Saturday 26 August 2023

కామ్రేడ్లు ఇకనైనా కళ్లు తెరవండి!


బీఆర్‌ఎస్‌ ను ఓడించాలనే నినాదంతోనే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతామని సీపీఐ, సీపీఎం నేతల ప్రకటించడం హాస్యాస్పందగా ఉన్నది. దీనికి వాళ్లు చెప్పిన కారణాలు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత పొత్తు ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పారని, కానీ మమ్మల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడాన్ని వామపక్ష నేతలు తప్పుపడుతున్నారు. అలాగే బీజేపీతో సఖ్యత ఏర్పడిన కారణంగానే కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందని ఆరోపించారు. కనీస మిత్ర ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వాపమక్షాలు మిత్ర ధర్మం గురించి మాట్లాడటం వారి బలహీనతను తెలియజేస్తున్నది. బీజేపీతో సఖ్యత అన్న సంగతి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఇండియా కూటమిలోకి బీఆర్‌ఎస్‌ను ఎందుకు ఆహ్వానించలేదు అన్న ప్రశ్నకు ఆ కూటమిలోని పార్టీల నేతలు చెప్పిన విషయాలు కూడా వాపమక్ష నేతలు అప్పుడు అర్థం కాలేదా? మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో 'విధాత' తెలుసుకునే ప్రయత్నంలో ఆ నియోజకవర్గ ప్రజలు చెప్పిన విషయాలు ఆసక్తి కలిగించాయి. ఒకప్పుడు మునుగోడు కమ్యూనిస్టుల కంచుకోట. ఆ తర్వాత చాలాకాలం కాంగ్రెస్‌కు అనంతరం బీఆర్‌ఎస్‌ కు అవకాశం ఇచ్చింది. కానీ ప్రస్తుతం బీజేపీకి ఇక్కడి ఓటర్లు మారే ప్రశ్నే తలెత్తదు అని తేల్చిచెప్పారు. మునుగోడు బీఆర్‌ఎస్‌ విజయం వెనుక వామపక్షాల పాత్ర కూడా ఉన్నది. తెలంగాణలో బీజేపీ విస్తరణను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే నాడు వామపక్షాలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన విషయం విదితమే. వామపక్షాల బలం తెలిసే కేసీఆర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించగానే వారి మద్దతు కోరారు. ఆ ఎన్నిక అయిపోయే వరకు వరకు వారితో సత్ససంబంధాలు నెరిపారు. ఫలితం అనంతరం వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని వామపక్ష నేతలే చెప్పారు. అప్పుడైనా కమ్యూనిస్టులు కళ్లు తెరవాల్సింది. 


ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం జాతీయ నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్నారు. కేసీఆర్‌ ఎంఐఎం మా మిత్ర పక్షం అని అసెంబ్లీ వేదికగా.. బహిరంగసభల్లోనూ బాహాటంగానే ప్రకటిస్తున్నారు. కానీ ఎన్నడూ ఆయన వామపక్షాల గురించి ప్రస్తావించలేదు. అలాంటప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి అవసరం ఏమొచ్చింది? బీఆర్‌ఎస్‌ వామపక్షాలకు చెరో టికెట్‌, రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వజూపినట్టు సమాచారం.  ఈ మాత్రం దానికి వాళ్లు బీఆర్‌ఎస్‌తో పొత్తు కోవడం దేనికి? వామపక్షాలు ఐక్యంగా వాళ్లకు బలం ఉన్నచోట కలిసి పోటీ చేస్తే అవే సీట్లు వారికి సొంతంగానే దక్కుతాయి. అవసరం అనుకుంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో కలిసి వారి జాతీయ నాయకత్వం కలిసి పనిచేస్తున్నందున వారు పోటీ చేసే చోట ఇరువురు సహకరించుకునే అవకాశం ఉన్నది. ఇన్ని అవకాశాలను వదిలేసి బీఆర్‌ఎస్‌తోనే కలిసి వెళ్దామనుకున్నామని, కానీ కేసీఆర్‌ మమ్మల్ని పట్టించుకోవడం లేదని కామ్రేడ్‌లు ఆవేదన చెందడం అభ్యుదయవాదులకు, ప్రజాస్వామికవాదులకు నచ్చడం లేదు. 


వామపక్షాలు ఇప్పటికే త్రిపుర, బెంగాల్‌ వంటి రాష్ట్రాలను కోల్పోయాయి. రానున్నరోజుల్లో వారి ఉనికే ప్రశ్నార్థం అయ్యే ప్రమాదం ఉన్నది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే వాళ్లు ఇంకో పార్టీని టికెట్లు అడగటం కంటే సొంతంగానే పోటీ చేసి తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటే మంచిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతున్నది. కనుక  కామ్రేడ్లు దేశంలో ప్రస్తుతం నెలకొన్నప్రతికూల పరిస్ఙితులు దృష్ట్యా మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడే పార్టీలతో కలిసి వెళ్లడం వారికీ మంచిది. దేశానికి శ్రేయస్కరం.

Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home