Friday 13 August 2021

రాష్ట్ర కాంగ్రెస్ దయనీయ స్థితి

వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటున్న కాంగ్రెస్ నేతల మాటలు ఆశ్చర్యంగా, హాస్యాస్పదంగా ఉన్నాయి. రాష్ట్రంలో దుబ్బాక, నాగార్జున సాగర్, జీ హెచ్ ఎం సీ, ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాష్ట్రంలో ఆ పార్టీ నాయకత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం కనిపించిన మాట వాస్తవం. ఇటీవల ఇంద్రవెల్లి సభ కూడా సక్సెస్ అయ్యింది. అయినా ప్రజలు ఆ పార్టీని అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అనుకోవడం లేదు. ఎందుకంటే ఎన్నికలను సీరియస్ గా తీసుకోకపోవడం, పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక (సీనియర్లు నిలబడే స్థానాల్లో తప్ప) త్వరగా తేలకపోవడం వంటివి ఆ పార్టీని పట్టి పీడిస్తున్న సమస్యలు.

అంతేకాదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ దళిత సాధికారికత కోసం తెచ్చిన పథకం దళిత బంధుపై విమర్శలు చేస్తున్నది. వాళ్ళ హయాంలో తెచ్చిన సబ్ ప్లాన్ అమలుపై అధికార పార్టీని నిలదీస్తున్నది. కానీ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి  సర్వే సత్యనారాయణ పార్టీ విధానానికి వ్యతిరేకంగా అధికార పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు. ఇది ఒక్క సర్వే తోనే మొదలు కాలేదు. గతంలో జానారెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీకి ఇబ్బందులు తెచ్చే ప్రకటనలు చేశారు. అలాగే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఎన్నిక కాకముందు ఆయనకు వ్యతిరేకంగా అనేకమంది సీనియర్ నేతలు బహిరంగ విమర్శలు చేశారు. కానీ అధిష్ఠానం ఆయనను ఎంపిక చేసిన తర్వాత కొంత సద్దుమణిగినట్టు అనిపించినా ఇప్పుడు అంతర్గత కలహాలు మళ్లీ కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకట రెడ్డి వంటి నేతల వ్యవహారశైలినే దీనికి నిదర్శనం. 

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకో రెండున్నర ఏండ్ల సమయమే ఉన్నది. ఇప్పటికి చాలా నియోజకవర్గాల్లో నేతలు ఉన్నా వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. హుజురాబాద్ ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అందుకు అద్దం పడుతున్నది. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి "కారు" ఎక్కారు. అక్కడ ఉప ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఇప్పటికీ ఖరారు కాలేదు. ప్రచారం మొదలుపెట్టలేదు. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అనే పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ విషయాన్ని సీరియస్ గా పట్టించుకోవడం లేదని అక్కడి నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. ఇలా అయితే పార్టీ నిలబడేది ఎట్లా, అధికారంలోకి వచ్చేది ఎట్లా అని ఆ పార్టీ కార్యకర్తలే అనుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది.



Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home