Thursday 5 August 2021

ఆశావహులకు అశనిపాతమే

 

తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాత చేపడుతామని కేంద్ర హోం శాఖ మంగళవారం ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం ఇచ్చింది. ఈ ప్రకటన రాజకీయ ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లింది.  నిజానికి విభజన చట్టంలోని సెక్షన్ 15తో సంబంధం లేకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లోని నిబంధనల ప్రకారం తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు, ఏపీ 175 నుంచి 225కు పెంచాలని విభజన చట్టంలోని సెక్షన్ 26 (1) స్పష్టం చేస్తున్నది.  కానీ రాజ్యాగంలోని ఆర్టికల్ 179 (3) అనుసరించి 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల అనంతరమే రెండు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటు జరుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేత వినోద్‌లు స్పందించారు. జమ్మూ-కశ్మీర్‌కు ఒక న్యాయం, తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు ఒక న్యాయం అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగమే ప్రామాణికం, జమ్మూ-కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఇక్కడ కూడా చేయాలని డిమాండు చేశారు.  ప్రతి పదేండ్లకు ఒకసారి జనాభాల లెక్కల సేకరణ జరుగుతుంది. 2021 తర్వాత మళ్లా 2031లోనే జనగణన జరుగుతుంది. కేంద్రం చెప్పినట్టు 2026 తర్వాత అంటే 2031లో చేపట్టే జనగణన వివరాలు ప్రచురించిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నట్టు స్పష్టమౌతున్నది. గత అనుభవాల దృష్ట్యా 2039 ఎన్నికల నాటికి మాత్రమే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి రావచ్చని రాజకీయవర్గాల అంచనా.

 అయితే కేంద్రం ప్రకటించిన తాజా నిర్ణయం రాజకీయ ఆశావహులకు అశనిపాతమే. ముఖ్యంగా తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధికార టీఆర్‌ఎస్‌కు ఈ నిర్ణయంతో ఇబ్బందే. ఎందుకంటే ఉద్యమపార్టీగా పేరొందిన టీఆర్‌ఎస్‌ను ప్రజలు రెండుసార్లు ఆదరించారు. పధ్నాలుగేండ్ల సుదీర్ఘ కాల పోరాటంలో ఆ పార్టీలో పనిచేస్తున్న వారి జాబితా పెద్దదే. అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కొంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇట్లా  అవకాశం ఇచ్చుకుంటూ వస్తున్నారు. చట్టసభల్లో పోటీచేసే అవకాశం లేనివారికి కార్పొరేషన్ పదవులు లేదా ఇతర పదవులు కట్టబెట్టారు. దీనికితోడు రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉన్నది. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు కొన్నినియోజకవర్గాల్లో అయితే ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. నియోవజర్గాల పునర్విభజన జరిగితే వీళ్లను సర్దుబాటు చేయవచ్చు అని ఇంతకాలం భావిస్తూ వస్తున్నారు. కానీ తాజాగా కేంద్ర హోం శాఖ ఇచ్చిన సమాధానం అధికారపార్టీకి మింగుడు పడని అంశమే. విభజన చట్టంలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అది అమల్లోకి వచ్చేది. కానీ ఇప్పట్లో లేదు కేంద్రం స్పష్టతను ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు రాష్ట్రంలో పాగా వేయడానికి ప్రణాళికలు వేసుకుంటూ  ముందుకు పోతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా ప్రతిపక్ష పార్టీలు కార్యాచరణతో ముందుకుపోతున్నాయి. 

నియోజకవర్గాల పునర్విభజన లేదు అని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అధికారపార్టీ నుంచి ఇతర పార్టీలకు వలసలు పెరిగే అవకాశం ఉన్నది. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారనున్నాయి. అట్లనే ఏపీలో కూడా ఏ ఎన్నిక జరిగినా వైసీపీ, టీడీపీ మధ్యనే ఉన్నది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీలను ఐక్యం చేసే పనిలో ఉన్నది. బీజేపీ కూడా దక్షిణాది రాష్ర్టాల్లో తమ బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోనూ కొన్ని ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు ఇప్పటి నుంచే పథకాలు రూపొందించుకుంటున్నాయి. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రతిపక్ష పార్టీల్లో చేరికలకు ద్వారాలు తెరిచిందనేది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

-రాజు

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home