Monday 9 February 2015

సర్కారు బడుల పటిష్ఠత


టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేజీ టు పీజీ వరకు ఉచిత నిర్బంధవిద్యను అందిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పింది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వా లు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామన్నాయి. కానీ అందుకు సంబంధించిన కార్యాచరణ ఏదీ కనిపించలేదు. అందుకే ఇప్పు డు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు సంక్షోభంలో ఉన్నాయి. ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అంతా కార్పొరేట్ మ యం అయిపోయిం ది. అలాగే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే ఆంగ్లమూ తప్పనిసరి అయింది. తెలుగు మీడియంలో చదివినవారు రాణించడం లేదా? అంటే.. ఎంతో రాణించిన వారూ ఉన్నారు. అయితే ఆంగ్లం అనేది ఒక మాధ్యమం మాత్ర మేనన్న స్పృహ కొరవడింది. ఇవ్వాల పేద, ధనిక అనే తేడా లేకుండా తమ పిల్లలు ఉన్నతస్థానానికి ఎదగాలని, అందుకు మంచి విద్య అందించడం కోసం ఆర్థిక స్తోమతలను కూడా లెక్కచేయకుండా ఇంగ్లీష్ చదువులను కోరుకుంటున్నారు.
అందుకే ఇవాళ ప్రతి గ్రామంలో ఇంగ్లీషు మీడియం పాఠశాలలు వెలిశాయి. ఇది ప్రభుత్వాల ప్రోద్బలంతోనో, ప్రజల సహకారంతోనో ఏర్పడలేదు. కేవలం కాలంతో పాటు వచ్చిన మార్పుల్లో భాగంగా జరిగింది. అందుకే తెలుగు మీడియం కంటే ఇంగ్లీషు మీడియం బోధిస్తున్న పాఠశాలలకు ఆదరణ పెరుగుతున్నది. అయితే ప్రభుత్వ పాఠశాల ల్లో గతంలో ఇంగ్లీష్ మీడియంలో సక్సె స్ స్కూళ్ల ను ప్రారంభించారు. దీనికోసం మొక్కు బడి శిక్షణా తరగతులు నిర్వహిం చడం వల్ల అది విజయవంతం కాలేదు. ఇప్పుడు మోడల్ స్కూళ్ల పేరుతో ఇంగ్లీ షు మీడియంలో బోధిస్తున్నారు. దీనిలో నూ సమస్యలున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో బోధించేవారు చాలా ప్రైవేట్ పాఠశాలల్లో బోధించేవారి కంటే మంచి అర్హతలు ఉన్నవారే. ప్రైవేట్ పాఠశాలలోనూ ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసిన వారితో పాటు డిగ్రీ చదవిన వారు బోధిసున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇచ్చేం త జీతాలు కాకుండా వాళ్ల వాళ్ల స్కూళ్ల పరిస్థితులకు అనుగుణంగా జీతాలు ఇస్తున్నారు.
ఇలా ప్రైవేట్ పాఠశాలల్లో బతకడానికి కావల్సిన జీతంతో కాలం వెళ్లదీస్తున్నవారి సంఖ్య బహుశా వేలల్లో ఉంటుంది. వీటితో పోలిస్తే కార్పొరేట్ స్కూళ్ల సంఖ్య తక్కువే. అందులో పనిచేసే వారి సంఖ్యా తక్కువే. అంటే ప్రభు త్వ పాఠశాలల్లో పనిచేసే వారెంత మంది ఉంటారో చిన్న, పెద్ద ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసేవారూ అంతేమంది ఉంటారు. ప్రభుత్వ పాఠశాల్లో ఉన్న సమస్యలే ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి. అయినా ఇవాల పేద, మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువ శాతం మంది తమ పిల్లలను ఇలాంటి స్కూళ్లకే పంపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇంగ్లీషు మీడియం. కార్పొరేట్ స్కూళ్లలో చదివేవారి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. అంటే ఆర్థిక స్థోమత ఆధారంగానే నేడు చదువులు సాగుతున్నాయని చెప్పడానికి లేదు. చదువంటేనే ఇంగ్లీష్ మీడియం చదువులై పోయిన ఈ కాలంలో ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి పిల్లల చదువుల కోసం జీవితాన్ని వెచ్చిస్తున్న వారు ఉన్నారు. అయితే ఈ చదువుల భారం అత్యధిక శాతం ప్రజలకు మోయలేనిదే. అయినా పిల్లల భవిష్యత్తు కోసం తప్పదనే భావనతో కాలంతో పోటీ పడుతున్నారు. ఫీజుల భారాన్ని భరిస్తున్నారు.
