Tuesday 3 April 2012

గెలిచింది తెలం'గాన'మే !


తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వచ్చిన ప్రతీసారి.. ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఆంద్ర, మన్యసీమ, గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రం వాదనలు మున్డుకొచ్చేవి. తరువాత బహుజన తెలంగాణ, అణగారిన వర్గాల తెలంగాణ కావాలని.. దొరల తెలంగాణ వద్దనే వాదనలు వచ్చాయి. రెండున్నర సంవత్సరాలుగా ఇలాంటి వాదనలు వచ్చాయి పోయాయి. ఆయా సందర్భాలకు అనుగుణంగా కొందరు ఇలాంటి వాదనలు తెచ్చారు, వీటిని ప్రజలు ఎంత వరకు విశ్వసించారు అనేది వేరే విషయం. ఈ వాదనలు తెచ్చిన వారు వాటికోసం ఉద్యమించింది లేదు. ఉద్యమిస్తున్నది లేదు. అందుకే ఆ వాదనలు పేపర్లో వ్యాసాలుగానో.. వార్తలు గానో మిగిలి పోయాయి.  యిప్పుడు రాయల తెలంగాణ కావాలని కొందరు..మతతత్వ తెలంగాణ వద్దని మరికొందరు వాదిస్తున్నారు. నిజంగా తెలంగాణ ప్రజలు ఈ అన్ని వాదనల్లో దేన్ని సమర్థిస్తున్నారో తెలియదు గానీ .. ముందు స్వరాష్ట్రం కావాలనే తమ ఆకాంక్షను మాత్రం వెలిబుచ్చుతున్నారు. ఇది ఎవరు అవునన్నా.. కాదన్నా వాస్తవం. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష.. ఆవేదన.. వారి అలుపెరుగని పోరాటం.. ఆరాటం అంతా తెలంగాణమే. యిప్పుడు ఈ ప్రాంత  ప్రజలు యుద్ధం చేస్తున్నది ఇద్దరిపైనే. అందులో తెలంగాణ ప్రకటన చేసి  వెనక్కి తీసుకున్న కేంద్రం పైన.. మరొకరు ఆడిన మాట తప్పినా రెండుకండ్ల బాబు పైన.. ఈ యుద్ధంలో తెలంగాణ వ్యతిరేకులపై ఈ ప్రాంత ప్రజలు విజయాన్ని సాధించారు.. సాధిస్తున్నారు... మునుముందు సంపూర్ణ విజయం సాధిస్తారు కూడా. ఇందులో రెండో మాటకు తావు లేదు. ఈ యుద్ధంలో కుల, మత, వర్గాల ప్రస్తావన లేదు. ఉండదు. ఉండకూడదు. బలమైన శత్రువును ఎదురుకోవాలంటే అది ఒక బలవంతుడికే సాధ్యం అవుతుంది. ఆ బలం పదేళ్ళ కిందట ప్రారంభమైన మలిదశ ఉద్యమం నేడు వివిధ పాయలుగా చీలిపోయి.. అందరి ఆకాంక్ష కోసం ఒక్క తాటిపైకి వచ్చింది. ఇందులో ఎవరి అభిప్రాయాలూ వారికున్నా..నినాదం మాత్రం ఒక్కటే. ఇది తెలంగాణ వ్యతిరేక శక్తులకు మింగుడు పడడం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని గ్రహించారు. బలమైన తెలంగాణ శక్తుల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీసే వ్యూహాలు పన్నుతున్నారు. ఈ కుట్రలను తిప్పికోట్టక పొతే తెలంగాణ ప్రజలు కట్టు బానిసలుగా బతకాల్సి వస్తుంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీ ల విధానం ఒక్కటే. ఇందులో వారి వారి ప్రయోజనాలు తప్పక ఉంటాయి. దీనిపై యిప్పుడు చర్చలు కూడా అనవసరం. ఈ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలిచినా అక్కడి ప్రజల తీర్పుగానే భావించాలి. అక్కడ శత్రువు ఓడిపోయాడు తెలంగాణ గెలిచింది. ఒకవేళ అక్కడ కాంగ్రెస్, టిడిపిలలో ఈ పార్టీ గెలిచినా... లేదా టి ఆర్ఎస్ టిడిపి లాగా నాలుగో స్థానానికి దిగాజరినా తెలంగాణ వాదం పై విషం చిమ్మేందుకు సీమాంద్ర మీడియా, సీమాంధ్ర నేతలు సిద్దపడేవారు. సిద్ధపడ్డారు కూడా. ఎన్నికల ఫలితాల రోజు మహబూబ్ నగర్లో మొదట టి ఆర్ఎస్ నాలుగో స్థానంలో ఉన్నప్పుడు.. మిగతా చోట్ల ముందున్నా వాటిని వదిలి పెట్టి.. మహబూబ్ నగర్ ఎన్నికపై చర్చలు పెట్టిన విషయాలు ఇక్కడ మనం గుర్తించు కోవాలె. దాన్ని మరిచిపోయి ..  