Thursday 27 June 2013

ఇదేనా తెలుగు వారి ఆత్మగౌరవం అంటే!

ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం అని చంద్రబాబు తరచూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటాడు. ఉత్తరాఖండ్ వరద బాధితులను రక్షించడానికి, వారిని వారి స్వస్థలాలను పంపించడానికి టీడీపీ అధినేత నాలుగైదు రోజులుగా నానా హడావుడి చేస్తూనే ఉన్నాడు. వరద బాధితులకు సౌకర్యాలు సరిగా లేవని ఏపీ భవన్ ముందు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి ధర్నా కూడా చేశారు. అట్లాగే వరద బాధితులను రక్షించడంలో భారత సైన్యం చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు. ఇఎ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచకుపడుతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ బురద రాజకీయం ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు సైన్యాన్ని ప్రశంసిస్తూనే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు అంటే ఏమనుకోవాలి? భారత సైన్యం ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తుందో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన  చంద్రబాబుకు తెలియకపోవడం దురదృష్టకరం. మాట్లాడితే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక టీడీపీ అనే చంద్రబాబు వరద బాధితులను ఆదుకునే పేరుతో టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు బాహిబాహీకి దిగి ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు. క్రమశిక్షణ గురించి లెక్చర్లు దంచే చంద్రబాబు ఆయన ముందే కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు ఒకరినొకరు తోసేసుకుంటూ, నోటికొచ్చినట్టు తిట్టుకుంటుంటే ప్రేక్షక పాత్ర పోషించాడు. ఇక అధికార పార్టీ నేతల గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే పక్కవాడు లేస్తే గానీ మనకు చలనం రాదు అన్నట్టు ఉంటుంది కాంగ్రెస్ నేతల వైఖరి. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకుంటున్నామని రోజూ మీడియా ముందు ఫోజులు ఇచ్చుకుంటూ, క్రెడిబులిటీ కోసం ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టకునే దాకా వెళ్లారు. బాధితుల గోడు పక్కకు పోయి నిన్న రాష్ట్ర, జాతీయ మీడియాలో వీరి గొడవే ప్రధానాంశం అయింది. సహాయ చర్యలకు వర్షం అడ్డంకిగా మారుతున్నది. సైన్యం బాధితులను రక్షించడానికి ఎంతో శ్రమిస్తున్నది. ఈ సమయంలో నేతలు పరామర్శల పేరుతో ఫైటింగులు చేసుకుంటే రాష్ట్రం పరువు గంగపాలు చేశారు.
ఇదేనా తెలుగు వారి ఆత్మగౌరవం అంటే! కాంగ్రెస్, టిడిపి నేతలను చూసి జనం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది.

Labels: , ,

Thursday 20 June 2013

సమావేశాలతో సమయం వృథా



తెలంగాణపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలతో షిండేతో జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత నెలరోజుల్లో తెలంగాణపై తేలుస్తామన్నారు. ఆ గడువు పోయి చాలా కాలం అయింది. అప్పుడు తెలంగాణపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నదని మీడియా కోడై కూసింది. (సారీ... ఒక వర్గం మీడియా సీమాంధ్ర ప్రజాప్రతినిధులను కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు పురమాయించింది అని చెప్పాలి) ఆ సమయంలో మంత్రి టీజీ వెంకటేశ్ లాంటి వాళ్లు కూడా తెలంగాణ ఇచ్చేటట్టు ఉన్నారని కూడా ప్రకటించారు. దీంతో అధికారపార్టీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అంతా సమైక్యంగా ఆజాద్‌తో కలిసి నెల గడువును తూచ్ అనిపించారు. దీంతో కథ మొదటికి వచ్చింది. అప్పుడూ ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నోరు మెదపలేదు. కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా తెలంగాణవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. తెలంగాణపై నాన్చివేత ధోరణిని తప్పుపడుతూ సమరదీక్ష సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలపై తెలంగాణ ఉద్యమ నాయకత్వం విమర్శలు చేసింది. సీమాంధ్ర నాయకత్వం తెలంగాణను అడ్డుకుంటే చచ్చిన పాముల్లా ఉన్న ఈ ప్రాంత నేతలు తెలంగాణ ఉద్యమ పార్టీని,  నాయకత్వాన్ని నల్లారి వారు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే వారికి బాసటగా నిలిచి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.

