Saturday 3 December 2011

చలి కాలంలో 'అవిశ్వాస' వేడి


అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం వేడి మొదలైంది. ఒకవైపు పార్టీలు విప్ జారీ చేశాయి. మరో వైపు తమ బలబలాలపై ఎమ్మెల్యేలతో సంప్రదింపులు మొదలయ్యాయి. అయితే ఈ అవిశ్వాస తీర్మానం ప్రభావం కేవలం కాంగ్రెస్ పార్టీ, జగన్ కు మధ్యే ఉన్నట్టు తాజా పరిణామాలను చూస్తే స్పష్టంగా కనిపిస్తున్నది. జగన్ వర్గం నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్లి పోవడంతో కిరణ్ సర్కారు అవిశ్వాస తీర్మానాన్ని ధీటుగా ఎదురుకుంటామని సవాళ్ళు కూడా విసిరింది. మొన్నటి దాక తన వైపు ఉన్న ఎమ్మెల్యేల్లో కొంత మంది బహిరంగంగానే ముఖ్యమంత్రిని కలిసి మద్దతు తెలిపారు. ఇదీ జగన్ వర్గాన్ని కలవరపెట్టింది. టిడిపి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం తో ఇక జగన్ కూడా గుంటూరు ఓదార్పు యాత్రకు విరామం ఇచ్చి నేరుగా రంగం లోకి దిగారు. జగన్ నివాసం లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు జగన్ తో సమావేశం కావడం, కాంగ్రెస్ పార్టీలో పిఅర్పీ విలీనం తరువాత చిరంజీవి కూడా మొదటి సరి తమ ఎమ్మెల్యేలు అసంతృప్తి తో ఉన్నారనడంతో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. జగన్ పడగొడితే నిలబెడతాను అన్న చిరునే తన అసంతృప్తిని వెల్లడించాడు. దీంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు గంట గంటకు మారిపోతున్నాయి. పిఅర్పీ రాకతో ఊపిరి పీల్చుకున్న అధికార పార్టీకి ప్రస్తుత పరిణామాలు మాత్రం కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఎందుకంటే తమ వల్లే ప్రభుత్వం నిలబడింది అన్న చిరు మా ఎమ్మెల్యేలను గడ్డి పోచల వలె చూస్తున్నారని ఒక రకంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ విశ్వాసాన్ని పొందుతుందో లేదో ఆ పార్టీ నేతలకే తెలియడం లేదు. ఇదే అదనుగా పిఅర్పీ తమ పదవుల కోసం పట్టుబడవచ్చు. ఇదే కనుక కొనసాగితే అధికార పార్టీకి మరిన్ని సమస్యలు తప్పక పోవచ్చు. ఎందుకంటే ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ని కొందరు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పిఅర్పీ ల విలీనం తరువాత కొన్ని చోట్ల ఈ రెండు పార్టీల శ్రేణుల్లో గొడవలు జరిగాయి. అవి ఇప్పడు సద్దుమనిగినా మునుముందు తీవ్ర స్థాయికి చేరుతాయి. అందుకే తాజా పరిణామాలతో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు నేరుగా రంగం లోకి దిగారు. జగన్ వర్గ ఎమ్మెల్యేల లో కొంత మందిని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కిరణ్ కు బొత్స కు మధ్య సంబంధాలు సరిగా లేవని వార్తలు వస్తున్నాయి. పిఅర్పీ తో ప్రస్తుత అవిశ్వాస తీర్మానంలో గట్టెక్కినా, అది కొంత కాలమే. ఎందుకంటే అసంతృప్త ఎమ్మెల్యేలకు ఏవో కొన్ని హామీలు ఇచ్చి తమ దారికి తెచ్చుకున్నా, అవి నెరవేరని నాడు మళ్లీ వారు తిరుగుబావుటా ఎగరేయవచ్చు. అందుకే కిరణ్ సర్కారు తెలుసు కావలసింది ఏమిటంటే సమర్థవంతమైన నాయకత్వం తోనే ప్రభుత్వ మనుగడ ఉంటుంది కానీ సంఖ్యా బలం తో కాదు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home