Monday 2 August 2021

ఉప ఎన్నిక, ఉద్యమకారులు


హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎవరూ అన్నది వారం, పది రోజుల్లోగా అధికారికంగా వెల్లడి కానున్నది. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజురాబాద్ లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఈటల బీజేపీ లో చేరిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం మండలాల వారీగా ఇంచార్జి లను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారు అని అందరూ అనుకుంటుండగానే ఈ నెల రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి.
చివరికి కౌశిక్ టీ ఆర్ ఎస్ కండువా కప్పుకోవడం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా రాష్ట్ర క్యాబినెట్ ఆయనను నామినేట్ చేయడం వంటి నిర్ణయాలు చక చకా జరిగిపోయాయి. అలాగే అధికార పార్టీ ఆహ్వానం మేరకు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, ఈటల చేరిక తర్వాత బీజేపీలో అంతర్గతంగా జరిగిన పరిణామాలతో మాజీమంత్రి పెద్దిరెడ్డి ఇంకా కొంతమంది ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ చేరారు.

దళిత బంధు పథకం, హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యం ప్రతిపక్ష పార్టీలలో భిన్నస్వరాలకు వేదిక అయ్యాయి. కొన్నిరోజులుగా చర్చలో ఉన్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎవరన్నది కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఎన్నికల సందర్భంలో ఉద్యమం, ఉద్యమకారులు అనే ప్రశ్నలు పౌర సమాజం నుంచి వస్తున్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ మాత్రమే చాలామంది ఉద్యమకారులను గుర్తించింది. వారి సేవలు రాష్ట్ర పునర్ నిర్మాణంలో వినియోగించుకుంటున్నది.

ఉద్యమ సమయంలో ఉద్యమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్ర బిందువుగా నిలిచింది. అందుకే దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో పెద్దగా ప్రధాన అంశం కాలేదు. కాని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఉద్యమకారుల విషయం ఇప్పుడు ప్రధానం అయ్యింది. బీసీ సామాజిక సమీకరణలు వంటివే కాకుండా ఈటల రాజేందర్ కు ఉద్యమ నేపథ్యం ఉండటంతో అధికార పార్టీ కూడా అలాంటి అభ్యర్థి వైపే చూసేలా చేసింది. ఈ కోణంలోనే ఉద్యమకారుడు, బీసీ అయిన టీఆర్ ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అభ్యర్థి అయితేనే గెలుపు అవకాశాలు ఉంటాయి అనే అభిప్రాయం అధికార పార్టీలో ఉన్నది. సంక్షేమ పథకాలకు తోడు ఉద్యమకారుడు వర్సెస్ ఉద్యమకారుడు అనేవి తమకు లాభిస్తాయి అనే ఆలోచనలో టీఆర్ ఎస్ అధినాయకత్వం ఉన్నదని అర్థం అవుతున్నది. గెల్లు అభ్యర్థిత్వం అధికారికంగా ప్రకటించడమే మిగిలింది ఇక. ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకోనున్నది.

- ఆసరి రాజు

Labels: , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home