Thursday 2 September 2021

సమయం కాదు, సందర్భం కాదు


రెండు దశాబ్దాలకు పైగా సంకీర్ణ ప్రభుత్వాలకు కాలం చెల్లి కమలనాథులకు ప్రజలు పట్టంగట్టారు. ఈ ఏడేండ్ల కాలంలో మోదీ, షాలు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ర్టాల్లో పాగా వేయడానికి ప్రయత్నం చేసి మొదటి ఐదేండ్లు విజయం సాధించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ర్టాల్లో అధికారాన్ని కోల్పోవడమే కాకుండా కకావికలం అయ్యింది. అయితే 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీలో బీజేపీ అధికారం దక్కించుకున్నది. ఆ ఎన్నికల సమయంలో ఒక సందర్భంలో బీజేపీ ఓడిపోతుందనే సంకేతాలు కూడా వచ్చాయి. మోదీ సొంతరాష్ట్రం కావడం వల్ల ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల గురించి అంత ఆసక్తి నెలకొన్నది. అయితే చివరికి సాధారణ మెజారిటీ కంటే కొన్ని సీట్లను దక్కించుకుని తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్నది. ఆ క్రమంలోనే బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ కూటమి బీజేపీని మట్టికరిపించాయి. అ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు తిరిగి జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా చేశాయి. ఒడిషాలోనూ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ 2019 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి నవీన్ పట్నాయక్ క్లీన్ ఇమేజ్, రాజకీయ అనుభవం ముందు చతికిలపడింది. ఆ తర్వాత మహారాష్ట్రలో దశాబ్దాల బీజేపీ-శివసేన కూటమి బద్దలు అయ్యింది. పంజాబ్‌లో అకాలీదళ్-బీజేపీ కూటమి చెదిరిపోయింది. ఫలితంగా బీజేపీ పాలిత, భాగస్వామ్య పార్టీల చేతిలో ఉన్న మహారాష్ట్ర, పంజాబ్ పోయాయి. 2019లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ పార్టీ సహకారంతో మనోహర్ లాల్ ఖట్టర్ తన ఖుర్చీని పదిలం చేసుకున్నాడు. 2018లో జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ పాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. మొన్న బెంగాల్ ఎన్నికల్లో ఏం జరిగిందో విదితమే. తమిళనాడులో డీఎంకే గెలువడంతో బీజేపీ పాలిత, భాగస్వామ్య పార్టీల పాలిత జాబితా నుంచి చాలా రాష్ర్టాలు పోయాయి. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టి గద్దెనెక్కినా యడ్యూరప్ప స్థానంలో బసవరాజు బొమ్మై సీఎం అయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ బీజేపీ పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడే చెప్పలేం. మధ్యప్రదేశ్‌లోనూ జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు ఫలితంగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్నది.  


కేంద్రంలో అధికారాన్ని నిర్ణయించే కీలక రాష్ర్టాలన్నింటిలో బీజేపీ ఐదేండ్ల కిందటి కంటే చాలా బలహీనపడింది. ఒక్క యూపీలోనే బలంగా ఉన్నది. అయితే ప్రస్తుత బలమే తిరిగి బీజేపీని వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలో నిలబెట్టలేవు. అట్లా అని కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారా? అంటే అదీ లేదు. ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలే ఆ పార్టీని నిండా ముంచుతున్నాయి. కలిసి పోరాడాల్సిన సమయంలోనే గ్రూపులుగా విడిపోయి అధికారానికి దూరమౌతున్న సందర్భాలు ఈ ఏడేండ్ల కాలంలో అనేక రాష్ర్టాల్లో చూశాం. ఇప్పటికీ ఆ పరిస్థితి మారలేదు. ఈ సమయంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్నాయా? అంటే అవుననే అంటున్నారు. ముఖ్యంగా యూపీ, బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, ఒడిషా, ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ర్టాల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఏకపక్షంగా సీట్లు గెలుచుకునే పరిస్థితి లేదు. మిగతా రాష్ర్టాల సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే మెరుగైన స్థానాలనే దక్కించుకునే అవకాశం ఉన్నది. అలాగే కమలనాథులు కూడా తమ పట్టును నిలుపుకుని లోక్‌సభ ఎన్నికల్లో గతంలో కంటే మెరుగైన స్థానాలు దక్కించుకునే వ్యూహ రచన ఇప్పటి నుంచే చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ఆశిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఇప్పుడు సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతలు ఇప్పుడు కేసీఆర్ ఫ్రంట్‌తో జతకట్టే అవకాశాలు అంతగా లేవు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలతో సతమతమౌతున్నప్పటికీ 19 ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నది. ఇటీవల ఆన్‌లైన్ ద్వారా సమావేశం నిర్వహించింది. బీజేపీ వ్యతిరేక కూటమిని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈ సమయంలో ఇటు బీజేపీతో గాని, అటు కాంగ్రెస్‌తో గాని సమాన దూరం పాటిస్తున్నవి ఏపీ, తెలంగాణలోని అధికార పార్టీలు. కాంగ్రెస్ మద్దతు లేకుండా కేంద్రంలో అధికారం అంత ఈజీ కాదన్నది అందరూ అంగీకరిస్తున్నదే. అందుకే రేపటి సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారం దక్కించుకోవడం సంగతి ఏమో గాని గతంలో కంటే ఎక్కువగానే లోక్‌సభ సీట్లను కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. అధికార పార్టీపై అన్నివర్గాల్లో నెలకొన్న అసంతృప్తి దీనికి కారణం. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికలు బీజేపీ అనుకూల, వ్యతిరేక కూటముల మధ్యనే జరుగుతాయి. తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాలను వదిలి హస్తిన రాజకీయాలవైపు చూసే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆశిస్తున్న హస్తిన రాజకీీీయ కూటమికి స్థానం లేదు. ఇది సమయం కాదు, సందర్భం కాదు.

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home