Friday 30 July 2021

నమ్మి నానబోస్తే...


కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలో ఉంచడాన్ని తెలంగాణ మొద‌టి నుంచీ వ్యతిరేకిస్తున్న‌ది. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు లేకుండా బోర్డుల పరిధిని నిర్ణయించరాదని కోరింది. తెలంగాణ విజ్ఞ‌ప్తుల‌ను ఏవీ ప‌ట్టించుకోకుండా కేంద్రం ఏక‌ప‌క్షంగా వాటి పరిధిని నిర్ణయిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువరించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యం తెలంగాణ‌కు గొడ్డ‌లిపెట్టుగా మార‌నున్న‌ది. 

ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ నీటి గోస గురించి ఆచార్య కొత్త‌ప‌ల్లి జ‌య‌శంక‌ర్ అంద‌రికీ అల్క‌గా అర్థ‌మ‌య్యేలా వివ‌రించేవారు. ఉమ్మ‌డి పాల‌కులు తెలంగాణ ప్రాజెక్టులు అంటేనే అంత‌ర్రాష్ట్ర స‌మ‌స్య‌లు, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ స‌మ‌స్య‌ల్లోకి నెట్టేవారు. ప్రాజెక్టులు శిలాఫ‌ల‌కాల‌పై, కాగితాల‌పై నీళ్ల కేటాయింపులు ఉండేవి. ఫ‌లితంగా నీళ్ల, క‌రెంటు స‌మ‌స్య‌లు తెలంగాణ ప్రాంతానికే ప‌రిమితం చేసేవారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆవిర్భావం నాటికి తెలంగాణ‌లో చెరువుల కింద పార‌కం అయ్యే భూములే అధికంగా ఉండేవి. వ‌ల‌స పాల‌కుల విధానాల వ‌ల్ల చెరువుల‌న్నీ ధ్వంసం అయ్యాయి. వ‌ర్షాభావ ప‌రిస్థితులకు తోడు, ప్రాజెక్టులు పూర్తికాక‌పోవ‌డం వ‌ల్ల నీటి కొర‌త ఉండేది. క‌రెంటు స‌మ‌స్య‌ల గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. పెట్టిన పెట్టుబ‌డికి చేతికి రాక అప్పులు తీర్చ‌లేక రైతుల ఆత్మ‌హ‌త్య‌లు నిత్య‌కృత్యం. 


అందుకే నీళ్లు, నిధులు, నియామ‌కాల ట్యాగ్‌లైన్ తో  ప్రారంభం అయిన తెలంగాణ ఉద్య‌మం రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత ఉద్య‌మ‌నాయ‌కుడే మ‌ఖ్య‌మంత్రి కావ‌డంతో ద‌శాబ్దాల తండ్లాటలు ఒక్కొక్క‌టిగా తీరుతున్నాయి. తెలంగాణ ఏర్ప‌డితే చీక‌టే అవుతుంది అన్న‌చోట‌నే వెలుగులు నింపారు. ద‌శాబ్దాలుగా అన్నిర‌కాలుగా న‌ష్ట‌పోయిన ప్రాంతానికి న్యాయం చేయాల్సిన జాతీయ‌పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా అనేక కొర్రీలు పెట్టి ఇచ్చింది. ఫ‌లితంగా పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ‌డ‌మే కాకుండా రాష్ట్రంలోని ఖ‌మ్మం జిల్లాలోని ఏడు మండ‌లాల‌ను ఏపీకి క‌ట్ట‌బ‌ట్టింది బీజేపీనే. అలాగే అప్ప‌టికే విద్యుత్ కొర‌తతో స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలంగాణ‌కు అక్క‌ర‌కు వ‌చ్చే సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కూడా ఏపీకి క‌ట్ట‌బెట్టిన చ‌రిత్ర బీజేపీ. కాంగ్రెస్ విధానాల‌ను, ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ తెలంగాణ వ్య‌తిరేక విధానాల‌పై ఒక్క ఉద్య‌మ‌పార్టీనే స్పందించింది. నిర‌సించింది. నిల‌దీసింది. పోరాడింది. మ‌రి జాతీయ‌పార్టీల నాయ‌కులుగా చెప్పుకుంటున్న‌వాళ్లు ఈ ఏడేండ్ల కాలంలో తెలంగాణ‌కు ఏం తెచ్చారో చెప్పండి అంటే స్ప‌ష్ట‌మైన స‌మాధానం చెప్ప‌కుండా మొత్తం కేంద్రం నిధుల‌తోనే రాష్ట్రం న‌డుస్తున్న‌ద‌న్న‌ట్టు అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నారు.

