Sunday 26 September 2021

పార్టీలో పూర్తి పట్టు ఇక ఆ ఇద్దరిదే!

జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్‌, గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. మహాత్మగాంధీ జయంతి రోజైన అక్టోబర్‌ 2న వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరనున్నారని సమాచారం. వాస్తవానికి సెప్టెంబర్‌ 28నే వీరు పార్టీలో చేరుతారనే వార్తలు వినిపించాయి. అయితే ఆలస్యం అయినా ఈ ఇద్దరు యువనేతల చేరిక దాదాపు ఖరారైంది.

ఇటీవల రాహుల్‌ గాంధీతో  కన్నయ్య కుమార్‌ భేటీ అయ్యారు. అప్పుడే ఆయన కాంగ్రెస్‌లో చేరుతారన్న అంతా అనుకున్నారు. సీపీఐలో ఇమడలేకపోవడం ఆయన చేరికకు కారణమని అంటున్నారు. ఆయనను బీహార్‌ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిని చేసే యోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గత ఎన్నికల్లో ఆర్జేడీ ప్రచార బాధ్యతలన్నీ తన భుజానికెత్తుకున్న తేజస్విని లాలు ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి విదితమే. రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయిన  తర్వాత ఆయన కుమారుడు గత ఎన్నికల సమయంలో నితీశ్ కు వ్యతిరేకంగా, బీజేపీ కి అనుకూలంగా పనిచేశారు. అయినా ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత ఆ పార్టీలో చీలిక వచ్చింది. ఇప్పుడు చిరాగ్ను బీజేపీ దూరం పెట్టింది. పార్టీలో చీలిక తెచ్చిన తన బాబాయ్ పశుపతి పాశ్వాన్ కు కేంద్ర మంత్రి మండలి లో చోటు దక్కింది. కన్హయ్య కుమార్, తేజస్వి యాదవ్, చిరాగ్ లు కలిసి రానున్న రోజుల్లో బీజేపీ, నితీశ్ కు వ్యతిరేకంగా పనిచేయన్నారు. 

మరోవైపు గుజరాత్‌ వాద్గాం నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ కూడా చాలా రోజులుగా కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌లో ఉన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్‌జిత్‌ సింగ్‌ను ఎంపిక చేయడాన్ని ఆయన స్వాగతించడం గమనార్హం. వచ్చే ఏడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేశ్‌ చేరిక కాంగ్రెస్‌కు కొంతమేర కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ ఇటీవలే గుజరాత్ ముఖ్యమంత్రిని మార్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అనైక్యత వల్లనే స్వల్ప మెజారిటీతో బీజేపీ గటెక్కింది. రాష్ట్ర కాంగ్రెస్ కూడా నాయకత్వ సమస్య ఎదురుకొంటున్నది. అందుకే జిగ్నేశ్‌ను పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నది. హార్దిక్ పటేల్ ను కూడా కలుపుకుని గుజరాత్ లో బీజేపీ కి చెక్ పెట్టాలన్నది కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనగా కనిపిస్తున్నది.అప్పట్లో కాంగ్రెస్ నాయకత్వ సమస్యపై సీనియర్లు సంధించిన లేఖాస్త్రాలపై సోనియా, రాహుల్ లు పెద్దగా స్పందించలేదు. అప్పుడప్పుడు నాయకత్వం పై సీనియర్లు విమర్శులు చేస్తున్నా మౌనమే సమాధానం అవుతున్నది.


కానీ  ఇటీవల యువ నాయకులకు పార్టీలో పెద్ద పీట వేసే నిర్ణయాలు తీసుకుంటున్నది. పార్టీలో ఇప్పటిదాకా  సోనియా గాంధీ నిర్ణయమే అందరికీ శిరోధార్యం. కానీ పంజాబ్ లో ముఖ్యమంత్రి మార్పు మొదలు కన్హయ్య కుమార్, జిగ్నేశ్‌ మేవాని వంటి నేతలను కాంగ్రెస్ లో తీసుకునివచ్చి రానున్న ఎన్నికల్లో బీజీపీని నిలువరించే వ్యూహాలకు రాహుల్, ప్రియాంక వాద్రాలు ఇప్పటి నుంచే అమలుచేస్తున్నారు. రానున్న రోజుల్లో రాహుల్, ప్రియాంకలే పార్టీపై పూర్తి పట్టు సాధించబోతున్నారు అనడానికి ఇవే సంకేతాలు.

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home