Tuesday 31 August 2021

ప్రత్యక్ష తరగతులు-ప్రమాద హెచ్చరికలు

 


సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి బడులు తెరువాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత స్కూళ్లు ప్రారంభం కావడం సంతోషమే. కానీ కరోనా థర్డ్‌వేవ్‌ ప్రమాదం పొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిస్తూనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉన్నదని చెప్తున్నది. ఈ విషయాల సంగతి ఎలా ఉన్నా పిల్లల ప్రాణాలతో చెలాగాటం వద్దు అన్నది మెజారిటీ ప్రజల నుంచి వస్తున్న డిమాండు. సుదీర్ఘకాలం ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఆన్‌లైన్‌ క్లాస్‌లతో పాఠాలు వింటున్న పిల్లల మానసికస్థితి దెబ్బతింటుందన్న వైద్య నిపుణుల మాటలు నిజమే. కానీ ఏడాదిన్నర కాలంగా బడులు బంద్‌. పారిశుద్ధ్యం అనేది లేకపోవడంతో చాలా స్కూళ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ముఖ్యంగా ప్రభుత్వ బడులలో ఈ సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక, పట్టణ సంస్థలు స్కూళ్ల పారిశుద్ధ్య పనులు చూసుకుంటాయని చెప్పింది. కానీ ఆ ఆదేశాలు అక్కడక్కడా అమలవుతున్నా క్షేత్రస్థాయిలో సరైన స్పందన లేదన్నది ప్రధాన పత్రికల్లో వస్తున్న కథనాలలో కనిపిస్తున్నది. 


మరోవైపు ప్రైవేటు స్కూళ్లల్లోనూ ఆన్‌లైన్‌ క్లాసులు ఉండవని ప్రభుత్వం అంతర్గతంగా నిర్ణయించింది. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవోలో, పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ ఆన్‌లైన్‌ క్లాస్లులు ఉండబు అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. దీనిపై అధికారులను వివరణ అడిగితే ప్రత్యక్ష బోధన ప్రారంభమంటే ఆన్‌లైన్‌ క్లాసులు ఉండవనే అర్థం అని చెప్తున్నారు. దేశంలో కొన్నిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్‌లో థర్డ్‌ వేవ్‌ పొంచి ఉన్నదన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ర్టాలను కేంద్రం అప్రమత్తం చేసింది. రానున్న రెండు నెలలు పండుగల సీజన్లు. వీటిని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్‌ 30 వరకు కోవిడ్‌ ఆంక్షలను పొడిగించింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలను అనుసరించి క్లాసుకు ఎంతమంది ఉండాలన్న గైడ్‌లైన్స్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రాలేదు అన్నది ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల వాదన. పిల్లల తల్లిదండ్రులలో 30 శాతం మంది ప్రత్యక్ష తరగతుల వైపు, 40 శాతం మంది ఆన్‌లైన్‌ క్లాసులే కావాలని, ఇంకా కొంతశాతం మంది పరిస్థితులను బట్టి తమ పిల్లలను బడులకు పంపాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. ఇదిలా ఉండగా మీ పిల్లల బాధ్యత మీదే, మీకు ఇష్టమైతేనే బడికి పంపండి అని ప్రైవేటు స్కూళ్ల వాళ్లు సర్క్యులర్లు జారీచేస్తున్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భయం వద్దు నిశ్చింతగా పిల్లలను బడికి పంపండి అని ప్రకటనలు చేస్తున్నది. అయితే పర్యవేక్షణ లేకుండా, పారిశుద్ధ్య పనులు పూర్తికాకుండా స్కూళ్లకు పిల్లలను పంపడానికి ఏ తల్లిదండ్రులు సాహసం చేయరు.

 ప్రత్యక్ష తరగతులు, ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలు అయ్యింది.  తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా  విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభించవద్దని హైకోర్టు ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లను ఇప్పుడే తెరవద్దని స్పష్టం చేసింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అప్పుడే తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపుతారు.

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home