Thursday 5 August 2021

హాకీ ఆటగాళ్ళూ హాట్సాప్

ఒలింపిక్స్ జరుగుతున్న ప్రతీసారి పతకాల పట్టికలో భారత్ స్థానం సంపాదించేవరకు ఉత్కంఠే. మన అథెట్లు కొన్ని పతకాలు సాధించి దేశం పేరు నిలబెట్టగానే ఊపిరి పీల్చుకున్న సందర్భాలు అనేకం. కానీ ఈసారి ఆ టెన్షన్ లేదు. 

మీరాబాయి సాయికోమ్ చాను క్రీడలు ప్రారంభమైన రెండో రోజే వెండి పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టర్‌గా 2016 ఒలింపిక్స్‌లో ఎదుర్కొన్న పరాభవం నుంచే మీరాబాయి చాను పాఠాలు నేర్చుకున్నది. ఫీనిక్ష్ పక్షి వలె పునరుజ్జీవం పొంది టోక్యోలో మెరిసింది. కట్టెల మోతతో మొదలైన ఆమె విజయ ప్రస్థానం వెనుక ఎన్నో ఉత్థానపతనాలున్నాయి. అస్సాంకు చెందిన బాక్సర్ లవ్లీనా కాంస్య పతకాన్ని సాధించింది. అయితే తన తొలి ఒలింపిక్స్‌లోనే పతకంతో తన పవర్‌ను ప్రపంచానికి చాటింది. భారత షట్లర్ పి.వి. సింధు రియోలో రజతం, టోక్యో కాంస్యం ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించింది.  వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. 


2011 ఏప్రిల్ 2న వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీ సిక్సర్ కొట్టినప్పుడు 120 కోట్ల భారతీయులు భావోద్వేగానికి లోనయ్యారు. 1983 తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడింది. ధోనీసేన విశ్వవిజేతగా నిలిచింది. ఆ భావోద్వేగమే 41 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో జర్మనీపై గెలిచి భారత్ కాంస్య పతకాన్ని సాధించినప్పుడు కలిగింది. మన దేశ జాతీయ క్రీడ హాకీ. కానీ క్రికెట్ మానియాలో చాలా క్రీడలు ఒలింపిక్స్, ఆసియా క్రీడల వంటి సమయాల్లోనే పతాక శీర్షికల్లో కనిపిస్తాయి. అందుకే జర్మనీతో గెలిచిన తర్వాత  భారత్‌లో ప్రజలు హాకీని మర్చిపోయారు. నిజానికి వారు హాకీని ప్రేమిస్తారు. కానీ మేము గెలుస్తామని నమ్మడం మానేశారు. కానీ మేము ఈరోజు గెలిచాం. భవిష్యత్తులో వారు మా నుంచి మరింత ఆశిస్తారు, మమ్మల్ని నమ్ముతారు డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్ పాల్ అన్న మాటలు అక్షరాల నిజం.


బెల్జియంతో పోరు అన్నప్పుడే మన హాకీ ఆటగాళ్లు ఏదో ఒక పతకాన్ని పట్టుకొస్తారనే నమ్మకం కలిగింది. బెల్జియంపై ఓడిపోయినా మనోైస్థెర్యం కోల్పోలేదు. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతాక విజేత. 1980 తర్వాత భారత్ ఒలింపిక్స్‌లో పతక పోరులో తలపడిన సందర్భం లేదు. కానీ కోట్లాది మంది భారతీయుల కల నెరవేర్చాలనే తపన, కసి ఉన్నాయి. ఉత్కంఠను అధిగమించింది. హాకీకి పునర్ వైభవమే లక్ష్యంగా ఆటగాళ్లు పోరాడారు. ఇదే 41 ఏండ్ల తర్వాత భారత్‌కు పతకాన్ని అందించింది. అందుకే పసిడి పతకాన్ని తలదన్నేలా ఈ పోరు జరిగిందని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 


అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో ఈసారి మన ఆటగాళ్ల ప్రదర్శన గతంలో కంటే మెరుగ్గా ఉన్నది. రైతు బిడ్డ రవి కుమార్ దహియా అద్భుత పోరాటంతో రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో రజతం సాధించాడు. హరియాణలోని సోనెపత్‌కు సమీపంలోని నాహ్రి రవి కుమార్ దహియా స్వగ్రామం. ఏ మాత్రం వసతులు లేని కుగ్రామం నుంచి వచ్చిన ఈ మల్ల యోధుడు పసిడి పతకమే లక్ష్యంగా పోరాడి రజతంతో మెరవడం విశేషం. 


ప్రపంచంలో మన కంటే చిన్నదేశాలు ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనను చూపెడుతున్నాయి. మనం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఆటగాళ్లను తీర్చిదిద్దాలి. ఈసారి పతకాలు సాధించిన వారి నేపథ్యం చూస్తే దేశంలోని మారుమూల కుగ్రామాల నుంచి ఎన్నో కష్టాల కడలిని దాటి ఇక్కడిదాకా వచ్చారు. దేశ ప్రతిష్ఠను నిలబెట్టారు. గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి మట్టిమాణిక్యాలు ఇంకా ఎందరో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేసి అలాంటి వారిని గుర్తించాలి. వారికి అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి. సరైన శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దితే  రానున్నరోజుల్లో మన దేశం నుంచి మరింత మంచి అత్యుత్తమ ఆటగాళ్లు తయారవుతారు. 

-రాజు


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home