Thursday 29 July 2021

ఏడేండ్ల విధాన ఫలితాలు

 ఏడేండ్ల విధానాల ఫలితాలు


నీళ్లు, నిధులు అన్నవి తెలంగాణలో ఉద్యమంలో నినాదంగానే కాదు, కీలకాంశాలుగా మారాయి. అందుకే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు లక్ష వరకు రైతు రుణమాఫి చేపట్టింది. ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యాంల నిర్మాణం, ఎరువుల పంపిణీ, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి వ్యవసాయ అనుకూల విధానాలను చేపట్టింది. ఫలితంగా ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్రంలో రైతుల కుటుంబాలకు భరోసా దొరికింది.  దేశంలోనే రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా నమోదైన రాష్ట్రం తెలంగాణ అని తాజాగా పార్లమెంటులో కేంద్రం ప్రకటించింది. 


ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గుతూ వస్తున్నాయి. రైతుల ఆత్మహత్యలకు పంట నష్టం, గిట్టుబాటు ధరలు, అప్పుల వంటివే కాదు ఇతరత్రా సమస్యలు కూడా కారణం. రాష్ట్రంలో దాదాపు 90 శాతం చిన్న, సన్నకారు రైతులే. ఉన్న భూమి మీదనే కుటుంబం మొత్తం ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి. పిల్లల చదువులు, ఇండ్లు కట్టుకోవడం, పెండ్లిళ్లు వంటివి చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు భారమయ్యేవి. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గురుకుల పాఠశాలలు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల వలె ఇంగ్లీషు మీడియం చదువులు, నాణ్యతతో కూడిన విద్య, అన్నిసౌకర్యాలతో కూడిన హాస్టల్ వసతులు గురకుల పాఠశాలలు అందిస్తున్నాయి. అందుకే ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజానీకం తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. 


పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెండ్లిళ్లు ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఆయా కుటుంబాలకు కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్లకు లక్ష వరకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అందిస్తున్నది. పేదవర్గాల వారికి భారంగా ఉన్న విద్య, పెండ్లిళ్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలతో పెద్ద భారం తగ్గింది. అట్లనే ప్రైవేటు దవాఖానల్లో ప్రసవాలు అంటేనే వేలు, లక్షల్లో బిల్లులు చెల్లించలేని దుస్థితి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం మానవీయంగా ఆలోచించి సర్కారు దవాఖానల్లో ప్రసవాలు చేయించుకుంటే కేసీఆర్ కిట్ అందిస్తున్నది. బాబు పుడితే పన్నెండు వేలు, పాప పుడితే 13 వేలు అందిస్తున్నది. ఈ పథకం చాలా కుటుంబాలకు మేలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూంల నిర్మాణం పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నది. ఈ పథకంపై ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నా వేలాదిమంది పేదలు తమ సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారు. 


ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఒకవైపు భారీ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతూ.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నా సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది. వ్యవసాయరంగానికి పెద్ద పీట వేసింది. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి తగిన ప్రోత్సాహం అందిస్తున్నది. రైతులకు ఒకప్పుడు భారంగా ఉన్న అనేకం ప్రభుత్వ ఆసరాతో అనేక ఇబ్బందులు తొలిగిపోయాయి. వ్యవసాయరంగానికి అన్నిరకాలుగా అందిస్తున్న సాయానికి తోడు వ్యవసాయరంగ అనుబంధ వృత్తుల ద్వారా రైతుల ఆదాయాలు మెరుగయ్యాయి. వాళ్ల అక్కరలు తీరుతున్నాయి. అప్పుడు చేయాల్సిన అవసరం కొంత తీరింది. రైతుల ఆత్మహత్యలు తగ్గడానికి ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న విధాన నిర్ణయాలే కారణం. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు వచ్చినా కీలక సమయంలో గ్రామీణ ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ వస్తున్నారు. వారికి మద్దతు తెలియజేస్తున్నారు.  


-ఎ. రాజు

Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home