Thursday, 30 October 2025

‘రీల్స్‌ కాదు.. రన్స్‌ చెయ్‌’.. బ్యాట్‌తోనే ట్రోలర్లపై రోడ్రిగ్స్‌ రోరింగ్‌!

 


‘‘ఎప్పుడూ చూసినా మైదానంలో తిరుగుతూ ఉంటావు. రీల్స్‌ చేసుకుంటూ ఉంటావు. ఆడేదెప్పుడు? అనవసరంగా జట్టులో ఉంచారు’’.. ఇవీ జెమీమా రోడ్రిగ్స్‌ గురించి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్‌. ఎప్పుడూ నవ్వుతూ ఉండే రోడ్రిగ్స్‌ ఈ విజయం అనంతరం కన్నీళ్లు పెట్టుకుంది. తన సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పింది.వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఆసీస్‌పై భారత్‌ అద్వితీయమైన విజయం సాధించింది. అసాధ్యమనుకున్న టార్గెట్‌ను ఛేదించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇదంతా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తోపాటు జెమీమా రోడ్రిగ్స్‌ చలవే. మరీ ముఖ్యంగా ఆఖరివరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించిన రోడ్రిగ్స్‌ ఇన్నింగ్స్‌ ఎప్పటికీ మరిచిపోలేం. ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా సెమీస్‌కు చేరిన ఆసీస్‌పై 127 పరుగులతో జెమీమా అజేయంగా నిలిచింది. రోడ్రిగ్స్‌ రోరింగ్‌ అంటూ అభిమానులు పిలుచుకోవడం వెనక చాలా శ్రమ ఉంది. ఈ గెలుపుతో అప్పటివరకూ ఆమెలో దాగి ఉన్న కన్నీళ్లన్నీ జలజలా బయటకు వచ్చేశాయి. వద్దన్నవారే జట్టులో ఉండాల్సిందే అనే స్థాయికి రోడ్రిగ్స్‌ చేరుకుంది.

ఆ కన్నీళ్లలో..
 సాధారణంగా ప్రపంచ కప్‌ గెలిస్తేనో లేకపోతే ఏదైనా భారీ టోర్నీలో విజయం సాధిస్తేనో భావోద్వేగానికి గురికావడం సహజం. కానీ, టీమ్‌ఇండియా సెమీస్‌లో ఆసీస్‌పై గెలవడంతోనే సంబరాలు అంబరాన్నంటాయి. శతకంతో జట్టును గెలిపించిన జెమీమా రోడ్రిగ్స్‌ అయితే మైదానమంతా కలయతిరుగుతూ కన్నీళ్లు పెట్టుకుంది. సెంచరీ చేసిన తర్వాత కూడా సంబరాలు చేసుకోని ఆమె.. మ్యాచ్ విజయం అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేసింది. నవీ ముంబయి తన హోం గ్రౌండ్‌ కావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇలా చేయడానికి మరో కారణం ఆమెపై వచ్చిన ట్రోలింగ్‌కు తన బ్యాటింగే సమాధానం చెప్పిందనే ఆత్మవిశ్వాసమని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.
రీల్స్‌ చేస్తుంది.. గిటార్‌ అంటే ప్రాణం 
క్రికెట్‌లోనే కాకుండా జెమీమాకు ఇతర ఆటల్లోనూ ప్రావీణ్యం ఉంది. హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌ బాల్ కూడా ఆడుతుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే క్రికెటర్. రీల్స్‌ చేస్తూ సందడిగా ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు దాదాపు 1.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక గిటార్‌ వాయిస్తూ పాటలు పాడటం ఆమెకెంతో ఇష్టం. ఇన్‌స్టా వీడియోలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అయితే, ఇవన్నీ ఆమెపై ఓ రకంగా ప్రతికూలంగా మారడానికి కారణం. ఏదైనా మ్యాచ్‌లో విఫలమైతే వెంటనే జెమీమాను టార్గెట్‌ చేసేవారికి ఈ రీల్స్‌ ఆయుధంగా మారేది. ఎప్పుడు చూసినా రీల్స్, వీడియోలు చేసుకోవడం కాదు ఆటపై దృష్టి పెట్టాలంటూ ఉచిత సలహాలు ఇచ్చేవారు.

అత్యుత్తమ ఫీల్డర్‌ కూడానూ.. 
జెమీమా రోడ్రిగ్స్‌ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. సన్నగా రివటాలా ఉండే జెమీమా మైదానంలో చాలా చురుగ్గా ఉంటుంది. అత్యుత్తమ ఫీల్డింగ్‌ నైపుణ్యాలతో జెమీమా రోడ్రిగ్స్‌ ‘జాంటీ రోడ్స్‌’ను గుర్తుకుతెచ్చేలా ప్రదర్శన ఇస్తుంటుంది. అందుకు తాజా ఉదాహరణ ఆసీస్‌తో సెమీస్‌. తాలియా మెక్‌గ్రాత్‌ను ఔట్‌ చేసిన తీరు అద్భుతం. ఇక బంతిని ఆపడంలో ఆసీస్‌కు దీటుగా స్పందించింది. అసలు జట్టులో స్థానం ఉంటుందో, లేదో అనే పరిస్థితి నుంచి తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకొనే స్థాయికి చేరుకుందనడంలో సందేహం లేదు.

కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. కోటి మంది లఖ్‌పతి దీదీలు: బిహార్‌లో ఎన్డీయే మ్యానిఫెస్టో

 


పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మరికొన్ని రోజుల్లో జరగనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా బిహార్‌ అధికార ఎన్డీయే కూటమి శుక్రవారం ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. వలస కార్మికులను ఆకట్టుకునేలా రాష్ట్రంలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది.పట్నాలో ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో ‘సంకల్ప పత్ర’ పేరుతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఎల్జేపీ (రాంవిలాస్‌) పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాసవాన్‌ కూడా పాల్గొన్నారు.
మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలివే.. రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య ఏడాదికి రూ.లక్ష వరకు సంపాదించేలా కోటి మంది మహిళలను ‘లఖ్‌పతి దీదీ’లుగా మార్చడమే లక్ష్యం. మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం. ఈబీసీలకు రూ.10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు. రాష్ట్రంలో సామాజిక-ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు కర్పూరీ ఠాకూర్‌ కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.9వేలు పెట్టుబడి సాయం. మూడు విడతల్లో ఈ మొత్తం చెల్లింపు బిహార్‌లో ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు, నాలుగు నగరాల్లో మెట్రో రైలు సేవల ఏర్పాటు. 5 ఏళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటు ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు, మెడికల్‌ కాలేజీల ఏర్పాటు గిగ్‌ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం

సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 150వ జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

 


భారత మాజీ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులర్పించారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోడీ పటేల్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పటేల్‌ విగ్రహంపై హెలికాప్టర్‌ నుంచి పూలవర్షం కురిసింది. అనంతరం ఏక్తా దివస్‌ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్‌ ఏర్పాటు చేశారు. ఇందులో సైనిక దళాల కవాతు ఆకట్టుకుంది.సైనిక దళాల నుంచి గౌరవవందనం స్వీకరించిన మోదీ.. అనంతరం వారికి సెల్యూట్‌ చేశారు. సాయుధ దళాలు, స్థానికులతో కలిపి ప్రధాని ఐక్యతా ప్రమాణం చేశారు. సైనిక బలగాల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌, జమ్మూకశ్మీర్‌, అండమాన్‌ నికోబార్‌, మణిపుర్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆసీస్‌పై శతకాల మోత.. చరిత్రలో నిలిచే ఇన్నింగ్స్‌లు!



