Friday 9 September 2022

మునుగోడులో ముందంజ‌లో ఉన్న‌ది ఎవ‌రు?



రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, శాస‌న స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డంతో రాష్ట్ర రాజ‌కీయ మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో ఆ పార్టీ త‌ర‌ఫున ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌చారం మొద‌లుపెట్టారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ దివంగ‌త పాల్వాయి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కూతురు స్ర‌వంతిని అభ్య‌ర్థిగా అధికారికంగా ప్ర‌క‌టించింది. అలాగే రాజ‌గోపాల్ రాజీనామా ఆమోదం పొందిన త‌ర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆ స్థానంపై దృష్టి సారించింది. ప్ర‌జాదీవెన స‌భ పేరుతో ఇప్ప‌టికే ఆ పార్టీ అక్క‌డ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. ఆ రోజే అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తార‌ని అనుకున్నారు. కానీ కేసీఆర్ ఆ జోలికి పోలేదు. ఎందుకంటే ఆ సీటు ఆశిస్తున్న ఆశావ‌హుల జాబితా ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆ స‌భ‌లో అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న జోలికి వెళ్ల‌లేదు. 


బీజేపీ, కాంగ్రెస్ పార్టీల  అభ్య‌ర్థులు ఖ‌రారు కావ‌డంతో ఇక టీఆర్ఎస్ ఈ రెండు మూడు రోజుల్లో అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌వ‌చ్చు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి పేరునే దాదాపుగా ఖ‌రారు అయ్యింది అంటున్నారు.  ఇప్ప‌టికే సీపీఐ, సీపీఎం పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టిన అధికార పార్టీ అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న త‌ర్వాత ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేయ‌నున్న‌ది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా అనంత‌రం ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార‌పార్టీకి కొంత అనుకూలంగా ఉన్న‌ద‌ని వివిధ స‌ర్వేలు వెల్ల‌డించాయి. అయితే మునుగోడులో స‌భ పెట్టి,  అమిత్ స‌మ‌క్షంలో చేరిన ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. అలాగే ఆయ‌న సోద‌రుడు ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా రాజ‌గోపాల్‌కు ఓటు వేయాల‌ని కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లకు, నేత‌ల‌కు ఫోన్ చేస్తున్నార‌ని ఇటీవ‌ల ఆ పార్టీ నేత‌లు ఆరోపించారు. ఆ వార్త‌లు పేప‌ర్ల‌లో వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో మునుగోడు ఉప ఎన్నిక‌ల రోజుకో మ‌లుపు తిరుగుతున్న‌ది. 


ప్ర‌స్తుతం అక్క‌డ‌ ఏ పార్టీకి అనుకూలంగా ఉన్న‌ద‌నేది స్ప‌ష్టంగా ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. అయితే కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టు అధికార‌పార్టీ ఇప్ప‌టికీ ముందంజ‌లో ఉన్న‌ద‌ని తెలుస్తోంది. రెండు మూడు స్థానాల్లో నిలిచేది ఎవ‌ర‌నేది మ‌రికొన్నిరోజుల్లో తేలుతుంది. రెండో స్థానంలో ఉండే పార్టీనే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌తో పోటీ ప‌డుతుంద‌నే టాక్ కూడా ఉన్న‌ది. బీజేపీ నేత‌లు చెబుతున్న‌ట్టు హుజురాబాద్ ఫ‌లితం పునరావృతమ‌వుతుందా?  టీఆర్ఎస్ నేత‌లు వాద‌న ప్ర‌కారం నాగార్జున‌సాగ‌ర్ ఉప‌ ఫ‌లితం వ‌లె ఉంటుందా? అన్న‌ది చూడాలి. 

Labels: , , , , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home