Thursday 12 August 2021

అభ్యర్థులు ఖరారు, ఎన్నిక ఎప్పుడు?

 టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి ఒక అడ్వాన్టేజ్ ఉన్నది. ఉద్యమం, ఉద్యమకారుల అంశాన్ని ప్రతిపక్షాలు తెరమీదికి తెస్తే ఆ పార్టీకే మేలు చేసినవాళ్ళు అవుతున్నారు. ఎందుకంటే కే సీఆర్ మాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నా, సన్నాసుల మఠం కాదు అన్నా అవకాశం వచ్చిన ప్రతీసారి ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్నారు. చట్ట సభల్లో వారిని నిలబెడుతున్నారు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విద్యార్థి నాయకుడు, ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ ఇచ్చి ప్రత్యర్థులపై పైచేయి సాధించాడు. 


ఈటల రాజీనామా ఎపీసోడ్, కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ వంటి పరిణామాల తర్వాత ఉద్యమకారులు, ఉద్యమ కారులపై రాళ్లు వేసిన వారికి పదవులు అన్న చర్చ గెల్లు శ్రీనివాస్ ను ఎంపిక చేసి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. మంత్రి హరీశ్ రావు కూడా ఇంతకాలం ఉప ఎన్నిక వ్యూహాలను అమలు చేస్తూనే ఉన్నా నియోజకవర్గానికి రాలేదు. ఈటల దమ్ముంటే కేసీఆర్, హరీశ్ లు నాపై పోటీ చేయాలని సవాల్ విసిరిన 24 గంటల్లోనే హుజురాబాద్ లో పార్టీ అభ్యర్థి తో కలిసి ప్రచారం మొదలుపెట్టాడు. పోటీ టీఆర్ ఎస్, బీజేపీ ల మధ్యే అని తేల్చాడు. ప్రధాన పార్టీల  అభ్యర్థులు ఖరారు కావడంతో ఉప పోరు ప్రచారం ఉధృతం కానున్నది. సంక్షేమ పథకాలు, ఉద్యమకారుడు పోటీలో ఉండటం, ఈటల ప్రచారంలో పెట్టిన బీసీ వాదానికి బీసీనే రంగంలోకి దింపడం వంటివి అధికారపార్టీకి కలిసి వచ్చే అంశాలు. 


కాంగ్రెస్ కూడా హుజురాబాద్ నుంచే మార్పు అంటున్నది. ఆ పార్టీ అభ్యర్థి ఎవరూ అన్నది వారం రోజుల్లో తేలుతుంది. ఇప్పటి వరకు అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక లో ద్విముఖ పోరే కనిపిస్తున్నది. కేసీఆర్ ఈ ఎన్నిక గురించి పలు సందర్భాల్లో తేలికగా తీసుకున్నట్టు, ఈటల పెద్దోడేమీ కాదన్నట్టు పత్రికలలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఎన్నిక


ను సీరియస్ గానే తీసుకుంటున్నారు. దాని ఫలితమే వివిధ పథకాల ప్రకటన అనే ఆరోపణల్లోనూ వాస్తవాలు ఉన్నాయి. కేసీఆర్ కూడా పథకాలను విమర్శించే వాళ్ళు ఓట్లు అడుగవచ్చు, పథకాలు పెట్టే మేము అడుగవద్దా అని కుండబద్దలు కొట్టారు. సంక్షేమ పథకాలతో కేసీఆర్ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు అని విపక్ష నేతల విమర్శలను పట్టించుకోకుండా తాను అనుకుంటున్న పనులు చేసుకుంటూ పోతున్నారు. 


హుజురాబాద్ ఉపఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. ఈటల రాజేందర్ గెలిస్తే జరిగే రాజకీయ పరిణామాల ఎలా ఉంటాయో కేసీఆర్ గ్రహించారు. అందుకే అలర్ట్ అయ్యారు. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అందుకే అన్నీ అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎంపిక ఇందులో భాగమే.

కొసమెరుపు: రాష్ట్ర శాసనమండలిలో ఏర్పడిన ఆరు స్థానాలకు జరగాల్సిన ఎన్నికలను కరోనా ఉధృతి కారణంగా వాయిదా వేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఏర్పడిన దాదాపు 35 స్థానాలతో పాటు హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహణపై పార్టీల అభిప్రాయం ఈ నెల 30 లోగా చెప్పాలని అన్ని పార్టీలకు కేంద్రం ఎన్నికల సంఘం లేఖ రాసింది. హుజురాబాద్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ నెల 30 వరకు ఈ ఎన్నిక నిర్వాహన పై పార్టీల అభిప్రాయం తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడనున్నది. ఆ తర్వాతే ఎన్నిక ఎప్పుడు అనే షెడ్యూల్ విడుదల అవుతుంది. అప్పటి వరకు పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం కొన..సాగుతూ ఉంటుంది. 

Labels: , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home