మొన్నటికి మొన్న చలో అసెంబ్లీ సందర్భంగా కిరణ్ ప్రభుత్వం తెలంగాణవాదులపై దమనకాండను ప్రయోగించింది. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి పార్టీలకు అతీతంగా సీమాంధ్ర నేతలు కుయుక్తులు పన్నుతుంటే కుక్కిన పేనులా ఉంటున్నారు. ఇప్పుడు తెలంగాణకు భారీ ప్యాకేజీ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు మళ్లీ సమావేశాలు  మొదలుపెట్టారు. తెలంగాణ తప్పా మరే ప్రత్యామ్నాయాన్ని అంగీకరించం అంటున్నారు. సోనియాగాంధీకి లేఖ రాయాలని, నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో భారీ మీటింగ్ పెట్టాలని నిర్ణయించారు. తెలంగాణ కోసం వెయ్యిమందికిపైగా బలిదానాలకు పాల్పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉవ్వెత్తున్న ఉద్యమం జరుగుతున్నది. వలస ప్రభుత్వ నిర్బంధాలను అధిగమిస్తూ శాంతియుతంగా ప్రజలు స్వరాష్ట్ర ఆకాంక్షను హస్తినకు చాటిచెప్పడానికి ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పలేని వీళ్లు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తేవడానికి త్వరలో హస్తినకు వెళతారట! హైదరాబాద్‌లో కిరణ్ ప్రభుత్వం చలో అసెంబ్లీ సందర్భంగా ఒక ప్రాంత ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తుంటే ప్రేకక్ష పాత్ర వహించారు. తెలంగాణ కోసమని సమావేశాలు పెట్టి తెలంగాణను అడ్డుకున్న ఆజాద్‌కు ధన్యవాదాలు తెలిపి, దిగ్విజయ్‌సింగ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసి తాము కూడా రాష్ట్ర సాధన కోసం ఏదో చేస్తున్నామనే భ్రమలు కల్పిస్తున్నారు.

ఐదున్నర దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ ఒక్క డిసెంబర్ 9న తప్ప మరెప్పుడు గౌరవించలేదు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు కామెడీ కామెంట్లు చేశారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఎక్కడ తెలంగాణపై సానుకూల ప్రకటన వస్తుందో అని సీమాంధ్ర నేతలు మూకుమ్మడిగా మూడురోజులు హస్తినలోనే మకాం వేసి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకున్నారు. షిండే పెట్టిన నెల గడువుకు ఆజాద్‌తో కొత్త అర్థాలు చెప్పించారు. ఇలా వచ్చిన తెలంగాణను డిసెంబర్ 9 తర్వాత అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారితోనే వేదికలు పంచుకుంటూ ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టిన ఈ ప్రాంత నేత నేతలు ఇప్పుడు మీటింగులు పెట్టి సోనియాగాంధీకి విన్నపాల లేఖ రాస్తే ఒరిగేది ఏమిటి? ఈ ప్రాంత విముక్తి కోసం వీరంతా ఒక్కతాటిపై నిలబడి ఉండి ఉంటే కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంపై ఇంత అణచివేతను ప్రయోగించేవాడా? అందుకే ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు తెలంగాణ కోసం ఎప్పుడు సమావేశాలు పెట్టినా వాటిని టీ, బిస్కెట్ సమావేశాల లాగానే ప్రజలు భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రానికి ప్యాకేజీలు పరిష్కారం కాదని మాటల్లో చెబితే ఢిల్లీ పెద్దలకు చెవికి ఎక్కదు. సమావేశాలతో సమయం వృథా తప్ప ఫలితం ఉండదనే విషయాన్ని ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు తెలుసుకుంటే మంచిది.

