Sunday 22 April 2012

ఉప ఎన్నికలు .. ఉపన్యాసాలు

తెలంగాణపై తేల్చడానికి, రాష్ట్రంలో జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధం లేదు. ఉండకూడదు కూడా. తెలంగాణ పై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక డెడ్ లైన్లు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఈ సాచివేత వైఖరి వల్లే దాదాపు 850 తెలంగాణ బిడ్డలు ఆత్మ్యహత్యలకు పాల్పడ్డారు. ఈ పాపంలో రెండుకండ్ల బాబుకు కూడా భాగస్వామ్యం ఉన్నది. మొన్నటిదాకా కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి, గవర్నర్, డీజీపీ తో కలిసి అనేక కుట్రలకు పాల్పడ్డాడు. దీనికి ఇంటిదొంగలు కూడా తమ వంతు సహాయం అందించారు.ఉద్యమకారులపై, ఉద్యోగస్తులపై, విద్యార్థులపై వందలాది అక్రమ కేసులు బనాయించాడు. తెలంగాణ ఉద్యమం చల్లబడిందని కేంద్రానికి నివేదికలు పంపాడు. కిరణ్ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఆ'జాదు' తో కలిసి కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించాడు.దీని ప్రభావం మొన్న ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒక్క మణిపూర్ లో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో వచ్చి ఫలితాలు కాంగ్రెస్ పెద్దలకు పెద్ద షాక్ నే ఇచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. అలాగే మహారాష్ట్రలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి ఆరోపణలను ఎదురుకొంటున్నది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కి మిత్ర పక్షమైన ఎన్ సిపీ మధ్య కూడా విభేదాలు మొదలయ్యాయి.ఈ రెండు పార్టీల మధ్య ఈ అగాధం ఏర్పడడానికి ప్రధాని మన్మోహన్ కారణం. ఒకవైపు మిత్ర పక్షాలతో కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ.. వాటివల్లే అనేక సమస్యలు వస్తున్నాయని ప్రధాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. ప్రధాని వ్యాఖ్యలను శరద్ పవార్ తప్పు పట్టాడు. ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం లో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్ అధిష్టానం వాయిలార్ రవిని రాష్ట్రానికి పంపి వాస్తవ పరిస్థితులపై ప్రాథమిక నివేదికను తెప్పించుకున్నది. రవి పర్యటన కేవలం ఉప ఎన్నికల కోసమే అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా బొత్స, కిరణ్ ల మధ్య కొనసాగుతున్న అంతర్గత కలహాలతో పార్టీ తీవ్రంగా నష్టపోయిందని రవి సోనియాకు వివరించినట్టు సమాచారం. అయితే ఈ ఉప ఎన్నికల తరువాత రాష్ట్రంలో పీ సి సి అధ్యక్షుడిని, ముఖ్యమంత్రిని మారుస్తారని వస్తున్నా వార్తల్లో వాస్తవం ఎంత ఉన్నా.. నాయకత్వ మార్పుతో కాంగ్రెస్ పార్టీ ఒనగూరే ప్రయోజనం మాత్రం శూన్యం. ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని పక్కన పెడితే.. అధికార, ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలపై చేతులేత్తేసినట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే తరుచు ఉప ఎన్నికలు వస్తుండడంతో  పోటీ చేయడం కన్నా, తమిళనాడు తరహాలో వదిలేయాలని అనిపిస్తున్నది చంద్ర బాబు నిర్వేదంతో అన్నారు. కిరణ్ కూడా తను ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన సమయం బాగా లేదేమో అని వేదాంతాలు పలికారు. అంటే ఎన్నికలను ఎదురుకొనే సత్తా లేదని ఈ ఇరువురు నేతలు ఒప్పుకున్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ చిత్తూరు బాబులిద్దరు విఫలమయ్యారు.కిరణ్, బోత్సలపై నమ్మకం లేకనే కాంగ్రెస్ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది, కనీసం రెండు మూడు స్థానాల్లో అయినా గెలవడానికి వ్యూహాలు రచిస్తున్నది. అధికార పార్టీగా గడిచిన రెండున్నర సంవతరాల్లో రాష్ట్రం లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలవకపోవడం కూడా కాంగ్రెస్ పెద్దలను కలవరానికి గురిచేసిందేమో. ఈ పరిస్థితి ఇలానే ఉంటే దాని ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై కూడా పడుతుందని గ్రహించింది. అందుకే రోగ నిర్ధారణ కోసం వాయిలార్ రవిని రాష్ట్రానికి పంపింది.  రాష్ట్రంలో పార్టీకి సోకిన వ్యాధికి ప్రాథమిక చికిత్స ప్రారంభించింది.యిప్పుడు వాయిలార్ రవి ఇచ్చిన నివేదిక ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నదో మరికొన్ని రోజులు ఆగితే గానీ తెలియదు. కానీ తెలంగాణ వ్యతిరేకులు ఉప ఎన్నికల్లో జగన్ ను ఎదురుకొని నిలబడడానికి, రాష్ట్ర విభజన అంశాన్ని వీటితో ముడి పెడుతున్నారు. గత ఎన్నికల సమయంలో నంద్యాల సభలో  వై ఎస్ వేసిన పాచికనే ఓట్ల కోసం  ఇప్పడు మళ్లీ వేస్తున్నారు. కానీ నాటికి నేటికి రాష్ట్రంలో.. రాష్ట్ర ప్రజానీకంలో ఎంతో మార్పు వచ్చింది. వై ఎస్ హయంలో జరిగిన అవినీతి, చంద్రబాబు ద్వంద్వ నీతీ.. కిరణ్ అసమర్ధత, కేంద్ర ప్రభుత్వ అలసత్వం ఇవన్నీరాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులకు గురి చేశాయి. చేస్తున్నాయి. ఈ విషాదానికి జగన్ కూడా బాధ్యుడే! రాష్ట్ర ప్రజల్లో మానసిక విభజన డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ పై చిదంబరం చేసిన ప్రకటన తర్వాతనే వచ్చింది. ఇక యిప్పుడు మిగిలింది భౌగోళిక విభజన మాత్రమే. రాష్ట్ర ప్రజలు కేంద్రాన్ని  కోరుతున్నది అదే. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే గానీ ప్రజలను అయోమయాని గురిచేసే ప్రకటనలు చేయడం సరికాదు. దాని వల్ల అన్నదమ్ములుగా విడిపోయి ఆత్మీయులుగా కలిసుండాలని ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను దెబ్బ తీయరాదు. యిప్పుడు జరిగే ఉపఎన్నికలు వై ఎస్, జగన్ ల అవినీతికి, ప్రభుత్వ పని తీరుకు, ప్రధాన ప్రతిపక్ష నేత సమర్థతకు కు మాత్రమే ఈ ఎన్నికల యుద్ధం. వీటికి  రాష్ట్ర విభజనకు సంబంధం లేదు.

--
rajuasari@gmail.com


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home