Thursday 1 February 2024

పొంగులేటి వ్యాఖ్యలతో టీడీపీకి లాభమా? నష్టమా?



తెలంగాణలో టీడీపీ పోటీకి దూరంగా ఉండి 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలుపడం వల్లనే ప్రజలు కోరుకున్న మార్పు వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ఏ ఆశయాలతో టీడీపీ స్థాపించారో నారా చంద్రబాబు నాయుడు దానికి ఎన్నడో తిలోదకాలిచ్చారన్నది ఆయన అభిమానుల వాదన. అందుకే ఎన్టీఆర్‌పై అభిమానంతో ఆపార్టీలో చేరిన వారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాంటి వారంతా అభిమాన నాయకుడి ఆశయాల మేరకే పనిచేస్తున్నారు. ఎన్టీఆర్‌ టీడీపీ పెట్టిన ఉద్దేశాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నారు. పొంగులేటి వ్యాఖ్యల వల్ల ఏపీలో టీడీపీ లాభమా? నష్టమా? అన్న చర్చ జరుగుతున్నది. 


అలాగే తెలంగాణలో వలె ఏపీలోనూ టీడీపీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తుందా? లేదా అక్కడ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనందున టీడీపీకి ఆ పార్టీ మద్దతు ఇస్తుందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం వద్ద ఉండదు. దీనిపై స్పందించడానికి టీడీపీ సిద్ధంగా ఉండదు. మరో ముఖ్యమైన విషయం తెలంగాణ ప్రజలు కూడా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని భావించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విస్మరించిన అంశాల పరిష్కారం కోసం కాంగ్రెస్‌పార్టీకి ఓటు వేశారు. అంతేగాని టీడీపీ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగాని, ఆ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఆ పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించినట్టుగాని అధికారికంగా ఎక్కడా ప్రకటించిన దాఖలాలు లేవు. మరి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంటులో ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ సీటు గెలుచుకోవడానికి ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ జరుగుతున్నది. 


పొంగులేటి వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ  అభిప్రాయమా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఒకవేళ పొంగులేటి వ్యాఖ్యలు నిజమైతే ఏపీలో టీడీపీకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందని అక్కడ పార్టీలన్నీ విమర్శిస్తున్నాయి. ఎన్నికల సమయం కాబట్టి ఈ విషయాన్నే అధికార వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా షర్మిల ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు ఎక్కువయ్యాయి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  వ్యాఖ్యల వల్ల టీడీపీకి లబ్ధి జరుగుతుందో లేదో తెలియదు. కానీ విమర్శలు మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అక్కడి రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Labels: , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home