరాయడం తప్పు. తమరు ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణ  ఉద్యమకారులపై దమనకాండను ప్రయోగించినా, టియర్ గ్యాస్ ప్రయోగించి ప్రాణాలు తీసినా.. ఈ ప్రాంత ప్రజల పక్షాన కాకుండా.. పార్టీ విధేయులు గానే ఉన్నారు మీ (మా) మంత్రులు. తెలంగాణ పై సీమాంధ్ర లోని గల్లీ  నేతల నుంచి ఢిల్లీ లోని మీ పెద్దల వరకు అడ్డదిడ్డంగా మాట్లాడినా అడ్డుకోలేని అసహాయులు ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు.అయినా ఎక్కడా సహనం కోల్పోలేదు ఈ ప్రాంత ప్రజానీకం. కానీ తెలంగాణ ను అడ్డుకోవడానికి మీతో మొదలు, మీ పీసీసీ అధ్యక్షులు, సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కరేమిటి అంత ఏకతాటిపైకి వచ్చినా... ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా  ఎన్నడూ మా పక్షాన నిలబడలేదు. దాని ప్రశ్నిస్తున్నది మా ప్రజానీకం. తెలంగాణ  ఇచ్చేది, తెచ్చేది మేమే అన్నా ఈ ప్రాంత ప్రజలు నమ్మలేదు. కానీ ఉండవల్లి లాంటి వాళ్ళు సంఖ్యా బలాన్ని చూపి సవాల్ చేసిన సందర్భంలో అయిన స్పందిస్తారు అనుకున్నాం.  ఆ పని చేయలేదు. ఎంతటి త్యాగాలకైనా సిద్ధమన్న వీళ్ళు ప్రాణం పోయిన పదవీ త్యాగం చేయము అని మొన్న జానారెడ్డి మాటలతో.. నిన్న మీడియా సమావేశంలో, నేడు ముఖ్యమంత్రి మద్దతు తో ఉద్యమ నాయకత్వంపై విమర్శలు చేయించడం తో పూర్తిగా అర్థం అయ్యింది. పాపం ఇది తెలియక మధు యాష్కీ  లాంటి వాళ్ళు ఇంకా వీళ్ళు వాళ్ళతో కలిసి వస్తారని ఆశిస్తున్నారు.
ఇక ఉండవల్లి వైఎస్ చెప్పిన పాట పాటనే ఇప్పుడు పాడుతున్నాడు. తెలంగాణ రావాలనే దేశం మొత్తం ఒప్పుకోవాలట. దేశం మొత్తం అనేదానికి కాంగ్రెస్ పార్టీలో ఏమి పర్యాయ పదం ఉన్నదో తెల్వదు కానీ  ఉండవల్లి దేశంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలలో ఇప్పటికే ముప్పై పైచిలుకు పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు రాశాయి. మరో జాతీయ పార్టీ పార్లమెంటులోనే స్పష్టంగా మద్దతు ప్రకటించిది. మీరు మొన్న రాజమండ్రి సభలో పేర్కొన్న విధంగానే 2001 నుంచి ఈ అంశంపై క్లారిటి  లేనిది ఒక్క కాంగ్రెస్ పార్టీకే. నాటి  కేంద్ర హోం మంత్రి  తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ను పరిశీలించాలని మీ పార్టీ అధినేత్రి లేఖ రాసి దశాబ్దం దాటినా మీ సంప్రదింపులు, చర్చలు పూర్తీ కాలేదు. అవి ఎప్పటికి పూర్తవుతాయో కాలపరిమితి లేదని ఆజాద్ చెప్పే ఉన్నాడు.ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు .. మీ పార్టీలో ఇన్ని అవలక్షణాలు పెట్టుకుని, రాష్ట్ర విభజనపై  పక్కవాణ్ణి విమర్శిస్తే పరిష్కారం దొరుకుతుందా?

Labels: , ,

Saturday 26 January 2013

బానిస నేతల బాధ్యతారాహిత్యం



సమరదీక్షకు కిరణ్ సర్కార్ అనుమతి ఇవ్వదట. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందట. సమైక్య రాష్ట్రంలో మా బతుకులకు భద్రత లేదు బాబు..మేము విడిపోతాం అంటే లేదు మా కింద బానిసల్లా బతకాలి అంటారు బలుపెక్కిన వేషంతో రాజమండ్రి వేదిక నుంచి. అఖిలపక్ష సమావేశానికి ఆంధ్రా ప్రాంత ప్రతినిధిగా వెళ్లి అక్కడ సమైక్య రాగం వినిపించాను చెప్పాడు గుంటూరు గాదె. హస్తినలో తెలంగాణ పై అధిష్టానం ఏ  నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను అని ప్రకటించాడు. తీరా ఆంధ్రలో అడుగుపెట్టగానే అబద్ధాలు మొదలుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ విభజనకు అంగీకరించే ప్రసక్తే లేదు అంటాడు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నా తెలుగు వారంతా కలిసే ఉండాలని ఆంధ్రా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు. విజయవాడలో విభిన్న వేషాలు వేస్తూ.. అర్థనగ్న ప్రదర్శనలు ఇస్తూ ఇదే సమైక్యవాదం అంటాడు ఆంధ్రా ఆక్టోపస్. వీళ్ళ నటనను చూస్తూ నవ్వుకుంటుంటే...నన్ను మరిచిపోతారా? అంటూ సత్తిబాబు సమైక్య సుత్తి పట్టుకుని బయలుదేరాడు. రాజమండ్రి సభలో తెలంగాణ పై రంగులు మార్చే ఊసరవెల్లి కంటే మిన్న ఉండవల్లి అబద్ధాలు ఆలకించడానికి అతిథి అయ్యాడు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మీరు ఆ సభకు వెల్లడమేంటి అంటే నా ప్రజాస్వామ్య హక్కు అంటాడు. మొన్న రాష్ట్ర రాజధానిలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనే సత్తిబాబు సంకుచిత బుద్ధి బయటపడ్డది. తెలంగాణ అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అంటే సత్తిబాబు అక్కసు, అలసత్వం, ఆక్రోశం అన్ని కనిపించాయి. అప్పుడే ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలకు అర్థం కావాల్సింది సమైక్య సత్తిబాబు సీమాంధ్ర బాబు అని. తెలంగాణ వాదులను తిట్టడమే సమైక్యవాదం అంటూ సభలు పెట్టుకోవడానికి అడ్డురాని శాంతిభద్రతలు...తెలంగాణ సభలకు, నిరసనలకు వర్తిస్తాయి. ఇంత నిస్సిగ్గుగా మూడేళ్ళుగా తెలంగాణ ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్న వలసపాలకుల విధానాలకు ఈ ప్రాంత బానిస నేతలు వంత పాడడమే ఇప్పటి విషాదం. మన సభలకు, సమావేశాలకు, సమరదీక్షలకు పర్మిషన్ ఇప్పించలేని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు స్వ రాష్ట్ర సాధన కోసం ఏ  త్యాగానికైనా సిద్ధం అంటారు.  తెలంగాణ ప్రకటనను అడ్డుకోవడాని హస్తినలో ఆంధ్రా లాబీయింగ్ చూపిన ఐక్యత తరువాత.. ఆజాద్ అసంబద్ధ ప్రేలాపనల తరువాత, రాజమండ్రి సభ తరువాత...కూడా  మన (సారి.. సీమాంధ్ర నేతల తాబేదార్లు) ప్రాంత కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలుగదు. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ సంఖ్యా బలాన్ని చూసి కాకుండా ...ఈ ప్రాంత నేతల బలహీనతలు చూసి, బలుపెక్కిన ఆంధ్రా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. మన నేతలు మేల్కోనంత కాలం మన ఆకాంక్షను అణచివేయడానికి అన్ని శక్తులు కూడగడతాడు. అర్థ సత్యాలు, అబద్ధాలు, అంకెల గారడీ చేస్తూనే ఉంటాడు. అదే అభివృద్ధి అంటాడు. అందుకే  స్వరాష్ట్ర కల సాకారం కావాలంటే... ఆంధ్రా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం ఒక్కటే కాదు.. ఈ ప్రాంత బాధ్యతారాహిత్య నేతలను బజార్లో నిలబెట్టాల్సిన సమయము, సందర్భం ఆసన్నమైంది.