రాష్ట్రం ఏర్ప‌డిన మొద‌టి నుంచే ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంక్షోభంలో ఉన్న వ్య‌వ‌సాయ‌రంగ అభివృద్ధి కోసం బ‌డ్జెట్‌లో ఏటా సింహ‌భాగం నిధులు కేటాయిస్తూ ఖ‌ర్చులు చేస్తున్న‌ది. దాని ఫ‌లిత‌మే వ‌ట్టిపోయిన చెరువులు బాగుప‌డ్డాయి. వాటిలోకి నీళ్లు వ‌చ్చాయి. ఆ చెరువుల్లో చేప‌లు దుముకులాడుతున్నాయి. నీళ్ల వివాదాల విష‌యంలో ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణ‌తో వ్య‌వ‌హ‌రిస్తూ అంత‌రాష్ట్ర వివాదాల సుడిగుండంలో ఉన్న‌ ప్రాజెక్టుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం చేసుకున్న ఘ‌న‌త తెలంగాణ ప్ర‌భుత్వానిది. మ‌హారాష్ట్ర‌తో స‌హృద్భావ సంబంధాల వ‌ల్ల చేసుకున్న నీటి ఒప్పందాల‌తో కాళేశ్వ‌రం లాంటి ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ విష‌యంలో కేంద్రం ప్ర‌భుత్వం చేసింది ఏమీ లేదు. తెలంగాణ తీసుకున్న విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు ఇవ్వాల చాలా రాష్ట్రాల‌కు అనుస‌ర‌ణీయం అవుతున్న‌ది. నీళ్ల విష‌యంలో క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌లతో లేని ఇబ్బందులు ఏపీతోనే ఎందుకు త‌లెత్తుతున్నాయో తెలుసుకోవాలి. మొద‌టి నుంచి ఇక్క‌డి చెరువులు బాగు చేయ‌లేదు. తెలంగాణ‌కు కేటాయించిన నీళ్లు విడుద‌ల చేయ‌లేదు. అందుకే ఇక్క‌డి నిధులు, నీళ్లు ఏపీకి త‌ర‌లించి అక్క‌డి ప్రాంతాల‌ను అభివృద్ధి చేసుకున్న చ‌రిత్ర వ‌ల‌స పాల‌కుల‌ది. అందుకే అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ ఏపీ పాల‌కుల ద్వంద్వ విధానాల‌తోనే జ‌ల జ‌గ‌డాలు. తాజాగా కేంద్రం కృష్ణా, గోదావ‌రి బోర్డుల‌ను పూర్తిగా త‌న అధీనంలోకి తీసుకోవడం కూడా ఏపీ వ్య‌వ‌హ‌రించిన తీరుతోనే. 

ఈ ఏడేండ్లే కాలంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది శూన్యం. విభ‌జ‌న చ‌ట్టం అక్ష‌రం అక్ష‌రం చ‌దివిన  త‌ర్వాత‌నే కృష్ణా, గోదావ‌రి బోర్డుల‌పై కేంద్రం గెజిట్ విడుద‌ల చేసింది అంటున్నారు. మ‌రి విభ‌జ‌న చ‌ట్టంలో అప‌రిష్కృతంగా ఉన్న ఇంకా అనేక స‌మ‌స్య‌లు ఇప్ప‌టికీ ఎందుకు పరిష్కారం కావడం లేదు?  రాష్ట్రానికి విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రావాల్సిన ప్రాజెక్టులు ఎందుకు ఇవ్వ‌డం లేదు? తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల‌ని ఎన్నిసార్లు విన్న‌వించినా ప‌ట్టించుకోలేదు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ ఊసే లేదు. ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేయాల‌ని కోరినా కేంద్రం స్పందించ‌డం లేదు. మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ ప్రాజెక్టులకు నీతి ఆయోగ్ ప్ర‌శ‌సంలే కాదు వీటికి త‌గిన నిధులు కేటాయించాలి చెప్పినా కేంద్రంలోని పెద్ద‌లు పెడ‌చెవిన పెట్టారు. అంతేకాదు బీజేపీ భాగ‌స్వామ్య ప‌క్షాలు కూడా బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తీసుకున్న విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించాయి. అయినా కేంద్రంతో ఘ‌ర్ష‌ణ ఎందుకు అని నోట్ల ర‌ద్దు, జీఎస్టీల‌తో పాటు వివిధ బిల్లుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చింది. అయినా తెలంగాణ‌కు బ‌డ్జెట్ లోనూ, ప్రాజెక్టుల కేటాయింపుల్లోనూ రిక్త‌హ‌స్తాలే. 

