Sunday 25 March 2012

మధ్యంతర సంకేతాలు ..



అవినీతి కుంభ కోణాలతో సతమతమవుతున్న యూపీఏ -2 ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూపీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి తనయుడు అఖిలేష్ ఆ రాష్ట్ర బాధ్యతలు అప్పగించి కేంద్రంపై కన్నేశారు ములాయం. అందుకే తనయుడికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆరు నెలల్లో అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎందుకంటే దేశంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు ఉన్న రాష్ట్రం యూపీ. గత పార్లమెంటు ఎన్నికల్లో ఇరవై రెండు స్థానాలు చేజిక్కించుకున్న ఎస్పీ ఈసారి దాన్ని యాబైకి పెంచాలని చూస్తున్నది. అప్పడు కేంద్రంలో చక్రం తిప్పవచ్చని ములాయం భావిస్తున్నారు. అందుకోసం తన క్యాడర్ ను సన్నద్ధం చేసే పనిలో మునిగిపోతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్న యూపీఏ -2  రోజుకో అవినీతి కుంభ కోణం వెలుగులోకి వస్తున్నది. మొన్నటిదాకా టూ జీ, కామన్ వెల్త్, ఎస్ బ్యాండ్ లతో పాటు తాజాగా బొగ్గు కుంభకోణం మన్మోహన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దేశవ్యాప్తంగా అవినితీకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఈ కుంభకోణాలు మన్మోహన్ సర్కారు ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. అవినీతి నిర్మూలనకు ఎలాంటి చర్యలు చేపట్టక పోగా.. భాగస్వామ్య పక్షాలతోనే కేంద్ర ప్రభుత్వానికి సమస్యలు ఎదురవుతున్నాయని.. కాంగ్రెస్ పార్టీ  భావించే భావి ప్రధాని రాహుల్ మొదలు ప్రస్తుత ప్రధాని వరకు తమ తప్పులను మిత్ర పక్శాలపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది యూపీఏ మిత్రపక్షాలకు మింగుడు పడడం లేదు. శరద్ పవార్ వంటి నేతలు ఇప్పటికే ఈ విషయంపై ప్రధానిని నిలదీశారు కూడా. రైల్వే బడ్జెట్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు తృణమూల్, కాంగ్రెస్ పార్టీలకు మధ్య పెద్ద అగాధాన్ని పెంచాయి. అయితే పెంచిన రైల్వే చార్జీల తగ్గింపు, రైల్వే మంత్రి మార్పుతో ఆ వివాదం కొంత సద్దుమణిగింది. కానీ దిదీ కూడా అదను చూసి యూపీఏ నుంచి బయటకు రావాలని చూస్తున్నారు. అలాగే ఐదు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు  కూడా కేంద్ర ప్రభుత్వ మనుగడపై ప్రభావాన్ని చూపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆశలు పెట్టుకున్న యూపీలో దెబ్బతినడం.. గత ఎన్నికల్లో ముప్పై మూడు స్థానాలను కాంగ్రెస్ పార్టీకి  ఏపీ అందించింది. ఇప్పడు ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ   తెలంగాణ సమస్య వల్ల కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.మొత్తానికి దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోతూ వస్తున్నది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. బీజే పీ పరిస్థితి అలానే ఉన్నది. దీంతో మళ్లీ తృతీయ ఫ్రంట్ తెరపైకి వస్తున్నది. అందుకే కొడుకుకు యూపీ బాధ్యతలు అప్పగించి మొన్నటి అసెంబ్లీలో సాధించిన ఊపుతో గతంలో కంటే మెరుగైన స్థానాలు గెలిస్తే ప్రధాని పదవిని చేపట్టవచ్చు అని ములాయం భావిస్తున్నట్టు ఉన్నది. యూపీ ఏ కు బయటి నుంచి మద్దతు ఇస్తున్న ఎస్పీ ప్రభుత్వంలో చేరాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు కోరిన ములాయం తిరస్కరించారు. ఢిల్లీ పీఠంపై కన్నేసిన ములాయం అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. దేశంలో దశాబ్దంన్నర కాలంగా సంకీర్ణ ప్రభుత్వాలే కొనసాగుతున్నాయి. గురి కుదిరితే కాంగ్రెస్ లేదా బిజేపీ మద్దతుతో ప్రధాని పదవిని చేపట్టాలని ములాయం, మాయావతి, నితీశ్ వంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యంతరం మాట అసలే తలెత్తదు అని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నా తాజాగా ములాయం చేసిన వ్యాఖ్యలు లోక్ సభకు  ఏడాదికి ముందే ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి.
rajuasari@gmail.com

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home