     

Labels: , ,

Friday 25 January 2013

బడిత ఉన్నవాడిదే బర్రె



మాకు (ఆంధ్రా ) సంఖ్యా బలం ఉంది కాబట్టి మేము శాశిస్తాము.... మీరు (తెలంగాణ) మా కింద పడి ఉండాలి అన్నట్టు సాగింది ఉండవల్లి రాజమండ్రి ప్రసంగం. బలవంతునిదే రాజ్యం అన్నటు ఉన్నది మీ వ్యవహారం. అందుకే బ్రిటిష్ పాలనలో మగ్గిన మీరు ఇంకా వాళ్ళ విధానాలనే అవలంబిస్తున్నారు. అందుకే మీ నల్లారి వారు ఉద్యమకారులపై నల్ల చట్టాలు ప్రయోగించాడు. మీ లగడపాటి, టీజీ వెంకటేష్ లు డయ్యర్ ల మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని రజాకార్ల తో పోల్చాడు ఉండవెల్లి. మేము ఎంత శాంతికాముకులమో ఈ పండేళ్ళ ఉద్యమం చూసి దేశంలోని ప్రజాస్వామికవాదులు ప్రశంసించారు. నీ లాంటి వాళ్ళ నుంచి కండక్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీప్రాంతంలో మొన్న లక్షిం పేటలో దళితులపై మీ పీసీసీ అధ్యక్షుని సామాజిక వర్గం చేసిన పాశవిక దాడిలో మరణించి గాయపడిన వాళ్ళ గురించి అప్పుడే మరిచిపోయావా? తెలంగాణ కోసం అమరులైన వారి గురించి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న ఉండవల్లి 369 మందిని కాల్చి చంపించింది మీ బ్రమ్హానంద రెడ్డి కాదా? ఉస్మానియా యూనివర్సిటీ ని మూసివేయాలి అన్న లగడపాటి ఎక్కడి వాడు? తెలంగాణ ఉద్యోగాలు దోపిడీకి గురయ్యాయి అని మీ ఎన్టీ అర్ వేసిన కమిషన్ తేల్చింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి 610 జీవోను తెచ్చింది ఆయనే. ఆ జీవో వచ్చి మొన్నటికి 27 ఏళ్ళు పూర్తీ అయినా ఎందుకు అమలు కాలేదు? దీనిపై ఎప్పుడైనా మాట్లాడవా ఊసరవెల్లి. అంతెందుకు రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లోని 234 మండలాలను కరువు ప్రాంత మండలాలుగా ప్రకటించింది. కరువు మండలాల ప్రకటనలోను తెలంగాణపై సీమాంధ్ర సర్కారు వివక్ష చూపింది. తెలంగాణలోని రెండు జిల్లాల్లో పాలమూరులో ఐదు మండలాలు, నల్లగొండలో 11 మండలాలు కలిపి 16 మండలాల్లో మాత్రమే కరువుందని తేల్చింది. 218 మండలాల్లో సీమాంధ్రలో కరువుందని, అందులో ముఖ్యమంత్రి జిల్లా చిత్తూరులో, రెవెన్యూమంత్రి రఘువీరాడ్డి జిల్లా అనంతపురంలో ఎక్కువ కరువుందని సీమాంధ్ర సర్కారు తేల్చింది.ఈ వివక్షపై మాట్లాడలేదు ఆంధ్రా అరుణ్ కుమార్. పెట్టుబడి పెట్టి , పంట చేతికి వచ్చే సమయంలో కరెంటు లేక తెలంగాణ ప్రాంత రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోతుంటే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమరు మాత్రం సర్కార్ తీరును తప్పుపట్టలేదు. కానీ మీ ప్రాంతంలో పంట వేయకుండానే క్రాప్ హాలిడే ప్రకటిస్తే అదేదో జాతీయ విపత్తు అన్నటు తెగ హడావుడి చేసి ఒక కమిటీ వేసి, యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారం చెల్లించారు ఇది కాదా వివక్ష? హక్కు లేకున్నా నిబంధనలను కాలరాసి మొన్నటికి మొన్న డెల్టాకు ప్రాంతానికి నీళ్ళు తరలించుకు పోయారు. ఆర్‌డీఎస్ రాజోలిబండ, తూములు కర్నూలు రైతులు బైరెడ్డి నాయకత్వాన షట్టర్లు పగలగొట్టి నీటిని పాలమూరు వైపునకు రాకుండా సుంకేశులకు మళ్ళించుకోలేదా?అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు అభివృద్ధి పై కాకి లెక్కలు చెప్పి అదే అభివృద్ధి అంటే నమ్మేవాళ్ళు ఎవరు? తమకు సంఖ్యా బలం ఉంది కాబట్టి మేము ఏమి చేసిన చెల్లు బాటు అవుతుంది అనే అహంకారం ఉండవల్లి రాజమండ్రిలో ఆవేశంగా ప్రసంగించారు. అసత్యాలతో అభివృద్ధిపై పూటకో మాట మాట్లాడుతున్నది మీరు. మీరు చెబుతున్న అభివృద్ధి సబబే అయితే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీలు ఇస్తే తమకు సమ్మతమే అని మీరు ఎందుకు చెబుతున్నారు. అంటే తెలంగాణ ప్రాంతం వెనుకబడింది మీ మాటలే తేటతెల్లం చేస్తున్నాయి. అలాగే 2014 ఎన్నికల వరకే తెలంగాణ వాదం ఉంటుంది అన్న ఉండవల్లి.. మూడేళ్ళ కిందట రాజీనామాల డ్రామాలు ఆడి తెలంగాణ ప్రక్రియను అడ్డుకున్న మీ పెట్టుబడి సమైక్య ఉద్యమం ఏమైందో ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. క్రమశిక్షణ అనే పదం కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ముఖ్యంగా ఆంధ్రా నేతలకు అది వర్తించదు. అందుకే తమ పార్టీలోని ఒక ప్రాంత ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి సభ పెట్టుకుని దానికి జై ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకున్న దుర్బుద్ధి మీది. తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలి అని కమ్యూనిస్టుల గురించి గొప్పలు చెప్పిన ఉండవెల్లీ ... మీలాంటి ఊసరవెల్లి ఆంధ్రా పాలకుల ఆధిపత్య అహంకారం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు కలిసి ఉండాలి అన్న కమ్యూనిస్ట్ పార్టీల్లోనూ రాష్ట్ర విభజనపై మార్పు వచ్చింది . అధికారం కోసం టిడిపి, బిజెపి లు రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెడుతున్నాయని చెప్పిన సత్తిబాబూ ..... మూడేళ్ళుగా తెలంగాణపై తమరు ఎన్ని మాటలు మాట్లాడారో ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు పీసీసీ అధ్యక్షుడిని అని మరిచిపోయి ఒక ప్రాంత ప్రతినిధిగా రాజమండ్రి సభకు హాజరు అయినప్పుడే పక్కోడికి నీతులు చెప్పే అర్హత కోల్పోయావు. వాళ్ళు పిలిచారు వెళ్ళాను మీరు సభ పెట్టి పిలవండి మీ సభకు వస్తాను అంటున్న సత్తి బాబుకు నీతి, నియమాలు లేకపోవచ్చు.. మాకు మాత్రం ఉన్నాయి. రాజమండ్రిలో రాజకీయ ఉసరవెల్లుల ప్రసంగాలు బడిత ఉన్నవాడిదే బర్రె అన్నటు సాగాయి. అది జై ఆంధ్రప్రదేశ్ సభ కాదు.. ఆధిపత్య అహంకారులు ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షపై అక్కసు వెళ్ళగక్కిన సభ.