ఇవాల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోయే కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇలాంటి వారికి అందితే చాలు. ఆ పథకం లక్ష్యం దాదాపుగా నెరవేరినట్టే. జనాభాలో మెజారిటీ ప్రజలు కోరుకుంటున్న దానికి అనుగుణంగా వారికి అందు బాటులోకి ఇంగ్లీషు విద్యను అందించినట్లు అవుతుంది. వారి ఆర్థిక భారాన్ని తగ్గించగలిగిన ఈ ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య తెలంగాణలో గుణాత్మక మార్పుకు దారితీస్తుంది.
అయితే ప్రభుత్వ పాఠశాలలు అనగానే మౌలిక సదుపాయా ల విషయం ముందుకు వస్తుంది. సదుపాయాల సమస్యలు సర్కా రీ స్కూళ్లలోనే కాదు చాలా ప్రైవేట్ పాఠశాల్లోనూ ఉన్నా యి, ఉంటాయి. వ్యక్తులు నడిపే ప్రైవేట్ పాఠశాలల్లోనే చాలా వరకు ఏటా వారి పరిధిని విస్తరించుకుంటూ,వసతులను సమ కూర్చుకుంటూపోతున్నారు. అలాగే కొత్తగా వచ్చే కోర్సులను, అవి అందించే మార్పులను స్వీకరిస్తున్నారు. దీనికోసం వాళ్లకు ఉన్న వనరులతోనే వాటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాం టి పరిస్థితుల్లో ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ. మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషిచేస్తూనే ఈ ఉచిత విద్యను, నాణ్యమైన విద్యను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం తలచుకుంటే అసాధ్య మేమీ కాదు. ఒకసారి ప్రభుత్వ పాఠశాల ల్లో ఇది అమలయ్యాక, విద్యార్థులు అందులోకి వచ్చేలా విశ్వసనీయత కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలలకు కావాల్సిన మౌలిక సదుపా యాలు ప్రభు త్వం చూసుకుంటుంది. కానీ విద్యార్థుల ను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించడం, వారి తల్లిదండ్రులను ఒప్పించడం మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయులపైనే ఉన్నది. పాఠశాలలను గ్రామస్థాయి నుంచి పటిష్ఠం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కంటే అందులో పనిచేసే ఉపాధ్యాయులపైనే ఎక్కువ ఉన్నది. ప్రైవేట్ పాఠశాలలు ఒక ఏడాది ఆశించిన అడ్మిషన్లు రాగానే సంతృప్తి పడి ప్రచారం చేయడం మానవు. ఏటా వారి పాఠశాలల ప్రగతిని, ఫలితాలను చూపిస్తూ ప్రచారం చేస్తుంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో స్కూలు ప్రారంభ సమయంలో మాత్రమే పన్నెండు రోజులు ప్రచారం చేస్తారు. ప్రజల విశ్వాసా న్ని చూరగొనే పని, ప్రక్రియ నిరంతరం సాగడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నా యి. అయినా వాటి మనుగడకే ప్రమాదమేర్పడే పరిస్థితి ఎందు కు వస్తున్నదో ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలలు ఎదు ర్కొం టున్న సమస్యలను అధిగమించి విద్యా ప్రమా ణాలను పెంచే లా చర్యలు చేపట్టాలి.
