Friday 25 November 2011

అ'విశ్వాసం' ఎవరికి ఉంది?



శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షం పూటకో మాట మాట్లాడుతున్నది. అయితే బల నిరూపణకు దిగుతున్నది మాత్రం కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీలు. ఈ రెండు పార్టీల సంఖ్యా బలాన్నేయిప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. కిరణ్ సర్కార్ తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నదని పైకి చెబుతున్నప్పటికీ  లోపల మాత్రం జగన్ వర్గ ఎమ్మెల్యేల ఫోబియ పట్టుకున్నది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో  జగన్ క్యాంపులోకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది సొంత గూటికి తిరిగి వస్తారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొన్న లోటస్ పాండ్ లో జరిగిన జగన్ వర్గ ఎమ్మెల్యేల భేటికి ఎనిమిది మంది డుమ్మా కొట్టారు. దీనికి కారణాలు ఎలా ఉన్నా జగన్ వర్గం లో తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్యా బలంతో కాంగ్రెస్ నేతలు సంతృప్తి చెందితే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇవ్వాళ జగన్ వర్గంలో తగ్గిన సంఖ్యా బలం రేపు మరింత తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. అది ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు జగన్ తో కలిసి నడిచే ప్రజాప్రతినిధుల సంఖ్యా ఎంతో స్పష్టంగా ఎవరికీ తెలియదు. సమావేశాలకు వచ్చే వారినే ప్రామాణికంగా తీసుకుంటే, జగన్ ఇంతకు ముందు చేపట్టిన పలు దీక్షల సమయంలో ఒక్కో సమయంలో ఒక్కో సంఖ్యా కనిపించింది. యిప్పుడు ఆయన వర్గంలోని కొందరు ఎమ్మెల్యేల స్వరం మారడానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయి. అందులో యిప్పుడు రాష్ట్రం లో ఎన్నికలు వచ్చే అవకాశాలు లేకపోవడం, తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులు ఆగిపోవడం, ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతుండడం వంటి కారణాలతో మూడు అభివృద్ధి కార్యక్రమాల పై దృష్టి సారించాలని ఆయా నేతలు భావించడం సహజమే. ఎందుకంటే అధికార పార్టీ సభ్యులుగా ఉండి, ప్రతిపక్ష పాత్ర పోషిస్తే వారికి వచ్చే లాభం ఏమి ఉండదు. పైగా అభివృద్ధి పనులు జరిగితేనే వారికి కొన్ని డబ్బులు, కొంత పేరు, గౌరవం లభిస్తాయి. అలాగే ప్రతిపక్షం కూడా యిప్పుడు ఎన్నికలకు పోయే పరిస్థితిలో లేదు. ఇటు జగన్, అటు చంద్రబాబు ఆస్తుల పై సిబిఐ ఎంక్వైరీలు సాగుతున్నాయి. మరో వైపు తెలంగాణ అంశం ఇంకా తేలలేదు. ముఖ్యంగా తెలంగాణ సమస్య పరిష్కారం కానంత వరకు రాష్ట్రం లోని అధికార,ప్రతిపక్ష, వైఎస్ఆర్ పార్టీలు ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే ఒకవేళ ఎన్నికలకు వెళ్లినా ఈ మూడు పార్టీలు తమ బల బలాలను తేల్చుకోవలసింది సీమాంద్రలోనే. తెలంగాణ పై ఈ మూడు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రాంతాన్ని వదిలి ఒక్క సీమాంద్ర తోనే అధికారంలోకి రావడం కష్టమే కదా! అందుకే అవిశ్వాసం పై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, దానిపై భయపడుతున్నది మాత్రం అధికార పార్టీయే !

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home