Tuesday 10 August 2021

మరుగునపడుతున్న ప్రజా సమస్యలు


 రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు సహజమే. కానీ రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీల నాయకుల మధ్య, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చేరిక సందర్భంగా జరిగిన సభలో వారి ప్రసంగం, ఇంద్రవెల్లి లో కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి అధికార పార్టీ అధినేత పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయి మీడియాలో చర్చనీయాంశాలు అయ్యాయి.

ఎన్నికలకు ఇంకో రెండేండ్ల సమయం ఉన్నది. అప్పుడే పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు హుజురాబాద్ ఉప ఎన్నికనే వేదిక అవుతున్నది. అందుకే ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెడుతున్నాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నాయి. అధికారపార్టీ నేతలు మీ హయాంలో ఏం చేసారో చెప్పాలని అడుగుతున్నారు. టీవీ చర్చల్లో ఈ అంశాలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలతో అసలు విషయాలు పక్కకుపోతున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పాదయాత్రలు కూడా మొదలు కానున్నాయి. ఈలోగా హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రావొచ్చు. అందుకే 16న హుజురాబాద్ లో ప్రారంభం కావాల్సిన దళిత బంధు పథకం వాసాలమర్రిలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకు సంబంధించిన నిధులు కూడా విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి హుజురాబాద్ పర్యటనకు ముందే దళిత బంధు పథకం అమలు కోసం కావలసిన నిధులు మంజూరు చేసింది. ఎన్నిక షెడ్యూల్ వస్తే పథకం అమలుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టింది. 

వచ్చే ఎన్నికల నాటికి ఓటు బ్యాంకు పదిల పరుచుకోవడానికి సంక్షేమ పథకాలతో అధికార పార్టీ రెండు అడుగులు ముందే ఉన్నది. ఈ పథకాలు ఏడేండ్లుగా అమలు చేయలేదని, ఎన్నికల కోసమే మొదలుపెడుతున్నారు అని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ వర్గాల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో నాయకులు మధ్య జరుగుతున్న చర్చలు దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో అదుపు తప్పుతున్నాయి. ప్రజా సమస్యలు మరుగున పడుతున్నాయి.




Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home