దీనివల్ల ప్రభుత్వ పాఠశా లలపై ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది. అప్పుడు తలకు మించిన భారం గా మారిన ప్రైవేటు పాఠశాలల వెంట పరిగెత్తాల్సిన అవసరం విద్యార్థుల తల్లిదండ్రులకు ఉండదు.
చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్ర మంలాగే.. కేజీ టు పీజీ విద్య విజయవంతం కావాలంటే ప్రజ ల భాగస్వామ్యం ఆవశ్యకం. మొక్కుబడి శిక్షణలతో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలి. నాణ్యమైన విద్యకోసం తగిన ప్రణాళికలు రూపొందించాలి. ప్రభుత్వ పాఠశాల పటిష్ఠత కోసం కలిసికట్టుగా ముందుకెళ్లాలి. అప్పుడే అట్టడుగు వర్గాలకు ఉన్నత విద్య అందుతుంది. నవ తెలంగాణ మన తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. 

Labels: , ,

బహదూర్‌పల్లి బాట

సోషల్ వర్క్ ఫీల్డు వర్క్ లో భాగంగా ఆ మధ్య నగరానికి కూతవేటు దూరంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాం. అక్కడ అనేక విషయాలు గమనించాం. నిజానికి ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. వీటన్నింటిని చూసిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దవచ్చు అనే విశ్వాసం కలిగింది.
---------------------------------

‘తినడానికి చేపను ఇవ్వడం కాదు, ఆ చేపను పట్టే నైపుణ్యాన్ని నేర్పించు’ అనే సూక్తి ఆ పాఠశాల ప్రధాన ముఖద్వారం వద్ద కనిపించింది. ఒక ప్రభుత్వ పాఠశాల అనగానే సహజంగానే అక్కడ ఉండే సదుపాయాలు గుర్తుకొస్తాయి. ఇవ్వాల చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవన్నది వాస్తవం. కానీ అంతకంటే ఆందోళనకరమైన అంశం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం. ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్నచూపు చూస్తున్న ఈ కాలంలో ఒక పాఠశాల రేపటి తెలంగాణ ప్రభుత్వ కేజీ టూ పీజీ ఉచిత విద్య కార్యక్రమానికి నమూనా నిలుస్తుంది అంటే అతిశయోక్తి కాదు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో కుద్బుల్లాపూర్ మండలంలోని బహదూర్‌పూర్ మండల ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గత ఏడాది వరకు ఇద్దరు విద్యావాలంటీర్లు, ఒక ప్రధానోపాధ్యాయునితో నడిచిన ఆ పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్లతో సతమతమయ్యేది.కాని నేడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓ స్వచ్ఛంద సంస్థ ఆ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నది. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అక్కడ విద్య బోధన జరుగుతున్నది. గత ఏడాది కంటే గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. విలువలతో కూడిన విద్య అందిస్తున్నారు. క్రమశిక్షణ అనేది ప్రాథమిక స్థాయి నుంచి అలవాటు చేస్తే దాని ప్రభావం చాలా ఉంటుంది. అంతేకాదు హానెస్టీ బాక్స్. పాఠశాల పరిసరాల్లో ఏ విద్యార్థికి చెందిన ఏ వస్తువైనా పోతే అది ఎవరికి దొరుకుతుందో వారు నిజాయితీగా హానెస్ట్ బాక్సులో వేయడం. అలా నిజాయితీని ప్రదర్శించిన వారి తెల్లారి ప్రేయర్ సమయంలో ప్రశంసించడం. అంటే ఇదొక రకంగా వారికి నైతిక విద్యను బోధించడం లాంటిదే. సంక్లిష్ట అంశాలను సులభ పద్ధతిలో పిల్లలకు అర్థమయ్యేలా చిత్రాల రూపంలో బోధించడం. ఇందులో పర్యావరణ అంశాలు మొదలు నీతి శతకాలు అన్నీ అందరూ చదువుకునే విధంగా బైట ఒక ప్రదర్శించడం. ఆయా అంశాలు బొమ్మల రూపంలో ఉండడం వల్ల పిల్లలను ఇట్టే ఆకర్షిస్తున్నది. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న ఆ ప్రాథమిక పాఠశాలల పిల్లలు ఒక్క చదువులోనే కాదు అన్ని రంగాల్లో తమదైన ప్రతిభను చూపుతున్నారు. ఇందులో విశేషమేమంటే అక్కడ చదువంతా ఒక బట్టి పద్ధతిలో కాకుండా విద్యార్థులకు కిండర్ గార్డెన్ పద్ధతిలో బోధిస్తున్నారు. బడి అంటేనే పారిపోయే పిల్లల్ని పద్ధతిగా తమ పనులను చక్కబెట్టుకునేట్టు తీర్చిదిద్దుతున్నారు. ఇక చదువు అంటే టీచరే బోధించడం కాదు. తాన చెప్పదలచుకున్న విషయాలు బోర్డుపై రాసి పిల్లలను తమ నోట్ పుస్తకాల్లో రాసుకోమని చెప్పడం కాదు. పిల్లల మధ్యనే వారికి అర్థమయ్యేలా బోధించడం. పాఠం చెప్పిన తర్వాత పది మంది పిల్లల చొప్పున ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక సందేహాలను మరొకరు నివృత్తి చేసుకోవడం. ఇక లెక్కలు సులభ పద్ధతిలో అర్థమయ్యేలా బోధించడం. అలాగే ఎక్కాలను సైతం పాటల రూపంలో బోధించడం వల్ల వారు ఈజీగా గుర్తుపెట్టుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ప్రోత్సాహమందిస్తే వారు తన ప్రతిభను నిరూపించుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో కల. కొందరు కొన్ని రా మెటీరియల్స్‌ను ఉపయోగించి కొన్ని వస్తులను తయారు చేయడం, అలాగే చిన్నతనం నుంచే క్రీడల పట్ల వారికి ఆసక్తి కలిగించడం ఇవన్నీ విద్యార్థులను పాఠశాలవైపు ఆకర్షించే అంశాలే. ఇంత కంటే మెరుగ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతుండవచ్చు. ఒక నిర్ణీత లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడానికి బహదూర్‌పల్లి పాఠశాలే ఆది కాదు అంతమూ కాదు. ఇది ఒక నమూనా కావాలి.
ఇవ్వాల ఫలాన స్కూలులో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య లభిస్తుంది అనేది వాళ్లు చేసుకునే ప్రచారమే కావచ్చు. లేదా ఆయా పాఠశాలల్లో చదవితే మంచి భవిష్యత్తు ఉంటుంది అనే విశ్వాసం కావచ్చు. దీనికి కారణం అవి సంపాదించుకున్న నమ్మకం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే కూలిపని చేసుకునే వారు సైతం ఎంత ఖర్చు అయినా సరే ప్రైవేట్ పాఠశాలలోనే చదివించడానికి మొగ్గుచూపుతున్నాడు. కానీ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం చదివించడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే అక్కన మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, బోధన విషయంలో కావచ్చు వారు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించడానికి కారణమవుతున్నాయి. నిజానికి ప్రైవేట్ పాఠశాలల్లో బోధించే వారికంటే మెరుగైన అర్హతలు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉండవచ్చు. కానీ చదువు చెప్పడానికి ఆ అర్హతలే సరిపోవు. పేద, మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే బాధ్యత వారి తల్లిదండ్రులు వారిపై పెడుతున్నారు. వాళ్లు బాధ్యతను నిర్వర్తించడానికి సంసిద్ధులు కావాలి. