Wednesday 28 December 2011

బాబు కోసం మన బాబులు ...


ఈ మధ్య తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర బల ప్రదర్శనలు చేయడం రాజకీయ పార్టీల నేతలకు ఫ్యాషన్ అయిపోయింది. ఒక బలమైన ఆకాంక్ష కోసం బలిదానాలకు పాల్పడిన అమరులను వీరి రాజకీయాలు వాడుకోవడం సిగ్గుచేటు. ముఖ్యంగా తెలంగాణ టిడిపి నేతలు ఈ విషయంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఇదంతా త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకోసమే అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇక్కడే ఉన్నది పెద్ద విషాదం. రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీకి నిలబడేది తెలంగాణ నేతలే. కానీ టిడిపి నేతల ఆరాటం మాత్రం సీమాంద్ర బాబును హీరో చెయ్యాలని, మంచిదే తమ నాయకుని కోసం కష్టపడడంలో తప్పులేదు. మోత్కుపల్లి చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు సంగతి అటుంచితే, ఆయన తెలంగాణ గురించి, ఉద్యమం గురించి పూర్తిగా మరిచిపోయారు. కెసిఆర్ ఫాం హౌసులో రెస్ట్ తీసుకుంటున్నారని, తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టారని రోజు చెప్పిందే చెబుతున్నారు. అయితే యిప్పుడు తెలంగాణ టిడిపి తెలంగాణ కోసం ఏమిచేస్తున్నారు అన్నది ప్రశ్న! తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉంది, వాళ్ళే తేల్చాలి అని ముఖ్యమంత్రి మొదలు చంద్రబాబు, జగన్ ఇలా గోడమీది పిల్లులందరూ అదే వాదిస్తున్నారు. మరి ఈ సమస్య ఎందుకు తేలడం లేదు. తెలంగాణ టిడిపి ఫోరం తరుఫున కేంద్ర హోం మంత్రిని కలిసినప్పుడు అయన ఏమి చెప్పాడు. మీ పార్టీ వైఖరిని అడిగాడు కదా, మీరిచ్చిన వినతి పత్రాన్ని ఎవరు పంపపారు అని అడిగాడు కదా. ఇదీ బాబు అభిప్రాయమా,లేక మీ అభిప్రాయమా అని అడిగిన విషయం మరిచిపోయారా ఎర్రబెల్లి, మోత్కుపల్లి. అక్కడ జరిగిన అవమానం తోనే కదా నాగం తెలంగాణ పై  చంద్రబాబు లేఖ ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబట్టింది. దానికే కదా ఆయన్ని పార్టీ నుంచి బయిటికి పంపింది. ఎదుటి వారి తప్పులను ఎంచే ముందు మన వైఖరి స్పష్టంగా ఉండాలి కదా. ఆ పని తెలంగాణ టిడిపి నేతలు చేయగలరా? బాబును నిలదీయగలరా? యిప్పుడు తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదం, సమైక్య వాదాలు లేవు. ఇన్నది ఒకే వాదం తెలంగాణ. 2004 ఎన్నికల్లో టిడిపి సమైక్య వాదం తో పోటీ చేస్తే ఈ ఫలితాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. అలాగే అభివృద్ధి నినాదం తో కరీంనగర్ ఉపఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కు ఇచ్చిన షాక్ ఏమిటో విదితమే. తెలంగాణ, సమైక్య వాదాలు ఉన్నది డిసెంబర్ తొమ్మిది చిదంబరం ప్రకటనకు ముందే. ఇక ఆ తర్వాత సమైక్యవాదానికి అప్పుడే నూకలు చెల్లాయి. ఇకపై తెలంగాణాలో జరిగే ఉప ఎన్నికల్లో వచ్చే ఫలితాలు పార్టీ చిత్తశుద్ధిని చూపించేవే. ఇదీ తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు గుర్తించుకుంటే మంచిది. బాన్సువాడ ఉప ఎన్నికల్లో డిపాసిట్ దక్కిందని సంబరపడిన కాంగ్రెస్ లాగా మీరు కూడా అలాగే సంతృప్తి చెందుతామంటే అది మీ ఇష్టం. అందుకే చంద్రబాబు రైతుల కోసం పెట్టినా అవిశ్వాసం, అలాగే తెలంగాణ కోసం రెండు సార్లు మీరు చేసిన 'రాజీ'నామాలు ఏమయ్యాయి? బాబు పెట్టిన అవిశ్వాసం జగన్ కు అసెంబ్లీ లో ఉన్న బలాన్ని, మీ రాజీనామాలు బస్సు యాత్రలకు  ఉపయోగపడ్డాయి. ఇదీ చంద్రబాబు తెలుగుదేశం, తెలంగాణ టిడిపి చేసిన ఉద్యమాల ఫలితాలు.

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home