Labels: , , , ,

ఉండవల్లి ఏందీ నీ లొల్లి



అధికార దాహంతోనే చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చాడు అంటాడు మంత్రి శైలజానాథ్. మరి వీళ్ళ వాదనే కరెక్ట్ అనుకుంటే తెలంగాణను సీమాంధ్ర లోని 170 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు అని ఊసరవెల్లి ఉండవెల్లి ఎలా చెబుతారు? అంతే కాదు 175 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఉంటే  రాష్ట్ర విభజన తీర్మానం ఎలా సాధ్యం అవుతుంది అన్నారు ఉండవల్లి గారు. నిజమే. మరి 119 మంది తెలంగాణ  ఎమ్మెల్యేలు లేకుండా ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారో చెబితే బాగుండేది. తెలంగాణ ప్రాంత ప్రతినిధులు లేకుండా అది ఆంధ్రప్రదేశ్ ఎట్లా అవుతుంది? జై ఆంధ్రప్రదేశ్! జై జై ఆంధ్రప్రదేశ్!! అని అంటివి. ఎంతమంది ఉన్నారు మీ స్టేజిమీద తెలంగాణ ప్రాంత నేతలు? మొదట జై ఆంధ్ర ఉద్యమం ఏమైంది అని పత్రికల్లో ప్రచారం చేసి, తరువాత జై ఆంధ్రప్రదేశ్ సభగా దాన్ని మార్చి...ఒక ప్రాంత ప్రజాప్రతినిధులు లేకుండా సభ పెట్టుకొన్న ఉండవెల్లి తెలంగాణ ఉద్యమ నాయకత్వం పై విషం చిమ్మడమే సమైక్యాంధ్ర ఉద్యమం అంటాడు. మనిషి అన్న వాడు మాట మీద నిలబడాలి. అది ఆంధ్రా  నాయకుల అలవాటే లేదు. అందుకే తెలంగాణ పై కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే ఏ  నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామన్న నేతలు ఒక్కరైనా ఉన్నారా రాజమండ్రి సభా వేదికపై ఉన్నవాళ్ళలో? రాష్ట్ర విభజన అధికారికంగా జరగక ముందే మీకు మీరే విభజన రేఖ గీశారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ అనువాదకుడిగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. రాజమండ్రి సభతో ఆయన అబద్ధాల కోరు అని, అహంకారి అని కూడా అర్థమయ్యింది. ఎందుకంటే తెలంగాణ ప్రస్తుతం  కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో లో లేదు అని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామో లేదో వచ్చే  మ్యానిఫెస్టోలో పెడతామని టీజీ వెంకటేష్ అంటాడు. మరి అరుణ్ కుమార్ ఏమో కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రసంగాన్ని అనువాదకుడిగా తెలంగాణ మా  మ్యానిఫెస్టోలో ఉందని, ఈ అంశం తమకు అత్యంత ప్రధాన్యమైనదని తెలుగులో తర్జుమా చేసి వినిపించాడు.  ఇప్పుడు చెప్పు ఉండవల్లి మిమ్మల్ని అబద్ధాల కోరు అనకుండా.. ఏమనాలో? అదొక్కటేనా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి? అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని ఎందుకు అడగలేదని సోనియా గాంధీ హిందీ ప్రశ్నకు తెలుగు అనువాదం చేసింది మీరే కదా!అప్పుడు గుర్తుకు రాలేదా  సమైక్యవాదం? ఇంతకాలం అంధకారంలో ఉన్న ఈ అనువాదకుడు ఇప్పుడే మేల్కొని సమైక్య సందేశం ఇవ్వడానికి రాజమండ్రి నుంచి కొత్త సారి.. సారి.. చెత్త రాగాలు మొదలుపెట్టాడు. పోలవరం వాళ్ళ గిరిజనులు నష్టపోతారు. అభివృద్ధి కావాలంటే కష్టాలు తప్పవు అనేది ఉండవల్లి గారి ఉద్భోద. గిరిజనం అంటే పట్టని మీకు సమైక్యత కోరుకునే హక్కు ఉందా?  తెలంగాణపై అరుణ్ కుమార్ అక్కసు... ఆజాద్ అసంబద్ధ వ్యాఖ్యలు అన్ని కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలం తోనే జరుగుతున్నాయి. అందుకే సత్తిబాబు రాష్ట్ర పీసీ సీ అధ్యక్షుడిని అని మరిచిపోయి రాజమండ్రిలో సమైక్య సన్నాయి లు నొక్కాడు. ఉండవెల్లి మంచికో చెడుకో రాజమండ్రి సభ ద్వారా తెలంగాణ  ప్రజలకు ఒక సత్యాన్ని చెప్పాడు. సభ ఆద్యంతం తెలంగాణ ఉద్యమ  నాయకత్వాన్నే టార్గెట్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత నేతలు ఎంత బానిసలో కూడా తెలియజేశారు. అందుకే ఉండవల్లి తెలంగాణ  ఉద్యమ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే తెలంగాణ ఉద్యమం సుదీర్ఘ కాలంగా శాంతియుతంగా  కొనసాగుతున్నది. తమరు ప్రదర్శించిన వీడియో లలో కొత్త విషయాలు  ఏమీ లేకపోయినా దింపుడు కళ్ళెం ఆశ మాత్రం కనిపించింది. ఎన్నిచేసినా సమైక్య ఉద్యమం బలపడం లేదనే ఆవేశం కనపడింది. అందుకే ఉద్యమ నాయకత్వాన్ని విరుచుకుపడితే కొంత గురింపు వస్తుంది అనుకున్నాడు అరుణ్ కుమార్. మద్రాస్ నుంచి ఆంద్ర రాష్ట్రం విడిపోయినప్పుదు తమరు ఎన్ని ఘన కార్యాలు చేసారో చరిత్ర చెబుతున్నది. సామరస్యంగా విడిపోయే రాష్ట్రాన్ని రాజధాని కోసం పొట్టి శ్రీరాములును పొట్టన పెట్టుకున్న చరిత్ర మీది. అందుకే రాష్ట్ర విభజన జరిగితే విద్వంసం సృష్టిస్తామని ఒకరు, మానవబాంబులం అవుతాం, ,మంత్రిగా ఉంది తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఒక ఫోర్స్ ను తాయారు చేస్తానన్న మాటలన్నీ తమ ప్రాంత ప్రతినిధుల నుంచే వచ్చాయి. ఎవరు ఎవర్ని రెచ్చ గొడుతున్నారో అర్థమయ్యిందా అరుణ్ కుమార్!  

