Thursday 30 September 2021

అధికార పార్టీ ఇచ్చిన అవకాశం


 కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నేతల మధ్య ఉండే అంతర్గతంగా కలహాలే ఒడిస్తాయి అనేది నానుడి. ఇందులో కొంత నిజం ఉన్నది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడి గా ఎంపిక చేసిన తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ పార్టీ కార్యకర్తలో కదలిక ఆయన తెచ్చాడు అన్నది రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ. ఇది వాస్తవం కూడా. ఇంద్రవెల్లిలో దళిత దండోరా సభ మొదలు గజ్వేల్ , ఇప్పుడు భూపాలపల్లి బహిరంగ సభల సక్సెస్ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది.

అధికార టీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు దక్కాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరారు. ఇదే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ఆయా పార్టీలకు అభ్యర్థులను అందిస్తున్నది. ఎన్నికలకు ఇంకో రెండేళ్ల సమయం ఉన్నది. ఇప్పటి నుంచే చాలా నియోజక వర్గాల్లో అధికార పార్టీ నుంచి టికెట్ కష్టం అనుకుంటున్న నేతలు బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం అయ్యాయి. పార్టీలకు ఉండే సహజమైన ఓటు బ్యాంకు కు తోడు ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలను పార్టీలకు తీసుకుని వచ్చే కార్యాచరణను మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా నే వివిధ నేతల చేరిక సందర్భంగా బహిరంగ సభల ద్వారా బలప్రదర్శన చేస్తున్నాయి. 

ఎన్నికల నాటికి ఇంకా చాలామంది ఆశావహులు, అధికారపార్టీలోని అసంతృప్త నేతలు పార్టీ మారే అవకాశం ఉన్నది. తమ రాజకీయ అవసరాల కోసం అధికార పార్టీ చాలా మంది నేతలను పార్టీలో చేర్చుకున్నది. కొందరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఇంకా కొంతమంది కి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టింది. ఇంకా కొంతమందిని హామీలు ఇచ్చి తీసుకున్నది. ఈ ఏడేండ్ల కాలంలో అధికార పార్టీ నుంచి పదవులు ఆశించి వివిధ పార్టీల నుంచి వచ్చిన వారి సంఖ్య పెద్దదే. అయితే ప్రత్యామ్నాయం కనిపించనంత కాలం మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలనే వ్యూహాలకు పదును పెట్టాయి. వీటి ఫలితమే అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలలోకి చేరికలు మొదలు అయ్యాయి. ఇది అధికార పార్టీ ప్రతిపక్షాలకు ఇచ్చిన అవకాశమే.


Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home