Tuesday 31 August 2021

కష్టకాలంలో కాంగ్రెస్


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దెదింపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతున్నది. ఇందుకోసం ఇటీవల 19 పార్టీలతో వర్చువల్‌ సమావేశం కూడా నిర్వహించింది. దేశ క్షేమం కోసం మనమంతా కలిసి పనిచేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని సోనియాగాంధీ ఆ సమావేశంలో స్పష్టం చేశారు. అలాగే ప్రజాసమస్యలపై ఐక్యపోరాటం చేయాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నది. కాంగ్రెస్‌ పార్టీ వివక్ష పార్టీలను ఏకం చేసే పనిపెట్టుకున్నది. కానీ ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలను పరిష్కరించకుండా విపక్ష పార్టీలకు సారథ్యం ఎలా వహిస్తుంది? జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి పటిష్ట నాయకత్వం లేదు. దీనికితోడు ఎన్నికల్లో వరుస ఓటములతో క్యాడర్‌లో నైరాశ్యం నెలకొన్నది. పార్టీలో అంతర్గతంగా అసమ్మతి రాగం కొంతకాలంగా కొనసాగుతున్నది. ఫలితంగా మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయింది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాలలో సీఎం కుర్చీ కోసం కొట్లాట నడుస్తున్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే ఏడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ఎలా సమాయత్తం చేస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలే 2024 పార్లమెంటు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి.


2022లో జరిగే ఏడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ  పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాలో నేరుగా ఎదురుకోనున్నది. ఇందులో గోవాలో గోవా ఫార్వార్డ్‌ పార్టీ (జీఎస్‌పీ) 2022 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే ప్రయత్నాలు చేస్తున్నది. ఇక పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, కొత్తగా ఎన్నికైన పీసీపీ అధ్యక్షుడు సిద్దూ వర్గాల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితుల్లో ఇరువురు నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు పంజాబ్‌లో పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నది. కేంద్రంలో అధికారాన్ని అందించే అతిపెద్ద రాష్ట్రం యూపీ. అక్కడ కాంగ్రెస్‌ పార్టీ మూడుదశాబ్దాలుగా మనుడగ పోరాటం చేస్తున్నది. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ ఇప్పటికే ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసి, ఎన్నికలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత ప్రియాంక వాగ్రాపై పడింది. ఉత్తరాఖండ్‌లోనూ మాజీ సీఎం హరీశ్‌సింగ్‌ రావత్‌, ఆ రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ ప్రీతమ్‌ సింగ్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకే సంవత్సరంలో ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చి రాజకీయంగా ఇబ్బందులు కొనితెచ్చుకున్న కమలం పార్టీని ఎదుర్కొని కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని దక్కించుకునే అవకాశాలను అంతర్గత కుమ్ములాటలతో చేజార్చుకుంటున్నది. అలాగే కీలక రాష్ట్రం గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ చేతులు ఎత్తేసింది. ఆ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. దీనికి బాధ్యత వహిస్తూ రాష్ట్రస్థాయి కీలక నేతలైన పీసీసీ అధ్యక్షుడు అమిత్‌ చావ్లా, ప్రతిపక్ష నేత పరేశ్‌ ధనాని రాజీనామా చేశారు. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి రాజీవ్‌ సతావ్‌ చనిపోయి నాలుగు నెలలు దాటింది. దీంతో కీలకమైన మూడు పదవులకు పూర్తి స్థాయి నియామకాలు జరగలేదు. దీంతో నాయకులు లేని కాంగ్రెస్‌ క్యాడర్‌లో అయోమనం నెలకొన్నది. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ అంతే. ఆ రాష్ట్ర మాజీ సీఎం వీరభద్రసింగ్‌ మరణం కాంగ్రెస్‌ పార్టీకి పెద్దలోటే అంటున్నారు. అక్కడ బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్‌ పార్టీ అందిపుచ్చుని అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలు ఏవీ మొదలుపెట్టలేదు. ఇట్లా కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీచేసే రాష్ర్టాల్లో అంతర్గత కలహాలు, భాగస్వామ్య పార్టీలతో కలిసి పోటీచేసే చోట విభేదాలు పరిష్కరించుకోనంత కాలం కాంగ్రెస్‌ పార్టీకి కష్టకాలమే.

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home