Labels: , , , , ,

Thursday 24 January 2013

రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది?



 ప్రభుత్వ విప్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి  మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్నిరాజీనామా చేశారు. త్వరలో ఆయన  వైసీపీలో చేరనున్నారు. ఇప్పటికే బొబ్బిలి ఎమ్మెల్యే సజయ కృష్ణ రంగారావు, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, చింతలపూడి ఎమ్మెల్యే ఎం.రాజేశ్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరణ తరువాత  కిరణ్ సర్కార్ అరకొర మెజారిటీతో కొనసాగుతున్నది. అయితే ఈ ఐదుగురి రాజీనామాలు ఇంత వరకు ఆమోదం పొందలేదు. కానీ కాంగ్రెస్ పార్టీని వీడుతామని...జగన్ కు అండగా ఉంటామని స్పష్టంగా చెప్పినా వీళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ధైర్యం చేయలేని స్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి ఈ ఐదుగురు ఎమ్మెల్యేలే బయట పడ్డారు. కానీ సీమాంధ్రలో చాలామంది ప్రజాప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో  వైసీపీ తరఫున పోటీ చేయడానికి ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. తమ వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడుతున్నారు. దీనికి సమైక్యవాదానికి సంబంధం లేదు.   అందుకే మొన్న రాష్ట్రాన్ని విభజిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది అని సీమంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షక్షుడు వయలార్ రవితో అన్నప్పుడు ఆ విషయం మాకు తెలుసు అన్నారు. ఎన్నికలు పెడతాం అన్నారు.  అంతేకాదు మీ కుమారులను, బంధువులను  వైసీపీలో పంపారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారు. పొతే పొండి అన్నటు వార్తలు వచ్చాయి. ఓట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తారా? రాష్ట్రాన్ని విభజిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది అని ఇంటెలిజెంట్స్ నివేదికలు...అన్నీ అబద్ధాలే! రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జగన్ ఇప్పటికే చాల సార్లు విఫలయత్నం చేశాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ పీ అర్ పీని విలీనం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాత్కాలికంగా కాపాడగలిగింది. ఇక్కడ కిరణ్ సర్కార్ ఘనత గాని.. సమైక్య నేతల సామర్త్యం గాని లేదు. అధికారం కోసం, అవకాశవాద రాజకీయాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కిరణ్ వచ్చాక అవి మరింత ఎక్కువయ్యాయి. అందుకే కిరణ్ సర్కార్ పని తీరు బాగా లేదని ప్రతిపక్షాలే కాదు స్వపక్ష నేతలే పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినా, జరగకపోయినా సీమాంధ్ర లో కాంగ్రెస్ పార్టీని కాపాడే నాయకుడు లేదు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి ఎప్పుడో అర్థమయ్యింది. అందుకే రెండుచోట్ల పార్టీని ఎందుకు దెబ్బ తీసుకోవాలి అనే అభిప్రాయం వాళ్ళలో ఉన్నది. అలాగే అఖిలపక్ష సమావేశంలో వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కన పెడితే తెలంగాణ పై ఒకటి రెండు పార్టీలు మినహా వ్యతిరేకత అంతగా కనిపించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పై తేల్చేయాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకే తెలంగాణకు అనుకూలంగా సంకేతాలు వస్తున్నాయని సీమాంధ్ర నేతలే మీడియా ముందు హడావుడి చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే ఏదో జరిగిపోతుంది అని లేనిపోని అపోహలు వల్లే సృష్టిస్తున్నారు. వీళ్ళ ఒత్తిడి వల్లే ఆజాద్ నెల గడువుపై తన అక్కసును మీడియా ముందు వెళ్ళగక్కాడు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ లోనే కాదు టిడిపి, వైసీపీలోను వ్యక్తిగత భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా, అవుతున్నా.. అవి తాత్కాలికమే. ఈ అంశంపై పార్టీల అభిప్రాయమే ఫైనల్ అని తెలంగాణ వ్యతిరేకులు తెలుసుకోవాలి.

Labels: , , , , ,

ఆజాద్ వ్యాఖ్యలే అంతిమం కాదు



తెలంగాణపై  తాజాగా ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ఆనందాలు (రాష్ట్రంలో నెలకొన్న అస్థిరత తొలిగిపోవాలని కోరుకునే వారికి ఈ పదం వర్తించదు), ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆజాద్ మాటలతో ఇప్పుడే మన మనసులు గాయపడలేదు. ఇప్పటికి ఎన్నోసార్లు ఆయన తెలంగాణ పై అడ్డదిడ్డమైన కామెంట్లు చేశాడు. ఆజాద్ తెలంగాణ కు అనుకూలంగా ఒక్క మాట మాట్లాడలేదు. మాట్లాడాడు కూడా. ఎందుకంటే షిండే గడువు గురించి ఈమధ్య కాలంలో ఆజాద్ చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో వచ్చాయి. అవి చూస్తే ఆజాద్ ఆంతర్యం ఏమిటో? అతను ఎవరి పక్షమో తెలుసుకోవడం కష్టమేమి కాదు. ఆజాద్ ఒక్కడే కాదు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడే మాటల్లో పొంతన ఉండదు. ప్రజలతో, ప్రసారమాధ్యమాల ప్రతినిధులతో వాళ్ళ మాటలతో  మైండ్ గేమ్ ఆడడం చూస్తూనే ఉన్నాం. అన్న హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలు మొన్నటి అమానత్ అత్యాచార ఉదంతం దాకా ప్రజాగ్రహంపై కాంగ్రెస్ పెద్దల వైఖరి చూస్తే..మనకుండే భావోద్వేగాలు వాళ్ళకు ఉండవు. అంతేకాదు సమస్యల పరిష్కారంపై బాధ్యతగా వ్యవహరించిన దాఖలాలు లేవు. కనుక ఆజాద్ వ్యాఖ్యలతోనే తెలంగాణ సమస్య సమసిపోదు, సమైక్య రాష్ట్రం  నిలబడదు. తెలంగాణ పై  షిండే విధించిన గడువు అయినా.. దానిపై కేంద్ర ప్రభుత్వం వెలువరించే నిర్ణయం వాయిదా పడినా అన్ని కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లోనే కొనసాగుతాయి. తెలంగాణ ప్రజల తెగువ, సహనం ప్రపంచ ఉద్యమాల్లో ఎక్కడా కనిపించవు. ఎందుకంటేఆధునిక యుగంలో  ఇంత శాంతియుతంగా, ఇంత సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉద్యమం ఒక్క తెలంగాణ ఉద్యమమే. అందుకే మనం సీమాంధ్ర లోని సామాన్య ప్రజల, ప్రజాస్వామిక వాదుల మన్ననలను పొందగలిగాము. గుప్పెడుమంది పెట్టుబడిదారులు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను తాత్కాలికంగా అడ్డుకున్నా..అదే అంతిమ నిర్ణయం కాదు. అంతేకాదు ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏమిటి అనేదే! ఆ నిర్ణయం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించేది అయితే సంబురం లేకపోతే సమరమే అని మనం అనుకుంటున్నదే కదా. కనుక తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి  కాంగ్రెస్ చెబుతున్న కారణాలు ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో కాలగర్భంలో కలిపివేస్తాయి.   

