Wednesday 9 December 2015

చరిత్రలో మైలురాయి డిసెంబర్ 9

చరిత్రలో కొన్ని రోజులకు సుస్థిరస్థానం ఉన్నది. ఎవరు అంగీకరించినా లేకున్నా డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేస్తూ చేసిన ప్రకటనతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగిందంతా దాని కొనసాగింపు మాత్రమే. ఇందులోనే చర్చలు, సంప్రదింపులు, కమిషన్ నివేదికలు, బిల్లు రూపకల్పన , అసెంబ్లీ, పార్లమెంటు చర్చ, రాష్ట్ర ఆమో దం, 2014 జూన్ 2న ఆవిర్భావం వగైరా అంతా. డిసెంబర్ తొమ్మిదికి ఆ ప్రాధాన్యం ఎందుకంటే ఐదున్నర దశాబ్దాల అనంతరం తెలంగాణపై మొదటిసారి అనుకూల ప్రకటన వచ్చింది. కేసీఆర్ దీక్ష మొదలుపెట్టిన రోజు నుంచి తెలంగాణపై ప్రకటన వచ్చేవరకు ఆ పదకొండు రోజులు యావత్ ప్రజానీకాన్ని రోడ్లపైకి తెచ్చింది. ప్రపంచానికి తెలంగాణ చైతన్యాన్ని చూపింది. కేంద్రంలో కదలిక తెచ్చింది. మొన్న వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా కొంతమంది నాయకులు కేసీఆర్ దీక్షపై అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకున్నారు. కానీ తెలంగాణ అంశం అంత సులభం కాదన్న వాళ్లే రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించడానికి మూలం డిసెంబర్ 9.
నాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించిన తర్వాత ఏం జరిగిందో విదితమే. తెలంగాణ ఏర్పాటును సమర్థించడానికి అన్ని ప్రాంతాల నాయకులతో కమిటీ వేసుకుని, అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకుని తెలంగాణకు అనుకూలత ప్రకటించిన టీడీపీ తర్వాత మాట మార్చింది. డిసెంబర్ 10 మానవహక్కుల దినోత్సవం రోజున ఎన్టీఆర్ భవన్ సాక్షిగా తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడిన చరి త్ర చంద్రబాబుది. అంతేకాదు అన్ని పార్టీల అభిప్రాయం తర్వాత వెల్లడించిన ప్రకటనను కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకున్నది. ఎందుకంటే నాడు పార్టీలకు అతీతంగా ఆంధ్రాలో అందరూ తెలంగాణను అడ్డుకోవడంలో సఫలమయ్యారు. నిజానికి ఆనాడు వాళ్ల రాజీనామా డ్రామాలను తిప్పికొట్టడానికి మనమూ అదే పనిచేద్దాం అన్న టీఆర్‌ఎస్ అధినేత ప్రతిపాదనను ఇక్కడి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు అంగీకరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ తెలంగాణ సోయిలేని నేతల వల్లనే రాష్ట్ర ఏర్పాటులో నాలుగేళ్ల జాప్యం జరిగింది.
ఆంధ్రా నాయకులు ఫజల్ అలీ సిఫార్సులకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయించారు. విలీన సమయంలో తెలంగాణకు ఇచ్చిన రక్షణలన్నీ ఉల్లంఘనకు గురయ్యాయి. అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది. కానీ 1969లో మలిదశ ఉద్య మం కంటే ఉవ్వెత్తు ఎగిసిపడినా తెలంగాణ ఏర్పడలేదు. ఉద్యమం ఉధృతమవుతున్న సమయంలో పథకాలు, ప్రణాళికా బోర్డుల పేరుతో కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేసింది. 2004లో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మావల్లే తెలంగాణ వచ్చిందని అందరూ అంటున్నారు. కానీ యూపీఏ ప్రభుత్వం వేసిన ప్రణబ్ కమిటీకి తెలంగాణకు అనుకూలంగా ముప్పై పైచిలుకు పార్టీలచేత లేఖలు ఇప్పించింది ఎవరో అందరికి తెలిసిందే. అన్ని పార్టీల మద్దతు ఉన్నది కాబట్టే కేసీఆర్ నిరాహారదీక్ష సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా మద్దతు పెరిగింది. పార్లమెంటు వేదికగా కేంద్రం పై ఒత్తిడి పెరిగింది. తెలంగాణపై తేల్చక తప్పని పరిస్థితి ఏర్పడింది.
డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన ఆనందాన్ని ఒక్కరోజు నిలవనీయలేదు. అర్ధరాత్రి నుంచే కుట్రలు మొదలయ్యాయి. మళ్లీ డిసెంబర్ 23న వచ్చిన ప్రకటన అనంతరం మొత్తం తెలంగాణను దాదాపు నాలుగేళ్ల పాటు రోడ్లపైకి తెచ్చింది. ఇవాల తెలంగాణ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నవారిలో ముప్పై మంది కచ్చితంగా నిలబడి ఉంటే మూడున్నర కోట్లమంది పోరాటాలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఆ పని చేయలేదు. పైగా సీమాంధ్ర ముఖ్యమంత్రితో కలిసి అధికారాన్ని అనుభవించిన వారు, పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సమయంలోనూ వారికే అండగా నిలబడినవారు ఇవాల తెలంగాణ గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉన్నది. తెలంగాణ ప్రాంతం మొత్తం మా రాష్ట్రం మాగ్గావాలె అని నినదిస్తున్న సమయంలో, సీమాంధ్ర నాయకులు ఏ మాత్రం పట్టించుకోకుండా తమ ఆధిపత్యాన్ని పరమావధిగా పనిచేస్తుంటే, వాళ్లకు వంతపాడిన చరిత్ర నేటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులది. రాష్ర్టాన్ని సాధించుకోవడానికి ఈప్రాంత ప్రజలు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా శాంతియుత మార్గం లో నాలుగేళ్లు పోరాటం చేశారు.
