Saturday 7 August 2021

ప్రశంసలను స్వాగతించాలె. విమర్శలను స్వీకరించాలె.

టీఆర్ఎస్ ఉద్యమ నేపథ్యం నుంచి పుట్టి రాజకీయపార్టీగా రూపాంతరం చెందింది. అందుకే ఉద్యమం, ఉద్యమ కారులు, ఉద్యమ ఆకాంక్షలు అన్నవి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యం చర్చలలో ఉంటున్నాయి. అదే కాంగ్రెస్ లేదా బీజేపీ అధికారంలో ఉండి ఉంటే పైన చెప్పిన అంశాలకు ప్రాధాన్యం ఉండేదో లేదో కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే అవి రెండు జాతీయ పార్టీలు. రాష్ట్ర నాయకత్వానికి ఆయా పార్టీలు ఎంత స్వేచ్ఛను ఇచ్చినా అంతిమ నిర్ణయం మాత్రం ఆ పార్టీల హస్తిన పెద్దలదే అన్నది వాస్తవం. జాతీయ పార్టీల అధినాయకత్వాల మద్దతు లేకుంటే అధికార ఖుర్చీ లో కూర్చొవడం కష్టం అన్నది ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన నాయకత్వ మార్పులే అందుకు ఉదాహరణ.


ఇదంతా ఎందుకు చర్చించాల్సి వస్తున్నది అంటే ప్రాంతీయ పార్టీలకు స్థానిక సమస్యలే ప్రాధాన్య అంశాలు. కానీ జాతీయపార్టీలకు వీటితో పాటు అనేకం ఉంటాయి. అందుకే ప్రాంతీయ సమస్యలపై వాటి వైఖరి రాజకీయ అవసరాలను బట్టి మారుతుంటాయి. అందుకే బీజేపీ కాంగ్రెస్ ముఖ్త్ భారత్ అన్న నినాదం ఆచరణలో విఫలమైంది. ప్రాంతీయపార్టీలతో బీజేపీ నేరుగా పోటీ పడిన చోట బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ ఒడిశా, కేరళ, తమిళనాడు, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలు బీజేపీకి చెక్ పెట్టాయి. 


ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని కాంగ్రెస్, బీజేపీలు చెప్పుకుంటున్నాయి. కానీ టీ ఆర్ఎస్ అధినేత వివిధ ఎన్నికల సందర్భంగా అనుసరిస్తున్న వ్యూహాలతోనే వాటి స్థానాలు మారుతున్నాయి. వారి వ్యవహార శైలి నచ్చక పార్టీ వీడుతున్నవారికి రాజకీయ ఆశ్రయాలుగా  మారుతున్నాయి. ఇంకా కొన్ని కొత్త పార్టీలు పురుడుపోసుకోవడానికి కారణం అవుతున్నాయి. రాజకీయ పునరేకీకరణలో భాగంగా టీఆర్ఎస్ అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇవి ఒక్క టీఆర్ఎస్ ను మాత్రమే ఎందుకు చుట్టుముడుతున్నాయి? ఉద్యమకాలంలో కలిసి పనిచేసిన వారికి పార్టీలో మొదటి నుంచి ఉన్నవారి కంటే ముందే పదవులు దక్కాయి. కానీ రాజకీయ నేపథ్యం ఉన్నవారు పదవులు ఉన్నంత వరకే మౌనంగా ఉంటున్నారు. పార్టీలో కొనసాగుతున్నారు. పదవీకాలం పూర్తి అయ్యాక ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా విపక్ష పార్టీలలోకి వెళ్ళి పోతున్నారు. ఇదంతా టీఆర్ ఎస్ అధినాయకత్వం వైఫల్యమే. కొందరి అసంతృప్తి అందరి అసంతృప్తి కాకపోవచ్చు. కానీ సుదీర్ఘ కాలం కలిసి నడిచిన వారిని కాదని రాజకీయ అవసరాల కోసం తెచ్చుకున్న వారితో వీసమెత్తు పార్టీకి ప్రయోజనం కలుగకపోగా కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. విపక్ష పార్టీలకు అవే ఆయుధాలు అవుతున్నాయి. పార్టీని నమ్ముకుని, పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని పట్టించుకోకుండా ఎన్ని పథకాలు తెచ్చినా కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలే వస్తాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలని కోరుకునే వారు కూడా ప్రభుత్వాన్ని  ప్రశ్నించడానికి కారణం కొన్ని నిర్ణయాలే. 


ప్రశంసలను స్వాగతించాలె. విమర్శలను స్వీకరించాలె.తెలంగాణ ఉద్యమం నేర్పిన పాఠాలు ఇవే.

Labels: , , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home