Labels: , , , ,

Tuesday 22 January 2013

మీ ఆందోళన మా ఆకాంక్షను తీర్చదు



తెలంగాణపై చంద్రబాబు లేఖ రాశాడనో, టీ కాంగ్రెస్ ఎంపీలు ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సమయంలో ఒత్తిడి వల్లనో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మూడేళ్ల కిందట తెలంగాణ ప్రకటన తర్వాత పార్టీలు తీసుకున్న యూటర్న్‌లో ఏమైనా మార్పు వచ్చిందా లేదా అన్నది మొన్నటి సమావేశంలో తేలింది. ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణపై రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కానీ మొన్నటి అఖిలపక్ష సమావేశం గతంలో కంటే భిన్నమైంది. సమైక్యవాదాన్ని బలంగా కాదు కదా నామమాత్రంగానైనా ఏ పార్టీ వినిపించలేదు. (సీపీఎం భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతాన్ని, ఎంఐఎం మూడు ప్రతిపాదనలు, కాంగ్రెస్ రెండు వాదనలు, టీడీపీ గతంలో ఇచ్చిన లేఖను చూపింది) ఫైనల్‌గా అన్ని పార్టీలు ఈ సమస్యను త్వరగా తేల్చాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాయి. దానికి అనుగుణంగానే షిండే కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక గడువు విధించారు. ఆ సమావేశంలో వ్యక్తుల అభిప్రాయాలు ఏవైనా పార్టీల నిర్దిష్ట అభిప్రాయాన్నే ఆయన పరిగణనలోకి తీసుకుని రికార్డు చేసుకున్నారు. షిండే అభిప్రాయమే కాంగ్రెస్ అభిప్రాయం అని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు దిగ్విజయ్‌సింగ్ అయినా వాయలార్ రవి అయినా, ఆజాద్ అయినా అదే చెబుతున్నారు. ఈ విషయాన్ని స్పష్టంగా మొన్న వాయలార్ రవిని, ఆజాద్‌లను కలిసిన సీమాంధ్ర మంత్రులకు చెప్పారు. అయినా ఇంకా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వితండవాదం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు వీళ్లు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముందు తమ అభిప్రాయాన్ని వెల్లడించడం మినహా చేయగలిగింది ఏమీ ఉండదు. అఖిలపక్ష సమావేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ నుంచే రెండు వాదనలు వినిపించాయి. గాదె వెంకటరెడ్డి తాను సమైక్యవాదాన్ని వినిపించాను అని ఇది వరకే ప్రకటించారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని షిండేకు చెప్పామని ఆ పార్టీ పెద్దలే చెబుతున్నారు. అయినా ఇప్పుడు సీమాంధ్ర నేతలు హస్తిన పర్యటనలతో ఆ పార్టీ అభిప్రాయంలో మారుతుందేమో కానీ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వైఖరి మాత్రం మారుతుంది అనుకోవడం వారి భ్రమే అవుతుంది. తెలంగాణ అనుకూలంగా తమకు సంకేతాలు అందుతున్నాయి అంటున్న సీమాంధ్ర నేతలు చెబుతున్న మాటలను తెలంగాణ ప్రజలు అంతా ఈజీగా విశ్వసించలేరు. ఎందుకంటే నరంలేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అన్నట్టు కాంగ్రెస్ నేతలు తమ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనే పేరుతో అడ్డదిడ్డంగా ఏదైనా మాట్లాడగలరు. అందుకే ఒకరోజు తెలంగాణపై సానుకూలంగా మరోరోజు వ్యతిరేకంగా వారి వ్యాఖ్యలు మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికంతటికి కారణం ఇప్పుడు హస్తినలోహడావుడి చేస్తున్న సీమాంధ్ర నేతలే.  అయితే తెలంగాణ ప్రజలు మాత్రం హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ బిల్లు పార్లమెంటు పెట్టి, ఆ బిల్లు పాస్ అయి అది గెజిట్ రూపంలో బయటికి వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. అంతేగానీ ఇప్పుడు సీమాంధ్ర నేతలు పడుతున్న ఆందోళనలు మీడియాకు వార్తలు అవుతాయి తప్ప, తెలంగాణవాదుల ఆకాంక్షను తీర్చేవి కావు.

Labels: , , , , ,

Monday 21 January 2013

ప్రజలకులేని బాధ ప్రసారమాధ్యమాలకు ఎందుకు?



సీమాంధ్ర  మీడియా ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తలకెత్తుకున్నది. అందుకే మెరుగైన సమాజం కోసం, ప్రతిక్షణం ప్రజాహితం వంటి ట్యాగ్ లైన్లను తగిలించుకున్న చానల్లు రాష్ట్ర విభజన బాధ సీమాంధ్ర ప్రజలది కాదు మాది అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ప్రసారమాధ్యమాలు పారదర్శకంగా ఉండాలనే పద్ధతికి తిలోదకాలు ఇచ్చాయి. తెలంగాణ పేరుతో...తెలంగాణ కోసం అన్నట్టు ప్రసారం చేసే కథనాల్లో తెలంగాణ వ్యతిరేక వాదాన్ని వినిపిస్తున్నాయి. వాళ్ళు రాష్ట్ర విభజనపై చేసే ఏ  కార్యక్రమాన్ని చూసినా హైదరాబాద్ చుట్టే తిప్పుతాయి. నదీ  జలాల సమస్య తలెత్తుతాయి అంటాయి. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కనిపించని ఏ  సమస్య తెలంగాణ విషయంలో కనిపిస్తాయి. నదీ జలాల పరిష్కారానికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య రాజ్యాంగం ప్రకారం అమలవుతున్నాయో అవే రేపు తెలంగాణ  ఆంధ్ర రాష్ట్రాల మధ్య అమలవుతాయి. ఈ విషయం సామాన్య ప్రజలకు కూడా తెలుసు. అయినా కొంత మంది సీమాంధ్ర నేతలు. కొన్ని మీడియా చానళ్ళు హైదరాబాద్ మీద తమ ఆశను.. తెలంగాణ ఉద్యమంపై తమ అక్కసును వెల్లగక్కుతున్నాయి. తమ వ్యక్తిగత ప్రయోజనాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి.  ఇది మంచి పధ్ధతి కాదు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావలసిన మీడియా ఇలా బాధ్యతా  రాహిత్యంగా వ్యవహరించడం సరికాదు.

