Monday 9 August 2021

పథకాలు సరే, కొలువుల సంగతి?

దళిత సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దళిత బంధు పథకంపై ప్రశంసలు, విమర్శలు వస్తున్నా ముఖ్యమంత్రి అడుగులు ముందుకే వేస్తున్నారు. ముదావహం. సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కేసీఆర్ ఆయా పథకాల లక్ష్యం, వీటి ద్వారా వారికి జరిగే రాజకీయ ప్రయోజనాల గురించి ఇప్పటికే కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే కొన్ని విధాన నిర్ణయాల అమలులో ఉన్న వేగం కొలువుల భర్తీ విషయంలో కనిపించడం లేదన్నది నిరుద్యోగుల నుంచి వస్తున్న ప్రశ్న. 

ఒకేసారి పెద్ద మొత్తంలో కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు త్వరలో వెలువడనున్నాయి అనే ప్రకటనలు ప్రాధాన్యం కోల్పోయాయి. కారణం దీనికి సంబంధించిన కార్యాచరణ ఏదీ లేదు. అందుకే నోటిఫికేషన్లపై నిరుద్యోగుల్లో అయోమయం నెలకొన్నది. ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్న తీరును ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి దీనిపై సరైన సమాధానం రావడం లేదు. నియామకాలపై ముఖ్యమంత్రి అదేశాలు అమల్లోకి రావడం లేదు. దీనికి బాధ్యత ఎవరిది అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

ప్రభుత్వం వివిధ పథకాల అమలులో చూపిస్తున్న శ్రద్ధ కొలువుల భర్తీలోనూ చూపెట్టాలి అని నిరుద్యోగులు కోరుతున్నారు. నియామకాల విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇచ్చిన మాటను పదే పదే విస్మరిస్తే ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది. 


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home