Sunday 4 March 2012

మౌనం వీడాల్సిందే!



రాష్ట్రంలో జరగనున్న ఉపఎన్నికలు చిత్తూరు బాబులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి, సీమాంధ్రలో జగన్ ను ఎదురుకోవడానికి వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న విషయం విదితమే. బాబు, కిరణ్ లు ఇద్దరు నాకు నువ్వు నీకు నేను అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్, టిడిపిలు కలిసి పనిచేస్తున్నాయని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తాజాగా సమాచార కమిషనర్ల నియామక సందర్భంలో బాబు కిరణ్ తో కలిసిపోయారని బొత్స మొదట వ్యాఖ్యానించి తరువాత సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు తెలంగాణ సమస్య మరో వైపు సీమాంధ్ర లో జగన్ ప్రభావంతో బాబు సతమతమవుతున్నారు. అలాగే కిరణ్ కూడా అధిష్టానం అండతో అధికారాన్ని చేపట్టారు. బాబు  సమస్యలనే కిరణ్ ఎదురుకొంతున్నారు. దీనికి తోడు సొంత పార్టీ లోని అసమ్మతి రోజురోజుకు పెరిగిపోతున్నది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ను, కాంగ్రెస్ పార్టీని జగన్, ఆయన వర్గీయులు బహిరంగంగానే విమర్శిస్తున్నా ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆయన సహచర మంత్రులే అంటున్నారు. ఇక కిరణ్ మోనార్క్ ల వ్యవహరిస్తున్నారని టి కాంగ్రెస్ నేతల విమర్శలు. మంత్రి పదవులకోసమో, కాంట్రాక్టు పనులకోసమో కిరణ్ బాగా పనిచేస్తున్నారు అని పొగిడే వారిని కొంత మండి  తన వర్గీయుల చేత చెప్పిస్తుంటారు. ఇలా అధికారం కోసం బాబు, ఉన్న అధికారాన్ని కాపాడుకోవడానికి కిరణ్ చాలానే శ్రమిస్తున్నారు. అవసరం అయినప్పుడల్లా కలిసి పనిచేస్తున్నారు. అయితే వచ్చిన చిక్కల్లా యిప్పుడు  ఏడు స్థానాలు, జగన్ వర్గ ఎమ్మెల్యేల పై వేటు పడడంతో మరో పదిహేడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా ఏడు స్థానాల్లో ఆరు తెలంగాణాలో, ఒకటి సీమాంధ్ర లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు కీలకం కానున్నాయి. తెలంగాణ ఉద్యమం చల్లబడిందని అధిష్టానానికి పంపుతున్న నివేదికలు, జగన్ ప్రభావం అంతగా లేదనే  నివేదికల్లో వాస్తవాలేమిటో తెలిసి రానున్నాయి. కోవూర్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో వై ఎస్ ఆర్ సిపి అభ్యర్థి భారీ మెజారిటీతో నెగ్గితే, దాని ప్రభావం యిప్పుడు వేటు పడిన పదహారు స్థానాలు (సీమాంధ్ర)పై కచ్చితంగా పడుతుంది. ఇక తాను తెలంగాణ కోసమే రాజీనామా చేశానని అనర్హత వెటుకు గురైన జగన్ వర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండ సురేఖ భవితవ్యం కూడా తేలిపోనుంది. ఎందుకంటే పరకాలలో టి ఆర్ ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ప్రకటించారు. అయితే యిప్పుడు తెలంగాణాలో జరుగుతున్న ఆరు స్థానాల్లో జగన్ పార్టీ పోటీ చేయడం లేదు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను వై ఎస్ ఆర్ పార్టీ గౌరవిస్తున్నదని పైకి చెబుతున్నా.. తెలంగాణ పై స్పష్టమైన వైఖరి చెప్పకపోతే ఓటమి కాయమని తెలిసే బరిలోకి దిగలేదని తెలుస్తున్నది. అందుకే రేపు పరకాల ఎన్నిక తెలంగాణాలో వై ఎస్ ఆర్ పార్టీ భవిషత్తును నిర్ణయించనుంది. తాజా తెలంగాణ ఉపఎన్నికల గండాన్ని జగన్ తాత్కాలికంగా తప్పించుకున్నా.. పరకాల రూపంలో తెలంగాణ ప్రజానీకం జగన్ ను  ప్రశ్నించనుంది. అప్పుడు జగన్ కూడా రెండుకళ్ళ సిద్ధాంతాలు, సరైన సమయంలో సరైన నిర్ణయం, ఇచ్చే శక్తి లేదు , తెచ్చే శక్తి తనకు లేదని తప్పించుకోవాలనుకుంటే కుదరక పోవచ్చు. ఈ ఉప ఎన్నికలు బాబు, కిరణ్ లకు ఎంత ముఖ్యమో జగన్ కు కూడా అంతే ముఖ్యం. రాష్ట్ర విభజన తమచేతుల్లో లేదని చేబుతున్న ఈ ముగ్గురు సీమాంధ్ర బాబులకు దీనిపై ఏదో ఒకటి తేల్చుకునే సమయం ఆసన్నమైంది. తమ మనసులో మాటలను చెప్పాల్సిందే!

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home