తెలంగాణ ఆకాంక్షను ఎంత బలంగా ఉన్నదో తెలియజేయడానికి పన్నెండు మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా) రాజీనామా చేసి, ప్రజల ముందుకు వెళితే, వారిని ఓడించడానికి పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన ఘనులు ఇప్పుడు ఆయా పార్టీల్లో ఉన్నారు. తెలంగాణ కోసం అనేక బలిదానాలు జరిగాయి. అయినా ఏనాడు ఈ నాయకులు పట్టించుకోలేదు. కానీ ఇవాల మాత్రం తెలంగాణ ఏర్పాటులో మాదే పెద్ద పాత్ర. మిగిలినవారు చేసింది ఏమీలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. వీరి మాటలను మొన్న సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ, నిన్న వరంగల్ ఉప ఎన్నిక సందర్భంలోనూ ప్రజలు పట్టించుకోలేదు. అందుకే నాడు నేడు తెలంగాణ ప్రజలు వీళ్లకు ఓట్ల రూపంలో తగిన సమాధానం చెప్పారు. అయితే ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణ ఏర్పడింది అంటే సోనియాగాంధీ సంకల్పం వల్లే. కానీ ఆ అనివార్య పరిస్థితిని తెలంగాణ ఉద్యమం సృష్టించింది.
రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు ఏం మాట్లాడినా అందులో వాస్తవం ఉండాలి. అప్పుడే ప్రజలు విశ్వసిస్తారు. పద్నాలుగేళ్లు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలు గుర్తించారు. అందుకే ఉద్యమనాయకుడితోనే తెలంగాణ పునర్ నిర్మాణం సాధ్యమని భావించారు. ఉద్యమ సమయంలో వలె కీలక సందర్భాల్లోనూ ఆయనకు అండదండలు అందిస్తున్నారు. రాష్ట్రం సాధించుకోవడమే కాదు, తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్నది ప్రజల ఆకాంక్ష. దానికి తెలంగాణ సోయి, రాష్ర్టాభివృద్ధి పట్ల సమగ్ర ప్రణాళిక అవసరం అని ఆశించారు. అవన్నీ కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని అనుకున్నారు కాబట్టే ప్రజలు జై కొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్నారు. ప్రజలకే కాదు వివిధ రాష్ర్టాల ముఖ్యమం త్రులు, కేంద్ర మంత్రులు సైతం ప్రభుత్వ పథకాలను హర్షిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో ఏవైనా లోపాలుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకుని రావచ్చు. నిర్మాణాత్మక సూచనలు ఇవొచ్చు. అంతేగానీ ఉద్యమ సమయంలో సీమాంధ్ర నాయకుల వలె కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో వరంగల్ ప్రజలు చూపెట్టారు.
తెలంగాణ ఏర్పాటుతోనే అన్ని సమస్యలు తీరిపోతాయి అన్న భ్రమలు అధికారపార్టీ నేతలకు, ప్రజలకు లేవు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే అన్ని పనులు పూర్తి కావాలె అన్నట్టు ఆల్టిమేటాలు ఇవ్వడం చూశాం. కేంద్రం నుంచి సరైన సహకారం లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం, అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నది. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై బట్టకాల్చి మీదేసే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అందుకే ఇంకా ఇద్దరు ఎంపీలున్న వారితోనే తెలంగాణ వచ్చిందా ? మేము లేకపోతే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేదా? అనే డైలాగులకు కాలం చెల్లింది. వర్తమానంలో తెలంగాణ అభివృద్ధికి ఎవరు ఏం చేస్తున్నారు అన్నదే ప్రధానం. ఇది తెలుసుకోకుండా ఒక వ్యక్తిని, ఒక పార్టీని నిందిస్తే ప్రజలు విశ్వసిస్తారన్న అపోహల నుంచి ప్రతిపక్షాలు బైటికి రావాలి. రాష్ర్టాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలి. ముఖ్యంగా డిసెంబర్ 9 ప్రకటన తర్వాత కేంద్రం వెనక్కి వెళ్లినా...తర్వాత ఎన్ని ప్రలోభాలు పెట్టినా రాష్ట్రం తప్పా మరో ప్రత్యామ్నాయానికి ఒప్పుకునేది లేదని ప్రజలు తెగేసి చెప్పారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని, కేసీఆర్ 11 రోజుల దీక్షకు కొనసాగింపుగానే చూడాలి. ఆ పదకొండు రోజుల సమిష్టి స్ఫూర్తిని రాష్ట్ర పునర్ నిర్మాణంలోనూ చూడవచ్చు.
-ఆసరి రాజు

Labels: , , ,