Labels: , ,

Monday 17 June 2013

ప్యాకేజీలు-లీకేజీలు



‘చలో అసెంబ్లీ’ సందర్భంగా కిరణ్ సర్కార్ శాంతిభవూదతల పరిరక్షణ పేరుతో తనను తానే ధించుకున్నది. చలో అసెంబ్లీని అడ్డుకోవడానికి వేలాదిమంది పోలీసులను మోహరించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఉద్యమకారుల కంటే పోలీసుల అత్యుత్సాహం వల్లే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఎంత నిర్బంధకాండను అమలుచేసినా తెలంగాణవూపజలు తమ ఆకాంక్షను చాటారు. ప్రభుత్వమే పోలీసు ఫోర్సుతో ‘చలో అసెంబ్లీ’ని సక్సెస్ చేసింది.అయితే ‘చలో అసెంబ్లీ’ పై సీమాంధ్ర మీడియా అర్ధసతాలతో, వక్రీకరణలతో కథనాలను ప్రసారం చేసింది. వీటిలో రాష్ట్రవూపభుత్వం‘అసెంబ్లీ ముట్టడిని కట్టడి చేసింద’ని, కిరణ్ ను కాంగ్రెస్ పెద్దలు మెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు.

అలాగే ప్రతి శుక్రవారం జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీలో చలో అసెంబ్లీ, తెలంగాణలో తాజా పరిస్థితులపై సీరియస్‌గా చర్చ జరిగిందని ఇదే మీడియా చెప్పుకొచ్చింది. తెలంగాణపై హస్తిన పెద్దలు అసెంబ్లీ సమావేశాల తర్వాత అఖిలపక్షం ఏర్పా టు చేయనున్నారని, ఇప్పటికే సిద్ధం చేసిన రెండు ప్రతిపాదనలను తెలంగాణ ప్రజావూపతినిధుల ముందు ఉంచి,వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నదని ఊహా కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

అందులో మొదటిది భారీ ప్యాకేజీ అని, రెండవది కర్నూల్, అనంతపురంతో కలిపి రాయల తెలంగాణ ప్రతిపాదనను వారి ముందు ఉంచనున్నట్లు చెబుతున్నది. వారానికి ఒకసారి జరిగే కోర్‌కమిటీలో సహజంగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి, ఇతర అంశాల గురించి చర్చ జరగడం సహజమే. ముఖ్యంగా నిన్న జరిగిన సమావేశంలో ప్రధానంగా ఆహారభద్రత బిల్లుపై చర్చ, ఎన్డీఏలో జేడీయూ ముసలం తదితర అంశాల గురించి చర్చ జరిగి ఉంటుంది. యూపీఏ ప్రభుత్వం నుంచి మమతాబెనర్జీ, డీఎంకే లాంటి ప్రధాన భాగస్వామ్య పార్టీలు వైదొలిగిన తర్వాత అరకొర మెజారిటీతో కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నది. అలాగే యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో రోజుకో కుంభకోణం వెలుగుచూస్తున్నది. బీఎస్పీ, ఎస్పీ లాంటి పార్టీలు బయటి నుంచి ఇస్తున్న మద్దతుతో యూపీఏ ప్రభుత్వం నిలబడింది. ఎస్పీ అధినేత కొంతకాలంగా నవంబర్‌లో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రావొచ్చు అనే సంకేతాలు ఇస్తున్నారు. దీనికనుగుణంగా కేంద్రంలో కొత్త సమీకరణలు జరుగుతున్నాయి.

కేంద్ర ప్రభు త్వం బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. మోడీని బూచిగా చూపించి బయటకు రావాలనుకుంటున్న జేడీయూను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే కాంగ్రెస్, బీజేపీయేతర ముఖ్యమంవూతులు ‘ఫెడరల్ ఫ్రంట్’ పేరుతో కొత్త ఫ్రంట్‌కు సన్నాహకాలు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి ఒకరినొకరు సంప్రదించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో యూపీఏ-3ని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్‌ను ప్రధానిగా చేయాలనే సోనియాగాంధీ ఆశయం అంత సులువు కాదనేది రాజకీయ విశ్లేషకుల అభివూపాయం. పైగా యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల ఏర్పాటులో ఆంధ్రవూపదేశ్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడాపరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని ‘సర్వే’, అధ్యయనాలు యూపీఏకు పరాభవం తప్పదని చెబుతున్నాయి. అట్లాగని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ఆ సర్వేలు చెప్పడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా మాత్రం కొనసాగుతుందని స్పష్టంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పొత్తుల కోసం ఇటు యూపీఏ, అటు ఎన్డీఏ ఆరాటపడుతున్నాయి.

