Thursday 5 August 2021

జోహార్ జయశంకర్ సార్

జీవితమంతా ఉద్యమమే ఊపిరిగా బతికారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. నాటి ఫజల్ అలీ కమిషన్ మొదలు మొన్నటి శ్రీకృష్ణ కమిటీ వరకు తెలంగాణ పై వేసిన అన్నీ కమిటీల ముందు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను శాస్త్రీయంగా వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నది సార్ కల. ఆ కల సాకారం కోసం తన జీవితకామంతా కృషి చేశారు. 

ఉమ్మడి రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు రాష్ట్రంలో వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి పై అధికారిక నివేదికలు విడుదల చేసేవారు. అందులో పేర్కొన్న లెక్కల ఆధారంగా నే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, ఈ ప్రాంతం పై వారు చూపిన వివక్షను ఏకరువు పెట్టేవారు. అందుకే సార్ అంటే అందరికీ అభిమానం. 

రాష్ట్ర సాధన అంశాన్ని ఎవరు ఎత్తుకున్నా సార్  తెలంగాణ కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వారికి అందించారు. దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమం అనేక ఆటుపోట్ల గురైంది. అయినా ఆ ఉద్యమ జ్వాల ఆరిపోకుండా కాపాడినవారు జయశంకర్ సార్. మలి దశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సందర్భంలో కొన్ని స్వార్థ శక్తులు ఇరు ప్రాంతాల ప్రజల్లో వైషమ్యాలు సృష్టించాలని చూశాయి. అలాంటి కుట్రలను సార్ బద్దలు కొట్టారు. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం అనే సందేశాన్ని సార్ అందించారు. ఉద్యమానికి దశను, దిశ ను చూపెట్టారు.

తెలంగాణ సిద్ధాంత కర్తగా రాష్ట్ర ఏర్పాటు కోసం సార్ చేసిన కృషి సువర్ణాక్షరాలతో లిఖించగలది. రాష్ట్ర సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసి పనిచేసినా తన స్వేచ్ఛను కోల్పోలేదు. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే ఏమస్తుందో సారు చెప్పిన మాటలు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆవిష్కృతం అవుతున్నాయి. నీళ్ళు, నిధుల గురించి సార్ చెప్పిన సత్యాలు నేడు నిజం అవుతున్నాయి. సార్ చెప్పినట్టే గోదావరి, కృష్ణ నదుల్లో మన వాటాను హక్కుగా వినియోగించుకుంటున్నాం. నిధులు ఇక్కడి అభివృద్ధికి ఖర్చు చేసుకుంటున్నాం.

తెలంగాణ కు జరిగిన అన్యాయం వల్ల నాలుగు తరాలు నష్టపోయాయి. కాబట్టి యువత త్యాగాలు చేయవద్దు. త్యాగాలు మేము చేస్తాం. మీరు రేపటి రాష్ట్ర ఫలాలు అందుకోవాలి అన్నారు. నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అప్పుడే నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్ లైన్ లక్ష్యం నెరవేరుతుంది. సార్ కల సంపూర్ణం కావాల్సి ఉన్నది. ఇందుకోసం సార్ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత నాటి ఉద్యమ పార్టీ అయిన నేటి అధికార పార్టీపై ఉన్నది.

(సార్ జయంతి నేడు. జోహార్ ఆచార్య కొత్త పల్లి జయశంకర్ సార్)


-రాజు

Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home