Saturday 14 August 2021

పార్టీల బీసీ బాట

 హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితబంధు పథకం ప్రభావం ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ జనరల్ స్థానంలో ఇప్పుడు అన్ని పార్టీలు బీసీ పాట పాడుతుండటం గమనార్హం. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ఈటల రాజేందర్ ది బీసీ సామాజిక వర్గమే. టీ ఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీసీనే. ఇంకా అక్కడ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ వాళ్ళు కూడా బీసీ అభ్యర్థి వైపే మొగ్గుచూపుతారని అంచనా. ముఖ్యంగా కొండా సురేఖ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. బహుజనవాదం వినిపిస్తున్న  బీఎస్పీ కూడా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో  తమ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉన్నది. ఆ పార్టీ కూడా ఆ నియోజకవర్గంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల కే సీటు కేటాయించవచ్చు.  ఇలా ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక దాదాపు అన్ని పార్టీలును బీసీల వైపు మళ్లించింది. 


కేంద్రంలో ఇటీవల మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. అందులో ఎక్కువ శాతం ఓబీసీ లకే బెర్తులు దక్కాయి. యూపీలో గత ఎన్నికల్లో బీజేపీ ఈ ఓబీసీ ప్రయోగం తోనే మంచి ఫలితాలు సాధించిన విషయం విదితమే. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీలు జనరల్ స్థానాల్లో బీసీ ప్రయోగాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో హుజురాబాద్ ఇప్పుడు ఆ ప్రయోగానికి వేదిక అయ్యింది. పార్టీల రాజకీయ అవకాశవాదం ఎలా ఉన్నా బీసీలకు జనరల్ స్థానంలో ప్రాతినిధ్యం లభిస్తున్నది. 


మార్పు ఎక్కడో ఒక దగ్గర మొదలు కావాలె. అది రాష్ట్రంలో హుజురాబాద్ నుంచి ప్రారంభం కావడం మంచి పరిణామం అని బీసీ నాయకులు భావిస్తున్నారు. పార్టీలన్నీ దాదాపు అగ్ర కులాల నాయకత్వంలోనే నడుస్తున్నది వాస్తవమని వారి వాదన. ఒక బలమైన పార్టీ అభ్యర్థి బీసీ కావడంతో మిగిలిన పార్టీలు కూడా బీసీ అభ్యర్థుల వైపే చూసే అనివార్యత ఇప్పుడు హుజురాబాద్ లో ఏర్పడింది. అందుకే అక్కడ అన్ని పార్టీలు బీసీ వాదాన్ని జపిస్తున్నాయి. 


Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home