 

Labels: , , ,

Sunday 20 January 2013

రాజీనామాలు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేవు


గుర్నాతారెడ్డి రాజీనామా వ్యవహారంపై వైఎస్అర్ సీపీ స్పందించడం లేదు. సమైక్యవాదం కోసమే తాను రాజీనామా చేశానని ఆయన చెబుతున్నారు. రెండు రోజుల్లో స్పీకర్ ను కలిసి రాజీనామాను ఆమోదించు కుంటాను అంటున్నారు. ఇడుపులపాయ ప్లీనరిలోనే తెలంగాణ పై తమ అభిప్రాయం చెప్పామని అన్న తెలంగాణ వైఎస్అర్ సీపీ నేతలు దీనికి  జవాబు చెప్పాలి. మొన్న రాష్ట్రాన్ని విభజిస్తే విధ్వంసం సృష్టిస్తామని అన్న గుర్నాతారెడ్డివ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం వైఎస్అర్ సీపీ నేతలు ఇది కూడా ఆయన వ్యక్తిగతం అంటే కుదరదు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మొదలు పెట్టిన సమైక్య డ్రామాలో ఇప్పటికే కొంతమంది టిడిపి నేతలు తమ వంతు పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు గుర్నాతారెడ్డి రాజీనామా డ్రామా అందులో భాగమే. డిసెంబర్ ప్రకటన వచ్చి మూడేళ్ళు దాటినా...తెలంగాణ సమస్య పరిష్కారం కాలేదంటే ఈ మూడు పార్టీలే కారణం. వీళ్ళ ముసుగులు మొన్న అఖిల పక్ష సమావేశానికి ముందు, తరువాత మెళ్ళ మెళ్ళగా  తొలిగిపొతున్నయి. సీమాంధ్ర నాయకత్వాల కింద నడిచే పార్టీల అభిప్రాయాలూ ఎన్నడూ తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండవు. అందుకే వాళ్ళ పార్టీల్లోని ఈ ప్రాంత బానిసలను ముందు పెట్టి  వాళ్లు తమ కుట్రలు కొనసాగిస్తారు. అయితే  సీమాంధ్ర రాజీనామాలు చేస్తే వచ్చేది ఎన్నికలే. అంతే తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేవు.

Labels: , , , ,

Friday 18 January 2013

ఆంధ్రా ఆక్టోపస్ పట్ల అప్రమత్తంగా ఉండాలే



ఈ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది అని అంటున్న ఆంధ్ర ఆక్టోపస్ ఎందుకు ఆందోళన పడుతున్నాడో అర్థం కావడం లేదు. కరీంనగర్ ఉప ఎన్నిక సమయంలో రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు రెఫరెండమే అన్నారు. అప్పుడు అభివృద్ధి మంత్రం జపించిన వైఎస్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన విషయం లగడపాటి మరిచిపోయారా? అంతెందుకు సీమాంధ్ర లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో లగడపాటి, టీజీ వెంకటేష్, ఆనం వివేకానంద తదితరులు జగన్ కు ఓటు వేస్తే అది రాష్ట్ర విభజనకు దారి తీస్తుందని పనిగట్టుకుని ప్రచారం చేశారు. అయిన అక్కడి ప్రజలు వీళ్ళ వాదనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అంతే కాదు లగడపాటి చేసే వాదనలో ఇసుమంత వాస్తవం ఉండదు అనడానికి మరో ఉదాహరణ. ఎస్సార్సీ ఆధారంగా ఏర్పడిన రాష్ట్రాన్నిమళ్లీ ఎస్సార్సీ ద్వారానే విభజించాలి అంటున్నాడు. మొదటి ఎస్సార్సీ తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రాన్ని)యథాతదంగా ఉంచాలని సిఫారసు చేసింది. దాన్ని పట్టించుకోకుండా ఆంధ్రా లాబీ కి తలొగ్గి తెలంగాణను ఆంధ్ర రాష్ట్రం తో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది. దీన్ని దాచి పెట్టి ఆంధ్ర ఆక్టోపస్ అవాస్తవాలు చెబుతూ ఆంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నాడు. అందుకే కొంత మంది సీమాంధ్ర విద్యార్థులు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు కొనసాగిస్తామని.. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఆంధ్ర రాష్ట్రము కోసమే తప్ప ఆంధ్రప్రదేశ్ కోసం కాదనే సత్యాన్ని వాళ్ళకు తెలియకుండా చేశారు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు. విజయవాడలో కూర్చుని విద్వేషాలు రెచ్చగొడుతూ.. తానూ ఆందోళన పడుతూ, ఆంధ్రా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న ఆంధ్రా ఆక్టోపస్ పట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేకపొతే రాజధాని పై నాడు రాజకీయం చేసి పొట్టి శ్రీ రాములు పొట్టన పెట్టుకున్నట్టే మిమ్మల్ని బలి చేస్తారు. తస్మాత్ జాగ్రత్త! రాష్ట్ర విభజన ఎన్నటికి జరగదని వాదిస్తున్న లగడపాటి దానికైనా కట్టుబడి ఉండాలి. లేదా విభజన జరిగితే రాజకీయాల నుంచి వైదొలుగుతాను అన్న మాట మీద అయిన నిలబడాలి. రాష్ట్ర విభజన జరుగుతుందా లేక సమైక్యంగా ఉంటుందా కొన్ని రోజుల్లో తేలుతుంది. అప్పటి వరకు లగడపాటి రాజగోపాల్ పూటకో మాట మాట్లాడకుండా మౌనంగా ఉంటే మంచిది.