బలవంతుడిని బలంతోనే కాదు.. బుద్ధితోనూ కొడితేనే విజయం వరిస్తుంది. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ సరిగ్గా అదే చేసింది. ఒక్కో పరుగు జోడిస్తూ గెలుపు రుచి చూసింది. ఆస్ట్రేలియాను సెమీస్‌లో ఓడించి ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. అప్పుడు హర్మన్‌ ప్రీత్‌ కౌర్ ఆ బాధ్యత తీసుకోగా.. ఈసారి జెమీమా రోడ్రిగ్స్‌ చివరివరకూ ఉండి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ రెండు ఇన్నింగ్స్‌లు చరిత్రను సృష్టించినవే.అప్పుడు అలా.. అది 2017 వన్డే ప్రపంచ కప్‌. భారత జట్టుకు సీనియర్‌ హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్‌. ఆమె సారథి. ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్ కూడా ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన క్రికెటర్. ఇక స్మృతి మంధాన, దీప్తి శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చి నాలుగేళ్లు కూడా కాలేదు. కానీ, ఆ టోర్నీలో భారత్‌ టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. మూడో స్థానంతో సెమీస్‌కు చేరుకుంది. అక్కడ ఆస్ట్రేలియా ఎదురైంది. ఓపెనర్లు స్మృతి మంధాన, పూనమ్ రౌత్ త్వరగానే పెవిలియన్‌కు చేరారు. సారథి మిథాలీ భారీ ఇన్నింగ్స్‌ ఆడలేదు. అప్పుడు క్రీజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హర్మన్‌ (115 బంతుల్లో 171*) ప్రత్యర్థి బౌలర్లపై సునామీలా విరుచుకుపడింది. హరికేన్‌ కపిల్‌దేవ్‌లా విజృంభించింది. దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తిలతో కలిసి మంచి భాగస్వామ్యాలను నమోదు చేసి భారత్‌కు అద్భుత స్కోరును అందించింది. తొలి 25 ఓవర్ల ఆటను చూసిన వారెవరూ భారత్ 281 పరుగులు చేస్తుందని ఊహించి ఉండరు. అయితే, మ్యాచ్‌ 50 ఓవర్లు కాదు సుమా.. 42 ఓవర్ల ఆటే. వర్షం కారణంగా మ్యాచ్‌ను కుదించారు. ఆమె ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయంటే ఆ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంటే, ఆఖరి 17 ఓవర్లలో భారత్ 180 పరుగులు చేసిందంటే దానికి కారణం హర్మన్‌. క్రికెట్ పుస్తకంలోని అన్ని షాట్లను ప్రయోగించింది. లాంగాఫ్‌ మీదుగా బౌండరీని దాటించడం ఆమెకెంతో ఇష్టం. మైదానం నలువైపులా షాట్లతో అలరించింది. ఇక బౌలింగ్‌లో అదరగొట్టిన భారత్ ఆసీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.ఇప్పుడు జెమీమాతో కలిసి.. 2025.. సేమ్‌ ప్రత్యర్థి. ఈసారి అజేయంగా సెమీస్‌కు చేరుకున్న ఆసీస్‌ను ఓడించడం కష్టమని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు కూడా అదే అనుకొన్నారు. స్కోరు బోర్డుపై 339 పరుగుల లక్ష్యం ఉందనగానే.. కొంతమంది టీవీలు కట్టేసిన వారూ లేకపోలేదేమో. ఓపెనర్లు 60 పరుగుల్లోపే పెవిలియన్‌కు చేరారు. అప్పుడు కూడా ఇంకొందరు తమ సెటప్ బాక్స్‌లను ఆపేసి ఉంటారు. కానీ, జెమీమా రోడ్రిగ్స్‌ - హర్మన్‌ ప్రీత్ కౌర్ జోడీ ఒక్కో పరుగును జోడిస్తూ వెళ్లారు. దాదాపు 156 బంతుల్లో 167 పరుగులు జోడించి విజయానికి బాట వేశారు. జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) కాస్త డల్‌ అయినప్పుడు హర్మన్‌ దూకుడు ప్రదర్శించింది. ఈ క్రమంలోనే 89 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరింది. కానీ, చివరివరకూ పట్టుదల ప్రదర్శించిన జెమీమా (127*) మాత్రం వికెట్ ఇవ్వను.. విజయం వదలను అన్నట్లుగా ఆడింది. మధ్యలో మూడుసార్లు జీవదానం లభించడంతో సద్వినియోగం చేసుకుంది. ఆమె ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్‌ లేకపోవడం గమనార్హం. మొత్తం 14 ఫోర్లను బాదిన జెమీమా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. మ్యాచ్‌ అనంతరం ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న తీరు ప్రతిఒక్కరినీ కదిలించింది.ఆస్ట్రేలియా బలమైన టీమ్‌ మాత్రమే కాదు.. నాకౌట్‌లో తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. దానికి ఉదాహరణ ప్రస్తుతం వన్డే వరల్డ్‌ కప్‌. బంతిని ఏమాత్రం వదలకూడదనే పట్టుదల చూసి మిగతా టీమ్‌లు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే, కీలక సమయాల్లో క్యాచ్‌లు డ్రాప్‌ చేయడంతో ఓటమి తప్పలేదు. దానిని సద్వినియోగం చేసుకున్న భారత్‌ అద్భుత విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

వాడని సిమ్ కార్డులను తొలగించుకున్నారా?

Tuesday, 28 October 2025

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: బహిరంగ సభలతో రంగంలోకి అమిత్ షా, రాహుల్ గాంధీ

 



బిహార్‌లో ఎన్నికల వేడి హీటెక్కింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం (అక్టోబర్ 29, 2025) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఎన్డీఏ, ఇండియా బ్లాక్ అభ్యర్థుల తరపున బహిరంగసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నేషనల్‌ మీడియాలో కథనాల ప్రకారం... అమిత్ షా దర్భంగా, సమస్తిపూర్, బేగుసరాయ్‌లో ఎన్డీఏ అభ్యర్థుల మద్దతుగా సమావేశాలను నిర్వహించనున్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో పాటు ఇండియా బ్లాక్ నాయకులతో కలిసి ముజఫర్‌పూర్‌, దర్భంగా ప్రాంతాల్లో రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇకపోతే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బిహార్‌లో ఎన్డీఏ అభ్యర్థుల మద్దతుగా ప్రచారసభలను నిర్వహించనున్నారు.


తేజస్వీ యాదవ్‌పై నిత్యానంద్ రాయ్ విమర్శలు

కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను “అవినీతిపరుడు”గా అభివర్ణించారు.