కాంగ్రెసేతర ప్రాంతాల్లో ఆయా పార్టీలతో పొత్తు తప్పని సరి. కానీ ఆంధ్రవూపదేశ్‌లో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో రెండుసార్లు నిర్ణయాత్మక పాత్ర పోషించిన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తెలంగాణ రూపంలో కష్టాలు మొదలయ్యాయి. ఈ అంశాన్ని తేల్చకుండా ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు. తెలంగాణపై 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యామ్నాయంగా ఏ ప్రతిపాదనకు అంగీకరించరు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలకు కూడా తెలుసు. ఇప్పుడు సీమాంధ్ర మీడియా ప్రచారం చేస్తున్న ప్రతిపాదనలు శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరు ప్రతిపాదనల్లోని అంశాలే. వీటిలో ఏ ఒక్కదాన్ని ఒక ప్రాంతం వారు ఆమోదిస్తే మరో ప్రాంతం వారు అంగీకరించరు అనే విషయాన్ని ఆ కమిటీనే కుండబద్దలు కొట్టింది. శ్రీకృష్ణ కమిటీ ఎటూ తేల్చలేకపోయిందని, ఆ నివేదిక ముగిసిన అధ్యాయమని కాంగ్రెస్ పెద్దలు పేర్కొన్నారు. అయినా సీమాంధ్ర మీడియా ఎందుకు పనిగట్టుకొని ఈ ప్రచారం చేస్తున్నది.

ఆ మధ్య ఇదే మీడియా గూర్ఖాలాండ్ తరహాలో తెలంగాణకు ప్రత్యేక మండలిని ఏర్పాటు చేస్తారని ప్రచారం చేసింది. అయితే ఆ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో 2/3 మెజారిటీ కావాలి. అందుకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అంగీకరించదు. ఈ ప్రతిపాదన సాధ్యం కాదు. అలాగే ప్యాకేజీకి కూడా తెలంగాణవాదులు ఒప్పుకోరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో పూటకో మాట మాట్లాడుతూ కాలం వెళ్లదీస్తున్నది. ఇక మిగిలింది హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేము అని చెప్పి ప్యాకేజీని ముందుకు తెస్తున్నదా? తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయినా ఫరవాలేదు అనుకున్నపుడే ఈ ప్రతిపాదన వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆ సాహసం చేస్తుందా లేదా అన్నది కాలం తేలుస్తుంది. తెలంగాణపై తేలుస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక గడువులు పెట్టింది. ఆ తర్వాత మాట మార్చింది. కనుక ఇప్పుడు సీమాంధ్ర మీడియా చెబుతున్న కట్టుకథలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజానీకం లేదు. తరతరాల పోరాటాల, త్యాగాల చరిత్ర పునాది మీద ఆత్మగౌరవ ఉద్యమాన్ని నిర్మించుకున్న తెలంగాణ సమాజం తెలంగాణ సాధించే దాకా విక్షిశమించదు. తెలంగాణ రాష్ట్రం మినహా మరే ప్రత్యామ్నాయాన్ని అంగీకరించదు.

-రాజు ఆసరి

Labels: , , , ,

Wednesday 5 June 2013

దేశంలో రెండు దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది కూడా ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే. ప్రస్తుత యూపీఏ ప్రభుత్వానికి ఆక్సిజన్‌ను అందిస్తున్నది ప్రాంతీయ పార్టీలే. అంటే ఒకరకంగా జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలు పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే. కానీ నాగం జనార్దన్‌రెడ్డికి మాత్రం ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీగా కనిపిస్తున్నది. ఇదే జాతీయ పార్టీ దేశంలో మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఒక ప్రాంతీయ పార్టీ బెదిరింపులకు లొంగి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు. అంతెందుకు 2004లో రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీని ఓడించడానికి జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నది. ఆ ఎన్నికల్లో టీడీపీని తెలంగాణలో మట్టికరిపించింది ఉప ప్రాంతీయ పార్టీనే. అదే టీడీపీ 2009 ఎన్నికల్లో నాగం చెబుతున్న ఉప ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకున్న విషయం నాగం మరిచిపోయారేమో! తెలంగాణ కోసం ఎవరు ఏ పార్టీలో అయినా పనిచేయవచ్చు. కానీ ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదు అనడమే వారి అవగాహన లోపానికి నిదర్శనం.