Labels: , ,

సీమాంధ్ర నేతల కుయుక్తులు అర్థం చేసుకోవాలె



రాష్ట్ర విభజనపై  సీమాంధ్ర నేతల వాదన వింతగా ఉన్నది. ఓట్లు సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తరా అని ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. దీన్ని సీమాంధ్ర  మీడియా కూడా కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం స్టేట్ విభజన చేయడానికి పూనుకుంటున్నట్టు ప్రచారం మొదలు పెట్టింది. తెలంగాణ సమస్య ముందుకు వచ్చినప్పుడల్లా టీ అర్ ఎస్ గెలుచుకున్న సీట్లతో ముడిపెట్టినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. ప్రజల ఆకాంక్షను పార్టీలకు వచ్చిన సీట్లతో ముడిపెట్టి.. అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి అహంకారంగా అడ్డదిడ్డంగా మాట్లాడినప్పుడు వీళ్ళెవరు అడ్డుకోలేదు. అఖిలపక్ష సమావేశంలో పార్టీలలో సీపిఎం, ఎంఐఎం (ఎంఐఎం కూడా మూడు ప్రతిపాదనలు కేంద్ర ముందు ఉంచింది. అందులో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వదలుచుకుంటే హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందే అని కుండ బద్దలు కొట్టింది) తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ రెండు అభిప్రాయాలు చెప్పినప్పటికీ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆ పార్టీ తరఫున పాల్గొన్న ప్రతినిధులు స్పష్టం చేశారు. కాని అప్పుడు అలా  మాట్లాడిన గాదె వెంకట రెడ్డి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. సమైక్యవాదాన్ని తాను బలంగా వినిపించాను అని చెప్పిన గాదె ఇప్పుడు మాట మారుస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబుతున్నదని సీమాంధ్ర మంత్రులే మీడియా ముందు వెల్లడించారు. వాళ్ళ వాదనను వినిపించడానికి వెళ్ళిన వీళ్ళను కాంగ్రెస్ పెద్దలు అడిగిన ప్రశ్నలకు మేము సరైన సమాధానం చెప్పలేక పోయామని వీళ్ళే చెప్పారు. అధిష్టాన పెద్దలు అడిగిన ప్రశ్నల్లో ఓట్లు సీట్లు ఒక అంశం మాత్రమే. ఇప్పుడు పార్టీ హైకమాండ్ వైఖరిని తప్పుపడుతున్న నేతలు తమ బంధు గణాన్ని జగన్ పార్టీలోకి పంపి సీమాంధ్ర  ప్రాంతంలో పార్టీని భ్రష్టు పట్టించారని ఆ పార్టీ పెద్దల ప్రధాన ఆరోపణ.  నిజానికి తెలంగాణపై ఓట్లు, సీట్ల రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్, టిడిపి, వై ఎస్అర్ సీపీ. ఈ పార్టీలే రాష్ట్ర విభజనపై ద్వంద్వ విధానాలను అవలంబిస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సమైక్యవాదానికి 270 స్థానాలు వస్తాయి అని లగడపాటి చేసిన, చేస్తున్న వితండ వాదాన్ని ఎందుకు తప్పు పట్టలేదు. బాబు పాదయాత్ర సమయంలో కరీంనగర్ లో ఆ పార్టీ కార్యకర్త తెలంగాణ పై స్పష్టత ఇవ్వాల్సిందే అని నిలదీస్తే... ఆయన చెప్పిన సమాధానం ఏమిటి? ఇక్కడ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే అక్కడ (సీమాంధ్రలో) పార్టీ పోతుంది అన్నప్పుడు మీడియాకు కనిపించలేదు. చంద్రబాబు వైఖరి కరెక్టుగానే కనిపించింది. తెలంగాణ అనగానే సీమాంధ్ర నేతలు, మీడియా అనేక అంశాలను తెర ముందుకు తెస్తాయి. రాయలసీమ, మన్యసీమ, హైదరాబాద్. ఇలా కాలుకు వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలుకు అన్న చందంగా అసలు అంశాన్ని పక్కదోవ పట్టించే కుట్రలు తెరలేపుతారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుతున్న నేతల్లోనే సఖ్యత లేదన్నది మొన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలోనే స్పష్టమైంది. అంతే కాదు వీళ్ళు ఏమి కోరుకుంటున్నారో క్లారిటీ కూడా లేదు. సమైక్య వాదాన్ని పక్కన పెట్టి హైదరాబాద్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అంటారు. రాష్ట్రాన్ని విభజిస్తే అనంతపురం జిల్లాను కర్ణాటకలో కలపాలని కొందరు వాదిస్తారు. కనుక సీమాంధ్ర ప్రజానీకం ఇప్పటికైనా అర్థం చేసుకోవలసింది మీ ప్రజాప్రతినిధులుగా చెప్పుకుంటున్న వాళ్ళ వాదనలు వారి ప్రయోజనాల కోసమే తప్ప..మీకోసం కాదు. హైదరాబాద్ లో ఒక్క సీమాంధ్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో కాలంగా ఉంటున్నారు. రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఇక్కడే ఉంటారు. ఎవరికీ అభద్రతా భావం అక్కర లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై అఖిలపక్ష సమావేశంలో పార్టీల అభిప్రాయం మేరకే తీసుకుంటుంది. అంతే గాని సీట్ల కోసమో, సొంత ప్రయోజనాల కోసమో తీసుకుంటుంది అనుకోవడం అపోహ మాత్రమే. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీలు రాష్ట్రంలో నెలకొన్నఅస్థిరతను తొలగించాలని కేంద్రాన్ని కోరాయి. సమస్యను పరిష్కరించాలని చెప్పిన వాళ్ళు... నిర్ణయం తీసుకునే సందర్భంలో సమస్యలు సృష్టిస్తున్న సీమాంధ్ర నేతల కుయుక్తులను అర్థం చేసుకోవాలె.  