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతే కాదు, ఉపాధ్యాయుల బాధ్యత అనే విషయాన్ని మరువరాదు. ప్రైవేట్ పాఠశాలలు ఏటా అడ్మిషన్ల సమయంలో వాళ్లకు వచ్చిన ఫలితాలను చూపెట్టి విద్యార్థులను తమ పాఠశాలలకు వచ్చే విధంగా ప్రచారాలు చేస్తున్నప్పుడు ఆ పని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎందుకు చేయకూడదో ఆలోచించాలి. అంతేకాదు ఇవ్వాల బహదూర్‌పల్లి మండల పరిషత్ పాఠశాలో ఆసక్తి కలిగించే అంశం ఏమంటే రోజువారీ విద్యార్థుల హాజరుపట్టిక ఉంటుంది. అందులో ఎంత మంది హాజరయ్యారు ఎంత మంది రాలేదు అన్నది క్లాసుల వారీగా బోర్డుపై రాస్తున్నారు. ఒకటి రెండు రోజులకంటే ఎక్కువ రోజులు రాని విద్యార్థి ఇంటికి వెళ్లి వారి సమస్యను తెలుసుకుని, ఒకవేళ వాళ్ల ఇంట్లో తల్లిదండ్రులు అంగీకరించుకుంటే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి విద్యార్థులను పాఠశాలకు తీసుకుని వస్తున్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థి పాఠశాలకు రాకపోవడానికి ఆర్థిక సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు. లేదా కుటుంబ సమస్యలు ఏవైనా ఉండవచ్చు. తల్లిదండ్రులు ఇద్దరు కూలి పనికి వెళ్తే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారిని చూసుకోవడానికి మరొకరి చదువును త్యాగం చేసే పరిస్థితులు ఇప్పటికీ గ్రామాల్లో కొనసాగుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు అందరూ కృషి చేయాలి. ఇక ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు నేర్పించే విషయాలు వారికి జీవితాంతం ఉపయోగపడతాయి. పాఠశాల బోర్డుపై ఏ రోజుకారోజు ముఖ్య వార్తలు రాయడం, జనరల్ నాలెడ్జీకి సంబంధించిన ఒక ప్రశ్న రాయడం, నిన్నటి ప్రశ్నకు జవాబు ఇవ్వడం. ఒక మంచి మాట రాయడం. ఇలా విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పరిజ్ఞానమే కాకుండా ఇతరత్రా విషయాలపై అవగాహన కల్పించడం. ఇవన్నీ ఇప్పుడే కొత్తగా వచ్చినవి కాదు. గత రెండు మూడు దశాబ్దాల కిందట ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నవే. కానీ రానురాను ఆ పరిస్థితి పోయి ఇరవై నాలుగు గంటలు పుస్తక పురుగులుగా మార్చే సంస్కృతి వచ్చింది. మార్కుల పేరుతో పిల్లలను బైట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకుండా పుస్తకాలకే పరిమితం చేయడం. ఒకరకంగా ఇది పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పైసలు కుమ్మరిస్తే, పిల్లలు ఆ పుస్తకాల బరువును మోడయం లాంటిది. ఈ పరిస్థితి మారాలి. నాణ్యమైన విద్య అంటే పిల్లలను ప్రకృతికి దూరంగా చదివించడం కాదు. పుస్తకాలే ప్రపంచంగా బోధించడం అంతకన్నా కాదు. అందరికి సమాన విద్య అనేది ఆచరణలో సాధ్యం కావాలంటే ఈ మార్కుల కొలమానం నుంచి మనం బైటికి రావాలి.
మార్పును కోరుకుంటే మార్పుకనుగుణంగా మన ప్రణాళికలను రూపొందించుకోవాలి. వాటిని పకడ్బందీగా ఆచరణలో పెట్టాలి. ఇవాల దేశంలోనే కాదు చాలా రాష్ట్రాల్లోముఖ్యంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో మొదలు తెలంగాణ రాష్ట్రంలో సైతం ప్రాథమిక విద్య పటిష్టంగా లేదని అనేక అధ్యయనాలు తేల్చాయి. ప్రాథమిక విద్య పటిష్టంగా ఉంటేనే విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది. కానీ నేడు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్నది. దీనిపై నిందారోపణలకు పరిమితం అవడం కంటే ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు కృషి చేసే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పిల్లల బంగారు భవితకు బహదూర్‌పల్లి ఒక బాట కావాలి.

Labels: , ,