కేంద్రం తాజాగా తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు, కొత్త విద్యుత్‌ చట్టం సవరణ బిల్లు రాష్ట్ర రైతాంగానికి అశ‌నిపాతం. అందుకే వాటిని పార్ల‌మెంటు వేదిక‌గా టీఆర్ఎస్ వ్య‌తిరేకించింది. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల్సిందే అని దేశ‌వ్యాప్తంగా నిర‌స‌నలు ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నాయి. అట్ల‌నే  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త విద్యుత్‌ చట్టం చాలా ప్రమాదకరం . ఆ చట్టం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఈ బిల్లును అనేక రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టంతో విద్యుత్‌పై రాష్ర్టాలకున్న అధికారం పోతుంది. ఈ బిల్లు అమ‌ల్లోకి వ‌స్తే విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరించే ప్ర‌మాదం ఉన్న‌ది.  తాజా కేంద్రం కేంద్రం ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. దీనిపై కూడా ఆందోళ‌న వ్య‌క్తం అవుతున్న‌ది. దీనిపై దేశంలో సహకార వ్యవస్థ బలోపేతం కోసం కేంద్రం ఇటీవల సహకార మంత్రిత్వ శాఖను నెలకొల్పామ‌ని, దేశంలోని సహకార సంస్థలను పునరుద్ధరించడంతో సహా గ్రామీణ ప్రాంతాల్లో రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ఈ శాఖ నెలకొల్పామని కేంద్రం సర్కారు స‌మ‌ర్థించుకుంటున్న‌ది.  అయితే సహకార వ్యవస్థకు సంబంధించిన చ‌ట్టాలు రాష్ట్రాల ప‌రిధిలో రూపుదిద్దుకుంటాయి. ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు కేంద్రానికి లేద‌ని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కొత్తగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం కొత్త‌ సమస్యలు సృష్టిస్తున్న‌ది. అయితే తాము అధికారంలోని లేని రాష్ట్రాల్లో అస్థిర‌త్వాన్ని సృష్టించ‌డానికి అనేక కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్న‌ది. త‌మ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించే రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డం ఏడేండ్లుగా చేస్తున్న‌ది.  బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యున‌ల్ తీర్పు ప్ర‌కారం ఉమ్మ‌డి రాష్ట్రానికి కృష్ణా జ‌లాల్లో తెలంగాణ వాటా తేల్చాల‌ని తెలంగాణ కోరుతున్న‌ది. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నిస్తామ‌ని చెప్పిన కేంద్రం ఇప్ప‌టికీ దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఏండ్ల త‌ర‌బ‌డి ఈ అంశాన్నిప‌ట్టించుకోక‌పోగా న‌మ్మి నాన‌బోస్తే అన్న‌ట్టు న‌లుగురు ఎంపీల‌ను గెలిపించినందుకు బీజేపీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి ఉన్న హ‌క్కుల‌ను హ‌రించేలా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. నీటి పంప‌కాల పూర్తి చేయ‌కుండా గెజిట్ పేరుతో తెలంగాణ నీటి హ‌క్కుల‌పై పెత్త‌నం చేయాల‌ని చూస్తే ప్ర‌జ‌ల నుంచి ప్ర‌తిఘ‌ట‌న త‌ప్ప‌దు. పోరాటాలు తెలంగాణ‌కు కొత్త కాదు. అందుకే రాష్ట్రాల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌ల‌ను  ప‌రిష్కారం చేయాలి. అప్ప‌టివ‌ర‌కు కేంద్రం తెచ్చిన గెజిట్‌ను ఉప‌సంహ‌రించుకోవాలి. 

-ఎ. రాజు

Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home