“నేడు ‘ఘమండియా’ కూటమి తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ‘మేము బిహార్‌ను అవినీతి నుంచి విముక్తం చేస్తాము’  తేజస్వీ యాదవ్ అంటున్నారు. తానే అవినీతి కేసుల్లో నిందితుడు, అనేక స్కాంలలో పాల్గొన్న వ్యక్తి బిహార్‌ను అవినీతి నుంచి ఎలా విముక్తి చేస్తాడని ప్రజలు ప్రశ్నించాలి,” అని రాయ్ వ్యాఖ్యానించారు.


రాహుల్ గాంధీ బిహార్ పర్యటన

కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిహార్ పర్యటనలో భాగంగా తేజస్వీ యాదవ్‌తో ఉమ్మడి ప్రజాసభను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అలాగే ఆయన దర్భంగా ప్రాంతంలో కూడా ఓ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

ఇకపై ట్రూకాలర్ అవసరం లేకపోవచ్చా?



  •  కాల్ చేసిన వ్యక్తి అసలు పేరు డిఫాల్ట్‌గా చూపించేందుకు సిఫార్సు


టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) మంగళవారం ప్రకటించిన ప్రకారం.. టెలికాం శాఖ (డీఓటీ)తో కలిసి కాల్ చేసిన వ్యక్తి అసలు పేరు. కనెక్షన్ కోసం ఉపయోగించిన గుర్తింపు ప్రకారం కాల్ అందుకునే వ్యక్తికి ఆటోమేటిక్‌గా (డిఫాల్ట్‌గా) చూపించేందుకు అంగీకరించింది. 2024 ఫిబ్రవరిలో జారీ చేసిన ‘టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్స్‌లో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ ( సీఎన్‌ఏపీ) పరిచయం’పై ట్రాయ్‌ సిఫార్సుల్లో, ఈ సేవను కేవలం కాల్ అందుకునే సబ్ స్క్రైబర్‌ అభ్యర్థన మేరకే ప్రారంభించాలని సూచించింది. అయితే, డీఓటీ ట్రాయ్‌కి తిరిగి పంపిన సూచనలో మార్పు కోరుతూ, సీఎన్‌ఏపీ సేవను డిఫాల్ట్‌గా అందుబాటులో ఉంచి, అవసరం లేని వారు దానిని డిసేబుల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని పేర్కొంది.


ప్రపంచవ్యాప్తంగా సీఎన్‌ఏపీ సేవను ప్రారంభించే ప్రయత్నం మోసపూరిత కాల్స్‌ను నివారించడం, “డిజిటల్ అరెస్ట్”, ఆర్థిక మోసాలు వంటి సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రారంభించబడింది.


డీఓటీ, ట్రాయ్‌,సిఫార్సులను అంగీకరించే అవకాశం ఉంది, అందులో కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ రిస్ట్రిక్షన్ (సీఎల్‌ఐఆర్‌) సదుపాయం పొందిన సబ్స్క్రైబర్ల పేరు కాల్ అందుకునే వ్యక్తికి చూపించకూడదని పేర్కొంది. సీఎల్‌ఐఆర్‌ సదుపాయం సాధారణ సబ్స్క్రైబర్లు, కేంద్ర గూఢచారి సంస్థల అధికారులు మరియు ప్రముఖులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.


సాధారణ సబ్స్క్రైబర్ల విషయంలో టెలికాం ఆపరేటర్లు పూర్తి ధృవీకరణ చేసి, చట్ట అమలు సంస్థలకు అవసరమైనప్పుడు సమాచారం అందించేలా ఉండాలి. ఈ సదుపాయం బల్క్ కనెక్షన్లు, కాల్ సెంటర్లు, టెలిమార్కెటర్లకు అందుబాటులో ఉండదు.


ట్రాయ్‌, డీఓటీ రెండూ ఈ సేవను 4G మరియు దాని కంటే అధిక సాంకేతికతలు ఉపయోగించే వినియోగదారులకు డిఫాల్ట్‌గా అందించాలని నిర్ణయించాయి, ఎందుకంటే 2జీ,3జీ వినియోగదారుల కోసం ఈ ప్రక్రియను అమలు చేయడం బ్యాండ్‌విడ్త్ పరిమితుల కారణంగా సాంకేతికంగా కష్టతరమని పేర్కొన్నాయి.

Featured post

‘రీల్స్‌ కాదు.. రన్స్‌ చెయ్‌’.. బ్యాట్‌తోనే ట్రోలర్లపై రోడ్రిగ్స్‌ రోరింగ్‌!

  ‘‘ఎప్పుడూ చూసినా మైదానంలో తిరుగుతూ ఉంటావు. రీల్స్‌ చేసుకుంటూ ఉంటావు. ఆడేదెప్పుడు? అనవసరంగా జట్టులో ఉంచారు’’.. ఇవీ జెమీమా రోడ్రిగ్స్‌ గురిం...