Labels: , , , ,

Thursday 3 January 2013

ప్యాకేజీ ప్రయోగం ఫలించదు



తెలంగాణపై తేల్చడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నదని, దీనిపై మీడియా లో చర్చల మీద చర్చలు. అయితే ప్రత్యేక రాష్ట్రమా, లేదా ప్యాకేజీనా అనే అంశాలపై మాత్రమే ప్రధానంగా ఈ చర్చలు సాగుతున్నాయి. తెలంగాణ పై చిదంబరం ప్రకటన తరువాత మూడేళ్ళు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అఖిలపక్షం తరువాత ముప్పై రోజుల్లో ఈ అంశాన్ని తెలుస్తామన్న షిండే హామీ, అయన ప్రకటన కాంగ్రెస్ వైఖరే అని ఆ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ ప్రకటన దీనికి కొంత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే అఖిలపక్ష సమావేశంలో ఒక్క సీపీఎం తప్ప ప్రధాన రాజకీయ పార్టీలేవీ సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించలేదు.అది కూడా తెలంగాణ పై కేంద్రం నిర్ణయం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నది. కాంగ్రెస్ పార్టీ రెండు వాదనలు, టిడిపి, వైఎస్అర్ సిపీ అస్పష్ట వైఖరి మినహా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నేరుగా వ్యతిరేకించలేదు. తాజాగా విజయవాడలో పీసీసీ అధ్యక్షులు తలపెట్టిన ప్రాంతీయ సదస్సుకు ఆజాద్ ఆదేశాలు అడ్డుకట్ట వేశాయి. రాష్ట్రం పై కీలక నిర్ణయాలు వెలువడే సందర్భంలో...హస్తిన సంకేతాలను ఎవరికీ వారు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒప్పందాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత హక్కులు అన్ని ఉల్లంఘనలకు గురయ్యాయి అనేది తెలంగాణవాదుల వాదన. 610 జీవో వచ్చి 27 ఏళ్ళు పూర్తి అయిన ఇప్పటికి అది అమలు కాలేదు. వైఎస్ హయంలోనూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమని ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టడం కోసమే జరిగింది. ఆ ప్రాంతీయ ముఖ్యంగా తెలంగాణకు ఎన్ని  నిధులు కేటాయించారో విదితమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి ప్రవేశపెట్టిన ప్యాకేజీ ప్రయోగాలు విఫలమయ్యాయి. ఇప్పుడు మళ్లీ ప్యాకేజీ అంటే తెలంగాణ ప్రజలు అందుకు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అంతేకాదు కర్ణాటక, బెంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని వెనుకబడిన ప్రాంతాలకు ప్రకటించిన ప్యాకేజీ, రాజ్యాంగ రక్షణలు తెలంగాణ విషయంలో సాధ్యం కాదు. ఎందుకంటే కేంద్రం ప్రకటించే ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలంటే పార్లమెంటులో 2/3 మెజార్టీ కావాలి. అంటే దాదాపు 365 సభ్యుల మద్దతు అవసరం. కేంద్ర ప్రభుత్వం నుంచి తృణమూల్ వైదొలిగిన తరువత యూపీఏ బొటా బోటీ మెజార్టీ తో కొనసాగుతున్నది. ఎఫ్ డీఐల ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ ఎంత కలవరపాటుకు గురైందో మనకు తెలిసిందే. అయినా కాంగ్రెస్ ప్యాకేజీ ప్రయోగం మరోసారి చేయాలంటే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సహకారం తప్పని సరి. దీనికి బీజీపీ ససేమిరా ఒప్పుకోదు. అదే తెలంగాణ పై పార్లమెంటులో బిల్లు పెడితే సాధారణ మెజారిటీ చాలు. ఇప్పటికే జాతీయస్థాయిలో తెలంగాణకు అనుకూలంగా ముప్పై పైచిలుకు పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ సులువైన మార్గాన్ని పక్కన పెట్టి సమస్యను సంక్లిష్టం చేస్తుందని భావించలేము. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను మరింత కాలం సాగతీయడానికి ఏవైనా కారణాలు చెబితే తప్ప తెలంగాణ అంశాన్ని పక్కనపెట్టలేని స్థితి. అలాగే తెలంగాణ పై ఇదే చివరి సమావేశమని షిండే ఇప్పటికే స్పష్టం చేశారు. మరో అంశం ఏమంటే గాదె వెంకట రెడ్డి చెప్పినట్టు రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదన్నా. అంతిమంగా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా చెప్పారు. రాజ్య సభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్  చెప్పినట్టు రాష్ట్ర విభజన అంశం అఖిలపక్ష సమావేశం తరువాత రాష్ట్ర పరిధి నుంచి కేంద్రం కోర్టులో చేరింది. కాబట్టి లగడపాటి చెబుతున్న ఏకాభిప్రాయం, కావూరి శాస్త్రీయ విభజన అనేవి కాంగ్రెస్ పార్టీ సమస్యలు. వాటిపై కాంగ్రెస్ పార్టీ తేల్చుకుని తెలంగాణపై తేల్చాల్సిన సమయం, సందర్భం ఆసన్నమైంది.    

Labels: , , , ,

Wednesday 2 January 2013

అల్వీ సాబ్ ఆచరణ కావలె



తెలంగాణపై రెండో ఎస్సార్సీ యే కాంగ్రెస్ పార్టీ విధానం అన్నవాళ్లు, అంటున్నవాళ్ళు అసలు విషయాన్ని దాచిపెడుతున్నారు. మొదటి ఎస్సార్సీ హైదరాబాద్ రాష్ట్రాన్ని (తెలంగాణ) ఆంధ్రా రాష్ట్రంతో కలపవద్దని సూచించింది. దాని తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, విదర్భ రాష్ట్రాల ఏర్పాటు విషయంలో మొదటి ఎస్సార్సీని గౌరవిస్తామని చెప్పింది. కాని తెలంగాణ ఏర్పాటుపై కేంద్రంలో ఏదైనా కదలలిక రాగానే సీమాంధ్ర మీడియా, ప్రజాప్రతినిధుల్లో కలవరం మొదలవుతుంది.అందుకే కొత్త  రాష్ట్రాలఏర్పాటుతో దేశ  సమాఖ్యకు ముప్పు వాటిల్లుతుందని సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టే ప్రచారం మొదలుపెడుతారు. గతంలో కూడా కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్సార్సీ వేయాలనే ప్రతిపాదన ఉన్నదని, దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నదని ఆ పార్టీ అధికార ప్రతినిధులు అన్నారు. అప్పుడు తెలంగాణ గురించి ప్రస్తావిస్తే దానికి కూడా రెండో ఎస్సార్సీ వర్తిస్తుందని చెప్పి, తరువాత నాలుక కరుచుకున్న ఉదంతాలు ఉన్నాయి. తెలంగాణ కు రెండో ఎస్సార్సీ ఏ సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏఐసీసీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ తాజాగా పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల డిమాండ్లతో తెలంగాణ ను కలిపితే అది ఆంధ్రప్రదేశ్ లో అపార్థాలకు దారితీస్తుందన్నారు. అయ్యా అల్వీ గారు ఇదే విషయాన్ని విస్పస్తంగా మీ పార్టీ ఆంధ్రా నాయకులకు చెబితే బాగుంటుంది. ఎందుకంటే మీ పార్టీ ఎంపి ఆంధ్రా  ఆక్టోపస్ తెలంగాణపై మీడియా ముందు అడ్డదిడ్డంగా మాట్లాడేది ఈ ఎస్సార్సీ గురించే. అలాగే అఖిలపక్ష భేటీలో తెలంగాణ పై కాంగ్రెస్ అభిప్రాయం ఏమిటని మిగిలిన పక్షాలు నిలదీసినప్పుడు... కాంగ్రెస్ రెండు రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నదన్న సురేష్ రెడ్డి అభిప్రాయానికి కట్టుబడి ఉన్నామని షిండే అన్నటు వార్తలు వచ్చాయి.(దీన్ని గాదె వెంకట రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఖండించారు)  నెలలోపు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామన్న షిండే వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరే అని రషీద్ అల్వీ స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర విభజన పై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయానికి కట్టుబడి ఉంటామని ఒకవైపు చెబుతూనే కయ్యానికి కాలు దువ్వుతున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు. వీళ్ళను కట్టడి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్  హైకమాండ్ పై ఉన్నది. ఎందుకంటే మీ విధానం ఏమిటో మీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు తెలిసినా...  తెలియనట్టు నటిస్తూ...ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఎన్నో ప్రకటనలు చేసింది. అందులో అనుకూల, ప్రతికూల ప్రకటనలూ ఉన్నాయి. అందుకే తెలంగాణ పై రోడ్ మ్యాప్ ప్రకటించకుండా ఇలా పూటకో ప్రకటన చేస్తే సమస్య తీరదు. మాటల్లో చెప్పేవి ఆచరణలో చూపితేనే... ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసిన వారవుతారు.

Labels: , ,