Labels: , , , ,

తెలంగాణపై తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని పైకి తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే,  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును పరోక్షంగా వ్యతిరేకిస్తున్న పార్టీలు టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు.,ఇక 2001లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్ నాడు 41 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గరికి పంపారు. దశాబ్ద కాలంగా తెలంగాణ సమస్య కాంగ్రెస్ కోర్టులో ఉన్నది. ఇప్పుడు తెలంగాణపై భిన్న అభిప్రాయాలు ఉన్నది కాంగ్రెస్ పార్టీలోనే. ఆ పార్టీ అధిష్ఠాన పెద్దలు చెబుతున్నట్టు సంప్రదింపులు, చర్చలు అనేకసార్లు జరిగాయి. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికార పార్టీలోనే ఏకాభిప్రాయాన్ని సాధించలేని వారు తెలంగాణ ఇచ్చే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉన్నదనడం ఇప్పటి విషాదం. షిండే పెట్టిన ‘నెల’ గడువును తప్పుపట్టిన ఆజాద్ ఇప్పుడు మరో గడువు పెట్టినా, షకీల్ అహ్మద్ తెలంగాణకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని చెప్పినా అది వాళ్ల పార్టీ నేతలను కాపాడుకోవడానికే తప్పా ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు మాత్రం కాదు. మీడియాలో వస్తున్నట్టు అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు. పార్లమెంటులో తెలంగాణపై బిల్లు పెట్టి ఆ ప్రక్రియ ప్రారంభించినప్పుడే దానికి విలువ ఉంటుంది. తెలంగాణఫై కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న సాచివేత ధోరణిని నిరసిస్తూ పార్టీని వీడుతున్న నేతలను చూసి హస్తిన పెద్దలే కాదు ఆంధ్రప్రదేశ్‌లోని సీమాంధ్ర మీడియా కూడా వలసలను కట్టడి చేసేందుకు పూటకో కథనాన్ని ప్రసారం చేస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణలోపై హస్తినలో ఏదో జరుగుతున్నదనే హడావుడి.

Labels: , , , ,

ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేసి దశాబ్ద కాలం పూర్తయింది. అప్పుడు ఓట్లు పడ్డాయి. రెండు రాష్ట్రాలు మాత్రం ఏర్పడలేదు. మూడు కొత్త రాష్టాలు ఏర్పాటు చేసిన ఆ పార్టీకి తెలంగాణ ఇచ్చే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే మూడు నెలల్లో తెలంగాణ అంటున్నది. జాతీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని రెండు ప్రాంతాల్లో ఉద్యమాలు చేయవచ్చు. కానీ ఆంధ్రలో అడుగుపెట్టదు. అక్కడి ప్రజాస్వామిక వాదులతో కలిసి ఉద్యమం చేయదు. ఇక్కడ మాత్రం ఉప ప్రాంతీయ పార్టీతో తెలంగాణ సాధ్యం కాదంటున్నది. అధికారంలో ఉన్నప్పుడు హాండ్ ఇచ్చి, ప్రతిపక్షంలో ఉండి హామీలు గుప్పిస్తున్నది. తెలంగాణపై టీఆర్‌ఎస్‌కు ఉన్న కమిట్‌మెంట్ మిగతా ఏ పార్టీలకు ఉండదు. ఎందుకంటే ఆయా పార్టీలన్నీ ఆంధ్రా నాయకత్వంలో నడుస్తున్నవే. అందుకే ఆ పార్టీలకు తెలంగాణ అంశం అంత ప్రాధాన్యమైనది కాదు. ఇదే సీమాంధ్ర మీడియాకు కావలసింది. టీఆర్‌ఎస్‌ను దెబ్బకొడితే ఆంధ్రా పార్టీలేవీ తెలంగాణ అంశం తెరమరుగవుతుందని వారి భావన. అందుకే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాటిని హైలెట్ చేయడం, అనుకూలంగా మాట్లాడితే హైడ్ చేయడం నాలుగేళ్లుగా చూస్తున్నదే.

Labels: , , , ,