పార్టీలు.. వర్గాల ప్రస్తావన తేవడం సరికాదు.  ఎందుకంటే తెలంగాణాలో జరిగిన ఆరు స్థానాల్లో ఐదు చోట్ల తెలంగాణ కోసం రాజీనామా చేసినవాళ్ళు అయితే ఒక్క స్థానానికి  మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నిక వచ్చింది. ఐదు స్థానాల్లో ఆయా అభ్యర్థులపై స్థానికంగా ఎంత వ్యతిరేకత ఉన్న తెలంగాణ వాదనికే ప్రజలు జై కొట్టి.. ఉద్యమ స్పూర్తిని చాటారు. మహబూబ్ నగర్ స్థానంలో మాత్రం జే ఏ సీ లో కీలక పాత్ర పోషిస్తున్న రెండు పార్టీలు బరిలో ఉండడం మూలంగా అక్కడ  ఎవరిని ఎన్నుకోవాలో.. ఏ పార్టీకి మద్దతు తెలంగాణ వాదులకు కూడా పరీక్షా ఎదురైంది. ఈ సమస్యను పరిష్కరించే సమయం కూడా జే ఏ సీ కి లేకుండా పోయి ఉండవచ్చు. ఇందులో ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అన్ని వర్గాల వారు కూర్చుని చర్చించుకునే అవకాశం కూడా ఉన్నది. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకునే మార్గాలు కూడా ఉన్నాయి. అంతే కానీ సీమాంధ్ర పెట్టుబడి దారులు తెస్తున్న వాదనలు.. తమది సమక్య వాదమని.. భాష ప్రయుక్త రాష్ట్రాలే తమ సిద్ధాంతమని బీరాలు పలికి.. చివరికి మాటమార్చి ఈ ప్రాంత ప్రజలను అవమాన పరిచే విధంగా తెలంగాణ ఇస్తే మతకలహాలు చెలరేగుతాయని శ్రీకృష్ణ కమిటీ ముందు అడ్డదిడ్డంగా మాట్లాడిన సిపిఎం వైఖరి తెలంగాణ వాదులది కావద్దు. వారి మాటలను బలపరిచే విధంగా మన వాదనలు ఉంటే..మన అనైక్యతే శత్రువుకు ఆయుధం అవుతుంది!
అలాగే మహబూబ్ నగర్ లో బిజెపి అభ్యర్థి గెలుపు పై వాదనలు చేస్తున్న మిత్రులు కూడా ఒక్క విషయం గ్రహించాలి. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణపై ఒక స్పష్టమైన విధానం ఆ పార్టీకి ఉన్నది. ఎప్పుడు అవకాశం వచ్చిన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ఆ పార్టీ నిలదీస్తున్నది. కానీ తెలంగాణ తను వ్యతిరేకం కాదని.. వ్యతిరేకంగా మాట్లాడలేదని.. మాట్లాడబోనని చెబుతూనే రాష్ట్ర అసెంబ్లీలో మాత్రం ఈ అంశం పై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. వ్యతిరేకం కాదన్న వాళ్ళు అనుకూలం అని చెప్పలేదు. బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తామనడం లేదు. ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్న పార్టీలను వదిలిపెట్టి..తెలంగాణకు మద్దతు ఇస్తామన్న పార్టీలను తప్పుపట్టడం ఎందుకో! అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఆ రాష్ట్రం ఎలా ఉండాలో ఈ ప్రాంత ప్రజలు నిర్ణయించుకుంటారు. అప్పటిదాకా ఉద్యమ ఐక్యతను ప్రదర్శిస్తున్న ప్రజల మధ్య విభజన తెచ్చే విధానాలకు ఎవరు పాల్పడిన అది చారిత్రక తప్పిదమే అవుతుంది.

--
rajuasari@gmail.com


Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home